ఎంసెట్‌లో ‘కార్బన్‌లెస్’ పత్రం...ఈసారికి అవకాశం లేదు!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఈనెల 15వ తేదీన జరగనున్న ఎంసెట్ పరీక్షలో విద్యార్థులకు ఓఎంఆర్ జవాబు పత్రాల కార్బన్‌లెస్ కాపీలను ఈసారికి ఇచ్చే అవకాశం లేదు.
గతంలో ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఎంసెట్ మే 2న జరిగితే విద్యార్థులకు ఓఎంఆర్ జవాబు పత్రాల కార్బన్‌లెస్ కాపీలను ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఆ మేరకు ఓఎంఆర్ జవాబు పత్రాలతోపాటు వాటితోపాటు కలసి ఉండే (అటాచ్‌మెంట్) కార్బన్ లెస్ కాపీలను కూడా ముద్రించారు. కానీ ప్రైవేటు విద్యా సంస్థల సహాయ నిరాకరణ నేపథ్యంలో పరీక్షను ఈనెల 15వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో పరీక్ష తేదీతోపాటు కేంద్రాలు కూడా మారాయి. ఫలితంగా ఓఎంఆర్ జవాబు పత్రాలను మార్పు చేసి, మళ్లీ కొత్తగా ముద్రించాల్సి వచ్చింది. అయితే వాటితోపాటు కార్బన్‌లెస్ కాపీని ముద్రించడం కష్టమని ముద్రణ సంస్థలు తేల్చాయి. దీంతో ఈసారికి విద్యార్థులకు కార్బన్‌లెస్ కాపీ ఇవ్వకుండానే పరీక్షల నిర్వహణకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఈనెల 15న పరీక్ష పూర్తయ్యాక రెండు మూడు రోజుల్లోనే ఓఎంఆర్ జవాబు పత్రాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. విద్యార్థులు వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణారావు తెలిపారు. కాగా, దీనిపై అధికారికంగా ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.
Published date : 05 May 2016 02:21PM