Skip to main content

అక్టోబర్ 2019 అవార్డ్స్

పవర్ గ్రిడ్ ఇండియాకు సీఎస్‌ఆర్ అవార్డు
Current Affairs పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో అక్టోబర్ 29న జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా సంస్థ చైర్మన్, ఎండీ కందికుప్ప శ్రీకాంత్ అవార్డు అందుకున్నారు. సామాజిక బాధ్యత కింద రూ.100 కోట్లకుపైగా వెచ్చించి ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో సమీకృత నీటి నిర్వహణ వ్యవస్థల ఏర్పాటుకు చేసిన కృషికి గుర్తింపుగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) ఎక్స్‌లెన్స్ అవార్డు విజేత
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : సామాజిక బాధ్యత కింద రూ.100 కోట్లకుపైగా వెచ్చించి ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో సమీకృత నీటి నిర్వహణ వ్యవస్థల ఏర్పాటుకు చేసిన కృషికి గుర్తింపుగా

నోర్డియాక్ అవార్డును తిరస్కరించిన గ్రెటా
84 దేశాలు సభ్యులుగా ఉన్న నోర్డియాక్ కౌన్సిల్ ప్రకటించిన ‘ఎన్విరాన్‌మెంటల్ అవార్డు’ని పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థెన్‌బర్గ్ తిరస్కరించింది. తనకు కావాల్సింది అవార్డు కాదని, పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాల ఆచరణ అని 16 ఏళ్ల గ్రెటా పేర్కొంది. తన పోరాటాన్ని గుర్తించినందుకు నోర్డియాక్ కౌన్సిల్‌కు కృతజ్ఞతలు తెలిపింది. స్వీడన్‌కు చెందిన గ్రెటా కొన్నేళ్లుగా పర్యావరణ పరిరక్షణ కోసం పోరాటం చేస్తోంది. 2018లో స్వీడన్ పార్లమెంట్ ఎదుట ఒంటరిగా ధర్నాకు దిగి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే పర్యావరణ రక్షణకు ఆమె చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఎన్విరాన్‌మెంటల్ అవార్డుని ప్రకటించారు. ఈ అవార్డు కింద దాదాపు రూ. 36 లక్షల నగదు బహుమతి అందిస్తారు.

సీసీఎల్ చైర్మన్ ప్రసాద్‌కు లైఫ్ టైం అవార్డు
Current Affairs ఇన్‌స్టాంట్ కాఫీ దిగ్గజం సీసీఎల్ ప్రొడక్ట్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్‌కు ఇంటర్నేషనల్ ఇన్‌స్టాంట్ కాఫీ ఆర్గనైజేషన్ నుంచి లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. ఇటీవల జర్మనీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును స్వీకరించారు. ఇన్‌స్టాంట్ కాఫీ రంగంలో చేసిన కృషికి గానూ ప్రసాద్‌కు ఈ అవార్డు దక్కింది. 1,500 టన్నుల వార్షిక సామర్థ్యంతో ప్రారంభమైన సీసీఎల్ ప్రస్థానం నేడు 35,000 టన్నుల స్థాయికి చేరింది. 90కి పైగా దేశాల్లోని క్లయింట్లకు కంపెనీ కాఫీ ఉత్పత్తులను సరఫరా చేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇంటర్నేషనల్ ఇన్‌స్టాంట్ కాఫీ ఆర్గనైజేషన్ నుంచి లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు
ఎప్పుడు : అక్టోబర్ 18
ఎవరు : చల్లా రాజేంద్ర ప్రసాద్
ఎందుకు : ఇన్‌స్టాంట్ కాఫీ రంగంలో చేసిన కృషికి

రామ్‌రాజ్ చైర్మన్ నాగరాజన్‌కు మగుదం అవార్డు
రామ్‌రాజ్ కాటన్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్ కె.ఆర్.నాగరాజన్‌కు ప్రతిష్ఠాత్మక ‘మగుదం-2019’ అవార్డు లభించింది. వ్యాపార విభాగంలో ఉత్తమ వ్యాపారవేత్తగా నిలిచినందుకు గాను నాగరాజన్‌ను ఈ అవార్డు వరించింది. తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో తెలంగాణ గవర్నరు తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా నాగరాజన్ ఈ అవార్డును అందుకున్నారు. దక్షిణాది సంప్రదాయమైన పంచెకట్టును తన రామరాజ్ కాటాన్స్ ద్వారా నాగరాజన్ ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేశారు. తద్వారా చేనేత కార్మికులకూ ప్రోత్సాహం కల్పించారు. క్రీడలు, వ్యాపారం, ఆరోగ్య సంరక్షణ, కళలు, సాహిత్యం లాంటి వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వ్యక్తులను ఏటా ‘మగుదం అవార్డు’తో సత్కరిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రామ్‌రాజ్ కాటన్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్ కె.ఆర్.నాగరాజన్‌కు మగుదం-2019 అవార్డు
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : తెలంగాణ గవర్నరు తమిళిసై సౌందరరాజన్
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : వ్యాపార విభాగంలో చేసిన కృషికిగాను

