టీఎస్ ఎంసెట్-2019 ఫలితాల్లో అబ్బాయిలదే హవా..
82.47%... 93.01% ఉత్తీర్ణత :
ఎంసెట్‌కు మొత్తంగా 2,17,199 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 1,42,210 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు, 74,989 మంది అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులు ఉన్నారు. అగ్రికల్చర్ పరీక్షలకు 1,31,209 మంది హాజరవగా అందులో 1,08,213 మంది (82.47 శాతం) అర్హత సాధించారు. అగ్రికల్చర్ ఫార్మసీ పరీక్షలకు 68,550 మంది హాజరుకాగా, వారిలో 63,758 మంది (93.01 శాతం) అర్హత సాధించారు. విద్యార్థుల ఎంసెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీని అమలు చేశారు. ఈ పరీక్షలను ఆన్‌లైన్లో పలు దఫాలుగా నిర్వహించినందున నార్మలైజేషన్ చేసి విద్యార్థులకు ర్యాంకులను ఖరారు చేశారు. ఈ ఫలితాల్లో ఎంసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థుల్లో టాప్-10 ర్యాంకులతోపాటు వివిధ కేటగిరీల్లో టాప్ ర్యాంకులను సాధించిన విద్యార్థుల వివరాలను కూడా ప్రకటించారు.
జూన్ 20 తరువాత కౌన్సెలింగ్:
ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి మాట్లాడుతూ.. జూన్ 20 తరువాత ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఈసారి జేఎన్‌టీయూ, ఉస్మానియా, కాకతీయ వర్సిటీల పరిధిలో ఇంజనీరింగ్‌లో 90 వేల వరకే సీట్లు ఉంటాయని తెలిపారు. జేఎన్‌టీయూ వీసీ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ తమ వర్సిటీల పరిధిలో గతేడాది 86 వేల సీట్లు ఉండగా ఈసారి 77,500 వరకు సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.
తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థులు టాప్ :
తెలంగాణ ఎంసెట్-2019 ఫలితాల్లో మన రాష్ట్ర విద్యార్థులు ‘టాప్’ లేపారు. ఇంజనీరింగ్, అగ్రి, మెడికల్ విభాగాల్లో టాప్ ర్యాంకులు సాధించి సత్తా చాటారు. ఇంజనీరింగ్ విభాగంలో ఏపీ విద్యార్థులు టాప్ టెన్‌లో మొదటి, రెండో ర్యాంకుతో కలిపి మొత్తం ఐదు ర్యాంకులు సాధించి తమ ప్రతిభ చూపారు. అదేవిధంగా అగ్రి, మెడికల్ విభాగంలోనూ టాప్ టెన్‌లో ఐదు ర్యాంకులు సాధించారు. జూన్ 9న హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో విడుదలైన ఈ ఫలితాల్లో ఇంజనీరింగ్ విభాగంలో ప్రథమ ర్యాంక్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన కురిశెట్టి రవి శ్రీతేజకు దక్కింది. ఇదే విభాగంలో రెండో ర్యాంకు విజయవాడకు చెందిన డి.చంద్రశేఖర ఎస్‌ఎస్ హేతహవ్యకు, నాలుగో ర్యాంకు నెల్లూరుకు చెందిన బట్టేపాటి కార్తికేయకు, ఐదో ర్యాంకు భీమవరానికి చెందిన గొర్తి భానుదత్తాకు, 8వ ర్యాంకు ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన గౌరుపెద్ది హితేందర్ కాశ్యప్‌కు లభించాయి. ఇక అగ్రి, మెడికల్ విభాగంలో రాజమహేంద్రవరంకు చెందిన దాసరి కిరణ్‌కుమార్‌రెడ్డి రెండో ర్యాంకును దక్కించుకున్నాడు. ఇదే విభాగంలో మూడో ర్యాంకు కాకినాడకు చెందిన మార్కాని వెంకట సాయి అరుణ్‌తేజకు, నాలుగో ర్యాంకు తిరుపతికి చెందిన సుంకర సాయి స్వాతికి, 8వ ర్యాంకు విశాఖపట్నానికి చెందిన సిద్ధార్థ భరద్వాజ్ బృందావనంకు, 9వ ర్యాంకు తిరుపతికి చెందిన పూజకు లభించాయి. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో మొదటి ర్యాంకు తెలంగాణకు చెందిన ఎంపటి కుశ్వంత్‌కు దక్కింది.
