Skip to main content

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంటుకు కత్తెర!

సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. 2015-16 విద్యాసంవత్సరానికి సంబంధించి పథకం మార్గదర్శకాలను ప్రకటించింది. ఎంసెట్‌లో అయిదు వేల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులు మాత్రమే పూర్తి రీయింబర్స్‌మెంట్ పొందేందుకు అర్హులుగా తేల్చింది.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రం ర్యాంకుతో సంబంధం లేకుండా పథకాన్ని వర్తింపజేయనుంది. సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ, రెసిడెన్షియల్ కాలేజీల్లో చదువుకున్న విద్యార్థులు, కార్పొరేట్ కాలేజీ స్కీమ్ కింద చదివే విద్యార్థులు కూడా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందేందుకు అర్హులవుతారు. 5 వేల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులు కాకుండా మిగతా వారికి.. ఆయా కాలేజీల్లో వసూలు చేసే ఫీజుతో నిమిత్తం లేకుండా గరిష్టంగా రూ.35 వేల ఫీజు లేదా కాలేజీ ఫీజు (ఏది తక్కువ అయితే అది) ప్రభుత్వం అందజేయనుంది. 2013-14లో పదివేల ర్యాంకు వచ్చిన విద్యార్థులకు కూడా పథకాన్ని వర్తింపచేశారు. 2014-15లో ఇదే విధానాన్ని అమలు చేసినా స్థానిక నిబంధన జోడించారు. తాజాగా దీన్ని 5 వేల ర్యాంకుకు పరిమితం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. 2014-15కు సంబంధించి గతంలోని ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగిస్తున్నట్లు, రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి తెలంగాణకు చెందిన స్థానిక విద్యార్థులకే పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు చెల్లించనున్నట్లు ఈ ఏడాది మార్చి 10న రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఉపకారవేతనాలు పొందేందుకు.. ప్రస్తుతం క్వాలిఫై అయిన కోర్సుకు ముందు విద్యార్థులు గత ఏడేళ్ల విద్యాభ్యాసానికి సంబంధించిన రికార్డులను సమర్పించాలని స్పష్టంచేసింది. రాష్ట్ర విభ జన నేపథ్యంలో తెలంగాణలో విడిగా ఎంసెట్‌ను నిర్వహించినందున 2015-16 విద్యాసంవత్సరానికి సంబంధించిన పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్స్ పథకంపై మార్గదర్శకాలను విడుదలచేయాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జూన్ 1న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజులకు సంబంధించిన మార్గదర్శకాలను వివరిస్తూ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి జె.రేమండ్‌పీటర్ మంగళవారం(జూన్ 30న) ఒక మెమో విడుదల చేశారు. ఈ నిబంధనలకు అనుగుణంగా స్కాలర్‌షిప్‌లకు అర్హులైన విద్యార్థుల అలాట్‌మెంట్ లెటర్లపై ఎంసెట్ కన్వీనర్ ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని ఈ ఉత్వర్వుల్లో స్పష్టంచేశారు.

స్థానిక తెలంగాణ విద్యార్థులకే..
ఫీజులకు సంబంధించి ప్రభుత్వపరంగా సవివరంగా తుది మార్గదర్శకాలు వెలువడాల్సి ఉంది. అప్పటివరకు ఎంసెట్ కౌన్సెలింగ్ సందర్భంగా.. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా తెలంగాణలోని అర్హులైన స్థానిక విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ వివరాలను అలాట్‌మెంట్ లెటర్లపైనే పేర్కొనాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది. కన్వీనర్ కోటాలో 2015-16 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోర్సుల్లో (బి-ఆర్కిటెక్చర్ కోర్సులతో సహా) తుది పరిశీలన తర్వాతే ఫీజు రీయింబర్స్‌మెంట్‌లోని మిగతా అంశాలపై తేల్చనున్నారు.
Published date : 03 Jul 2015 10:50AM

Photo Stories