ఏపీలో ప్రమాణాలు, చేరికలు లేని 53 ఇంజనీరింగ్ కాలేజీలు మూత..!
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణలు తీసుకువస్తూ, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటు వంటి పథకాలు అమలు చేస్తూ ప్రమాణాలకు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో నిబంధనల ప్రకారం లేని కాలేజీలు స్వచ్ఛందంగా మూసివేతకు దరఖాస్తు చేసుకున్నాయి. నిర్ణీత సంఖ్యలో విద్యార్థుల చేరికలు లేని వాటికి అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతి ఇవ్వలేదు. దీంతో 53 కళాశాలలు మూతపడ్డాయి. గత ఏడాది 445 కళాశాలలుండగా ఈ సంవత్సరం 392 కాలేజీలకు మాత్రమే అనుమతులు వచ్చాయి. అవసరాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు తగ్గట్టుగా ఏఐసీటీఈ కొత్త కోర్సులకు శ్రీకారం చుట్టడంతో కాలేజీల సంఖ్య తగ్గినా గత ఏడాదికన్నా సీట్లు మాత్రం పెరిగాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, మిషన్ లె ర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్‌స, డీప్ లెర్నింగ్, డేటా అనాలసిస్ వంటి కొత్త కోర్సుల్ని దాదాపు 50 శాతం కాలేజీల్లో ప్రారంభిస్తున్నారు. గత ఏడాది ఎంసెట్ కౌన్సెలింగ్‌కు 445 కాలేజీల్లో కన్వీనర్, మేనేజ్‌మెంటు కోటా కలిపి 1,29,882 సీట్లు ఉండగా ఈసారి 1,53,978 సీట్లున్నాయి. ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన కాలేజీలను రాష్ట్రంలోని కాకినాడ, అనంతపురం జేఎన్‌టీయూలు మళ్లీ పరిశీలించి అనుబంధ గుర్తింపు ఇస్తాయి. ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
అత్యధిక సీట్లు కొన్ని బ్రాంచిల్లోనే...
ఏఐసీటీఈ అనుమతించే కోర్సుల్లో ఎక్కువ సీట్లు కొన్ని ముఖ్యమైన బ్రాంచిల్లో మాత్రమే ఉన్నాయి. విద్యార్థుల చేరికలు కూడా వాటిలోనే ఎక్కువ కావడంతో కాలేజీలుకూడా వాటికి అదనపు సెక్షన్లు ఏర్పాటుచేస్తూ సీట్లు పెంచుతున్నాయి. కొత్త కోర్సుల సీట్లతోపాటు కంప్యూటర్ సైన్సు, ఈసీఈ, మెకానికల్, సివిల్స్, ఐటీ వంటి కొన్ని విభాగాల్లో చేరికలు ఉంటున్నాయి.
కన్వీనర్ కోటా భర్తీలో గణనీయంగా పెరుగుదల
గతంలో ప్రభుత్వాలు కాలేజీల్లో ప్రమాణాలతో పనిలేకుండా ఫీజులను ఇష్టానుసారం పెంచేశాయి. గరిష్ఠ ఫీజు రూ.1.08 లక్షల వరకు నిర్ణయించారు. ఫీజు రీయింబర్స్‌మెంటు గరిష్ఠంగా రూ.35 వేలకే పరిమితం చేయడంతో మిగతా మొత్తాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు భరించాల్సి వచ్చేది. దీంతో కన్వీనర్ కోటా సీట్లు కూడా పూర్తిగా భర్తీ అయ్యేవి కాదు. కీలకమైన విభాగాల్లో కూడా కన్వీనర్ కోటా సీట్లు మిగిలేవి. ఇప్పుడు ప్రభుత్వం ప్రమాణాలు, సదుపాయాలకు అనుగుణంగా ఫీజు నిర్ణయించడంతోపాటు దాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుండడంతో చేరికల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు.
గత నాలుగేళ్లలో కాలేజీలు, మొత్తం సీట్లు, కన్వీనర్ కోటా భర్తీ, మిగులు సీట్ల వివరాలు
ఏడాది | కాలేజీలు | మొత్తం సీట్లు | కన్వీనర్ కోటా | భర్తీ | మిగులు |
2017 | 467 | 1,40,358 | 98,251 | 66,073 | 32,178 |
2018 | 460 | 1,36,224 | 96,857 | 56,609 | 37,248 |
2019 | 445 | 1,29,882 | 1,06,203 | 60,315 | 45,888 |
2020 | 392 | 1,53,978 | -- | -- | -- |
ఈ ఏడాదిలో ఎంసెట్ రాసిన అభ్యర్థుల వివరాలు
కేటగిరీ | దరఖాస్తులు | హాజరు | శాతం |
జనీరింగ్ స్ట్రీమ్ | 1,85,946 | 1,56,899 | 84.38 |
బైపీసీ స్ట్రీమ్ | 87,652 | 75,834 | 86.52 |
ప్రమాణాలులేని కాలేజీల్లో చేరికలు అంతంతమాత్రమే..
గతంలో అత్యధిక కాలేజీల్లో విద్యార్థుల చేరికలూ అంతంత మాత్రమే. గత ఏడాది ఎంసెట్ కౌన్సెలింగ్‌లో కాలేజీల్లో చేరిన విద్యార్థుల సంఖ్యను చూస్తే వాటి పరిస్థితి అర్థమవుతుంది.
ఒక్క విద్యార్థీ చేరని కాలేజీలు | 9 |
50 లోపు సీట్లు భర్తీ అయిన కాలేజీలు | 62 |
100 లోపు సీట్లు భర్తీ అయిన కాలేజీలు | 103 |
100 శాతం నిండిన కాలేజీలు | 17 |