డిసెంబర్ 2020 అవార్డ్స్
తణుకు ఆంధ్రా షుగర్స్ సంస్థ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ ముళ్లపూడి నరేంద్రనాథ్కు జాతీయ పురస్కారం ‘‘బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు-2020’’ లభించింది. జాతీయ రైతు దినోత్సవం(డిసెంబర్ 23) పురస్కరించుకుని డిసెంబర్ 23న జాతీయ వ్యవసాయ, పరిశోధన మండలి-నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్(హరియాణ) ఈ అవార్డును ప్రదానం చేసింది. వర్చువల్ విధానంలో జరిగిన కార్యక్రమం ద్వారా నరేంద్రనాథ్ ఈ అవార్డును అందుకున్నారు. ఒంగోలు జాతి పశు అభివృద్ధి, పరిరక్షణ కోసం చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు-2020 విజేత
ఎప్పుడు : డిసెంబర్ 23
ఎవరు : ముళ్లపూడి నరేంద్రనాథ్
ఎందుకు : ఒంగోలు జాతి పశు అభివృద్ధి, పరిరక్షణ కోసం చేసిన సేవలకు గుర్తింపుగా
డిజిటల్ ఇండియా అవార్డును గెలుచుకున్న తెలంగాణ జిల్లా?
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిజిటల్ ఇండియా పురస్కారాల్లో తెలంగాణలోని కామారెడ్డి జిల్లాకు ‘ఎక్స్‌లెన్స్ ఇన్ డిజిటల్ గవర్నెన్స్’ అవార్డు లభించింది. డిసెంబర్ 30న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో వర్చువల్ విభాగంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిజిటల్ ఇండియా అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ అవార్డును అందుకున్నారు.
ప్రభుత్వరంగ సంస్థలు పాలనా వ్యవహారాల్లో ఉపయోగిస్తున్న వినూత్న డిజిటల్ విధానాలను గుర్తించి కేంద్ర ఎలక్టాన్రిక్, ఐటీ శాఖ ఆరు విభాగాల్లో 22 ప్రభుత్వ వ్యవస్థలను డిజిటల్ ఇండియా అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో కామారెడ్డి జిల్లా ‘ఎక్స్‌లెన్స్ ఇన్ డిజిటల్ గవర్నెన్స్ - జిల్లా విభాగం’లో సిల్వర్ ఐకాన్ అవార్డు గెలుచుకొంది. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోనే జిల్లా ప్లాటినమ్ ఐకాన్ అవార్డును, అరుణాచల్ ప్రదేశ్‌లోని చాంగ్‌లాంగ్ జిల్లా గోల్డ్ ఐకాన్ అవార్డును గెలుచుకున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డిజిటల్ ఇండియా అవార్డుల్లో సిల్వర్ ఐకాన్ అవార్డును గెలుచుకున్న తెలంగాణ జిల్లా
ఎప్పుడు : డిసెంబర్ 30
ఎవరు : కామారెడ్డి జిల్లా
ఎక్కడ : ఎక్స్‌లెన్స్ ఇన్ డిజిటల్ గవర్నెన్స్ - జిల్లా విభాగంలో
ఎందుకు : పాలనా వ్యవహారాల్లో ఉపయోగిస్తున్న వినూత్న డిజిటల్ విధానానికి గుర్తింపుగా
ఐరాస యంగ్ చాంపియన్స్ అవార్డుకు ఎంపికైన భారతీయడు?
ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రకటించిన ‘యంగ్ చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్-2020’ అవార్డుకు మొత్తం ఏడు మంది ఎంపికయ్యారు. అవార్డు విజేతల్లో భారత్‌కు చెందిన 29 ఏళ్ల విద్యుత్ మోహన్ కూడా నిలిచారు. పర్యావరణ సమస్యలను ఎదుర్కోవడానికి సృజనాత్మక పరిష్కారాలను సూచించే వారికి ఐరాస ఈ అవార్డులను ప్రకటిస్తోంది. మిగిలిపోయిన పంటను ప్రత్యేక పద్ధతిలో కాల్చడం ద్వారా రైతులకు ఆదాయం చేకూరే విధానాన్ని గురించి ప్రచారం చేసినందుకుగానూ మోహన్‌కు ఈ అవార్డు దక్కింది. మోహన్ వృత్తిరీత్యా ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఐరాస సెక్రటరీ జనరల్‌గా ఆంటోనియో గుటెర్రెస్ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐరాస యంగ్ చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్-2020 అవార్డుకు ఎంపికైన భారతీయుడు
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : విద్యుత్ మోహన్
ఎందుకు : మిగిలిపోయిన పంటను ప్రత్యేక పద్ధతిలో కాల్చడం ద్వారా రైతులకు ఆదాయం చేకూరే విధానాన్ని గురించి ప్రచారం చేసినందుకుగానూ
ప్రధాని నరేంద్ర మోదీకి లెజియన్ ఆఫ్ మెరిట్ పురస్కారం
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అమెరికా అత్యున్నత మిలటరీ పురస్కారాల్లో ఒకటైన ‘‘లెజియన్ ఆఫ్ మెరిట్’’ వరించింది. ప్రధాని మోదీ తరఫున యూఎస్‌లో భారత అంబాసిడర్ తరణ్‌జిత్ సింగ్ సంధు ఈ అవార్డును అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రెయిన్ చేతుల మీదుగా డిసెంబర్ 22న అందుకున్నారు. దీంతో ఈ అవార్డు కింద దేశాధినేతలకు ఇచ్చే చీఫ్ కమాండర్ హోదా మోదీని వరించింది. భారత్, అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడం, భారత్‌ను అంతర్జాతీయ శక్తిగా తీర్చిదిద్దడంలో చేసిన కృషికిగాను మోదీకి ఈ అవార్డు లభించింది.
మోదీతో పాటు...
లెజియన్ ఆఫ్ మెరిట్ను మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకూ బహూకరించారు. సైన్యంతో పాటు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాల బలోపేతానికి కృషి చేసిన దేశాధినేతలకు అమెరికా ఈ అవార్డును అందిస్తుంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా అత్యున్నత మిలటరీ పురస్కారాల్లో ఒకటైన ‘‘లెజియన్ ఆఫ్ మెరిట్’’ విజేతలు
ఎప్పుడు : డిసెంబర్ 22
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ మాజీ ప్రధాని షింజో అబే
ఎందుకు : సైన్యంతో పాటు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాల బలోపేతానికి కృషి చేసినందుకు
2020 ఏడాది వరల్డ్ క్విజ్జింగ్ చాంపియన్‌గా నిలిచిన వ్యక్తి?
వరల్డ్ క్విజ్జింగ్ చాంపియన్-2020గా హైదరాబాద్ వాసి అవ్వ రవికాంత్ నిలిచారు. సింగపూర్ మెర్లియన్స్ తరఫున ఆయన ఈ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు. విశ్రాంత ఐఏఎస్, రాష్ట్ర గవర్నర్ సలహాదారుడు ఏపీవీఎన్ శర్మ కుమారుడైన రవికాంత్ ప్రస్తుతం సింగపూర్‌లోని ఓ మెడికల్ టెక్నాలజీ కంపెనీలో పనిచేస్తున్నారు. గత 25 ఏళ్లుగా క్విజ్‌ల నిర్వహణలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి అయిన రవికాంత్.. ఐఐటీ మద్రాస్, ఐఐఎం అహ్మదాబాద్, కొలంబియా వర్సిటీల్లో చదివారు. గతంలో ప్రపంచ క్విజ్జింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో వరుసగా 2018, 2019లో ఆసియా-పసిఫిక్ ప్రాంత టాపర్‌గా నిలిచారు.
సచివాలయాల సేవలకు అవార్డు...
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందజేస్తున్న సేవలకుగాను ఇలెట్స్ నాలెడ్‌జ ఎక్స్చేంజ్ సమ్మిట్, అవార్డ్స్-2020లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ‘ట్రాన్స్ ఫర్మేషనల్ గవర్నెన్స్ ఇన్ సర్వీస్ డెలివరీ టు సిటిజెన్’ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వరల్డ్ క్విజ్జింగ్ చాంపియన్-2020గా నిలిచిన వ్యక్తి?
