ఏపీ పీజీఈసెట్ ఫలితాలు విడుదల
Sakshi Education
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): రాష్ట్రంలో ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ పోస్ట్రుగాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ పీజీఈసెట్) ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు మే 17న విశాఖలోని ఏయూ ఆడిటోరియంలో విడుదల చేశారు.
మొత్తం 88.99 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు ఆయన తెలిపారు. ప్రవేశపరీక్షకు 29,339 మంది దరఖాస్తు చేయగా 26,779 మంది పరీక్ష రాశారని, వీరిలో 23,831 మంది అర్హత సాధించారని అన్నారు. ఎంటెక్ విభాగంలో 22,010 మంది పరీక్ష రాయగా 19,565 మంది (88.89 శాతం), ఎంఫార్మసీ విభాగంలో 4,769 మంది పరీక్ష రాయగా 4266 మంది (89.45) శాతం ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. ఎంటెక్‌లో 10 మంది, ఎంఫార్మసీలో ఇద్దరు ట్రాన్స్ జెండర్స్ అర్హత సాధించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మొత్తం 14 కోర్సుల్లో ర్యాంకులు సాధించినవారి వివరాలను విడుదల చేశారు. విజయనగరం జిల్లా 91.11 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో, అనంతపురం 87.78 శాతంతో అట్టడుగున నిలిచాయి. కోర్సుల వారీగా పరిశీలిస్తే.. జియో ఇంజనీరింగ్, జియో ఇన్ఫర్మేటిక్స్, మెటలర్జీ కోర్సుల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫుడ్ టెక్నాలజీలో 98.88 శాతం, బయోటెక్నాలజీలో 96.43, కెమికల్ ఇంజనీరింగ్‌లో 96.40 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అత్యల్పంగా ఇన్‌స్ట్రుమెంటేషన్ కోర్సులో 68.32 శాతం మంది మాత్రమే అర్హత సాధించగలిగారు. ఏయూ రీజియన్ పరిధిలో 89.03, ఎస్వీయూ పరిధిలో 88.98, ఓయూ పరిధిలో 89.63, నాన్ లోకల్ విద్యార్థుల్లో 86.95 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 365 ఎంటెక్ కళాశాలల్లో 27,300 సీట్లు, 81 ఎంఫార్మసీ కళాశాలల్లో 2,787 సీట్లు ఉన్నాయి.
ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఫలితాల కోసం క్లిక్ చేయండి
Published date : 18 May 2018 02:28PM