Skip to main content

ఏప్రిల్ మూడో వారంలో ఆంధ్రప్రదేశ్ ఎంసెట్

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వృత్తి విద్యా కళాశాలల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఎంసెట్-2019ను ఏప్రిల్ మూడో వారంలో నిర్వహించనున్నారు.
ఎంసెట్‌తో పాటు వివిధ వృత్తి విద్యాకోర్సుల ప్రవేశ పరీక్షలకు సంబంధించిన పరీక్షల షెడ్యూళ్లను రాష్ట్ర ఉన్నత విద్యామండలి సిద్ధం చేసింది. జనవరి 12నవీటిని రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారు. గత ఏడాది ఎంసెట్ షెడ్యూల్ కన్నా కొన్ని రోజులు ముందుగానే ఈసారి సెట్ పరీక్షలు జరుగుతాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సెట్ పరీక్షలన్నీ గతంలో మాదిరిగానే ఆన్‌లైన్‌లో జరగనున్నాయి. గత ఏడాదిలో ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగపు ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 22, 23, 24 తేదీల్లో జరిగింది. అగ్రికల్చర్ కోర్సుల ప్రవేశపరీక్ష ఏప్రిల్ 24, 25 తేదీల్లో జరిగింది. అదే రకంగా ఈసెట్ పరీక్ష మే 3న, పీఈసెట్ పరీక్ష మే 24న, ఐసెట్ పరీక్ష మే 2న, ఎడ్‌సెట్ పరీక్ష ఏప్రిల్19న, లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్ష ఏప్రిల్ 19న జరిగాయి. దాదాపు ఇదే షెడ్యూళ్లకు రెండు మూడు రోజులు ముందు ఈసారి పరీక్షల తేదీలు ఉండే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం తమ కాలేజీల్లో వృత్తివిద్యా కోర్సుల ప్రవేశాల షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏపీ నుంచి కూడా పలువురు అభ్యర్ధులు తెలంగాణ ఎంసెట్‌కు హాజరయ్యే అవకాశమున్నందున అంతకన్నా ముందుగానే ఏపీ ఎంసెట్‌ను పూర్తిచేసి ప్రవేశాల ప్రక్రియను త్వరితంగా చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణలో మే 3, 4 ,6 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్, మే 8, 9 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ ఎంట్రన్స్ టెస్టు నిర్వహించనున్నారు. అలాగే మే 11న టీఎస్ ఈసెట్, 20న టీఎస్ పీఈసెట్, 23, 24వ తేదీల్లో టీఎస్ ఐసెట్, 26న టీఎస్ లాసెట్, పీజీ లాసెట్, 27 నుంచి 29 వరకు టీఎస్ పీజీ ఈసెట్, మే 30, 31 తేదీల్లో టీఎస్ ఎడ్ సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
Published date : 12 Jan 2019 03:28PM

Photo Stories