ఎప్పుడు : డిసెంబర్ 10
ఎవరు : అవ్వ రవికాంత్
ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు అంతర్జాతీయ అవార్డు
ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు ‘ది గ్రీన్ బెర్గ్ ప్రైజ్-ఎండ్ బ్లైండ్‌నెస్ 2020’ అంతర్జాతీయ అవార్డు లభించింది. ఈ విషయాన్ని ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపక అధ్యక్షుడు గుళ్లపల్లి ఎన్.రావు డిసెంబర్ 12న తెలిపారు. ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ప్రైజ్ విభాగంలో తమకు ఈ పురస్కారం లభించినట్లు పేర్కొన్నారు. అంధత్వ నిర్మూలనకు సంస్థలు చేస్తున్న కృషికి గాను ఈ అవార్డును ఇస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ది గ్రీన్ బెర్గ్ ప్రైజ్-ఎండ్ బ్లైండ్‌నెస్ 2020 విజేత
ఎప్పుడు : డిసెంబర్ 12
ఎవరు : ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్
ఎందుకు : అంధత్వ నిర్మూలనకు కృషి చేస్తున్నందున
ఐసీజేఎస్ అమల్లో ప్రథమ స్థానం కై వసం చేసుకున్న రాష్ట్రం?
ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్) అమలుకు సంబంధించి కేంద్ర హోంశాఖ డిసెంబర్ 15న అవార్డులను ప్రకటించింది. ఐసీజేఎస్ విధానం అమలు, వినియోగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన మహారాష్ట్ర పోలీసు శాఖ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది. మహారాష్ట్ర తర్వాత రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్, మూడవ స్థానంలో తెలంగాణ నిలిచాయి. ఈ అవార్డులకు దేశంలోని 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పోటీ పడ్డాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు.
ఐసీజేఎస్ అంటే..
క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లోని అన్ని విభాగాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి, సమాచార మార్పిడి, విశ్లేషణలతో ఆన్‌లైన్ ద్వారా సమన్వయ పరిచే విధానమే ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్). బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్) అమల్లో అగ్రస్థానం
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : మహారాష్ట్ర పోలీసు శాఖ
ఎక్కడ : దేశంలో
పద్మవిభూషణ్ అవార్డును వెనక్కి ఇచ్చిన పంజాబ్ మాజీ సీఎం?
శిరోమణి అకాలీదళ్ పార్టీ వ్యవస్థాపకుడు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్ ‘పద్మవిభూషణ్’ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చారు. వివాదస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా పద్మవిభూషణ్ గౌరవాన్ని వెనక్కి ఇస్తున్నట్లు డిసెంబర్ 3న ప్రకాశ్‌సింగ్ బాదల్ ప్రకటించారు. దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌ను తిరిగి ఇస్తున్నట్లు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు.
ఏకైక నేత...
మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అడ్వాణీ తరువాత, సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని కలిగి ఉన్న ఏకైక నేత ప్రకాశ్ సింగ్ బాదల్. ఆయన పంజాబ్‌కు ఐదుసార్లు సీఎంగా పనిచేశారు. 73 ఏళ్ల రాజకీయ జీవితంలో 11 పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
ధిండ్సా సైతం...
శిరోమణి అకాలీ దళ్ డెమొక్రటిక్ పార్టీని ఏర్పాటు చేసిన రాజ్యసభ సభ్యుడు సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా సైతం రైతులకు మద్దతుగా 2019లో అందుకున్న పద్మ భూషణ్ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పద్మవిభూషణ్ అవార్డును వెనక్కి ఇచ్చిన పంజాబ్ మాజీ సీఎం
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : ప్రకాశ్‌సింగ్ బాదల్
ఎందుకు : వివాదస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా
నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న తొలి పాటల రచయిత?
అమెరికా సంగీత దిగ్గజం, జానపద గాయకుడు, గీత రచయిత బాబ్ డిలాన్ రాసిన మొత్తం 600 పాటలను యూనివర్సల్ మ్యూజిక్ పబ్లిషింగ్ గ్రూప్ సొంతం చేసుకుంది. అంటే ఈ పాటలపై హక్కులన్నీ ఆ గ్రూప్‌వే. అయితే ఈ లావాదేవి సంబంధించి బాబ్ డిలాన్‌కు ఎంత మొత్తం చెల్లించారన్నది ఇంకా వెల్లడికాలేదు. బాబ్ డిలాన్ 2016లో సాహిత్యంలో నోబెల్ పురస్కారం పొందారు. దీంతో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న తొలి పాటల రచయితగా రికార్డు సృష్టించారు. సాహిత్యం విభాగంలో సంగీతకారుడు లేదా గీత రచయితకు అవార్డును ఇవ్వడం నోబెల్ చరిత్రలో ఇదే తొలిసారి.