ఏపీ ఎంసెట్‌లోనూ అతడే టాప్.. తెలంగాణ ఎంసెట్‌లో ర్యాంకులు పొందిన పలువురు విద్యార్థులు ఇటీవల వెల్లడైన ఏపీ ఎంసెట్-2019 ఫలితాల్లోనూ సత్తా చాటడం విశేషం. ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో కురిశెట్టి రవి శ్రీతేజ మొదటి ర్యాంక్ దక్కించుకోవడం విశేషం. అదేవిధంగా గొర్తి భానుదత్తా ఏపీ ఎంసెట్‌లో మూడో ర్యాంక్ పొందాడు. అలాగే ఏపీ ఎంసెట్‌లో అగ్రి, మెడికల్ విభాగంలో రెండో ర్యాంక్ దక్కించుకున్న దాసరి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ఎంసెట్‌లోనూ అదే స్థానంలో నిలిచాడు. అదేవిధంగా తిరుపతికి చెందిన సుంకర స్వాతి ఏపీ ఎంసెట్ మెడికల్ విభాగంలో మొదటి ర్యాంకు దక్కించుకుంది. |
ఇంజనీరింగ్‌లో టాప్-10 ర్యాంకులు:
ర్యాంకు | పేరు | కంబైన్‌డ స్కోర్ | ప్రాంతం |
1 | కురిశెట్టి రవి శ్రీతేజ | 95.4834 | తాడేపల్లిగూడెం |
2 | డి చంద్రశేఖర ఎస్.ఎస్.హేతహవ్య | 94.6569 | విజయవాడ |
3 | గిల్లెల ఆకాశ్‌రెడ్డి | 93.1628 | వనపర్తి |
4 | బట్టేపాటి కార్తికేయ | 93.0393 | నెల్లూరు |
5 | గోర్తి భానుదత్త | 92.0528 | భీమవరం |
6 | బి. సాయి వంశీ | 91.7638 | హైదరాబాద్ |
7 | సూరపనేని సాయివిగ్న | 91.4714 | మాదాపూర్ |
8 | గౌరిపెద్ది హితేంద్ర కశ్యప్ | 90.7947 | గిద్దలూరు |
9 | పి.వేద ప్రణవ్ | 90.6039 | హైదరాబాద్ |
10 | అప్పకొండ అభిజిత్‌రెడ్డి | 90.3028 | మాదాపూర్ |
అగ్రికల్చర్, ఫార్మసీలో..
ర్యాంకు | పేరు | కంబైన్‌డ స్కోర్ | ప్రాంతం |
1 | ఎంపటి కుశ్వంత్ | 97.9473 | భూపాలపల్లి |
2 | దాసరి కిరణ్‌కుమార్‌రెడ్డి | 96.5340 | రాజమండ్రి |
3 | మరకని వెంకట సాయి అరుణ్ తేజ | 96.3524 | కాకినాడ |
4 | సుంకర సాయి స్వాతి | 96.2564 | తిరుపతి |
5 | ఆరె అక్షయ్ | 96.0615 | హైదరాబాద్ |
6 | మోనీష ప్రియ.జె | 95.9446 | మదురై (తమిళనాడు) |
7 | బుర్ర శివానీ శ్రీవాత్సవ | 95.4109 | నిజామాబాద్ |
8 | సిద్ధార్థ్ భరద్వాజ్ బృందావనం | 95.2323 | విశాఖపట్నం |
9 | వి. పూజ | 94.9352 | తిరుపతి |
10 | తిప్పరాజు హాసిత | 94.6426 | హైదరాబాద్ |
విద్యాసంస్థల వారీగా పరీక్షలు రాసిన, అర్హత సాధించిన విద్యార్థుల వివరాలు..
ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ
విద్యా సంస్థ | హాజరు | అర్హులు | హాజరు | అర్హులు |
ప్రభుత్వ జూనియర్ కాలేజీలు | 7,960 | 6,737 | 9,886 | 9,055 |
కేంద్రీయ విద్యాలయాలు | 463 | 401 | 212 | 203 |
జవహర్ నవోదయ విద్యాలయాలు | 263 | 237 | 182 | 180 |
ప్రభుత్వ/డీఆర్‌డీఏ పథకం | 482 | 424 | 468 | 442 |
ప్రైవేటు/ కార్పొరేట్ కాలేజీలు | 1,22,041 | 1,00,414 | 57,802 | 53,878 |
మొత్తం | 1,31,209 | 1,08,213 | 68,550 | 63,758 |
ఎంసెట్ టాపర్ల అభిప్రాయాలు...
