ఏపీ ఎంసెట్-2020 ప్రాథమిక ‘కీ’ నేడే విడుదల
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎంసెట్-2020 శుక్రవారంతో ప్రశాంతంగా ముగిసింది.
ఆన్‌లైన్ (సీబీటీ) విధానంలో జరిగిన ఈ పరీక్షలను హైదరాబాద్‌తో పాటు ఏపీలోని మొత్తం 47 నగరాల్లో 118 కేంద్రాల్లో నిర్వహించారు. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి 25 వరకు ఉదయం, మధ్యాహ్నం మొత్తం 14 సెషన్లలో పరీక్షలు జరిగాయి. 9 సెషన్లలో జరిగిన ఇంజనీరింగ్ విభాగానికి 1,85,946 మంది దరఖాస్తు చేయగా 1,56,899 మంది (84.38 శాతం) పరీక్ష రాశారు. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి 25 వరకు అగ్రి, మెడికల్ విభాగం పరీక్షలు జరగ్గా మొత్తం 87,652 మందికి గాను 75,834 (86.52%) మంది హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించి సమాధానాల ప్రాథమిక ‘కీ’ని శనివారం విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాలను దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
- ఉన్నత విద్యా ప్రవేశాలు ముగించి అక్టోబర్ నుంచి తరగతులు ప్రారంభించాలని యూజీసీ, ఏఐసీటీఈ క్యాలెండర్‌ను నిర్దేశించిన నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏపీ ఎంసెట్‌ను ఉన్నత విద్యామండలి పూర్తి చేసింది.
Published date : 26 Sep 2020 12:17PM