ఐఐటీ ప్రవేశాలలో మార్పులు!
Sakshi Education
ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలలో బీటెక్‌లో ప్రవేశాలకు సంబంధించిన విధానాల్లో తాజా మార్పులకు రంగం సిద్ధమైంది. ప్రధానంగా ప్రస్తుతం ఐఐటీల్లో ప్రవేశాలకు అమలు చేస్తున్న.. ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సుల్లో టాప్-20 పర్సంటైల్ అనే నిబంధనకు ప్రత్యామ్నాయం చూసే దిశగా జాయింట్ అడ్మిషన్ బోర్డ్ యోచిస్తోంది. 2012 నుంచి అమలు చేస్తున్న టాప్-20 పర్సంటైల్ నిబంధన విషయంలో విద్యార్థుల్లో నిరసన కొనసాగుతూనే ఉంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు వచ్చినా బోర్డ్ పరీక్షల్లో టాప్-20 పర్సంటైల్‌లో నిలవక ఎందరో విద్యార్థులు ఐఐటీలో సీటు అవకాశం కోల్పోయారు. ఇదే విషయంపై ఐఐటీ డెరైక్టర్లతో కూడిన జాయింట్ అడ్మిషన్ బోర్డ్ ప్రత్యామ్నాయాలను రూపొందించేందుకు ఉపక్రమించింది. త్వరలో జరిగే జేఏబీ మలి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. మార్పులకు ప్రభుత్వ ఆమోదం లభిస్తే 2015 నుంచే అమలు చేయనున్నట్లు సమాచారం.
Published date : 22 Sep 2014 04:35PM