మార్చి 2018 అవార్డ్స్
అమెరికాలో మైనార్టీలుగా ఉన్న సిక్కుల్లో అవగాహన కల్పించడానికి నిర్వహించిన 'వి ఆర్ సిక్స్'(మేము సిక్కులం) ప్రచారానికి అమెరికా అత్యున్నత పురస్కారం దక్కింది. మైనార్టీ కమ్యూనిటీపై సిక్కులకు అవగాహన కల్పించేందుకు గత ఏడాది ఏప్రిల్‌లో నేషనల్ సిక్ క్యాంపెయిన్(ఎన్‌ఎస్‌సీ) అనే స్వచ్ఛంద సంస్థ ఈ ప్రచారాన్ని ప్రారంభించింది. మైనార్టీలపై అమెరికాలో జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ తమ వర్గానికి చెందినవారిని అప్రమత్తం చేయడమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ ప్రచారానికి దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన కనిపించింది. ఇందుకుగాను 2018 సంవత్సరానికి 'పీఆర్ వీక్' అనే పురస్కారం దక్కింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 'వి ఆర్ సిక్స్' ప్రచారానికి పీఆర్ వీక్ పురస్కారం
ఎప్పుడు : మార్చి 22
ఎక్కడ : అమెరికాలో
కరణ్ థాపర్‌కు జీకే రెడ్డి పురస్కారం
పాత్రికేయరంగంలో ఎనలేని కృషిచేసిన ప్రముఖ జర్నలిస్టు, టీవీ వ్యాఖ్యాత కరణ్ థాపర్‌ను జీకే రెడ్డి స్మారక అవార్డు వరించింది. రాజ్యసభ సభ్యుడు, జీకే రెడ్డి స్మారక అవార్డు వ్యవస్థాపకుడు టి.సుబ్బరామిరెడ్డి, టీఎస్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో అవార్డు ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ చేతుల మీదుగా థాపర్ ఈ అవార్డును అందుకున్నారు. సుబ్బరామిరెడ్డి, అవార్డు కమిటీ చైర్మన్, మాజీ కేంద్రమంత్రి కరణ్ సింగ్, మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అవార్డుతోపాటు ప్రశంసా పత్రం, రూ.5లక్షల నగదు అందజేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కరణ్ థాపర్‌కు జీకే రెడ్డి పురస్కారం
ఎప్పుడు : మార్చి 23
ఎవరు : టీఎస్‌ఆర్ ఫౌండేషన్
కామన్వెల్త్ యూత్ అవార్డుల్లో ఇద్దరు భారతీయులకు చోటు
'కామన్వెల్త్ యూత్ అవార్డు'ల జాబితాలో ఇద్దరు భారతీయులకు చోటు దక్కింది. మొత్తం 53 దేశాల నుంచి ఎంపిక చేసిన తుది 20 మందిలో భారత్‌కు చెందిన మృణాళిని దయాళ్, యోగేశ్ కుమార్ పేర్లు ఉన్నాయి. 'హెల్త్ ఓవర్ స్టిగ్మా' పేరుతో మృణాళిని చేస్తున్న ప్రచారానికిగాను ఆమెను ఎంపిక చేయగా.. 'ఈవెన్ కార్గో' స్వచ్ఛంద సంస్థ ద్వారా అందిస్తున్న సేవలకుగాను యోగేశ్ కుమార్‌ను ఎంపిక చేసినట్లు కామన్వెల్త్ యూత్ ప్రోగ్రామ్ ప్రకటించింది.
