Skip to main content

వెబ్ ఆప్షన్లకు వన్‌టైమ్ పాస్‌వర్డ్

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే వెబ్ ఆప్షన్ల ప్రక్రియలో వన్‌టైమ్ పాస్‌వర్డ్ విధానాన్ని అమలు చేయాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది.
వెబ్‌సైట్లో విద్యార్థులు తమ వివరాలను ఇవ్వగానే వారి మొబైల్ నంబర్‌కు వన్‌టైమ్ పాస్‌వర్డ్ వచ్చేలా, దానితో లాగిన్ అయి ఆప్షన్లు ఇచ్చుకునేలా చర్యలు చేపట్టింది. ఈ వన్‌టైమ్ పాస్‌వర్డ్ 20 నిమిషాల పాటు పనిచేస్తుంది. మళ్లీ ఆప్షన్లు ఇచ్చుకోవాలంటే మళ్లీ వన్‌టైమ్ పాస్‌వర్డ్ పొందాల్సి ఉంటుంది.

8 నుంచి మొదలయ్యేనా?
ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియను బుధవారం (ఈనెల 8వ తేదీ) నుంచి చేపట్టాలని ఇంజనీరింగ్ ప్రవేశాల కమిటీ ఇప్పటికే నిర్ణయించింది. కానీ హైదరాబాద్ జేఎన్‌టీయూ నుంచి అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితా ఇంకా ప్రవేశాల క్యాంపు కార్యాలయానికి అందలేదు. అనుబంధ గుర్తింపు నిరాకరణ, కోర్సుల కోతపై కొన్ని కాలేజీల యాజమాన్యాలు ఇప్పటికే కోర్టును ఆశ్రయించడంతో... కోర్టు తీర్పు వచ్చాకే కాలే జీల జాబితాలు, సీట్ల వివరాలు ఇస్తామని జేఎన్‌టీయూహెచ్ చెబుతోంది. వాస్తవానికి ఈనెల 4వ తేదీనే కోర్టు తీర్పు వస్తుందని... 6వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభించాలని తొలుత ప్రవేశాల కమిటీ భావించింది. అలా జరగలేదు. తర్వాత సోమవారం కోర్టు తీర్పు వస్తుందని భావించి.. 8 నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ కోర్టు తీర్పు మంగళవారం (7వ తేదీ) సాయంత్రానికి వాయిదా పడింది. అయితే కోర్టు తీర్పు వచ్చిన వెంటనే జేఎన్‌టీయూహెచ్ కాలేజీల జాబితాను తమకు అందజేస్తే 8వ తేదీ నుంచే వెబ్ ఆప్షన్లు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టవచ్చని ప్రవేశాల క్యాంపు కార్యాలయం అధికారి శ్రీనివాస్ తెలిపారు. జాప్యం జరిగితే మాత్రం 9వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభించడం సాధ్యమవుతుందని చెప్పారు.

ఇదీ వన్‌టైమ్ పాస్‌వర్డ్ విధానం
వెబ్ ఆప్షన్ల ప్రక్రియలో నాలుగు దశలు ఉంటాయి. ఇందుకు ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్‌ను ఉపయోగించడం మంచిది. తొలుత tseamcet.nic.in వెబ్‌సైట్‌లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లింక్‌ను ఓపెన్ చేయాలి. అందులో విద్యార్థి రిజిస్ట్రేషన్ నంబరు, హాల్‌టికెట్ నంబరు, ర్యాంకు, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి పాస్‌వర్డ్ జనరేట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో పైబాక్సులో ఒక పాస్‌వర్డ్‌ను (అది 8 నుంచి 10 లెటర్లు ఉండాలి. అది క్యాపిటల్ లెటర్, నంబరు, సింబల్, అక్షరాలతో కూడినదై ఉండాలి) ఎంటర్ చేయాలి. రెండో బాక్సులో మరోసారి దాన్నే ఎంటర్ చేయాలి. మూడో బాక్సులో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్‌ను ఇచ్చి, సేవ్ పాస్‌వర్డ్‌ను నొక్కాలి. దాంతో మొబైల్ నంబర్‌కు రహస్య లాగిన్ ఐడీ వస్తుంది. తర్వాత హోంపేజీలో క్యాండిడేట్ లాగిన్‌లోకి వెళ్లి ఈ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో లాగిన్ కావాలి. అక్కడ వన్‌టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) బటన్‌ను నొక్కితే మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసి వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ ఓటీపీ 20 నిమిషాల పాటు పనిచేస్తుంది. ఇచ్చిన వెబ్ ఆప్షన్లు ఆటోమెటిక్‌గా సేవ్ అవుతాయి. మళ్లీ ఆప్షన్లను మార్పు చేసుకోవాలన్నా, మరిన్ని ఆప్షన్లు ఇచ్చుకోవాలన్నా మళ్లీ ఓటీపీని తీసుకుని ఎంటర్ చేయాలి.
Published date : 07 Jul 2015 01:41PM

Photo Stories