Skip to main content

ప్రశాంతంగా ముగిసిన టీఎస్ ఎంసెట్ పరీక్ష

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఈనెల 12న నిర్వహించిన ఎంసెట్ ప్రశాంతంగా ముగిసింది.
ఇంజనీరింగ్ విభాగంలో 93.43 శాతం మంది.. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 92.97 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలో భౌతికశాస్త్రం (ఫిజిక్స్) ప్రశ్నలు కాస్త కఠినంగా వచ్చాయని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఎంసెట్ ప్రశ్నపత్రం సెట్ కోడ్‌ను ఉదయం 6 గంటలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. 246 కేంద్రాల్లో ఉదయం 10 గంటలకు ఇంజనీరింగ్ పరీక్ష ప్రారంభమైంది. 1,41,190 మంది విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోగా.. 1,31,910 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక 154 కేంద్రాల్లో మధాహ్నం 2:30కు అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష ప్రారంభమైంది. దీనికి 79,061 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోగా.. 73,501 మంది పరీక్ష రాశారు. ఎంసెట్ ప్రాథమిక ‘కీ’ని ఈనెల 13న విడుదల చేయనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ యాదయ్య తెలిపారు. వాటిపై ఈనెల 18వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించి.. 22వ తేదీన ర్యాంకులను ప్రకటిస్తామని వెల్లడించారు.

సులభంగానే ప్రశ్నపత్రం..
ఫిజిక్స్ ప్రశ్నలు కొంత కఠినంగా వచ్చినా.. మొత్తంగా గతేడాదితో పోల్చితే సులభంగానే ప్రశ్నలు వచ్చాయని సబ్జెక్టు నిపుణులు ఎంఎన్ రావు వెల్లడించారు. ఇంజనీరింగ్ విభాగంలో మూడు ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని మరో సబ్జెక్టు నిపుణులు మూర్తి తెలిపారు. సెట్ ‘ఎ’కోడ్ ప్రశ్నపత్రంలోని 87, 98, 110 ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లలో సరైన జవాబులు లేవని వివరించారు. దీంతో కొంతమంది విద్యార్థులు కొద్దిపాటి గందరగోళానికి గురయ్యారని చెప్పారు. సిలబస్‌లోని అన్ని చాప్టర్ల నుంచి ప్రశ్నలు వచ్చాయన్నారు. గతేడాది ఎంసెట్‌లో ఎక్కువ సమయం తీసుకునే సుదీర్ఘ ప్రశ్నలు 15 వరకు ఇవ్వగా.. ఈసారి అలాంటివి నాలుగైదు మాత్రమే ఉన్నాయని వివరించారు. ఇటీవల జరిగిన ఏపీ ఎంసెట్‌తో పోల్చినా.. రసాయన శాస్త్రం, గణితంలో 50 నుంచి 60 వరకు ప్రశ్నలు సులభంగా ఉన్నాయన్నారు. గణితంలో అత్యధికంగా 80 మార్కులు పొందగలుగుతారని, సాధారణ విద్యార్థి కూడా 40 నుంచి 50 మార్కులు పొందగలరని చెప్పారు.
Published date : 13 May 2017 03:29PM

Photo Stories