ఓపెన్ టెన్త్, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా టెన్త్, ఇంటర్మీడియెట్ కోర్సుల్లో ప్రవేశానికి సొసైటీ శనివారం ప్రకటన విడుదల చేసింది. ఈ కోర్సుల్లో ప్రవేశానికి నిర్ణీత రుసుముతో జూలై 20 నుంచి సెప్టెంబర్ 19 వరకు ఫీజు చెల్లించవచ్చని శనివారమిక్కడ సొసైటీ డైరక్టర్ (ఇన్‌చార్జి) పార్వతి తెలిపారు.
ఆలస్య రుసుముతో అక్టోబర్ 10 వరకు గడువు ఉందన్నారు. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో సహా మొత్తం 992 ఓపెన్ స్కూల్ కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు. 14 ఏళ్లు పూర్తయిన వయోజనులకు 8వ తరగతిలో ఓపెన్ బేసిక్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రవేశం కల్పిస్తామని చెప్పారు. 14-15 ఏళ్లు నిండినవారెవరైనా టెన్త్, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశించవచ్చని, దీనికి గరిష్ట వయోపరిమితి లేదని వివరించారు. టెన్త్ అడ్మిషన్ ఫీజు జనరల్ కేటగిరీ వారికి రూ.1,300, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ, మాజీ సైనికోద్యోగులకు రూ.900లుగా నిర్ణయించారు. ఇంటర్ అడ్మిషన్ ఫీజును జనరల్ కేటగిరీ వారికి రూ.1,400, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ, మాజీ సైనికోద్యోగులకు రూ.1,100లుగా నిర్ణయించారు. అయిదేళ్లలో ఎప్పుడైనా ఈ కోర్సులను పూర్తిచేయవచ్చు. అందుకు తొమ్మిది సార్లు పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పిస్తారు. దృశ్య, శ్రవణ విద్యావిధానం ద్వారా సెలవురోజుల్లో 30 తరగతులు నిర్వహించి శిక్షణ ఇస్తారు. మెటీరియల్ కూడా ఉచితంగా అందిస్తారు. నిపుణులైన అధ్యాపకులతో శిక్షణ ఇస్తామని డైరక్టర్ పార్వతి తెలిపారు. ఈ ఏడాది లక్ష మంది కన్నా ఎక్కువ మందికి ప్రవేశాలు కల్పించాలన్నదే సొసైటీ లక్ష్యమని వివరించారు.
Published date : 20 Jul 2015 02:51PM