గిన్నిస్ బుక్‌లో ట్రినిటీ చాక్లెట్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్‌గా ‘ట్రినిటీ - ట్రఫుల్స్ ఎక్స్‌ట్రార్డినేర్’ గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించింది. ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ కంపెనీ ‘ఐటీసీ’కి చెందిన ఫాబెల్లె బ్రాండ్ తయారు చేసిన ఈ చాక్లెట్ ఖరీదును కేజీ రూ. 4.3 లక్షలుగా నిర్ణయించారు. ఇంతటి ఖరీదైన చాక్లెట్ మరొకటి లేనందున గిన్నిస్ బుక్‌లో ఈ లిమిటెడ్ ఎడిషన్ స్థానం సంపాదించినట్లు ఐటీసీ అక్టోబర్ 22న వెల్లడించింది. ఫ్రాన్స్ కు చెందిన చాక్లెట్ తయారీ నిపుణుడు ఫిలిప్ కొంటిచినీ, ఫాబెల్లెలోని భారత నిపుణులు సంయుక్తంగా ఈ చాక్లెట్లకు రూపకల్పన చేశారని తెలిపింది. చెక్క పెట్టెలో ఈ చాక్లెట్లను విక్రయిస్తున్నట్లు పేర్కొంది. ఒక్కో చెక్క పెట్టెలో 15 ట్రఫుల్స్ ఉండగా.. సగటు బరువు దాదాపు 15 గ్రాములు ఉన్నట్లు వివరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ట్రినిటీ - ట్రఫుల్స్ ఎక్స్‌ట్రార్డినేర్ చాక్లెట్‌కు గిన్నిస్ బుక్‌లో స్థానం
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎందుకు : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్‌గా గుర్తింపు పొందినందుకు

ఏపీ, తెలంగాణకు జాతీయ అవార్డులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వివిధ విభాగాల్లో పలు జాతీయ పంచాయతీ అవార్డులు లభించాయి. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 23న న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ అవార్డులను ప్రదానం చేశారు. జిల్లా స్థాయి అవార్డులను కలెక్టర్లు, మండల, గ్రామ స్థాయి అవార్డులను ఆ శాఖాధికారులు అందుకున్నారు.
జాతీయ పంచాయతీ అవార్డులు
  1. గ్రామ పంచాయతీ వికాస్ యోజన అవార్డు: కరకంబాడి గ్రామం( చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్)
  2. బాల్య మిత్ర పంచాయతీ అవార్డు: రాజువారి చింతలపాళెం(నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్), పైడిమడుగు(జగిత్యాల జిల్లా, తెలంగాణ)
  3. నానాజీ దేశ్‌ముఖ్ జాతీయ గౌరవ గ్రామ సభ పురస్కారం: శ్రీకూర్మం(శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్), రాఘవపూర్ గ్రామం(పెద్దపల్లి జిల్లా, తెలంగాణ)
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తి కరణ్ అవార్డులు:
  1. ఆంధ్రప్రదేశ్ నుంచి
    జిల్లా పంచాయతీ పురస్కారం:
    చిత్తూరు జిల్లా
    మండల పంచాయతీ అవార్డులు: కర్నూలు, గుమ్మగట్ట, సబ్బవరం, వెదురుకుప్పం
    గ్రామ పంచాయతీ పురస్కారాలు: పొగిరి (శ్రీకాకుళం జిల్లా), బుట్టాయగూడెం (ప.గో. జిల్లా), కూచివారిపల్లి (వైఎస్సార్ జిల్లా), అచ్చంపేట(తూ.గో. జిల్లా) తాళ్వాయిపాడు (నెల్లూరు జిల్లా), కోణంకి (ప్రకాశం జిల్లా)
  2. తెలంగాణ నుంచి
    జిల్లా పంచాయతీ అవార్డు:
    ఆదిలాబాద్ జిల్లా
    మండల పంచాయతీ అవార్డులు: మంథని, వెల్గటూరు
    గ్రామ పంచాయతీ పురస్కారాలు: మల్కాపూర్ (మెదక్), ఇర్కోడు (సిద్దిపేట), మల్లారం (పెద్దపల్లి), నాగపూర్ (నిజామాబాద్)

