Skip to main content

తెలంగాణ ఎంసెట్‌లో ఏపీ అమ్మాయి టాపర్

సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్/నెట్‌వర్క్: తెలంగాణ ఎంసెట్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సత్తాచాటింది. కర్నూలుకు చెందిన పరిగెల నమ్రత అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 145.88 మార్కులతో (హాల్ టికెట్-118401135) మొదటి ర్యాంకు సాధించింది.
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 2 నుంచి 7 వరకు నిర్వహించిన తెలంగాణ ఎంసెట్-18 ఫలితాలను ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మే 19న విడుదల చేశారు. ఎంసెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీతో కలిపి కంబైన్డ్ స్కోర్‌ను ఖరారు చేసి.. ర్యాంకులను కేటాయించారు. ఇంజనీరింగ్ విభాగంలో టాప్-10 ర్యాంకులన్నీ బాలుర సొంతమవ్వగా.. అగ్రి,ఫార్మసీ విభాగంలో టాప్-10లో ఐదు ర్యాంకులు సాధించారు. ఈ రెండు కేటగిరీల్లో కలిపి ఏపీ విద్యార్థులు టాప్-10 ర్యాంకుల్లో ఐదు ర్యాంకులను సాధించారు. తెలంగాణ ఎంసెట్‌కు మొత్తంగా 2,21,064 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్ విభాగంలో 1,36,305 మంది పరీక్షకు హాజరుకాగా.. 1,06,646 మంది (78.24 శాతం) అర్హత సాధించారు. ఇక అగ్రికల్చర్/ఫార్మసీ విభాగంలో 66,858 మంది పరీక్ష రాయగా.. 60,651 మంది (90.72 శాతం) అర్హత సాధించారు.

ఏపీ విద్యార్థుల హవా..
తెలంగాణ ఎంసెట్‌లో ఫలితాల్లో ఏపీ విద్యార్థుల హవా కొనసాగింది. ఇంజనీరింగ్ టాప్-10 ర్యాంకుల్లో మూడు, అగ్రి, ఫార్మసీ విభాగంలోని టాప్-10 రెండు ర్యాంకులు సాధించారు. ఇంజనీరింగ్‌లో విశాఖపట్నానికి చెందిన కేవీఆర్ హేమంత్ కుమార్ 4వ, విజయవాడకు చెందిన ఎస్ మదన్‌మోహన్‌రెడ్డి 5వ, శ్రీకాకుళం జిల్లాకు చెందిన డాకారపు భరత్ 6వ ర్యాంకు సాధించారు. అగ్రి, ఫార్మసీ విభాగంలో నమ్రత టాప్ ర్యాంకర్‌గా నిలువగా, కర్నూలు జిల్లా ఆదోని పట్టణం విక్టోరియా పేటకు చెందిన గంజికుంట శ్రీవాత్సవ్ 6వ ర్యాంక్ సాధించాడు. కాగా, 160 మార్కులకు నిర్వహించిన తెలంగాణ ఎంసెట్‌లో ఒక్క విద్యార్థికి కూడా పూర్తి మార్కుల లభించలేదు. ఇంజనీరింగ్ విభాగంలో టాప్ మార్కులు 152.8616 మాత్రమే. ఇక అగ్రి, ఫార్మసీలో 145.8842 మార్కులే టాప్ మార్కులు.

న్యూరాలజిస్ట్ కావాలని..
నీట్‌లో కూడా మంచి ర్యాంకు సాధిస్తానని టాపర్ నమ్రత ‘సాక్షి’తో చెప్పింది. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించాలనేది తన లక్ష్యమని పేర్కొంది. నమ్రత తండ్రి డా.హరిచరణ్ కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ (జనరల్ సర్జరీ)గా పనిచేస్తుండగా, తల్లి నివేదిత కర్నూలు ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో కంటి వైద్య నిపుణులుగా ఉన్నారు. నమ్రత సోదరి కూడా కర్నూలు వైద్య కళాశాలలో రెండో సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతోంది. న్యూరాలజిస్ట్ కావాలన్నది తన ధ్యేయమని నమ్రత పేర్కొంది. ఇంటర్ కర్నూలులోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివి 987 మార్కులు సాధించింది. ఏపీ ఎంసెట్‌లోనూ 21వ ర్యాంకు సాధించి..సత్తా చాటింది.

రోజూ 12 గంటలు చదివా..
‘‘నాలుగో ర్యాంకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. మాది విశాఖపట్నం. మంచి ర్యాంకు రావాలని రోజూ 12 గంటల పాటు కష్టపడి చదివా..’’
- హేమంత్‌కుమార్, ఇంజనీరింగ్ 4వ ర్యాంకు

మంచి ఇంజనీర్ అవుతా..
‘‘మంచి ఇంజనీర్ కావాలనే నా లక్ష్యం. మాది శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం. నాన్న కేబుల్ ఆపరేటర్. జేఈఈ మెయిన్స్‌ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 8వ ర్యాంకు వచ్చింది. అడ్వాన్స్‌డ్‌లోనూ మంచి ఫలితం సాధిస్తా..’’
- డాకారపు భరత్, 6వ ర్యాంకు

నీట్‌లోనూ ర్యాంక్ సాధిస్తా..
‘‘ఎంబీబీఎస్ చేసి మంచి డాక్టర్ కావాలని ఉంది. నీట్‌లోనూ ఆలిండియా ర్యాంకు వస్తుందన్న నమ్మకం ఉంది. మాది కర్నూలు జిల్లా ఆదోని. నాన్న పారామెడికల్ ఆఫీసర్. అమ్మ గృహిణి.’’
- గంజికుంట శ్రీవాత్సవ్, 6వ ర్యాంకు
Published date : 21 May 2018 06:03PM

Photo Stories