Skip to main content

టీఎస్ ఎంసెట్-2019 నోటిఫికేషన్ విడుదల

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్ డిగ్రీ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఎంసెట్-2019 నోటిఫికేషన్ విడుదలైంది.
మార్చి 6 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి 2న జేఎన్టీయూహెచ్‌లో జరిగిన ఎంసెట్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి వివరాలను వెల్లడించారు. మే 3 నుంచి ఆన్‌లైన్‌లో ఎంసెట్ నిర్వహిస్తున్నామని, ఇందుకోసం టీఎస్‌టీఎస్, టీసీఎస్ సహకారం తీసుకుంటున్నట్లు చెప్పారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 18 పరీక్ష జోన్లుగా విభజించి 54 పరీక్షా కేంద్రాల్లో ఎంసెట్ నిర్వహిస్తున్నామని, తెలంగాణలో 15 జోన్లు, ఆంధ్రప్రదేశ్‌లో 3 జోన్లు ఉన్నాయన్నారు. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి హాజరు కావాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం ఆన్‌లైన్‌లో మాక్ టెస్ట్‌కు అవకాశం కల్పించామని, ఇందుకు సెట్ వెబ్‌సైట్ చూడాలన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులు, విద్యార్థుల సంఖ్య ఆధారంగా పరీక్షా కేంద్రాలను ఖరారు చేస్తామని పాపిరెడ్డి చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు ఇబ్బంది కలగకుండా పరీక్షలు నిర్వహిస్తామని, ప్రస్తుతం ప్రకటించిన పరీక్షల తేదీల్లో ఎన్నికల తేదీలు ఉంటే వాటిని మార్చే అవకాశం ఉంటుందన్నారు. గతేడాది 2.40 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఈసారి మరో 10 వేల వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూ వీసీ వేణుగోపాల్‌రెడ్డి, కన్వీనర్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇదీ ఎంసెట్ షెడ్యూల్...
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 06-03-2019
దరఖాస్తుల స్వీకరణ గడువు: 05-04-2019
దరఖాస్తులో తప్పుల సవరణ: 06-04-2019నుంచి 09-04-2019 రూ.
500 అపరాధ రుసుముతో గడువు:11-04-2019 రూ. 1000
అపరాధ రుసుముతో గడువు:17-04-2019
ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు జనరేట్ అయ్యే తేదీ:18-04-2019
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం తేదీ: 20-04-2019
హాల్‌టికెట్ల డౌడ్‌లోడ్‌కు చివరి తేదీ: 01-05-2019
రూ.5,000 అపరాధ రుసుముతో దరఖాస్తు సమర్పణ గడువు: 24-04-2019
రూ. 10,000 అపరాధ రుసుముతో దరఖాస్తు సమర్పణ గడువు: 28-04-2019
పరీక్ష తేదీలు:ఇంజనీరింగ్ స్ట్రీమ్‌ మే 3, 4, 6
అగ్రికల్చర్, ఫార్మసీ : మే 8, 9

పరీక్ష సమయం:
మార్నింగ్ సెషన్:
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.
ఆఫ్టర్‌నూన్ సెషన్: మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు

రిజిస్ట్రేషన్ ఫీజు :

కేటగిరీ

ఫీజు వివరాలు

ఇంజనీరింగ్

ఎస్సీ, ఎస్టీలకు రూ. 400, ఇతరులకు రూ. 800

అగ్రికల్చర్, ఫార్మసీ

ఎస్సీ, ఎస్టీలకు రూ. 400, ఇతరులకు రూ. 800

రెండు కేటగిరీలకు

ఎస్సీ, ఎస్టీలకు రూ. 800, ఇతరులకు రూ. 1,600

Published date : 04 Mar 2019 12:29PM

Photo Stories