ఓల్గా, హండ్కేలకు సాహితీ నోబెల్
Current Affairs సాహితీ రంగంలో విశేషంగా కృషిచేసిన ఇద్దరు ప్రముఖ సాహితీవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. ఆస్ట్రియాకి చెందిన ప్రముఖ నవల, నాటక రచయిత పీటర్ హండ్కేకి 2019 సంవత్సరానికి గాను నోబెల్ పురస్కారం వరించింది. 2018 సంవత్సరానికి పోలండ్‌కి చెందిన ప్రముఖ పర్యావరణ వేత్త, స్త్రీవాది, మేధావి, నవలా రచయిత్రి ఓల్గా టోర్కార్క్విజ్‌కి ‘ద బుక్స్ ఆఫ్ జాకోబ్‌‘ అనే నవలకు గానూ ఈ బహుమతి లభించింది.
ఓల్గా టోర్కార్క్విజ్
1962, జనవరి 29న పోలండ్‌లోని వెస్ట్రన్ టౌన్‌లో జన్మించిన ఓల్గా టోర్కార్క్విజ్ యూనివర్సిటీ ఆఫ్ వార్సాలో చదువుకున్నారు. ఆమె తండ్రి లైబ్రేరియన్ కావడంతో పుస్తకపఠనమే ప్రపంచంగా పెరిగారు. ఆమె తొలి నవల ‘ద జర్నీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద బుక్’ 1993లో ప్రచురించారు. ఓల్గా రచించిన ‘ఫ్లైట్స్’ నవలకు 2017లో బుకర్ ప్రైజ్ లభించింది. ఆమె రచించిన 900 పేజీల ‘‘ద బుక్స్ ఆఫ్ జాకోబ్’’ ఏడు దేశాలకూ, మూడు ప్రాంతాలకూ, ఐదు భాషల చరిత్రకు సంబంధించినది. 18వ శతాబ్దానికి చెందిన జూయిష్ అనే చిన్న తెగకు చెందిన బహుకొద్ది చరిత్ర మాత్రమే తెలిసిన ఫ్రాంకిసమ్ అనే వ్యక్తి చరిత్రను అన్వేషిస్తుంది.
సాహితీరంగంలో నోబెల్ బహుమతి వచ్చిన మహిళల్లో ఓల్గా 15వ వారు. ఆమె నవలల్లో స్త్రీపురుషుల మధ్య, ప్రకృతికీ సంస్కృతికీ మధ్య, వివేచనకీ, అవివేకానికీ మధ్య వారి అంతరాంతరాల్లో రగులుతోన్న అంతర్మథనాన్ని అద్భుతంగా వర్ణిస్తారని నోబెల్ పురస్కారాన్ని ప్రకటించిన రాయల్ స్వీడిష్ అకాడమీ పేర్కొంది. ‘సహనశీల పోలండ్ మిథ్య’ అంటూ ఆమె చేసిన రచనల కారణంగా 2015లో ఆమెను చంపేస్తామన్న బెదిరింపులు సైతం వచ్చాయి.
పీటర్ హండ్కే
పీటర్ హండ్కే ఆస్ట్రియాలో రెండవ ప్రపంచ యుద్ధకాలంలో (1942, డిసెంబర్ 6) జర్మనీ సైనికుడికీ, స్లొవేనియాకు చెందిన మైనారిటీ తల్లికి జన్మించారు. ఆస్ట్రియాలోనే పెరిగిన పీటర్ 1966లో ‘ద హార్నెట్స్’ అనే నవలతో సాహితీరంగంలో సంచలనం సృష్టించారు. దీంతో న్యాయవాద చదువుని మధ్యలోనే వదిలేసి సాహితీరంగం వైపు వచ్చారు. ఆయన రాసిన ‘ద అవర్ వియ్ న్యూ నథింగ్ ఆఫ్ ఈచ్ అదర్’ అనే సంభాషణలు లేని నాటకం చాలా ప్రసిద్ధి గాంచింది. పీటర్ పూర్తి స్వచ్ఛమైన జర్మన్ భాషా రచయితల్లో బతికి ఉన్న అతి కొద్దిమందిలో ఒకరు.
పీటర్ రచనలెంత ప్రాముఖ్యతను సాధించాయో, అంతే స్థాయిలో ఆయన వివాదాస్పదుడు కూడా. 2014లో సాహిత్యరంగంలో నోబెల్ బహుమతిని నిషేధించాలని పీటర్ డిమాండ్ చేశారు.