బాబ్ డిలాన్ రాసిన ‘బ్లోయింగ్ ఇన్ ద విండ్’, ‘ద టైమ్స్ దే ఆర్ ఏ చేంజింగ్’ పాటలు అమెరికాలో పౌర హక్కుల ఉద్యమాలకు ఊపిరిగా నిలిచాయి. ఈ పాటలకు డిలన్‌కు 2008లో పులిట్జర్ ప్రైజ్ కూడా దక్కింది. ‘అనదర్ సైడ్ ఆఫ్ బాబ్ డిలన్’, ‘బ్రింగింగ్ ఇట్ ఆల్ బ్యాక్ హోమ్’, ‘హైవే 61 రీవిజిటెడ్’ వంటి ఆల్బమ్స్‌తో డిలాన్ ప్రసిద్ధి చెందారు.
ఐక్యరాజ్యసమితి అవార్డు గెలుచుకున్న జాతీయ సంస్థ?
భారత్‌లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఏర్పాటైన జాతీయ సంస్థ ‘ఇన్వెస్ట్ ఇండియా’ ప్రతిష్టాత్మక అవార్డు... ‘‘ఐక్యరాజ్యసమితి పెట్టుబడుల ప్రోత్సాహక పురస్కారం-2020’’ను గెలుచుకుంది. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉన్న యునెటైడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (యూఎన్‌సీటీఏడీ) ప్రధాన కార్యాలయంలో డిసెంబర్ 7న అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వివిధ దేశాల ఇన్వెస్ట్‌మెంట్ ఏజెన్సీలు చేస్తున్న కృషికి గుర్తింపుగా యూఎన్‌సీటీఏడీ ఈ అవార్డును అందిస్తోంది. సుమారు 180 ప్రభుత్వ ఏజెన్సీలు ఈసారి బరిలో నిలవగా ఇన్వెస్ట్ ఇండియా విజేతగా నిలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐక్యరాజ్యసమితి పెట్టుబడుల ప్రోత్సాహక పురస్కారం-2020 విజేత
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : ఇన్వెస్ట్ ఇండియా
ఎక్కడ : జెనీవా, స్విట్జర్లాండ్
ఎందుకు : పెట్టుబడులను ప్రోత్సహించడంలో విశేష కృషి చేసినందుకుగాను
గిన్నిస్ రికార్డుల్లో స్థానం సంపాదించిన ఉంగరం పేరు?
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన నగల దుకాణదారు హర్షిత్ బన్సాల్ 12,638 వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని తయారు చేశాడు. 8 పొరలతో 165.45 గ్రాముల బరువున్న ఉంగరానికి ‘మారిగోల్డ్ డైమండ్ రింగ్’ అనే పేరు పెట్టారు. అత్యధిక సంఖ్యలో వజ్రాలు పొదిగిన ఉంగరంగా ‘మారిగోల్డ్ డైమండ్ రింగ్’ గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లో స్థానం సంపాదించింది.
ఇప్పటివరకు హైదరాబాద్‌కు చెందిన నగల వ్యాపారి కొట్టి శ్రీకాంత్ పేరిటి ఈ రికార్డు ఉండేది. 7,801 వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని శ్రీకాంత్ తయారు చేశాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మారిగోల్డ్ డైమండ్ రింగ్‌కు గిన్నిస్ రికార్డుల్లో స్థానం
ఎప్పుడు : డిసెంబర్ 5
ఎవరు : హర్షిత్ బన్సాల్
ఎక్కడ : ప్రపంచంలో
ఎందుకు : అత్యధిక సంఖ్యలో వజ్రాలు(12,638 వజ్రాలు) పొదిగినందున
ఆస్ ఫెలోషిప్‌కు ఎంపికైన భారతీయ డాక్టర్?
అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్ మెంట్ ఆఫ్ సెన్సైస్ (ఆస్) 2020 సంవత్సరానికి ప్రకటించిన ఫెలోషిప్‌కు ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ (ఏఐజీ) చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి ఎంపికయ్యారు. గత 100 ఏళ్లలో ఒక భారతీయ డాక్టర్‌కు ఆస్ ఫెలోషిప్ దక్కడం ఇదే తొలిసారి. గ్యాస్ట్రోఎంట్రాలజీలో ఆయన చేసిన అనేక నూతన ఆవిష్కరణలకు గుర్తింపుగా ఈ ఫెలోషిప్‌కు ఎంపిక చేసినట్లు ఆస్(AAAS) తెలిపింది.
నాగీ స్టంట్...
క్లోమగ్రంధి సంబంధిత వ్యాధులను నయం చేసేందుకు నాగేశ్వర్‌రెడ్డి ఆవిష్కరించిన ‘నాగీ స్టంట్’ ప్రపంచ గుర్తింపు పొందింది. కాలేయం, క్లోమగ్రంధి వ్యాధులకు సంబంధించి ఆయన పలు పరిశోధనలు చేశారు. కొత్త చికిత్సలకు శ్రీకారం చుట్టారు. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులను అందుకున్నారు.
2021, ఫిబ్రవరి 13న...
2021, ఫిబ్రవరి 13వ తేదీన జరిగే ఆస్ వార్షిక సమావేశంలో ఫెలోషిప్ గ్రహీతలకు అవార్డు అందిస్తారు. అధికారిక ధ్రువీకరణ పత్రాలు, బంగారు, నీలం రంగుల్లో మెడల్స్ ప్రదానం చేస్తారు. 2020 ఏడాదిలో నోబెల్ పొందిన ఇద్దరు శాస్త్రవేత్తలు జెన్నిఫర్ డౌడ్నా, చార్లెస్ రైస్‌లు కూడా ఈ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు.
గతంలో...
1878లో ప్రముఖ శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్, 1905లో సామాజిక శాస్త్రవేత్త డబ్ల్యూఈబీ డు బోయిస్, 1963లో కంప్యూటర్ శాస్త్రవేత్త గ్రేస్ హోపర్ వంటి ప్రముఖ శాస్త్రవేత్తలకు ఆస్ ఫెలోషిప్ లభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్ మెంట్ ఆఫ్ సెన్సైస్ (ఆస్) ఫెలోషిప్-2020కు ఎంపికైన భారతీయుడు
ఎప్పుడు : డిసెంబర్ 8
ఎవరు : ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి
ఎందుకు : గ్యాస్ట్రోఎంట్రాలజీలో చేసిన అనేక నూతన ఆవిష్కరణలకుగాను
ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్ మెడల్ దక్కించుకున్న పోలీస్ అధికారి?
తెలంగాణకు చెందిన సీబీఐ ఇన్‌స్పెక్టర్ బి.సతీశ్ ప్రభుకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్ మెడల్ లభించింది. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో డిసెంబర్ 9న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఆర్‌పీఎఫ్, సీబీఐల్లో పలు సంచలన కేసులు పరిశోధించి నిందితులకు శిక్ష పడేలా చేయడంతో ప్రభుకు ఈ అవార్డు దక్కింది. అబూ సలేం, మోనికా బేడీ కేసును ఆయన ఛేదించారు. 2012లో ఇండియన్ పోలీస్ మెడల్ కూడా ఆయన్ను వరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్ మెడల్ విజేత
ఎప్పుడు : డిసెంబర్ 9
ఎవరు : తెలంగాణకు చెందిన సీబీఐ ఇన్‌స్పెక్టర్ బి.సతీశ్ ప్రభు
ఎక్కడ : సీబీఐ ప్రధాన కార్యాలయం, న్యూఢిల్లీ
ఎందుకు : ఆర్‌పీఎఫ్, సీబీఐల్లో పలు సంచలన కేసులు పరిశోధించి నిందితులకు శిక్ష పడేలా చేయడంతో
93వ ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన భారతీయ చిత్రం?
2021, ఏప్రిల్‌లో జరగనున్న 93వ ఆస్కార్ అవార్డులకు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారతదేశం తరఫున మలయాళ చిత్రం ‘జల్లికట్టు’ నామినేట్ అయ్యింది. జల్లికట్టును ఆస్కార్ ఎంట్రీగా పంపుతున్నట్టు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నవంబర్ 25 ప్రకటించింది.
