Skip to main content

ఎంసెట్ మాక్ టెస్టు షురూ!

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మొదటిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న ఎంసెట్-2018 మాక్ టెస్టుల లింకు అందుబాటులోకి వచ్చింది.
ఫిబ్రవరి 28న నోటిఫికేషన్‌ను జారీ చేసిన ఎంసెట్ కమిటీ మార్చి 4 నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ఎంసెట్ వెబ్‌సైట్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులకు కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష విధానం ఎలా ఉంటుందో వెబ్‌సైట్‌లో వివరించింది. అలాగే ఆన్‌లైన్ పరీక్షను ప్రాక్టీస్ చేసుకునేందుకు ప్రత్యేకంగా మాక్ టెస్టు లింకును వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. దాని ఆధారంగా విద్యార్థులు పరీక్ష విధానంపై అవగాహన కోసం ప్రాక్టిస్ చేసుకోవచ్చని పేర్కొంది. ఫీజు చెల్లింపు, దరఖాస్తుల సబ్మిషన్, వయోపరిమితి, అర్హతలు, నిబంధనలు, నార్మలైజేషన్ ప్రాసెస్, ముఖ్యమైన తేదీలు, సిలబస్, పరీక్ష కేంద్రాలు, ఎంసెట్ ద్వారా ప్రవేశాలు చేపట్టే కోర్సులు తదితర సమగ్ర సమాచారాన్ని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

ఒక ప్రశ్న తర్వాత మరొకటి..
మాక్ టెస్టులో కంప్యూటర్‌లో అన్ని ప్రశ్నలు ఒకేసారి కాకుండా ఒక్కో ప్రశ్న స్క్రీన్‌పై ప్రత్యక్షం అవుతుంది. దానికి సంబంధించిన జవాబును క్లిక్ చేసి, సేవ్/నెక్ట్స్ బటన్ నొక్కితే రెండో ప్రశ్న వస్తుంది. ఇలా విద్యార్థి అన్ని ప్రశ్నలకు ఒక్కొక్కటిగా సమాధానాలను క్లిక్ చేసి, చివరగా సబ్మిట్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. మాక్ టెస్టుకు ఇచ్చిన లింకులో విద్యార్థుల ప్రాక్టీస్ కోసం పాత ప్రశ్నలను, జవాబులను అందుబాటులో ఉంచింది. పరీక్షలో సబ్జెక్టుల వారీ ప్రశ్నలు వేర్వేరుగా ఉండేలా ఏర్పాట్లు చేసింది.
Published date : 02 Mar 2018 02:54PM

Photo Stories