లైంగిక ఆరోగ్యం పట్ల మహిళల్లో అవగాహన కల్పించేందుకు మృణాళిని కృషి చేస్తున్నారు. కొరియర్ రంగంలో తొలిసారిగా మహిళలకు అవకాశం కల్పించి, లింగ సమానత్వం కోసం యోగేశ్ కుమార్ పాటు పడుతున్నాడు. 15 నుంచి 29 సంవత్సరాల వయసు వారినే ఎంపిక చేసే ఈ అవార్డు కోసం.. యువతరంపై ప్రభావం చూపే కార్యక్రమాలను చేపట్టే వారికే తొలి ప్రాధాన్యం ఇస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కామన్వెల్త్ యూత్ అవార్డుల్లో ఇద్దరు భారతీయులకు చోటు
ఎప్పుడు : మార్చి 27
ఎవరు : మృణాళిని దయాళ్, యోగేశ్ కుమార్
ఎందుకు : మహిళల ఆరోగ్యం, సమానత్వం కోసం కృషి చేస్తున్నందుకు
రిలయన్స్ కు ‘డ్రైవర్స్ ఫర్ చేంజ్’ పురస్కారం
ప్రతిష్టాత్మక ఫైనాన్షియల్ టైమ్స్ ఆర్సెలర్ మిట్టల్ బోల్డ్‌నెస్ ఇన్ బిజినెస్ అవార్డ్స్ కార్యక్రమంలో ’మార్పు చోదకులు’ పురస్కారాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అందుకున్నారు. హైడ్రోకార్బన్‌స అన్వేషణ, ఉత్పత్తి.. పెట్రోలియం రిఫైనింగ్..మార్కెటింగ్, పెట్రోకెమికల్స్, రిటైల్, 4జీ డిజిటల్ సర్వీసుల విభాగంలో అత్యుత్తమ పనితీరునకు గాను రిలయన్‌స ఇండస్ట్రీస్‌కి ఈ పురస్కారం దక్కింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘డ్రైవర్స్ ఫర్ చేంజ్’ పురస్కారం
ఎప్పుడు : మార్చి 16
ఎక్కడ : ఫైనాన్షియల్ టైమ్స్ ఆర్సెలర్ మిట్టల్ బోల్డ్‌నెస్ ఇన్ బిజినెస్ అవార్డ్స్, లండన్
ఎవరు : రిలయన్స్ ఇండస్ట్రీస్
హెచ్.జే.భాభా స్మారక అవార్డు అందుకున్న డా.జైన్
డీఆర్‌డీఓ శాస్త్రవేత్త డాక్టర్ ప్రకాశ్ చంద్ జైన్ మార్చి 16న ప్రతిష్టాత్మక హోమీ జహంగీర్ భాభా స్మారక అవార్డు అందుకున్నారు. ఇంఫాల్‌లో జరిగిన 105వ భారత సైన్స్ కాంగ్రెస్‌లో కేంద్ర మంత్రి హర్షవర్థన్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. హైదరాబాలోని డీఆర్‌డీవోలో పనిచేస్తున్న డా.జైన్ ఎయిరోస్పేస్ ఇంజనీరింగ్‌లో విశేష కృషి చేశారు. దానికి గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు.
కలెక్టర్ యోగితా రాణాకు అవార్డు
‘బేటీ బచావో.. బేటీ పడావో’లో హైదరాబాద్ నగరం అద్భుత ప్రగతి సాధించినందుకు గాను ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా అవార్డు అందుకున్నారు. మార్చి 8న రాజస్తాన్‌లోని జుంజునులో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలో యోగితా రాణాకు మోదీ అవార్డును బహూకరించారు. ‘బేటీ బచావో-బేటీ పడావో’లో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో బాలికా సంరక్షణ, బాలికా విద్యకు విశేష కృషికి గాను ఈ మేరకు ఆమెను సత్కరించారు. ఈ పథకం అమలులో హైదరాబాద్ జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. బాలికల నిష్పత్తి పురోభివృద్ధికి యోగితా రాణా ప్రత్యేక చొరవను ప్రధాని ప్రశంసించారు. ఈ పథకం ప్రారంభం అయిన తరువాత మహా నగరంలో ప్రతి వెయి్య మంది బాలురకు బాలికల నిష్పత్తి శాతం 914 నుంచి 968కు పెరిగింది. లింగ నిర్ధారణ కట్టడి, బాలికల పట్ల చిన్నచూపు, సెక్స్ డిటర్మినేషన్ టెస్ట్‌లు, ఒక మగపిల్లాడు పుడితే రెండో బిడ్డకి నో చెప్పే పద్ధతి లాంటి కార్యక్రమాలతో నగరంలో బాలికల శాతం పెరిగింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హైదరాబాద్ కలెక్టర్ యోగితా రాణాకు అవార్డు
