Skip to main content

అనుమతి లేనిదే దూర విద్యా కోర్సులు కొనసాగించొద్దు

న్యూఢిల్లీ: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ముందస్తు అనుమతి లేనిదే దూర విద్యా కోర్సులు కొనసాగించొద్దని సుప్రీంకోర్టు అన్ని డీమ్డ్ యూనివర్సిటీలను ఆదేశించింది.
అలాగే 4 డీమ్డ్ యూనివర్సిటీలకు గడిచిన కాలం నుంచి అమల్లోకి వచ్చేలా అనుమతులివ్వడంపై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్రానికి సూచించింది. 2001-05 మధ్య కాలంలో రాజస్తాన్‌లోని జేఆర్‌ఎన్ రాజస్తాన్ విద్యాపీఠ్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్‌‌సడ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్(ఐఏఎస్‌ఈ), అలహాబాద్ అగ్రికల్చరల్ ఇనిస్టిట్యూట్(ఏఏఐ), తమిళనాడులోని వినాయక మిషన్‌‌స రీసెర్చ్ ఫౌండేషన్ అనే ఆ నాలుగు డీమ్డ్ యూనివర్సిటీల్లో ఇంజినీరింగ్ చేసిన విద్యార్థుల పట్టాలను నిలిపివేయాలని సూచించింది. ఈ వర్సిటీలకు యూజీసీ ఇచ్చిన అనుమతులు చెల్లవని స్పష్టం చేసింది. ఆ విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ఏఐసీటీఈని ఆదేశించింది.

టెక్నికల్ కోర్సులకు దూరవిద్య వద్దు!
ఏ కోర్సయినా డిస్టెన్‌‌స, కరెస్పాం డెన్స్ పద్ధతిలో చదివే వెసులుబాటును అనేక విశ్వవిద్యాలయాలు కల్పిస్తున్నాయి. అయితే ఏదెలా ఉన్నా ఇంజనీరింగ్ వంటి టెక్నికల్ కోర్సులు చేసే విద్యార్థులకు ఈ దూరవిద్య కోర్సులతో పెద్దగా ప్రయోజనమేమీ కలగడం లేదు. కేవలం బుక్ నాలెడ్‌‌జ తప్పితే ప్రాక్టికల్ నాలెడ్‌‌జ రావడంలేదు. దీంతో వారు కోర్సులు పూర్తి చేసినా ఖాళీగానే ఉండాల్సి వస్తోంది. అసలు టెక్నికల్ కోర్సులకు కరెస్పాండెన్స్ పద్ధతి సరైంది కాదంటూ విద్యావేత్తలు ఎన్నోరోజులుగా చెబుతున్నా వినేవారే కరువయ్యారు. తాజాగా సుప్రీంకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సాంకేతిక విద్యను కరెస్పాండెన్స్ కోర్సుల ద్వారా అందించవద్దని నవంబర్ 3న ఆదేశించింది. ఇంజనీరింగ్ లాంటి సబ్జెక్టులకు విద్యా సంస్థలు దూర విద్యా విధానంలో అందిస్తున్న కోర్సులపై సుప్రీంకోర్టు పరిమితులు విధించింది. ఇదే అంశంపై పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పులను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. అంతేకాకుండా టెక్నికల్ విద్యను కరెస్పాండెన్‌‌స ద్వారా అందించేందుకు ఒడిశా హైకోర్టు ఇచ్చిన అనుమతిని సుప్రీంకోర్టు పక్కన పెట్టింది.
Published date : 04 Nov 2017 02:11PM

Photo Stories