Skip to main content

64 ఇంజనీరింగ్ కాలేజీలు ఔట్!

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈసారి సీట్లు భారీగా తగ్గిపోనున్నాయి. ఈ ఏడాది 64 కాలేజీల్లో ప్రవేశాలే ఉండకపోగా మిగతా కాలేజీల్లో చాలా సీట్లు రద్దు కానున్నాయి.
ల్యాబ్ సదుపాయాలు, ఫ్యాకల్టీ ప్రాతిపదికన కాలేజీలు, సీట్లకు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో 40 వేల నుంచి 50 వేల వరకు సీట్లకు కోత పడే అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం, యూనివర్సిటీలు ఓకే చెప్పిన 174 కాలేజీలకే మొదట అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు ఉన్నత విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. శుక్రవారం సాయంత్రం వరకు ఆ కాలేజీల జాబితాను ఉన్నత విద్యా మండలికి అందజేయనుంది. శుక్రవారం వీలుకాకపోతే శనివారం ఉదయమే అనుబంధ గుర్తింపు లభించిన కాలేజీల జాబితాను ఉన్నత విద్యాశాఖ ప్రకటించనుంది. ఆ తర్వాత 5వ తేదీ నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది.

కాలేజీల్లో లోపాలు ఇలా..
రాష్ట్రంలో 282 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా, వాటిలో 242 కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. మరో 40 కాలేజీలు దర ఖాస్తు చేసుకోలేదు. దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో 174 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరో 24 కాలేజీల్లో భారీగా లోపాలు ఉన్నాయని అటు జేఎన్‌టీయూహెచ్, ఇటు విజిలెన్స్ విభాగాల తనిఖీలు తేల్చాయి.

దీంతో వాటికి అనుబంధ గుర్తింపును నిరాకరించాలన్న నిర్ణయానికి వచ్చారు. మరో 44 కాలేజీల్లో కూడా లోపాలు ఉన్నట్లు జేఎన్‌టీయూహెచ్, విజిలెన్స్ విభాగాల తనిఖీల్లో తేలింది. వీటిపై శుక్రవారం తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇందులో టాప్ కాలేజీలు అయిన చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ), మహత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంజీఐటీ) కూడా ఉన్నట్లు తెలిసింది. ఆ కాలేజీలు బాగానే ఉన్నాయని, లోపాలు లేవని ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్‌టీయూహెచ్ తేల్చినా... విజిలెన్స్ విభాగం మాత్రం వాటిల్లోనూ లోపాలు ఉన్నాయని తేల్చినట్టు సమాచారం.

గుర్తింపు వచ్చే కాలేజీల్లోనూ సీట్లకు కోత!
అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు చర్యలు చేపట్టిన కాలేజీల్లోనూ భారీగా సీట్లకు కోత పడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ల్యాబ్ సదుపాయాలు, విద్యార్థి, అధ్యాపకుల రేషియో అధారంగానే బ్రాంచీలు, సీట్లకు ఓకే చెప్పాలని జేఎన్‌టీయూహెచ్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీంతో 174 కాలేజీలకు అనుబంధ గుర్తింపు లభించినా వాటిల్లో భారీగా సీట్లకు కోత పడుతుందని ఉన్నత విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. కొన్ని కాలేజీల్లో బ్రాంచీలకు కూడా కోత పడే అవకాశం ఉంది. మొత్తంగా ఈసారి 40 వేల నుంచి 50 వేల సీట్లు తగ్గిపోయే అవకాశం ఉందని జేఎన్‌టీయూహెచ్ వ ర్గాలు పేర్కొంటున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) రాష్ట్రంలోని 282 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1.42 లక్షల సీట్లకు అనుమతులు ఇచ్చింది. కానీ అనుబంధ గుర్తింపు ఆయా కాలేజీల్లో 90 వేల నుంచి లక్షలోపు సీట్లకే వచ్చే అవకాశం ఉంది. అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోని 40 కాలేజీల్లో 25 వేల వరకు సీట్లు రద్దు కానుండగా.. అనుబంధ గుర్తింపు నిరాకరించాలన్న నిర్ణయానికి వచ్చిన 24 కాలేజీల్లో మరో 15 వేల సీట్లకు కోత పడుతుంది. లోపాలు ఉన్నట్లు తేల్చిన 44 కాలేజీల్లోనూ 10 వేల సీట్ల వరకు తగ్గిపోయే అవకాశం ఉంది.
Published date : 01 Jul 2016 02:25PM

Photo Stories