Skip to main content

తెలంగాణలో ఈనెల 22 నాటికి ఎంసెట్ నోటిఫికేషన్

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్-2016 నోటిఫికేషన్‌ను ఈ నెల 22వ తేదీ నాటికి విడుదల చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఎంసెట్‌తో సహా ఇతర సెట్స్ నిర్వహించే యూనివర్సిటీలను, సెట్స్‌కు కన్వీనర్లను ఎంపిక చేసిన మండలి నోటిఫికేషన్ల జారీపై దృష్టి సారించింది.
ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ ఏపీ ఎంసెట్ నోటిఫికేషన్ జారీ చేసి, దరఖాస్తులను స్వీకరిస్తుండగా.. తెలంగాణలో మాత్రం ఇంకా నోటిఫికేషన్ జారీ కాలేదు. రాష్ట్ర విద్యార్థులతోపాటు ఏపీకి చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్థులంతా తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 25న తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ జారీ చేశారు. దాంతో పోలిస్తే ఈసారి ఆలస్యమేమీ కానప్పటికీ త్వరగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు. మరో రెండు మూడ్రోజుల్లో ఎంసెట్ కమిటీని ఏర్పాటు చేసి, 22వ తేదీ నాటికి నోటిఫికేషన్ జారీ చేసేందుకు విద్యా మండలి కసరత్తు చేస్తోంది. 22న వీలు కాకపోతే 25లోగా నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఎంసెట్ విధివిధానాలు, ఫీజు తదితర అన్ని వివరాలతో కూడిన నివేదికను ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణరావు ఉన్నత విద్యా మండలికి అందజేసినట్లు తెలిసింది. ఇతర సెట్స్ (ఐసెట్, ఈసెట్, పీజీఈసెట్, లాసెట్, ఎడ్‌సెట్ తదితర) నోటిఫికేషన్లను కూడా ఒక్కొక్కటిగా జారీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంసెట్ నోటిఫికేషన్ జారీ చేసిన ఒకట్రెండు రోజుల నుంచే దరఖాస్తుల స్వీకరణకు చర్యలు చేపట్టాలని విద్యా మండలి భావిస్తోంది. ఇందుకు అవసరమైన షెడ్యూల్‌ను సిద్ధం చేయాలని ఎంసెట్ కన్వీనర్‌ను ఆదేశించింది.

పెరగనున్న దరఖాస్తుల సంఖ్య:
తెలంగాణ ఎంసెట్ రాసేందుకు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య ఈసారి పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర విభజన సమస్యలు, అనవసరపు ఆందోళనలు, అపోహలు తొలగిపోవడంతో ఏపీ నుంచి తెలంగాణ ఎంసెట్ రాసే విద్యార్థుల సంఖ్య ఈసారి పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మరోవైపు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రభుత్వం నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట వేస్తుండటంతో రాష్ట్రం నుంచి కూడా ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. గతేడాది తెలంగాణ ఎంసెట్‌కు 2,32,047 లక్షల మంది (ఇంజనీరింగ్‌కు 1,39,682, అగ్రికల్చర్ అండ్ మెడికల్‌కు 92,365 మంది) దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఏపీకి చెందిన వారు 43,169 మంది, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 9,458 మంది, తెలంగాణకు చెందిన వారు 1,79,420 మంది ఉన్నారు.
Published date : 16 Feb 2016 12:48PM

Photo Stories