ఉప రాష్ట్రపతికి కొమొరోస్ అత్యున్నత పౌర పురస్కారం
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి అరుదైన గౌరవం దక్కింది. ఆఫ్రికాలోని కొమొరోస్ పర్యటనలో ఉన్న వెంకయ్యనాయుడుకు ఆ దేశ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన ‘ద ఆర్డర్ ఆఫ్ ద గ్రీన్ క్రెసెంట్’ను ప్రదానం చేసింది. ఈ పురస్కారాన్ని ఆ దేశాధ్యక్షుడు అజాలీ అసౌమని చేతుల మీదుగా ఆయన అక్టోబర్ 11న అందుకున్నారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ‘కొమొరోస్ దేశ అత్యున్నత పౌరపురస్కారాన్ని అందుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఈ అపూర్వ గౌరవాన్ని 130 కోట్ల మంది భారతీయుల తరఫున వినయపూర్వకంగా స్వీకరిస్తున్నాను.’ అని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కొమొరోస్ అత్యున్నత పౌర పురస్కారం
ఎప్పుడు: అక్టోబర్ 11, 2019
ఎవరు: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ: ఆఫ్రికాలోని కొమొరోస్

ఇథియోపియా ప్రధానికి నోబెల్ శాంతి పురస్కారం
ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం 2019 సంవత్సరానికి గాను ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీని వరించింది. ఆఫ్రికా దేశంలో శాంతి స్థాపన, అంతర్జాతీయ సహకారంలో ఆయన చేసిన కృషికిగాను ఈ అవార్డు దక్కింది. ప్రధానంగా ఇథియోపియాకు సరిహద్దుల్లో ఉన్న ఎరిట్రియా దేశంతో దశాబ్దాల తరబడి నెలకొని ఉన్న సరిహద్దు ఉద్రిక్తతల్ని నివారించడానికి శాంతి ఒప్పందం కుదుర్చుకోవడంలో అబీ అహ్మద్ చూపించిన చొరవకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రకటిస్తున్నట్టుగా ఓస్లోలో నార్వే నోబెల్ ఇనిస్టిట్యూట్ ప్రకటించింది. ఇథియోపియా దేశానికి చెందిన వ్యక్తికి అత్యున్నత పురస్కారం రావడం ఇదే మొదటిసారి. 43 ఏళ్ల అబీ నోబెల్ పురస్కారం పొందిన 100వ విజేత. ఈ పురస్కారం కింద 90 లక్షల స్వీడిష్ క్రౌన్స్ (దాదాపు రూ.9.40 కోట్లు) అబీ అహ్మద్‌కు అందజేస్తారు. ఆల్‌ఫ్రెడ్ నోబెల్ వర్ధంతిని పురస్కరించుకొని డిసెంబర్ 10న నార్వేలోని ఓస్లోలో శాంతి పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.
అతడే ఒక సైన్యం :
ఒక సైనికుడిగా జీవితాన్ని ప్రారంభించి సైబర్ ఇంటెలిజెన్స్ విభాగంలో సాహసోపేతంగా వ్యవహరించి, ప్రధానిగా శాంతి స్థాపనకు పలు సంస్కరణలు తీసుకువచ్చిన అబీ అహ్మద్ ప్రస్థానం ఎంతో ఆసక్తికరం. దక్షిణ ఇథియోపియాలో జిమా జోన్‌లో 1976లో అబీ జన్మించారు. ఆయన తండ్రి ముస్లిం. తల్లి క్రిస్టియన్. చదువుల్లో ఎప్పుడూ ముందుండేవారు. చదువుపై ఆసక్తితో ఎన్నో డిగ్రీలు సొంతం చేసుకున్నారు. శాంతిభద్రతల అంశంలో అడ్డీస్ అబాబా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. లండన్‌లో గ్రీన్ విచ్ యూనివర్సిటీ నుంచి నాయకత్వ మార్పిడి అనే అంశంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. టీనేజ్‌లో ఉండగానే సైన్యంలో చేరారు. లెఫ్ట్‌నెంట్ కల్నల్ పదవి వరకు ఎదిగారు ప్రమాదాలు ఎదుర్కొని వాటిని పరిష్కరించడం అయనకు ఎంతో ఇష్టమైన విషయం. 1998-2000 మధ్య ఎరిట్రియాతో యుద్ధ సమయంలో నిఘా విభాగంలో పనిచేశారు. గూఢచారిగా మారి ఎరిట్రియా నుంచి రక్షణకు సంబంధించి పలు రహస్యాలను రాబట్టారు. 1995లో ర్వాండాలో ఐక్యరాజ్యసమితి శాంతి కార్యకర్తగా సేవలు అందించారు. 2010లో రాజకీయాల్లో చేరారు. ఒరోమో పీపుల్స్ డెమోక్రటిక్ ఆర్గనైజేషన్ సభ్యుడిగా చేరి పార్లమెంటుకి ఎన్నికయ్యారు. 2018 ఏప్రిల్‌లో ప్రధాని పగ్గాలు చేపట్టి దేశం దశ దిశ మార్చడానికి కృషి చేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఇథియోపియా ప్రధానికి నోబెల్ శాంతి పురస్కారం
ఎవరు: అబీ అహ్మద్ అలీ
ఎందుకు: ఆఫ్రికా దేశంలో శాంతి స్థాపన, అంతర్జాతీయ సహకారంలో ఆయన చేసిన కృషికిగాను..
ఎక్కడ: ఇథియోపియా

