Skip to main content

ఏప్రిల్ 29నే ఏపీ ఎంసెట్

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి మార్పు చేసింది. గతంలో 2016 మే 5వ తేదీన ఎంసెట్ నిర్వహిస్తామని ప్రకటించగా తాజాగా షెడ్యూల్‌ను ఆరురోజులు ముందుకు జరిపి ఏప్రిల్ 29నే నిర్వహించడానికి నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ మార్పుపై బుధవారం రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అధ్యక్షతన సచివాలయంలో సమావేశం జరిగింది. కర్ణాటక ప్రభుత్వం కేసెట్‌ను మే 4, 5 తేదీల్లో నిర్వహించనున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యార్థులకు వెసులుబాటు కల్పించేందుకు ఏపీ ఎంసెట్ షెడ్యూల్‌ను ముందుకు మార్చినట్లు మంత్రి గంటా తెలిపారు.
హైదరాబాద్‌లో ఎంసెట్ కేంద్రాలు లేనట్లే... ఏపీ ఎంసెట్‌కు సంబంధించిన పరీక్ష కేంద్రాలు తెలంగాణలో ఏర్పాటు చేయరాదని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. గత ఏడాది హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు యత్నించగా తెలంగాణ ప్రభుత్వం సహకరించలేదని, ఈసారి కూడా అలాగే అవుతుంది కనుక ఏపీ వరకే పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు పరిమితమవ్వాలని అభిప్రాయపడ్డారు. అయితే తెలంగాణ విద్యార్థులు ఏపీ ఎంసెట్ రాసే విషయమై ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డిని ప్రశ్నించగా.. ఎంసెట్‌కు ఇంకా చాలా సమయం ఉన్నందున హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రాల ఏర్పాటుపై ఆలోచిస్తామన్నారు.
Published date : 07 Jan 2016 12:44PM

Photo Stories