Skip to main content

హైదరాబాద్‌లో పారిశ్రామిక యూనివర్సిటీ-‘నిమ్‌స్మె’లో ఏర్పాటు చేసేందుకు చర్యలు

హైదరాబాద్: హైదరాబాద్‌లో జాతీయు చిన్న, వుధ్యతరహా పారిశ్రామిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి కేహెచ్ మునియప్ప వెల్లడించారు. జాతీయ సూక్ష్మ, చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమల కేంద్రంలో (నిమ్‌స్మె) దీనిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. సాంకేతిక విద్యను అభ్యసించిన విద్యార్థులను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అనుగుణంగా ఇందులో శిక్షణ అందిస్తామని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన నిమ్‌స్మె గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో మునియప్ప ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. నిమ్‌స్మెకు ఉన్న 107 ఎకరాల స్థలంలో 50 ఎకరాల వరకు కబ్జాకు గురైందని, ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అప్పగిస్తే వెంటనే యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. అలా వీలుకాని పక్షంలో నిమ్‌స్మెకు సమీపంలో వంద ఎకరాల స్థలం కేటాయించినా యూనివర్సిటీ ఏర్పాటుకు జనవరిలో చర్యలు చేపడతామన్నారు. ఇందులో దేశ విదేశీయులకు శిక్షణ ఇస్తామని, వంద శాతం ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. దేశవ్యాప్తంగా 18 టూల్ రూమ్స్ అండ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో ఒకదానిని విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. దీనికి ఈ నెల 25న శంకుస్థాపన చేస్తామన్నారు. ఇందులో ఒకసారి 10 వేల మందికి శిక్షణ ఇవ్వొచ్చన్నారు. దేశంలో 50 శాతం వరకు ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్రం కృషి చేస్తోందని చెప్పారు. 11వ పంచవర్ష ప్రణాళికలో 2 లక్షల మందికి, 12వ పంచవర్ష ప్రణాళికలో 5 లక్షల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. సబ్సిడీలు తీసుకోకుండా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేవారికి బ్యాంకు గ్యారెంటీని ప్రభుత్వం ఇస్తుందని మునియప్ప చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రసంగిస్తూ.. గత ఏడాది చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 12 శాతం నుంచి 15 శాతం విద్యుత్ కొరత ఉందని, 2 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ వస్తున్నందున ఈసారి కోతలు ఉండబోవని చెప్పారు. రాష్ట్రంలో ఎన్ని ఆందోళనలు, ఉద్యమాలు ఉన్నా అవేవీ రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కాలేదని పేర్కొన్నారు. గత మూడేళ్లలో రూ. లక్షా 43 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతులు ఇచ్చామన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు (ఒంగోలు, చిత్తూరు, మెదక్) నేషనల్ ఇండస్ట్రియల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్స్‌ను కేంద్రం మంజూరు చేసిందని ఆయన చెప్పారు.
Published date : 23 Dec 2013 11:59AM

Photo Stories