ఐఐటీల పనితీరు మెరుగుపరిచే దిశగా హెచ్‌ఆర్‌డీ చర్యలు దేశంలోని
Sakshi Education
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు) ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి వాటి పనితీరును మెరుగుపరిచే దిశగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పలు చర్యలకు శ్రీకారం చుడుతోంది. ముందుగా ఐఐటీల్లో ప్రధాన సమస్యగా పరిణమించిన ఫ్యాకల్టీ కొరతపై, అదేవిధంగా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్యకలాపాలకు అవసరమైన మౌలిక సదుపాయాల మెరుగుదలపై దృష్టి సారించింది. ఫ్యాకల్టీ కొరతను అత్యంత ప్రధాన సమస్యగా భావించిన నేపథ్యంలో.. కొత్తవారిని నియమించడం వెనువెంటనే సాధ్యం కాదనే విషయాన్ని గుర్తించింది. ప్రస్తుతం అన్ని ఐఐటీల్లో పనిచేస్తున్న అధ్యాపకులు లాంగ్‌టర్మ్ డిప్యుటేషన్ విధానంపై ఇతర ఐఐటీలకు వెళ్లే అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఈ లాంగ్‌టర్మ్ డిప్యుటేషన్ వెసులుబాటును గరిష్టంగా పదేళ్లకు పెంచింది. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం ఐఐటీ క్యాంపస్‌లలో స్టూడెంట్- టీచర్ నిష్పత్తిని 10:1కు పరిమితం చేయడం. తాజా నివేదికల ప్రకారం- దేశంలోని ఐఐటీల్లో ఫ్యాకల్టీ కొరత 37 శాతంగా ఉంది. అదేవిధంగా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్యకలాపాలు పెంచే దిశగా ఐఐటీలకు అందిస్తున్న నిధుల మొత్తాన్ని పెంచాలని, ప్రస్తుతం ఇస్తున్న నిధులపై సమీక్షించాలని సంబంధిత శాఖకు సిఫార్సు చేసింది.
Published date : 27 Oct 2014 02:14PM