National Games ప్రారంభించిన ప్రధాని మోదీ
600 మంది గుజరాతీ కళాకారులు తమ సాంస్కృతిక ప్రదర్శనతో కట్టిపడేశారు. ప్రేక్షకుల జయజయధ్వానాల మధ్య భారత ప్రధాని మోదీ అంగరంగ వైభవంగా ఆటల పండగను ప్రారంభించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాలతో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన క్రీడాకారులను ప్రధాని ఆకాశానికెత్తారు. స్టేడియంలో గుజరాత్‌కు చెందిన స్టార్ స్విమ్మర్ మాన పటేల్ ఐక్యతా జ్యోతిని ప్రధాని మోదీకి అందజేసింది. ఆ వెంటే స్టేడియమంతా కరతాళధ్వనులతో మార్మోగిపోయింది. ఈ కార్యక్రమంలో చాంపియన్ అథ్లెట్ నీరజ్ చోప్రా, స్టార్ షట్లర్ పీవీ సింధు, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, రెజ్లర్ రవి దహియా, మాజీ షూటర్ గగన్ నారంగ్, హాకీ మాజీ కెప్టెన్ దిలీప్ టిర్కీ, మాజీ మహిళా అథ్లెట్ అంజూ జార్జ్ తదితరులు హాజరయ్యారు. 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు సర్వీసెస్ కు చెందిన సుమారు 7000 మందికి పైగా అథ్లెట్లు 36 క్రీడాంశాల్లో పాల్గొనేందుకు వచ్చారు. గుజరాత్‌లోని ఆరు ప్రముఖ నగరాల్లో పోటీలు నిర్వహిస్తారు.