చండీప్రసాద్‌కు ఇందిరాగాంధీ అవార్డు
ప్రముఖ పర్యావరణ వేత్త, సామాజిక ఉద్యమకారుడు చండీప్రసాద్ భట్‌కు 2017-18ఏడాదికిగాను ఇందిరాగాంధీ జాతీయ సమైక్య అవార్డు ప్రకటించారు. అవార్డు కింద ప్రసాద్‌కు రూ. 10 లక్షల నగదు అందనుంది. అన్ని సామాజిక వర్గాలకు చెందిన పేదల అభివృద్ధి కోసం ఆయన గత ఆరు దశాబ్దాలుగా కృషిచేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ప్రముఖ పర్యావరణ వేత్త, సామాజిక ఉద్యమకారుడు చండీప్రసాద్ భట్‌కు ఇందిరాగాంధీ జాతీయ సమైక్య అవార్డు
ఎవరు: చండీప్రసాద్ భట్
ఎందుకు: అన్ని సామాజిక వర్గాలకు చెందిన పేదల అభివృద్ధి కోసం చేసిన కృషికి
ఎక్కడ: న్యూఢిల్లీ

తెలంగాణకు కాయకల్ప అవార్డులు
తెలంగాణలోని పలు జిల్లా కేంద్ర, పీహెచ్‌సీ- సీహెచ్‌సీ ఆస్పత్రులకు కాయకల్ప అవార్డులు వరించాయి. మెరుగైన సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ, స్వచ్ఛత ప్రమాణాల ప్రాతిపదికన ఆస్పత్రులకు కేంద్రం ఏటా ఇచ్చే ఈ పురస్కారాల ప్ర దానోత్సవం ఢిల్లీలో జరిగింది. రాష్ట్రం నుంచి జిల్లా ఆస్పత్రుల విభాగంలో కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి మొదటి స్థానం దక్కింది. ద్వితీయ స్థానంలో సంగారెడ్డి, కొండాపూర్ జిల్లా కేం ద్రం ఆస్పత్రులు నిలిచాయి. పీహెచ్‌సీ-సీహెచ్‌సీల విభాగంలో పాల్వంచ సామాజిక ఆరోగ్య కేంద్రానికి ప్రథమ స్థానం దక్కింది. ఆయా ఆస్పత్రుల బాధ్యులు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మం త్రి హర్షవర్ధన్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: తెలంగాణకు కాయకల్ప అవార్డులు
ఎందుకు: మెరుగైన సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ, స్వచ్ఛత ప్రమాణాల..
ఎక్కడ: న్యూఢిల్లీ

