Skip to main content

20న తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్-2017 ఉమ్మడి ప్రవేశ పరీక్షకు 20వ తేదీన నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
దీనికి సంబంధించి ఉన్నత విద్యా మండలి సర్వం సిద్ధం చేస్తోంది. పరీక్షకు ముందు, తరువాత చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన ప్రక్రియను కూడా ఖరారు చేసింది. ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ, ప్రాసెసింగ్, ఫీజు చెల్లింపు వంటి ఆన్‌లైన్ సేవలపై గురువారం ఉన్నత విద్యా మండలి ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సమావేశమై చర్చించింది. ఆన్‌లైన్ సేవలు అందించే వెండర్లను ఖరారు చేసింది. మరోవైపు ఈ నెల 20న ఎంసెట్ పరీక్ష కమిటీ (సెట్ కమిటీ) సమావేశం నిర్వహించేందుకు జేఎన్టీయూ చర్యలు చేపట్టింది. ఆ సమావేశంలో విధి విధానాలను ఖరారు చేయడంతోపాటు, ఎంసెట్ షెడ్యూల్, నోటిఫికేషన్‌లను జారీ చేసే అవకాశం ఉంది. ఆ రోజున వీలు కాకపోతే తర్వాతి రోజున షెడ్యూల్, నోటిఫికేషన్ జారీ చేసేలా కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లపై ఎంసెట్ చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య దృష్టి సారించారు. నోటిఫికేషన్‌లో ఉండాల్సిన నిబంధనలు, దరఖాస్తు తేదీలు, ఫీజు వివరాలు, అర్హతలకు సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు. ఇక ఎంసెట్ పరీక్ష ఫీజులో మార్పు చేయవద్దని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు రూ. 250, బీసీలు, ఇతరులకు రూ. 500 పరీక్ష ఫీజునే ఈసారి కూడా కొనసాగించాలని భావిస్తున్నారు.
Published date : 17 Feb 2017 02:46PM

Photo Stories