ఎప్పుడు : మార్చి 8
ఎందుకు : ‘బేటీ బచావో.. బేటీ పడావో’లో హైదరాబాద్ నగరం అద్భుత ప్రగతి సాధించినందుకు గాను
జయమ్మకు నారీ శక్తి పురస్కారం ప్రదానం
నారీ శక్తి పురస్కారాన్ని 2017 సంవత్సరానికి గానూ తెలంగాణ నుంచి జయమ్మ అందుకున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సమాజంలోని అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మహిళలను గుర్తించి కేంద్రం నారీ శక్తి పురస్కారాలను ప్రదానం చేస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్‌ఐవీ నియంత్రణకు, సెక్స్ వర్కర్ల కుటుంబాల పరిరక్షణకు చేస్తున్న ఉద్యమాలకు గుర్తింపుగా తెలగాణకు చెందిన జయమ్మను నారీ శక్తి పురస్కారానికి కేంద్రం ఎంపిక చేసింది. మార్చి 8న ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నారీ శక్తి పురస్కారం - 2017
ఎప్పుడు : మార్చి 8
ఎక్కడ : న్యూఢిల్లీలో
ఎవరు : తెలంగాణ నుంచి అవార్డుని అందుకున్న జయమ్మ
క్లిక్స్‌కు యునెస్కో అవార్డు
దేశంలో నాలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న కనెక్టెడ్ లెర్నింగ్ ఇనీషియేటివ్ ప్రోగ్రామ్(క్లిక్స్)కి యునెస్కో అవార్డు లభించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగపరచుకుంటూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు తెలంగాణ, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాలు చేస్తున్న కృషికి యునెస్కో ఈ అవార్డు అందించింది. ప్రపంచ వ్యాప్తంగా 143 ప్రాజెక్టుల్లో మన క్లిక్స్‌తో పాటు మొరాకోకు చెందిన జెనీ ప్రాజెక్టులు ఈ అవార్డులను పొందాయి. క్లిక్స్ ద్వారా మన రాష్ట్రంలో 12 జిల్లాల్లో 10,080 మంది విద్యార్థులకు, 1589 టీచర్లకు శిక్షణ అందించారు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ (టిస్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్లిక్స్‌ను మరిన్ని పాఠశాలల్లో నిర్వహించాలని నిర్ణయించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కనెక్టెడ్ లెర్నింగ్ ఇనీషియేటివ్ ప్రోగ్రామ్(క్లిక్స్)కి యునెస్కో అవార్డు
ఎప్పుడు : మార్చి
ఎక్కడ : తెలంగాణ, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం
ఎందుకు : సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగపరచుకుంటూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు చేస్తున్న కృషికి గాను
బాలకృష్ణ దోశీకి ప్రిట్జ్‌కర్ ప్రైజ్
‘ఆర్కిటెక్చర్ నోబెల్’గా పిలిచే ప్రిట్జ్‌కర్ ప్రైజ్.. భారత్‌కు చెందిన బాలకృష్ణ దోశీకి దక్కింది. న్యూయార్క్‌లో మార్చి7న ఆయన ఎంపికను ప్రకటించారు. తక్కువ వ్యయంతో ఇళ్ల నిర్మాణానికి దోశీ ఆధ్యుడు.