జల్లికట్టు గురించి...
- లీజో జోస్ పెలిసెరీ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ‘జల్లికట్టు’.
- ఆంటోనీ వర్గీస్, చెంబన్ వినోద్ జోస్, శాంతి బాలచంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించారు.
- కసాయి కొట్టు నుంచి తప్పించుకున్న దున్నపోతు చుట్టూ తిరిగే కథ ఇది. ఆ ఊరి మొత్తాన్ని ఆ దున్న ఎలా ఇబ్బంది పెట్టింది, ఈ క్రమంలో అందర్నీ ఎలా మార్చేసింది? అన్నది కథాంశం.
- 2019, అక్టోబర్ 4న ఈ సినిమాకు కెమెరా, ఎడిటింగ్, సౌండ్ డిజైనింగ్.. ఇలా అన్ని డిపార్ట్‌మెంట్‌లకు మంచి పేరు లభించింది.
- 50వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమాకుగాను ఉత్తమ దర్శకుడి ట్రోఫీను అందుకున్నారు లిజో.
ఐసీఐడీ-2020 అంతర్జాతీయ అవార్డుకు ఎంపికైన ఏపీ రైతు?
ఢిల్లీ ప్రధాన కార్యాలయంగా పనిచేసే ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ(ఐసీఐడీ)-2020 అంతర్జాతీయ స్థాయిలో నాలుగు అవార్డులు ప్రకటించింది. అందులో రైతు విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మేకల శివశంకరరెడ్డి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. మిగతా మూడు కేటగిరీలు.. టెక్నాలజీ అవార్డు, మేనేజ్‌మెంట్ అవార్డు, యంగ్ ప్రొఫెషనల్ అవార్డులు ఇరాన్ దేశస్తులు దక్కించుకున్నారు. ఇండోనేషియా వేదికగా త్వరలోనే అవార్డులు ప్రదానం చేయనున్నారు.
అనంతపురం జిల్లా, రాప్తాడు మండలం, ప్రసన్నాయపల్లికి చెందిన అభ్యుదయ రైతు మేకల శివశంకరరెడ్డి ఉద్యాన పంటల సాగులో నూతన ఒరవడితో ముందుకు సాగుతున్నారు. డ్రిప్ పద్ధతిలో ఉద్యాన పంటలు(ప్రధానంగా ద్రాక్ష) సాగు చేసి.. వాటికి పూర్తిగా ఫర్టిగేషన్ పద్ధతిలో పోషకాలు అందించి మంచి దిగుబడులు సాధించారు. ఇప్పటికే పలు అవార్డులు, రివార్డులు దక్కించుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ(ఐసీఐడీ)-2020 అవార్డుకు ఎంపిక
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : మేకల శివశంకరరెడ్డి
ఎక్కడ : రైతు విభాగంలో
ఎందుకు : ఉద్యాన పంటల సాగులో నూతన ఒరవడితో ముందుకు సాగుతున్నందున
ఇన్ఫోసిస్ సైన్స్ అవార్డుకు ఎంపికైన సీసీఎంబీ శాస్త్రవేత్త?
శాస్త్ర, పరిశోధన రంగాల్లో చేసిన కృషికి గాను దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థ అందించే... ఇన్ఫోసిస్ సైన్స్ అవార్డుకు 2020 ఏడాది హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) శాస్త్రవేత్త డాక్టర్ రాజన్ శంకరనారాయణన్ ఎంపికయ్యారు. జీవశాస్త్ర రంగానికి సంబంధించి డాక్టర్ రాజన్‌ను, ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ విభాగంలో హరి బాలక్రిష్ణన్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు డిసెంబర్ 2న ఇన్ఫోసిస్ తెలిపింది. అమెరికాలోని మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎమ్‌ఐటీ)లో ఫ్రొపెసర్‌గా హరి బాలక్రిష్ణన్ పనిచేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇన్ఫోసిస్ సైన్స్ అవార్డుకు 2020కు ఎంపిక
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : డాక్టర్ రాజన్ శంకరనారాయణన్, ఫ్రొపెసర్ హరి బాలక్రిష్ణన్
ఎందుకు : శాస్త్ర, పరిశోధన రంగాల్లో చేసిన కృషికి గాను