దూర విద్యకు న్యాక్ అనుమతి తప్పనిసరి: యూజీసీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) అనుమతి ఉన్న విద్యా సంస్థలే దూర విద్యా కోర్సులను నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్పష్టం చేసింది.
ఆయా విద్యా సంస్థలు న్యాక్ అక్రెడిటేషన్‌ను ఐదేళ్లపాటు కలిగి ఉండాలని పేర్కొంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా దూర విద్యా కోర్సులను నిర్వహిస్తున్న విద్యా సంస్థలకు ‘యూజీసీ (ఓపెన్ అండ్ డిస్టెన్‌స లర్నింగ్) రెగ్యులేషన్‌స-2017’ పేరుతో కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈనెల 23వ తేదీ నుంచి ఈ మార్గదర్శకాలను అమల్లోకి తెచ్చింది. ఆ ప్రకారం ఇప్పటివరకు దూర విద్యా విధానంలో కోర్సులను కొనసాగిస్తున్న సంస్థలు కూడా తాజాగా యూజీసీ నుంచి అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేసింది. తాజా మార్గదర్శకాలు దూర విద్యలో డిగ్రీ, పీజీ కోర్సులను నిర్వహిస్తున్న విద్యా సంస్థలకు వర్తిస్తాయని పేర్కొంది. ఇంజనీరింగ్, మెడిసిన్, డెంటల్, ఫార్మసీ, నర్సింగ్, ఆర్కిటెక్చర్, ఫిజియోథెరపీ, ఇతర సాంకేతిక విద్యకు సంబంధించిన కోర్సులను దూర విద్యా విధానంలో నిర్వహించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. డిస్టెన్‌స ఎడ్యుకేషన్ కౌన్సిల్ లేదా కమిషన్, లేదా ఇతర రెగ్యులేటరీ విభాగం గుర్తింపుతో దూర విద్యా విధానంలో కోర్సులను నిర్వహిస్తున్న విద్యా సంస్థలు యూజీసీ నుంచి గుర్తింపు తీసుకోవాలని పేర్కొంది. ఆయా విద్యా సంస్థలు ఆన్‌లైన్ ద్వారా వెంటనే యూజీసీకి దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. తదుపరి వివరణ ఇచ్చే వరకు డీమ్డ్ యూనివర్సిటీలకు ఇవి వర్తించవని తెలిపింది. న్యాక్ అక్రెడిటేషన్ లేని యూనివర్సిటీలకు ఈ నిబంధనలు ప్రస్తుతం వర్తించవని, అయితే ఆయా వర్సిటీలు ఏడాదిలోగా న్యాక్ అక్రెడిటేషన్‌ను పొందాలని వెల్లడించింది. ఈ నిబంధనలు పాటించకుండా, యూజీసీ గుర్తింపు తీసుకోకుండా కోర్సులను నిర్వహిస్తే చెల్లవని పేర్కొంది. నిబంధనలను అతిక్రమించే విద్యా సంస్థల గుర్తింపును రద్దు చేస్తామని, అవసరమైతే పోలీసు కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేసింది.
Published date : 28 Jun 2017 01:30PM