సినీ నటుడు నారాయణమూర్తికి జాతీయ అవార్డు
ప్రముఖ సినీ నటుడు, ప్రజా చిత్రాల దర్శకుడు ఆర్.నారాయణమూర్తికి సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ అవార్డు లభించింది. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అక్టోబర్ 13న జరిగిన కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేతులమీదుగా నారాయణమూర్తి ఈ అవార్డును అందుకున్నారు. హనుమంతు తన పాటల ద్వారా ప్రజల్లో సామాజిక చైతన్య స్ఫూర్తిని రగిలించారని మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో సుద్దాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సుద్దాల అశోక్ తేజ పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ అవార్డు విజేత
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి
ఎక్కడ : హైదరాబాద్

ఇద్దరు రచయిత్రులకు బుకర్ ప్రైజ్
ఆంగ్ల సాహిత్యంలో ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డు బుకర్ ప్రైజ్-2019 విజేతల పేర్లను అక్టోబర్ 14న ప్రకటించారు. లండన్‌లోని గిల్డ్‌హాల్ వేదికగా పీటర్ ఫ్లోరెన్స్ ఆధ్వర్యంలోని న్యాయనిర్ణేతల బృందం విజేతల పేర్లను ప్రకటించింది. కెనడియన్ రచయిత మార్గరెట్ ఎట్‌వుడ్, ఆంగ్లో-నైజీరియన్ రచయిత బెర్నార్‌డైన్ ఎవరిస్టోలకు సంయుక్తంగా బుకర్ ప్రైజ్ లభించింది. దీంతో ఈ అవార్డు అందుకున్న తొలి నల్లజాతి మహిళగా ఎవరిస్టో గుర్తింపు పొందింది. ఇక ఎట్‌వుడ్‌ను బుకర్ ప్రైజ్ వరించడం ఇది రెండోసారి. ‘ద టెస్టామెంట్’ అనే నవలకుగానూ ఎట్‌వుడ్‌కు, ‘గర్ల్, వుమన్, అదర్’ అనే నవలకుగానూ ఎవరిస్టోకు బుకర్ ప్రైజ్ దక్కింది. ఈ అవార్డు కింద ఇచ్చే 50 వేల పౌండ్ల నగదును ఇద్దరు సమానంగా పంచుకోనున్నారు. కాగా భారత్‌కు చెందిన సల్మాన్ రష్దీ నవల ‘క్విచోటే’ కూడా బుకర్ ప్రైజ్‌కు షార్ట్‌లిస్ట్ అయిన ఆరు నవలల్లో ఒకటిగా నిలిచింది.
కాల్పనిక సాహిత్యానికి ఇచ్చే ఈ అత్యున్నత అవార్డు బుకర్ ప్రైజ్ చరిత్ర(1969లో ప్రారంభమైంది)లో 1992 తర్వాత తొలిసారి ఇద్దరు విజేతలను ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బుకర్ ప్రైజ్-2019 విజేతలు
ఎప్పుడు : అక్టోబర్ 14
ఎవరు : మార్గరెట్ ఎట్‌వుడ్, బెర్నార్‌డైన్ ఎవరిస్టో

అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్
ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించడానికి వినూత్న కోణంలో పరిశోధనలు చేసి ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పుల్ని తెచ్చినందుకు ప్రవాస భారతీయుడు అభిజిత్ బెనర్జీకి అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం వరించింది. 2019 ఏడాదికి గానూ ఆర్థిక నోబెల్ పురస్కారాన్ని ముగ్గురికి ప్రకటించారు. అభిజిత్, ఆయన భార్య ఎస్తర్ డఫ్లో, మరో అమెరికన్ ఆర్థికవేత్త మైకేల్ క్రెమెర్‌లను సంయుక్తంగా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ అక్టోబర్ 14న ప్రకటించింది. ఈ పురస్కారం కింద ఇచ్చే తొమ్మిది లక్షల 18 వేల అమెరికా డాలర్ల నగదును ముగ్గురు ఆర్థికవేత్తలు సమానంగా పంచుకుంటారని తెలిపింది. ఈ ముగ్గురు ఆర్థికవేత్తలు చేసిన పరిశోధనలు, ప్రతిపాదనలతో ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని సమర్థమంతంగా ఎదుర్కొంటున్నామని కొనియాడింది.
అభిజిత్ బెనర్జీ
పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆర్థికవేత్తలు ప్రొఫెసర్ నిర్మల, దీపక్ బెనర్జీలకు కోల్‌కతాలో 1961లో అభిజిత్ బెనర్జీ జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అంతా భారత్‌లోనే సాగింది. కోల్‌కతా ప్రెసిడెన్సీ కాలేజీలో డిగ్రీ చేశారు. 1988లో అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. 2003లో ఎస్తర్ డఫ్లోతో కలిసి అబ్దుల్ లతీఫ్ జమీల్ పోవర్టీ యాక్షన్ ల్యాబ్ (జే-పాల్)ను స్థాపించారు. ప్రస్తుతం ప్రతిష్టాత్మక మాసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో ఆర్థికశాస్త్రంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 2015 తర్వాత అభివృద్ధి ఎజెండా అనే అంశంలో ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన హైలెవల్ ప్యానెల్ ఆఫ్ ఎమినెంట్ పర్సన్స్ లో కూడా అభిజిత్ పనిచేశారు.
ఎస్తర్ డఫ్లో
ఫ్రాన్స్ కు చెందిన ఎస్తర్ డఫ్లో ఎంఐటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. విద్య, ఆరోగ్యం, ఆర్థికం, పర్యావరణం, పరిపాలన వంటి పలు రంగాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఎంఐటీలో ప్రొఫెసర్‌గా ఉన్న ఆమె ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని పొందిన రెండో మహిళగా నిలిచారు. పురస్కారం పొందిన మరో ఆర్థికవేత్త 54 ఏళ్ల వయసున్న క్రెమర్ హార్వర్డ్ వర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు.

