- సానుకూల పరిస్థితులు ఉన్నాయంటున్న ఉన్నత విద్యామండలి వర్గాలు
- సమయాభావంతో ఈ ఏడాది ఈసెట్ కౌన్సెలింగ్ ఒక విడతతోనే పూర్తి
హైదరాబాద్: ఎంసెట్ మలివిడత కౌన్సెలింగ్‌కు సంబంధించి ఈ నెల పదో తేదీన సుప్రీంకోర్టు ముందు విచారణ జరగనుండడంతో తమ వాదనలను వినిపించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి సమాయత్తమవుతోంది. వేలాది మంది విద్యార్థులు, వందలాది కాలేజీలు మలివిడత కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో సుప్రీం తీర్పు ప్రాధాన్యత సంతరించుకోనుంది. దాదాపు 70 వేల సీట్లు మిగిలి పోవడంతో పాటు తొలివిడతలో అవకాశాలు రాని వారు, అవకాశం వచ్చినా మలివిడతపై ఆశతో సీట్లలో చేరని వారు వేలాదిగా ఉన్నారు. వీటితో పాటు తెలంగాణ ప్రాంతంలో మొదటి విడతలో అవకాశం కోల్పోయిన 174 కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. వాటికి షరతులతో ప్రవేశాలకు అవకాశం కల్పించారు.రెండో విడత కౌన్సెలింగ్ లేక వీరంతా నిరాశానిస్పృహల్లో కూరుకుపోయారు. మలివిడతకోసం విద్యార్థులు, కాలేజీల యాజమాన్యాలు, ఏపీ ఉన్నత విద్యామండలి సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలుచేశాయి. ఇవి ఈ నెల 10న విచారణకు రానున్నాయి. వేలాది మంది విద్యార్థుల భవితవ్యం ఈ కౌన్సిలింగ్‌తో ముడిపడి ఉందని, అదే విధంగా వందలాది కాలేజీలు మూతపడే పరిస్థితి ఉందని.. కాబట్టి మలివిడతకు అవకాశం కల్పించాలని ఉన్నత విద్యామండలి నివేదించనుంది. ఇటీవల ఇరు రాష్ట్రాల సాంకేతిక విద్యాశాఖ కమిషనర్లు అజయ్‌జైన్ (ఏపీ) శైలజారామయ్యర్ (తెలంగాణ)లు సుప్రీంకోర్టుకు నివేదించాల్సిన అంశాలపై చర్చించారు. ఆమేరకు తమ న్యాయవాదులకు సుప్రీంకోర్టులో వినిపించాల్సిన వాదనలపై సూచనలు ఇచ్చారు.
సమయాభావం వల్లే ...
ఈసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించి ఒక విడతతోనే అడ్మిషన్ల ప్రక్రియను పూర్తిచేశారు. మలివిడతకు ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించలేదు.ఈసెట్ ముందుగా పూర్తయిందని, అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయి తరగతులు కూడా ప్రారంభమవడంతో రెండో విడతకు అవకాశం కల్పించలేదని ఉన్నత విద్యామండలి అధికారులు పేర్కొంటున్నారు. వచ్చే ఏడాది సమయానుకూలంగా ఈసెట్‌లో తొలి, మలివిడతల కౌన్సెలింగ్‌లపై నిర్ణయిస్తామని చెప్పారు.