90వ ఆస్కార్ అవార్డులు
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజిలెస్‌లో అట్టహాసంగా జరిగింది. మార్చి 5న డాల్బీ థియేటర్ వేదికగా జరిగిన 90వ అకాడమీ అవార్డుల పండుగలో ‘ది షేప్ ఆఫ్ వాటర్’ చిత్రం ఏకంగా నాలుగు విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. ‘డన్‌కర్క్’ చిత్రం మూడు విభాగాల్లో అవార్డులను గెల్చుకొని రెండోస్థానంలో నిలిచింది. ఈ కార్యక్రమానికి అమెరికన్ టెలివిజన్ హోస్ట్ జిమ్మీ కిమ్మెల్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
అవార్డు విజేతలు
ఉత్తమ చిత్రం | : ది షేప్ ఆఫ్ వాటర్ |
ఉత్తమ డెరైక్టర్ | : గెలెర్మో డెల్‌టొరో (ది షేప్ ఆఫ్ వాటర్) |
ఉత్తమ నటి | : ఫ్రాన్సెన్స్ మెక్‌డోర్మండ్ (త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి) |
ఉత్తమ నటుడు | : గ్యారీ ఓల్డ్‌మేన్ (డార్కెస్ట్ అవర్) ఉత్తమ |
ఉత్తమ సహాయ నటి | : ఎలిసన్ జేలీ (ఐ, టోన్యా) |
ఉత్తమ సహాయ నటుడు | : సామ్ రాక్‌వెల్ (తీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి) |
ఉత్తమ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్) | : జోర్డాన్ పీలే (గెట్ ఔట్) |
ఉత్తమ స్క్రీన్‌ప్లే (అడాప్టెడ్) | : జేమ్స్ ఐవరీ (కాల్ మీ బై యువర్ నేమ్) |
ఉత్తమ సినిమాటోగ్రఫీ | : రోజర్ డీకిన్స్ (బ్లేడ్ రన్నర్ 2049) |
ఉత్తమ ఒరిజినల్ స్కోర్ | : అలెగ్జాండర్ డిప్లా (ది షేప్ ఆఫ్ వాటర్) |
ఉత్తమ ఒరిజినల్ సాంగ్ | : క్రిస్టిన్ ఆండర్సన్ లోపెజ్, రాబర్ట్ లోపెజ్ |
ఉత్తమ యానిమేటెడ్ ఫిల్మ్(ఫీచర్) | : కోకో |
ఉత్తమ యానిమేటెడ్ ఫిల్మ్ (షార్ట్) | : డియర్ బాస్కెట్ బాల్ |
ఉత్తమ లైవ్ యాక్షన్ (షార్ట్) | : ది సెలైంట్ చైల్డ్ |
ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్ (ఫీచర్) | : ఇకారస్ |
ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్ (షార్ట్) | : హెవెన్ ఈజ్ ఎ ట్రాఫిక్ జామ్ ఆన్ ద 405 |
ఉత్తమ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ | : ఎ ఫెంటాస్టిక్ వుమన్ (చిలీయన్ సినిమా) |
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ | : పాల్ డీ ఆస్టర్‌బెల్లీ, జెఫ్రీ ఎ మాల్విన్, షేన్ వియ (ది షేప్ ఆఫ్ వాటర్) |
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ | : జాన్ నెల్సన్, గెర్ద్ నెఫ్‌జర్, పాల్ లాంబర్ట్, రిచర్డ్ ఆర్ హూవర్ (బ్లేడ్ రన్నర్ 2049) |
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ | : లీ స్మిత్ (డంకర్క్) |
ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ | : కజుహిరొ సుజి, డేవిడ్ మాలినోవ్‌స్కీ, లూసీ సిబ్బిక్ (డార్కెస్ట్ అవర్) |
ఉత్తమ కాస్టూమ్ డిజైన్ | : మార్క్ బ్రిడ్జెస్ (ఫాంటమ్ థ్రెడ్) |
ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ | : రిచర్డ్ కింగ్, అలెక్స్ గిబ్సన్ (డంకర్క్) |
ఉత్తమ సౌండ్ మిక్సింగ్ | : మార్క్ వెంగర్టిన్, గ్రెగ్ ల్యాండెకర్, గ్యారీ ఎ రిజొ (డంకర్క్) |
ఉమా సుధీర్ కు చమేలీ దేవి అవార్డు
2017 సంవత్సరానికి ప్రతిష్టాత్మక చమేలీ దేవి అవార్డు ఎన్డీటీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఉమా సుధీర్‌కు లభించింది. రాజకీయాలు, పిల్లలు, మహిళలు, మానవ హక్కులు, వ్యవసాయం, గ్రామీణ సమస్యలు, మైనారిటీల సమస్యలు తదితరాలపై ఆమె విసృ్తతంగా వెలువరించిన కథనాలకు ఈ గుర్తింపు లభించింది. ఉమా సుధీర్ విశ్లేషణాత్మక కథనాలు క్షేత్రస్థాయిలో వాస్తవాలపై అవగాహన కలిగించేందుకు దోహదపడ్డాయని అవార్డు అందించే మీడియా ఫౌండేషన్ పేర్కొంది.