Skip to main content

ఎంసెట్-15కు పకడ్బందీ ఏర్పాట్లు: కన్వీనర్ ఎన్‌వీ.రమణారావు

కేయూ క్యాంపస్: తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా మే 14న ఎంసెట్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్‌వీ.రమణారావు తెలిపారు.
హన్మకొండ కాకతీయ యూనివర్సిటీలో వరంగల్ రీజియన్ పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు మంగళవారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష మే 14న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు... మెడిసిన్ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ర్టవ్యాప్తంగా ఇంజనీరింగ్ ప్రవేశపరీక్షకు 1,38,644 మంది, మెడిసిన్ పరీక్షకు 91,569 మంది విద్యార్థులు హాజరుకానున్నారన్నారు. ఎస్‌ఎంఎస్ ద్వారా విద్యార్థులకు హల్‌టికెట్ నంబర్లు, పరీక్ష కేంద్రం వివరాలు పంపనున్నామన్నారు. విద్యార్థులను పరీక్షకు 45 నిమిషాలు ముందుగా కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. నిర్దేశించిన సమయం తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ప్రతి 500 మంది విద్యార్థులకు ఒక అబ్జర్వర్‌ను, 24 మందికి ఒక ఇన్విజిలేటర్ చొప్పున నియమిస్తున్నట్లు తెలిపారు. పోలీస్, రెవెన్యూ ఆర్టీసీ సహకారంతో పరీక్ష సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సమావేశంలో వరంగల్ రీజినల్ కోఆర్డినేటర్ కేయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసులు, ఎంసెట్ కోకన్వీనర్ డాక్టర్ కాశీవిశ్వనాథ్, పరీక్ష కేంద్రాల సీఎస్‌లు, అబ్జర్వర్లు పాల్గొన్నారు.
Published date : 29 Apr 2015 03:09PM

Photo Stories