సచిన్‌కు స్వచ్ఛతా రాయబారి అవార్డు
Current Affairs క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ‘అత్యంత ప్రభావశీల స్వచ్ఛతా రాయబారి’ అవార్డు లభించింది. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా సచిన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచడంతోపాటు స్వచ్ఛతా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నందుకుగాను సచిన్‌కు ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్యంత ప్రభావశీల స్వచ్ఛతా రాయబారి అవార్డు
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : సచిన్ టెండూల్కర్
ఎందుకు : స్వచ్ఛతా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నందుకుగాను

వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్
వెద్యరంగంలో అందించిన విశిష్ట సేవలకు గానూ ముగ్గురు వైద్యులకు నోబెల్ బహుమతి లభించింది. అమెరికాకు చెందిన డాక్టర్ విలియమ్ జీ కెలీన్ జూనియర్(హార్వర్డ్ యూనివర్సిటీ), డాక్టర్ గ్రెగ్ ఎల్ సెమెన్జా(హాప్కిన్స్ యూనివర్సిటీ), బ్రిటన్‌కు చెందిన డాక్టర్ పీటర్ జే రాట్‌క్లిఫ్(ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్)లు నోబెల్ పురస్కారం-2019కు ఎంపికయ్యారు. వీరు ముగ్గురికి సంయుక్తంగా పురస్కారాన్ని అందజేయనున్నట్లు నోబెల్ కమిటీ అక్టోబర్ 7న ప్రకటించింది. ఈ ముగ్గురు ప్రైజ్‌మనీ అయిన 9.18 (రూ. 6.51 కోట్లు)లక్షల అమెరికన్ డాలర్లను సమంగా పంచుకుంటారు.
శరీరంలోని కణాలు శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలను ఎలా గుర్తిస్తాయో, ఆ స్థాయిలకు అనుగుణంగా తమ పనితీరును ఎలా మార్చుకుంటాయో అనే విషయం(హైపోక్సియా)పై ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. రక్తహీనత, కేన్సర్ తదితర వ్యాధుల చికిత్సలో ఈ పరిశోధనలు ఉపయోగపడతాయి. ఆక్సిజన్‌ను గ్రహించే విధానంలో మార్పు కలగజేసే ఔషధాల రూపకల్పన ద్వారా పలు వ్యాధులకు చికిత్స విధానాన్ని వీరు రూపొందించారు.
2018 సంవత్సరానికి గానూ అమెరికా సైంటిస్ట్ జేమ్స్ ఆలిసన్, జపాన్ శాస్త్రవేత్త తసుకు హోంజోలకు వైద్య శాస్త్ర నోబెల్ లభించింది. డైనమైట్‌ను రూపొందించిన ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్‌ఫ్రెడ్ నోబెల్ పేరున ఇచ్చే ఈ పురస్కారాలను, ప్రతీ సంవత్సరం ఆయన వర్థంతి రోజైన డిసెంబర్ 10న ప్రదానం చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వైద్యరంగంలో నోబెల్ పురస్కారం-2019 విజేతలు
ఎప్పుడు : అక్టోబర్ 7
ఎవరు : డాక్టర్ విలియమ్ జీ కెలీన్ జూనియర్, డాక్టర్ గ్రెగ్ ఎల్ సెమెనా, డాక్టర్ పీటర్ జే రాట్‌క్లిఫ్
ఎందుకు : శరీరంలోని కణాలు-ఆక్సిజన్ అనే విషయంపై పరిశోధనలు చేసినందుకు

