Skip to main content

యూజీసీ గుర్తింపున్న ‘దూర విద్య’ విద్యార్థులే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు అర్హులు: ఉన్నత విద్యా మండలి

సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) జాయింట్ కమిటీ, ఏఐసీటీఈ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (డీఈసీ)/డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బోర్డు (డీఈబీ) గుర్తింపు కలిగిన యూనివర్సిటీల పరిధిలో దూర విద్య ద్వారా డిగ్రీ పొందిన విద్యార్థులకు మాత్రమే రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది.
2013లో యూజీసీ జారీ చేసిన యూనివర్సిటీల భౌగోళిక పరిధి (టెరిటోరియల్ జ్యూరిస్‌డిక్షన్) రెగ్యులేషన్స్ ప్రకారం ఒక రాష్ట్రంలోని యూనివర్సిటీ మరో రాష్ట్రంలో దూర విద్యా కేంద్రాలను నిర్వహించడానికి వీల్లేదని ఉన్నత విద్యా మండలి స్పష్టంచేసింది. ఇందులో భాగంగానే ఇతర రాష్ట్రాలకు చెందిన వర్సిటీలు 2013 తర్వాత తెలంగాణలో నిర్వహిస్తున్న దూర విద్యా కేంద్రాల్లో చదివే విద్యార్థులకు అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించింది. దీన్ని ఐసెట్‌లో అమలు చేయాలని ఫిబ్రవరి 12 (బుధవారం)నజరిగిన ఐసెట్ కమిటీ భేటీలో నిర్ణయం తీసుకుంది. అన్ని సెట్స్‌లలో దీన్ని అమలు చేయాలని మండలి నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కుప్పలుగా ఉన్న ఇతర రాష్ట్ర యూనివర్సిటీల దూర విద్యా కేంద్రాలను కట్టడి చేయలేని ఉన్నత విద్యా మండలి ఇలా వాటికి చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టింది.
Published date : 13 Feb 2020 01:26PM

Photo Stories