Skip to main content

జులై 20 నుంచి ఇంజనీరింగ్ చివరి దశ ప్రవేశాలు

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ చివరిదశ ప్రవేశాల షెడ్యూల్ జారీ అయింది. జులై 20 నుంచి ఎంసెట్-2018 చివరి దశ కౌన్సెలింగ్‌కు ప్రవేశాల కమిటీ జులై 18న షెడ్యూల్‌ను ప్రకటించింది.
అలాగే కాలేజీల పరిధిలో ఇంటర్నల్ స్లైడింగ్, స్పాట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇప్పటివరకు ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం ఫీజు చెల్లించకుండా, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకాని వారు జులై 20, 21 తేదీల్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలి పారు. ప్రాసెసింగ్ ఫీజు ఎస్సీ, ఎస్టీలకు రూ.600, ఇతరులకు రూ.1,200 ఉంటుందని.. https://tseamcet.nic.in వెబ్‌సైట్‌లో క్రెడిట్‌కార్డు/డెబిట్‌కార్డు/నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చని వెల్లడించారు. వీరంతా జులై 21న హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించే సమయంలో మొబైల్, ఆధార్ నంబరు, కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాల నంబర్లతోపాటు ఈ మెయిల్ ఐడీ కచ్చితంగా ఇవ్వా లని పేర్కొన్నారు. జులై 21 నుంచి 23 వరకు వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి జులై25న సీట్లను కేటాయించనున్నట్లు వివరించారు. జులై25 నుంచి 27 వరకు ట్యూషన్ ఫీజు చెల్లించి, ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని తెలిపారు. సీట్లు పొందిన కాలేజీల్లో 27లోగా చేరా లని పేర్కొన్నారు. కాలేజీల్లో ఇంటర్నల్ స్లైడింగ్ (బ్రాంచ్ మార్పు), స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాల ను 25న వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు.

బైపీసీ స్ట్రీమ్‌లో జులై20 వరకు వెబ్‌ఆప్షన్లు
ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్‌లో ప్రవేశాల కోసం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైనవారు జులై20 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని శ్రీనివాస్ పేర్కొన్నారు. జులై18న 37 వేల ర్యాంకు వరకు విద్యార్థులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలువగా, 4,641 మంది హాజరయ్యారని, 956 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారని వెల్లడించారు. జులై19న 37,001వ ర్యాంకు నుంచి చివరిర్యాంకు వరకున్న విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలని సూచించారు.

ఎవరెవరు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చంటే...
  • ఇదివరకే సీటు వచ్చినా, ఆయా కాలేజీల్లో చేరడం ఇష్టం లేని వారు
  • సీటు వచ్చిన కాలేజీల్లో రిపోర్టు చేసినా, మరో కాలేజీకి వెళ్లాలనుకునే వారు
  • సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్నా ఆప్షన్లు ఇచ్చుకోనివారు
  • వెబ్ ఆప్షన్లు ఇచ్చినా సీట్లు రాని వారు
Published date : 19 Jul 2018 03:23PM

Photo Stories