భూమి దీర్ఘవృత్తంగా ఉండును!
భూమి గుండ్రంగా ఉండును. ఇది చిన్నప్పటి నుంచీ మనమంతా వింటున్నదే. నిజానికి పూర్తిగా గుండ్రంగా కాకుండా ఓ మాదిరి దీర్ఘవృత్తాకారంలో ఉందట. అసలు ఆ మాటకొస్తే భూమి ఇంకా పూర్తి రూపాన్ని సంతరించుకునే క్రమంలోనే ఉందట. దీర్ఘవృత్తాకారం రావడానికి కారణమైన గురుత్వాకర్షణ శక్తే భూమికి ఓ నిశ్చిత రూపాన్నిచ్చే పనిలో మునిగి ఉందని సైంటిస్టులు చెబుతుండటం విశేషం! భూమిపై నుంచి అంతరిక్షంలోకి జారిపోకుండా మనల్ని కాపాడుతున్నది, భూమిపై పట్టి ఉంచుతున్నది గురుత్వాకర్షణ శక్తేనన్నది తెలిసిందే. భూమికి ఆ శక్తే భూమిని లోలోపలి నుంచి సమ్మెట పోట్లను తలపించేలా ఒత్తిడి చేసీ చేసీ దీర్ఘవృత్తాకారానికి తీసుకొచ్చిందట. భూమి కేంద్రానికి, ఉపరితలానికి మధ్య దూరం భూమధ్యరేఖ వద్ద ఒకలా, ధ్రువాల వద్ద ఇంకోలా ఉండటానికి ఈ దీర్ఘవృత్తాకారమే కారణమట. భూమి రూపాన్ని తీర్చిదిద్దే ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉందని తాజాగా కనిపెట్టామంటున్నారు అంతరిక్ష శాస్త్రవేత్తలు. భూమి ఆకారాన్ని నిర్దేశించడంలో గురుత్వాకర్షణ శక్తితో పాటు ఎగుడుదిగుడు ఉపరితలం, లోపలి పొరల్లో ఉన్న వనరుల అసమతుల విస్తృత వంటి పలు ఇతర కారకాల ప్రమేయమూ ఉందని పరిశోధన తేల్చింది. ఒకప్పుడు భూమిపై 30 కిలోమీటర్ల పై చిలుకు ఎత్తు దాకా ఉన్న పర్వతాలు గురుత్వాకర్షణ శక్తి వల్లే క్రమంగా తగ్గుతూ వచ్చాయట. భూమిపై ఉన్న విభిన్న స్థలాకృతులు, పై పొరల కదలికలు తదితరాలు కూడా ఇందుకు కారణమయ్యాయని తేలింది. భూమి ఎలా ఏర్పడిందో అర్థం చేసుకునే ప్రయత్నానికి ఈ తాజా ఆవిష్కరణలు కొత్త కోణాలను అందిస్తున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు.
Also read: ఆక్సిజన్ ‘స్థాయి’లో మార్పును బట్టి గ్రహాలపై జీవం గుట్టు పట్టేయొచ్చు
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP