నార్మలైజేషన్‌లో ఎంసెట్ ర్యాంకులు!
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ తదితర ఉన్నత వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఎంసెట్‌లో నార్మలైజేషన్(సాధారణీకరణ) ప్రక్రియలో ర్యాంకులను ప్రకటించనున్నారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి వివిధ ఉన్నత కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం ప్రవేశ పరీక్షలను కంప్యూటరాధారితంగా నిర్వహించనుండడంతో ఈ నార్మలైజేషన్ ప్రక్రియను చేపడుతున్నారు. ఈ నార్మలైజేషన్ ప్రక్రియను ఎలా చేపట్టాలి అనే దానిపై ఉన్నత విద్యామండలి పలువురు ప్రొఫెసర్లు, ఇతర నిపుణులతో నార్మలైజేషన్ కమిటీని ఇంతకు ముందు నియమించింది. ఈనెల 9న ఈ కమిటీ సమావేశమై ప్రాథమిక చర్చలు జరిపింది. ఇంతకుముందు ఎంసెట్ సహా వివిధ ప్రవేశపరీక్షలు ఓఎమ్మార్ పత్రాల (పెన్ను కాగితాలతో) ఆధారంగా నిర్వహించే వారు. ఒకేరోజు ఒకేరకమైన ప్రశ్నపత్రంతో విద్యార్థులందరికీ ఈ ప్రవేశపరీక్ష ఉండేది. ఈ పరీక్షలో విద్యార్థులకు వచ్చిన మార్కులను, ఇంటర్మీడియెట్‌లో సాధించిన మార్కుల్లో 25 శాతం మేర వెయిటేజీ కల్పించి ర్యాంకులను ప్రకటించేవారు. ఒకేరకమైన మార్కులు వచ్చి ఉంటే ఇంటర్మీడియెట్‌లో ముఖ్య సబ్జెక్టులలో ఆయా అభ్యర్థులు సాధించిన మార్కులను బట్టి ర్యాంకులను ఇచ్చేవారు. ఈసారి ఓఎమ్మార్ పత్రాలతో కాకుండా కంప్యూటరాధారితంగా ఎంసెట్ సహా ఇతర ప్రవేశపరీక్షలన్నీ నిర్వహించాలని ప్రభుత్వం ఏపీ ఉన్నత విద్యామండలిని ఆదేశించడం తెలిసిందే. అయితే ఎంసెట్‌ను కంప్యూటరాధారితంగా నిర్వహించేందుకు తగినన్ని పరీక్ష కేంద్రాలు రాష్ట్రంలో లేవు. రోజులో వేర్వేరు సమయాల్లో 50 వేల మందికి పరీక్ష రాసేందుకు వీలుగా మాత్రమే పరీక్ష కేంద్రాలున్నాయి. దీంతో ఏప్రిల్ 24 నుంచి 27 వరకు ఏపీ ఎంసెట్ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. కంప్యూటరాధారిత పరీక్షను వివిధ సెషన్ల కింద పెడుతున్నందున అభ్యర్థులకు వేర్వేరు ప్రశ్నపత్రాలను ఇవ్వనున్నారు. అయితే ఒక సెషన్లో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో గరిష్ట మార్కులు 80 వస్తే మరో సెషన్లో పరీక్ష రాసిన వారికి గరిష్ట మార్కులు 100 వరకు ఉండవచ్చు. ఇలా అన్ని సెషన్లలోనూ గరిష్ట మార్కులు వేర్వేరుగా ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులందరికీ న్యాయం జరిగేలా.. ఎంసెట్ మార్కులకు ఇంటర్మీడియెట్ వెయిటేజీ మార్కులను కూడా జతచేసి జేఈఈ, గేట్ తరహాలో నార్మలైజేషన్ ద్వారా ర్యాంకులు ప్రకటించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫార్ములాపై చర్చలు జరుపుతున్నారు. ఈనెల 27న నార్మలైజేషన్ కమిటీ మరోసారి సమావేశం కానుంది. అప్పటికి దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇలా ఉండగా ఇప్పటివరకు ఏపీ ఎంసెట్‌కు మొత్తం 1,58,912 దరఖాస్తులు అందాయి.
Published date : 10 Mar 2017 03:52PM