EAMCET: ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్ తేదీ వివరాలు..
మొదటి దశలో మిగిలిపోయిన సీట్లన్నీ ర్యాంకు ఆధారంగా అర్హులకు కేటాయిస్తారు. ఇందులోనూ సీట్లు మిగిలిపోతే స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేస్తారు. మొదటి దశలో కనీ్వనర్ కోటా ద్వారా సీట్లు పొంది, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వారు అక్టోబర్ 13లోగా అవసరమనుకుంటే సీటు రద్దు చేసుకోవచ్చు. రద్దు చేసుకున్న సీట్లను కూడా రెండో దశ కౌన్సెలింగ్‌లోకి తీసుకుంటారు. అప్పటికీ భర్తీ కానివి, రెండో దశలోనూ సీటు క్యాన్సిల్ చేసుకుంటే ఖాళీ అయ్యే సీట్లను స్పాట్ అడ్మిషన్ ద్వారా భర్తీ చేస్తారు.
31 వేలకు పైగా సీట్లు
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో కనీ్వనర్ కోటా కింద మొత్తం 78,270 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తొలిదశలో 61,169 సీట్లు కేటాయించగా, 14,847 సీట్లు మిగిలిపోయాయి. తొలి కౌన్సెలింగ్‌లో అఫ్లియేషన్ పూర్తి చేసుకోలేని కాలేజీలు కూడా ఈసారి అర్హత సాధించాయి. కాబట్టి మొత్తం 31,948 సీట్లను భర్తీ చేయనున్నారు. కం ప్యూటర్ అనుబంధ కోర్సుల్లో సీట్లు ఎక్కువగా భర్తీ అయినట్లు సమాచారం. రెండో ప్రధాన బ్రాంచి గా భావిస్తున్న ఈసీఈలో దాదాపు 3 వేల సీట్లు అందుబాటులోకి వచ్చే వీలుంది. సివిల్, మెకానికల్ సీట్లతోపాటు ఐటీ కోర్సుల్లో కూడా ఒక్కో బ్రాంచ్‌లో దాదాపు వెయ్యి సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుంది.
క్లైమాక్స్‌లో ‘బి’కేటగిరీ
ఇంజనీరింగ్ ‘బి’కేటగిరీ సీట్ల భర్తీ ప్రక్రియను అక్టోబర్ 5కల్లా పూర్తి చేయాలని ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ మండలి గడువు విధించింది. ఆ తర్వాత 15లోగా ఉన్నత విద్యామండలికి వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ర్యాంకు ప్రకారమే భర్తీ చేయాలని, ఇలా కాని పక్షంలో ఫిర్యాదు చేయాలని మండలి స్పష్టం చేసింది. అయితే, ఎక్కడా కూడా నిబంధనల ప్రకారం ఈ సీట్ల కేటాయింపు జరగడం లేదనే విమర్శలొస్తున్నాయి. ఇదిలాఉంటే, ప్రైవేటు కాలేజీలు మిగిలిపోయిన సీట్లను స్పాట్ అడ్మిషన్ ద్వారా ముందే మాట్లాడుకున్న వారికి ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
ప్రభుత్వ కాలేజీల్లో మిగులు
ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏటా 200 సీట్లు మిగిలిపోతున్నాయి. రెండు దశల కౌన్సెలింగ్ తర్వాత స్పాట్ అడ్మిషన్లు చేపడుతున్నారు. ఆ తర్వాతనే జాతీయ కాలేజీలైన ఐఐటీ, నిట్ వంటి వాటిల్లో సీట్లొచ్చి విద్యార్థులు వెళ్లిపోతున్నారు. దీంతో ఖాళీలు ఏర్పడుతున్నాయి. వీటిని భర్తీ చేసుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రైవేటు కాలేజీలు ఇలా మిగిలిపోయిన సీట్లను కూడా సొమ్ము చేసుకుంటున్నా, ప్రభుత్వ కాలేజీలకు భర్తీ చేసే వెసులుబాటు ఇవ్వకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
చదవండి:
Engineering: బీ కేటగిరీ సీట్లకు అందరి దరఖాస్తులు తీసుకోవాలి
Engineering Admissions: బీటెక్‌లో ప్రవేశాలకు సిద్ధమవుతున్నారా... అయితే ఇది మీ కోసమే!