Skip to main content

ఈ ఏడాది కూడా తగ్గనున్న ఇంజనీరింగ్ సీట్లు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్ల సంఖ్య ఈ ఏడాది కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది.
గతేడాది 14 వేల సీట్ల వరకు తగ్గిపోగా ఈ ఏడాది మరో 15 వేలకు పైగా సీట్లు రద్దయ్యే అవకాశముందని అధికార వర్గాలు అంటున్నాయి. విద్యార్థుల చేరికలు తగ్గిపోతుండడంతోపాటు నిర్వహణ సమస్యలు ఎదురవుతుండటంతో కళాశాలలు కోర్సులను రద్దు చేసుకోవడంతోపాటు సీట్లనూ తగ్గించుకుంటున్నాయి. సరైన వసతులు, బోధన సిబ్బంది, ప్రయోగశాలలు, క్యాంపస్ నియామకాలు లేని కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు కూడా ఇష్టపడడం లేదు. ఆ కళాశాలల్లో మొదటి విడత కౌన్సెలింగ్‌లో అరకొర చేరిన విద్యార్థులు కూడా రెండో విడతకు వచ్చేసరికి అక్కడ సీటు రద్దు చేసుకొని మరో కాలేజీకి వెళ్లిపోతున్నారు. ఇలా విద్యార్థులు చేరకపోవడం, చేరిన వారి సంఖ్య అతి స్వల్పంగా ఉంటే కాలేజీలే కోర్సులను రద్దు చేసుకుంటున్నాయి. మరోపక్క అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇంజనీరింగ్ విద్యలో ప్రమాణాలు పెంచేందుకు ఇటీవలి కాలంలో పెట్టిన నిబంధనలు కూడా దీనికి కారణమే. కాలేజీల్లో మౌలిక సదుపాయాలు లేకపోయినా, తగిన సిబ్బంది లేకున్నా అనుమతులు ఇవ్వడం లేదు. కాగా ఈ ఏడాది కూడా కోర్సులను రద్దు చేయాలని కోరుతూ కళాశాలలు.. ఏఐసీటీఈకి దరఖాస్తులు అందించాయని అధికారులు తెలిపారు. గతేడాది ఎంసెట్ కౌన్సెలింగ్ మధ్యలో 11 కాలేజీలు విద్యార్థులు చేరని కోర్సులను ఆపేయాలని కన్వీనర్‌ను అభ్యర్థించి నిలిపివేయించుకున్నాయి. ప్రస్తుతం ఏఐసీటీఈ నుంచి కాలేజీలకు అనుమతులు ఇంకా ఖరారు కాలేదని, అవి వచ్చాక ఎన్ని సీట్లు తగ్గుతాయన్నది స్పష్టమవుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు 15 వేలకు పైగా సీట్లు తగ్గే అవకాశముందని వెల్లడించారు.

భారీగా మిగిలిపోతున్న సీట్లు:
గతేడాది కన్వీనర్ కోటా సీట్లే భారీగా మిగిలిపోయాయి. ఇంజనీరింగ్, ఫార్మా సీట్లు వర్సిటీ కాలేజీల్లో 4,661 ఉండగా 4,533 భర్తీ అయ్యాయి. 128 సీట్లు మిగిలాయి. ప్రయివేటు కాలేజీల్లో ఇంజనీరింగ్, ఫార్మా సీట్లు 93590 ఉండగా 61,540 భర్తీ అయి 32050 మిగిలిపోయాయి. ప్రభుత్వ, ప్రయివేటు మొత్తంగా 32178 సీట్లు మిగిలిపోయినట్లు ప్రభుత్వమే ప్రకటించింది.

ప్రధాన బ్రాంచ్‌ల్లోనూ మిగులే..
అప్రధాన బ్రాంచ్‌లతోపాటు కోర్ బ్రాంచ్‌ల్లోనూ సీట్లు మిగిలిపోతున్నాయి. గతేడాది ఈసీఈలో 24,047 సీట్లలో 5,280, కంప్యూటర్ సైన్సులో 21,779 సీట్లలో 4,289, మెకానికల్‌లో 16,994లో 6,985, ఈఈఈలో 13,104 సీట్లలో 5,561, సివిల్‌లో 12,879లో 5366 సీట్లు మిగిలిపోయాయి. ఇక బీఫార్మసీలో 3,587 సీట్లుండగా 3,289 సీట్లు భర్తీ కాలేదు. కొన్ని కోర్సుల్లో ఒక్కరూ చేరలేదు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కెమికల్ పెట్రో ఇంజనీరింగ్, జియో ఇన్ఫర్మేటిక్స్, పవర్ ఇంజనీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్, బయోటెక్నాలజీ, సివిల్ ఎన్విరానిమెంటల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, కెమికల్ సిరామిక్ టెక్నాలజీల్లో ఒక్కరూ చేరలేదు. ఫుడ్ సైన్స్లో ఒక్కరు, మెటలర్జికల్ మెటీరియల్ ఇంజనీరింగ్‌లో ముగ్గురు, ఏరో స్పేస్ ఇంజనీరింగ్‌లో ఐదుగురు మాత్రమే చేరారు. ఇలా ఆయా కోర్సుల్లో చేరికలు లేకపోవడంతో కళాశాలలు ఆయా కోర్సులు, సీట్లు రద్దు చేసుకుంటున్నాయి.
Published date : 02 May 2018 02:26PM

Photo Stories