ఏపీ ఎంసెట్ రెండో కౌన్సెలింగ్ వాయిదా!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌పై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఐఐటీ, ఎన్‌ఐటీలు సహ ఇతర రాష్ట్రాల వర్సిటీలు, బిట్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్రవేశాలు పూర్తికాకపోవడమే ఇందుకు కారణం.
ఆయా సంస్థల్లో ప్రవేశాలు పూర్తయ్యాకనే రెండో విడత కౌన్సెలింగ్‌ను చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వంతో చర్చించి ఈ నెల 14 తరువాత రెండో విడత కౌన్సెలింగ్ చేపట్టవచ్చని అధికారవర్గాల సమాచారం. ఎంసెట్ మొదటివిడత కౌన్సెలింగ్‌కు సంబంధించి ఈ నెల 26న సీట్ల అలాట్‌మెంటు జరిగిన సంగతి తెలిసిందే. గురువారం నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. రెండో విడత కౌన్సెలింగ్‌ను జూలై 9, 10, 11 తేదీల్లో చేపట్టాలని ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేశారు. అయితే, ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్రవేశాలు ప్రారంభం కాకపోవడం వల్ల అధికారులు సందిగ్థంలో పడ్డారు. ఆ అడ్మిషన్లు పూర్తయితేనే ఏపీ ఎంసెట్‌లో సీట్లు పొందిన వారు ఎంతమంది ఉంటారో, ఎంతమంది ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర సంస్థల్లో చేరతారో తేలదు. అలా తేలిన తర్వాతే ఖాళీ అయ్యే సీట్లను రెండో విడత కౌన్సెలింగ్ జాబితాలో చేరుస్తారు. రెండో విడతలో కన్వీనర్ కోటాలో ఆ సీట్లను మెరిట్ జాబితాలో తదుపరి విద్యార్థులు పొందే అవకాశముంటుంది. ఐఐటీ తదితర సంస్థల్లో ప్రవేశాలు పూర్తికాకుండా రెండో కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తే ఖాళీ కాబోయే సీట్లు ఆ జాబితాలో చేరవు. ఆ తదుపరి వాటిని కాలేజీల యాజమాన్యాలు స్పాట్ అడ్మిషన్ల పేరిట భర్తీ చేస్తారు. దీనివల్ల మెరిట్ విద్యార్థులు నష్టపోయే ప్రమాదముంది. ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో దాదాపు 3వేల మంది విద్యార్థులు ఏపీ నుంచి చేరుతుంటారని అధికారవర్గాలు చెబుతున్నాయి. వీరంతా ఏపీ ఎంసెట్‌లో మెరిట్ ర్యాంకులు సాధించి మంచి కాలేజీల్లో సీట్లు పొందినవారే అవుతారని, ఆ సీట్లన్నీ మెరిట్ జాబితాలో తదుపరి ఉన్న వారికి దక్కకుండా పోయే అవకాశముందని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. దీంతో రెండో విడత కౌన్సెలింగ్‌ను 9వ తేదీ నుంచి కాకుండా 14 నుంచి చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని అధికారవర్గాలు వివరించాయి.
Published date : 03 Jul 2015 10:53AM