Skip to main content

యథావిధిగా ఎంసెట్-2 సర్టిఫికెట్ల పరిశీలన

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో (కన్వీనర్ కోటా) ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు రంగం సిద్ధమైంది.
ఎంసెట్-2 మెడికల్ ప్రవేశ పరీక్ష ప్రశ్న పత్రం లీకేజీ ఆరోపణలు, సీఐడీ విచారణ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ స్పందించింది. ఇప్పటి వరకు లీకేజీ ఆరోపణలకు సంబంధించి నివేదిక రాలేదని, కాబట్టి గతంలో నిర్ణయించిన ప్రకారమే ఈ నెల 25 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ యథావిధిగా ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ‘సాక్షి’కి తెలిపారు. ఒకవేళ విచారణలో లీకేజీ జరిగినట్లు రుజువైతే నిబంధనల ప్రకారం నడుచుకుంటామని ఆయన పేర్కొన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయం ఇటీవల నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 25 నుంచి 30 వరకు అన్ని వర్గాల అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. ఇక 31, వచ్చే నెల 1, 2 తేదీల్లో ప్రత్యేక వర్గాలకు చెందిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. అందులో వికలాంగులు, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, ఆర్మీ, పోలీసు అమరవీరుల పిల్లల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. తెలంగాణ విద్యార్థులకు హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలోని దూర విద్యా కేంద్రం, వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీల్లో ఈ ప్రక్రియ ఉంటుంది. ఏపీకి చెందిన వారికి విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. వెరిఫికేషన్ పూర్తయ్యాక వెబ్ కౌన్సెలింగ్ ఉంటుంది.
Published date : 23 Jul 2016 03:12PM

Photo Stories