ముగ్గురు పరిశోధకులకు భౌతిక శాస్త్ర నోబెల్
ముగ్గురు అంతరిక్ష పరిశోధకులు.. కెనడియెన్ అమెరికన్ జేమ్స్ పీబుల్స్, స్విట్జర్లాండ్‌కు చెందిన మైఖేల్ మేయర్, డిడియర్ క్యులోజ్‌లకు 2019 సంవత్సరానికి భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతి లభించింది. మొత్తం బహుమతిలో(9.14 లక్షల అమెరికన్ డాలర్లు) సగ భాగాన్ని పీబుల్స్... మిగిలిన సగాన్ని మేయర్, క్యులోజ్ సంయుక్తంగా గెల్చుకున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ అక్టోబర్ 8న ప్రకటించింది. ఈ ముగ్గురి పరిశోధనలు విశ్వంపై మన అవగాహనను మరింత పెంచాయని పేర్కొంది.
బిగ్ బ్యాంగ్ అనంతరం విశ్వం ఎలా రూపాంతీకరణ చెందినదనే విషయంపై జేమ్స్ పీబుల్స్ పరిశోధనలు చేశారు. విశ్వంలో మనకు తెలిసిన గ్రహాలు, నక్షత్రాలు, ఇతర వివరాలు కేవలం 5 శాతమేనని, మిగతా 95 శాతం మనకు తెలియని కృష్ణ పదార్థం(డార్క్ మాటర్), దాని శక్తేనని పీబుల్స్ పరిశోధనల వెల్లైడె ందని రాయల్ స్వీడిష్ అకాడమీ పేర్కొంది. ప్రిన్స్ టన్ యూనివర్సిటీలో సైన్స్ బోధిస్తున్న పీబుల్.. ఎంతో ఆసక్తి ఉంటే తప్ప సైన్స్ వైపు రావద్దని విద్యార్థులకు సూచించారు.
యూనివర్సిటీ ఆఫ్ జెనీవాలో ప్రొఫెసర్లుగా ఉన్న మేయర్(77), క్యులోజ్(53)లు 1995 అక్టోబర్‌లో తొలిసారి మన గ్రహ వ్యవస్థకు ఆవల, సూర్యుని తరహా నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న ఓ గ్రహాన్ని గుర్తించారు. సూర్యుడి నుంచి 50 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహాన్ని ఫ్రాన్స్ లోని అబ్జర్వేటరీ నుంచి గుర్తించారు. గురు గ్రహ పరిమాణంలో ఉన్న ఈ గ్రహానికి ‘51 పెగాసస్ బీ’ అని నామకరణం చేశారు.

రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్
రసాయన శాస్త్రంలో విశేష సేవలందించిన ముగ్గురు శాస్త్రవేత్తలను నోబెల్ పురస్కారం-2019 వరించింది. జర్మనీకి చెందిన జాన్ బి.గుడెనఫ్, బ్రిటిష్-అమెరికన్ అయిన ఎం.స్టాన్లీ విట్టింగమ్, జపాన్‌కు చెందిన అకిరా యోషినోకు సంయుక్తంగా ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ అక్టోబర్ 9న ప్రకటించింది. లిథియం ఆయాన్ బ్యాటరీ అభివృద్ధికి చేసిన విశేష పరిశోధనలకుగాను ఈ ముగ్గురికి నోబెల్ బహుమతి దక్కింది. పురస్కారం పొందిన జాన్ గుడెనఫ్ ప్రస్తుత వయసు 97 సంవత్సరాలు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం-2019 విజేతలు
ఎప్పుడు : అక్టోబర్ 9
ఎవరు : జాన్ బి.గుడెనఫ్, ఎం.స్టాన్లీ విట్టింగమ్, అకిరా యోషినో
ఎందుకు : లిథియం ఆయాన్ బ్యాటరీ అభివృద్ధికి చేసిన విశేష పరిశోధనలకుగాను
Published date : 30 Oct 2019 06:09PM

Photo Stories