Skip to main content

Pralay Missile : ‘ప్రళయ్‌’ తొలి పరీక్ష విజయవంతం

దేశీయంగా తయారుచేసిన బాలిస్టిక్‌ క్షిపణి ‘ప్రళయ్‌’ తొలి పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ ద్వీపంలో దీనిని పరీక్షించినట్లు క్షిపణి తయారీ సంస్థ అయిన రక్షణ, పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) డిసెంబర్‌ 22వ తేదీన వెల్లడించింది.
Pralay Ballistic Missile
Pralay Ballistic Missile

భూమి మీది లక్ష్యాలను చేధించేందుకు భూమి మీద నుంచి ప్రయోగించేలా ప్రళయ్‌ క్షిపణిని తయారుచేశారు. ‘ప్రయోగించగానే క్షిపణి ఖచ్చితంగా ముందుగా అనుకున్న పథంలోనే దూసుకెళ్లి నిర్ధేశించిన లక్ష్యాన్ని విజయవంతంగా చేధించింది’ అని డీఆర్‌డీవో పేర్కొంది. అక్కడి తూర్పు తీరం వెంట అమర్చిన సెన్సార్లు.. క్షిపణి పనితీరును నమోదుచేశాయని, మిస్సైల్‌ అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసిందని సంస్థ వివరించింది. 150 కి.మీ.ల నుంచి 500 కి.మీ.ల సుదూర లక్ష్యాలను విచ్ఛిన్నం చేసేందుకు ‘పృథ్వీ’ తరహాలో అత్యాధునిక నావిగేషన్, ఏవియానిక్స్‌ సాంకేతికతల సమ్మేళనంగా ఈ కొత్త క్షిపణిని అభివృద్ధిచేసినట్లు డీఆర్‌డీఓ వెల్లడించింది. నూతన ‘సర్ఫేస్‌–టు–సర్ఫేస్‌’ మిస్సైల్‌ను తయారుచేసి విజయవంతంగా పరీక్షించిన డీఆర్‌డీవో, అనుబంధ విభాగాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ అభినందించారు. దేశ సాయుధ బలగాల సామర్థ్యాన్ని కొత్త క్షిపణి మరింత శక్తివంతం చేస్తుందని డీఆర్‌డీఓ చైర్మన్‌ డాక్టర్‌ జి. సతీశ్‌ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు.

Published date : 23 Dec 2021 04:15PM

Photo Stories