Skip to main content

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్‌లో తొలిరోజు 8వేల వెబ్ ఆప్షన్లు

సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎంసెట్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది. ఎంసెట్‌లో 1 నుంచి 35వేల ర్యాంకు వరకు ఉన్న అభ్యర్థులు గురు, శుక్రవారాల్లో ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు.
తొలిరోజు రాత్రి వరకు దాదాపు 8వేల మంది ఆప్షన్లు ఎంచుకున్నారని ఎంసెట్ అడ్మిషన్ల కమిటీ పేర్కొంది. వీరిలో ట్యాప్ ర్యాంకర్లు ఇంకా తమ ఆప్షన్లు నమోదు చేయనట్లుగా అధికారులు అభిప్రాయపడుతున్నారు. శుక్రవారం రాత్రి వరకు సమయం ఉన్నందున ఎంతమేరకు టాప్ ర్యాంకర్లు ఆప్షన్ల నమోదు ఇస్తారో వేచి చూడాల్సిందే. జేఈఈ మెయిన్స్‌తో సహా ఇతర ప్రవేశపరీక్షలు రాసిన ఆ విద్యార్థులు అక్కడ కూడా మంచి ర్యాంకులే సాధించినందున వారి ప్రాధాన్యతలు ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థలు, ప్రముఖ ప్రైవేటు సంస్థలపై ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక ధ్రువపత్రాల పరిశీలనకు 29,968 మంది సర్టిఫికెట్లను ఇచ్చారని అధికారులు వివరించారు. ఆయా ర్యాంకుల అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీల్లో నిర్ణీత సమయంలో ఎన్నిసార్లయినా ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, మార్పులు చేర్పులు చేసుకోవచ్చన్నారు. గడువు ముగిశాక వారు చివర్లో ఇచ్చిన ఆప్షన్లు యథాతథంగా సేవ్ అవుతాయని, వాటి ప్రకారమే సీట్ల కేటాయింపు ఉంటుందని అడ్మిషన్ల కమిటీ ప్రత్యేకాధికారి రఘునాథ్ వివరించారు. మరుసటి రోజు నుంచి తక్కిన ర్యాంకర్లకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశముంటుందన్నారు. మళ్లీ 19, 20 తేదీల్లో మాత్రమే మొత్తం ర్యాంకర్లందరూ తమ ఆప్షన్లలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి రెండు రోజులు చివరి అవకాశమిస్తామని చెప్పారు. జూన్ 22న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు.

కౌన్సెలింగ్‌లో నరసారావుపేట జేఎన్‌టీయూ కాలేజీ:
నరసారావుపేటలో ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రారంభం కానున్న కాకినాడ జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కాలేజీలోని 350 సీట్లను కూడా ప్రస్తుత కౌన్సెలింగ్ ద్వారానే భర్తీచేయనున్నారు. ఈ కాలేజీ కోడ్‌ను జేఎన్‌టీఎన్‌గా అడ్మిషన్ల కౌన్సెలింగ్ వెబ్‌సైట్లో పెట్టారు. మెకానికల్, ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఈసీఈతో సహా మొత్తం ఏడుకోర్సులు ఈ కాలేజీలో నిర్వహించనున్నట్లు ఎంసెట్ కన్వీనర్, జేఎన్‌టీయూకే ప్రొఫెసర్ సాయిబాబు తెలిపారు.
Published date : 10 Jun 2016 03:35PM

Photo Stories