Skip to main content

ఫిబ్రవరి 27న టీఎస్ ఎంసెట్ నోటిఫికేషన్

సాక్షి, హైదరాబాద్ : ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో వచ్చే విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం ఎంసెట్ పూర్తిస్థాయి షెడ్యూల్ ఖరారైంది. దీనిపై ఫిబ్రవరి 27న నోటిఫికేషన్ జారీ కానుంది. మార్చి 4 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.
మే 2 నుంచి 7వ తేదీ వరకు (6వ తేదీ మినహా.. ఆరోజున నీట్ పరీక్ష ఉంది) ఆన్‌లైన్ విధానంలో పరీక్షలను నిర్వహిస్తారు. ఈ మేరకు ఫిబ్రవరి 26నజేఎన్టీయూలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ తు మ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఎంసెట్ కమిటీ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నా రు. సమావేశం అనంతరం పాపిరెడ్డితోపాటు ఎంసెట్ కమిటీ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, కన్వీనర్ యాదయ్య వివరాలను వెల్లడించారు.

తొలిసారిగా ఆన్‌లైన్‌లో..
బీఈ/బీటెక్, బయోటెక్, బీటెక్ డైరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, బీఫార్మసీ, బీఎస్సీ హానర్స్, అగ్రికల్చర్/బీఎస్సీ (హానర్స్), హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్‌ఎస్సీ, ఫార్మ్-డి కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్-2018ను నిర్వహించనున్నారు. తొలిసారిగా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నామని.. రోజూ రెండు సెషన్లలో, ఒక్కో సెషన్‌లో 25 వేల మందికి పరీక్ష ఉంటుందని అధికారులు తెలిపారు. ఒక్కో సెషన్‌కు ఇచ్చే ప్రశ్నలు వేర్వేరుగా ఉం టాయి కనుక విద్యార్థుల మార్కుల నార్మలైజేషన్ ప్రక్రియ చేపడతామన్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రొఫెసర్ నేతృత్వంలో దానిని ఖరారు చేశామని, అవగాహన కోసం దానిని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. ఈసారి తెలుగు, ఇంగ్లిషుతోపాటు ఉర్దూ మీడియంలోనూ ప్రశ్నలు ఇస్తామని, వారికి ఇచ్చే ప్రశ్నలు ఉర్దూ, ఇంగ్లిషు రెండు భాషల్లో ఉంటాయని చెప్పారు.

మెయిల్ ఐడీ తప్పనిసరి..
ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణలో సమస్యలు రాకుండా పక్కా చర్యలు చేపడుతున్నామని, పది రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు. ఈసారి దరఖాస్తుకు మెయిల్‌ఐడీ తప్పనిసరి చేశామని, ఏ సమాచారమైనా మెయిల్‌కే పంపిస్తామని వెల్లడించారు. మే 9న ప్రాథమిక కీ విడుదల చేస్తామని, అదేరోజున ఆన్‌లైన్ పరీక్ష జవాబు పత్రం (రెస్పాన్‌‌స షీట్) మెయిల్ ఐడీకే పంపుతామని చెప్పారు. ఆన్‌లైన్ పరీక్షల కోసం హైదరాబాద్‌లోని ఐదు జోన్లతోపాటు కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, నిజమాబాద్, వరంగల్, ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలులో ప్రాంతీయ కేంద్రాలు ఉంటాయని తెలిపారు. ఆన్‌లైన్ పరీక్షలకు ప్రాక్టీస్ కోసం www.eamcet. www.tsche.ac.in వెబ్‌సైట్‌లో మాక్ టెస్టుల లింకులను అందుబాటులోకి తెస్తామన్నారు. కాగా ఈసారి ఆన్‌లైన్ పరీక్షల నేపథ్యంలో పరీక్ష ఫీజులు పెంచుతున్నట్లు పాపిరెడ్డి వెల్లడించారు. గతేడాది ఎస్సీ, ఎస్టీలకు రూ.250గా ఉన్న ఫీజు ఈసారి రూ.400కు.. బీసీ, జనరల్ విద్యార్థులకు రూ.500 నుంచి రూ.800కు పెంచుతున్నట్లు వెల్లడించారు.

ఇదీ షెడ్యూల్ ..
  • 27-2-2018: ఎంసెట్ నోటిఫికేషన్
  • 4-3-2018 నుంచి 4-4-2018 వరకు: ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
  • 6-4-2018 నుంచి 9-4-2018 వరకు: దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు అవకాశం
  • 11-4-2018 వరకు: రూ.500 ఆలస్య రుసుముతో; 18వ తేదీ వరకు రూ.1,000; 24వ తేదీ వరకు రూ.5 వేలు; 28వ తేదీ వరకు రూ.10 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తులు
  • 20-4-2018 నుంచి 1-5-2018 వరకు: హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
  • 2-5-2018, 3-5-2018: అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు (ఉదయం సెషన్ 10 గంటల నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం సెషన్ 3 గంటల నుంచి 6 గంటల వరకు)
  • 4-5-2018, 5-5-2018, 7-5-2018: ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్ష
Published date : 27 Feb 2018 04:26PM

Photo Stories