Skip to main content

విద్యార్థులు ఆ దూర విద్యా కేంద్రాల్లో చేరవద్దు: తుమ్మల పాపిరెడ్డి

సాక్షి, హైదరాబాద్: ఇతర రాష్ట్ర యూనివర్సిటీలు, డీమ్డ్, ప్రైవేటు యూనివర్సిటీలకు చెందిన దూర విద్యా కేంద్రాలను నిర్వహించే కాలేజీలపై చర్యలు చేపట్టాలని యూనివర్సిటీలకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి సూచించింది.
ఈ మేరకు ఫిబ్రవరి 5న రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి లేఖ రాశారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలోని కాలేజీలు ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల దూర విద్యా కేంద్రాలను ఏర్పాటు చేశాయని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాంటి కాలేజీలకు జరిమానా విధించడం, గుర్తింపు రద్దు చేయడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. వీటికి సంబంధించి చేపట్టిన చర్యలపై 15 రోజుల్లోగా తమకు నివేదిక అందజేయాలని ఆదేశించారు. యూనివర్సిటీల భౌగోళిక పరిధులను పేర్కొంటూ యూజీసీ 2013లో జారీ చేసిన ఉత్తర్వులు, 2015లో జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. ఒక రాష్ట్రంలోని యూనివర్సిటీ మరో రాష్ట్రంలో దూర విద్యా విధానంలో విద్యను అందించడానికి వీల్లేదని స్పష్టంచేశారు. అయినా రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ, ఇతర కాలేజీలు ఇతర రాష్ట్ర యూనివర్సిటీలు, డీమ్డ్, ప్రైవేటు యూనివర్సిటీల దూర విద్యా కేంద్రాలను ఏర్పాటు చేసి కోర్సులను నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. మరోవైపు ఇదే అంశంపై కాలేజీ యాజమాన్యాలు పాపిరెడ్డితో సమావేశం అయ్యారు. ఆయా దూర విద్యా కేంద్రాల్లో చదివే విద్యార్థుల సర్టిఫికెట్లు చెల్లవని, వాటిల్లో విద్యార్థులు చేరవద్దని స్పష్టంచేశారు.
Published date : 06 Feb 2020 04:10PM

Photo Stories