ఐఐటీలో సీటు సాధిస్తా.. నాకు ఇంటర్‌లో 985 మార్కులొచ్చాయి. క్రమపద్ధతిలో చదివినందుకు మంచి ర్యాంకు సాధించా. ఏపీ ఎంసెట్‌లో నాలుగో ర్యాంకు వచ్చింది. జేఈఈ మెయిన్స్ లో 33వ ర్యాంకు వచ్చింది. జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నా. ఐఐటీలో సీటు సాధిస్తా. - చంద్రశేఖర ఎస్‌ఎస్ హేతహవ్య, ఎంసెట్ రెండో ర్యాంకు |
కంప్యూటర్ ఇంజనీర్ అవుతా.. నాకు ఇంటర్‌లో 981 మార్కులు వచ్చాయి. ఏపీ ఎంసెట్‌లో 28వ ర్యాంకు వచ్చింది. జేఈఈ మెయిన్స్ లో 117వ ర్యాంకు వచ్చింది. కంప్యూటర్ ఇంజనీర్ కావడం నా లక్ష్యం. - జి.ఆకాశ్‌రెడ్డి, మూడో ర్యాంకు |
ఐఐటీయే లక్ష్యం... మా నాన్న సురేష్‌నాయుడు ఆక్వా రైతు, అమ్మ అమరావతి గృహిణి. పదో తరగతిలో 10 గ్రేడ్ పాయింట్లు సాధించా. ఇంటర్‌లో 981 మార్కులు వచ్చాయి. ఏపీ ఎంసెట్‌లో 5వ ర్యాంకు, జేఈఈ మెయిన్స్ లోనూ 5వ ర్యాంకు సాధించా. ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యం. - బట్టేపాటి కార్తికేయ, నాలుగో ర్యాంకు |
రీసెర్చ్ అంటే ఇష్టం... మా నాన్న నాగవెంకట విశ్వనాథం ప్రైవేటు ఉద్యోగి. అమ్మ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. పదో తరగతిలో 10 పాయింట్లు సాధించా. ఇంటర్‌లోనూ 10 గ్రేడ్ పాయింట్లు వచ్చాయి. ఏపీ ఎంసెట్‌లో 3వ ర్యాంకు, జేఈఈ మెయిన్స్ లో కూడా 3వ ర్యాంకు వచ్చింది. అడ్వాన్స్ డ్ ఫలితాల కోసం చూస్తున్నా. నాకు పరిశోధనలంటే ఇష్టం. - భాను దత్త, ఎంసెట్ ఐదో ర్యాంకు |
ఐఐటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తా... నాన్న శ్రీనివాస్‌కుమార్ రైల్వేలో సీనియర్ టెక్నికల్ ఇంజనీర్, కంప్యూటర్ సైయి ఇంజనీర్ చేయాలనే నా లక్ష్యం. ఇంటర్‌లో 984 మార్కులు వచ్చాయి. జేఈఈలో 248 ర్యాంకు వచ్చింది. అడ్వాన్స్ డ్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నా. - బి.సాయివంశీ, ఎంసెట్ ఆరో ర్యాంకు |
సివిల్స్ సాధిస్తా... నా తల్లిదండ్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. భవిష్యత్తులో సివిల్స్‌లో మంచి ఉద్యోగం సంపాదించాలనేది నా లక్ష్యం. జేఈఈ మెయిన్స్ లో 125వ ర్యాంకు సాధించా. - గౌరిపెద్ది హితేంద్ర కశ్యప్, 8వ ర్యాంకు |
న్యూరో సర్జన్ కావడమే జీవితాశయం... మా నాన్న లక్ష్మీనారాయణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అమ్మ లక్ష్మి టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. నీట్‌లో 55వ ర్యాంకు సాధించా. న్యూరో సర్జన్ కావాలనేది నా ఆశయం. - ఎంపటి కుశ్వంత్, ఫస్ట్ ర్యాంకు |
న్యూరో సర్జన్ అవుతా... మా నాన్న సూర్యభాస్కరరావు రైల్వే ఉద్యోగి. అమ్మ విజయశాంతి గృహిణి. పదో తరగతిలో 10 గ్రేడ్ పాయింట్లు, ఇంటర్‌లోనూ 10 గ్రేడ్ పాయింట్లు సాధించా. నీట్‌లో జాతీయ స్థాయిలో 528 ర్యాంకు, ఏపీ ఎంసెట్‌లో రెండో ర్యాంకు వచ్చింది. న్యూరో సర్జన్ అవుతా. - దాసరి కిరణ్‌కుమార్‌రెడ్డి, రెండో ర్యాంకు |
కార్డియాలజిస్ట్ కావాలనుకుంటున్నా... మా నాన్న వెంకట కిరణ్‌కుమార్ న్యూరో సర్జన్, అమ్మ నాగశ్రీదేవీ గృహిణి. పదో తరగతి, ఇంటర్‌లోనూ 10 గ్రేడ్ పాయింట్లు సాధించా. ఏపీ ఎంసెట్‌లో 107, నీట్‌లో 1292 ర్యాంకు వచ్చింది. కార్డియాలజిస్ట్ కావాలనేదే నా లక్ష్యం. - ఎం. వెంకటసాయి అరుణ్ తేజ, మూడో ర్యాంకు |
ఇంజనీరింగ్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
అగ్రికల్చర్, మెడికల్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
మొబైల్‌లో ఫలితాల కోసం క్లిక్ చేయండి