Skip to main content

‘ఎంసెట్-3’ కి సర్టిఫికెట్ల గండం

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఎంబీబీఎస్, బీడీఎస్, వ్యవసాయ కోర్సుల్లో చేరినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్-3 పరీక్ష రాసిన ఇరు రాష్ట్రాలకు చెందిన చాలా మంది విద్యార్థులకు కొత్త చిక్కొచ్చిపడింది.
ఈ నెల 15న ప్రభుత్వం ఎంసెట్-3 ర్యాంకులను ప్రకటించి 17 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడుతోంది. అయితే ఒరిజినల్ సర్టిఫికెట్లను ఆయా విద్యార్థులు ఏపీలో తాము చేరిన కాలేజీలకు సమర్పించేశారు. కానీ ఒరిజినల్స్ ఉంటేనే తెలంగాణలో మెడికల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అవకాశం ఉంటుంది. లేకుంటే ఇక్కడ అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వరకు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వాలని విద్యార్థులు కోరుతుండగా వాటిని ఇవ్వబోమని ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలు తెగేసి చెబుతున్నాయి. దీంతో ఈ అంశాన్ని ఆయా విద్యార్థులు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎంసెట్-3 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం విద్యార్థుల సర్టిఫికెట్లను ఇవ్వాల్సిందిగా ఏపీకి చెందిన ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు లేఖలు రాసినట్లు ‘సాక్షి’కి తెలిపారు. వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే ఒరిజినల్ సర్టిఫికెట్లను తిరిగి ఇచ్చేస్తామన్నారు.

నష్టమేమీ లేదు...
ఆంధ్రప్రదేశ్‌లో ఎంబీబీఎస్, బీడీఎస్, వ్యవసాయ, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశాల భర్తీకి ప్రక్రియ కొనసాగుతోంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లకు, ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తిచేసి విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. అలాగే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని మేనేజ్‌మెంట్ బీ కేటగిరీ సీట్ల భర్తీ పూర్తయింది. అయితే ఆ రాష్ట్రంలో చేరిన అనేక మంది విద్యార్థులకు ఎంసెట్-3లో కనబరిచే ప్రతిభ ఆధారంగా తెలంగాణలో సీటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడి కౌన్సెలింగ్‌లోనూ పాల్గొనాలని వారు భావిస్తున్నారు. ఒకవేళ వారు తెలంగాణలో సీటు పొందినా ఆంధ్రప్రదేశ్‌లోని మెడికల్ కాలేజీలకు వచ్చే నష్టం లేదని వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి అంటున్నారు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ప్రభుత్వ సీట్లకు మొదటి కౌన్సెలింగ్ మాత్రమే పూర్తయిందని... కాబట్టి అక్కడ సీటు వదులుకున్న విద్యార్థులు తెలంగాణలో సీటు పొందితే ఆ రాష్ట్రంలో మిగిలిపోయే సీట్లకు రెండో కౌన్సెలింగ్ చేపట్టి నింపుకోవచ్చని అంటున్నారు. అలాగే ప్రైవేటు కాలేజీల్లో బీ కేటగిరీలో సీటు పొంది చేరినవారు ఆ సీటును వదులుకుంటే యాజమాన్యాలకు వచ్చే నష్టమూ లేదంటున్నారు. బీ కేటగిరీ సీటు ఖాళీ అయితే అవి ఎన్‌ఆర్‌ఐ కోటాగా మారుతాయంటున్నారు. ఒరిజినల్స్ కాకుండా ఇతర రాష్ట్రాల కస్టోడియన్ సర్టిఫికెట్లు ఇస్తే అవి చెల్లవని... న్యాయపరమైన చిక్కులు ఏర్పడతాయని వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి చెబుతున్నారు. అలాగే అక్కడ సీటు వదులుకున్న విద్యార్థులకు ఫీజు వెనక్కు ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
Published date : 14 Sep 2016 02:04PM

Photo Stories