ఎవరి ఎంసెట్ వారిదే..!
Sakshi Education
హైదరాబాద్ ఎంసెట్‌ను ఉమ్మడిగా కాకుండా ఏపీ వరకు మాత్రమే నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై బుధవారం అధికారిక ప్రకటన చేయనుంది.
తెలంగాణతో సంబంధం లేకుండా ఏపీలోని 13 జిల్లాల్లో ఉన్న కాలేజీలకు మాత్రమే ఈ ఎంసెట్‌ను ఏపీ ఉన్నత విద్యామండలి ద్వారా చేపట్టనున్నారు. ఎంసెట్ సహా వివిధ సెట్ల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వంతో తలెత్తిన వివాదంపై సోమవారం రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. ఉమ్మడి ఎంసెట్‌కు తెలంగాణ ప్రభుత్వం ససేమిరా అని ప్రత్యేక షెడ్యూల్‌ను విడుదల చేయడం, గవర్నర్ నరసింహన్ సూచనలనూ ఆ ప్రభుత్వం బేఖాతరు చేయడం తదితర అంశాలను వివరించారు. ఎంసెట్ నిర్వహణలో తెలంగాణ బెట్టు వీడకపోవడంతో ఉమ్మడి ఎంసెట్ నిర్వహణపై ఇక ఎంతచేసినా ఫలితం ఉండదన్న అభిప్రాయానికి వచ్చారు. తెలంగాణ వైఖరిపై కేంద్ర ప్రభుత్వానికి లిఖిత ఫిర్యాదు చేశాక విడి ఎంసెట్‌పై అధికారిక ప్రకటన చేయాలని నిర్ణయించారు. ఏపీ ఉన్నత విద్యామండలి నిర్వహిస్తున్న ఖాతాలను స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ స్తంభింపచేయడంపైనా గంటా సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు. దీనిపై ఏపీ ఉన్నత విద్యామండలి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని చెప్పారు.
Published date : 03 Feb 2015 12:37PM