Skip to main content

ఫిబ్రవరి 2019 రాష్ట్రీయం

విశాఖలో వరల్డ్ ఓషన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం
Current Affairs ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో రెండో వరల్డ్ ఓషన్ సైన్స్ కాంగ్రెస్ 2019 సదస్సును ఫిబ్రవరి 25న ఫ్రారంభించనున్నారు. ఫిబ్రవరి 27 వరకు జరిగే ఈ సదస్సులో వాతావరణ మార్పుల్లో సముద్రాలు, తీరప్రాంత నివాసాలు-సుస్థిరత,తదితర అంశాలపై చర్చించనున్నారు. విజ్ఞాన భారతి (న్యూఢిల్లీ), భారతీయ విజ్ఞాన మండలి (ఏపీ) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకి 20 దేశాల నుంచి నిపుణులు, వెయి్యమంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రత్యేకంగా నిర్వహించే స్టూడెంట్స్ కాన్‌క్లేవ్‌లో పాఠశాల, కళాశాలలకు చెందిన 300 మంది విద్యార్థులు పాల్గొననున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వరల్డ్ ఓషన్ సైన్స్ కాంగ్రెస్ 2019 ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్

తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావుగౌడ్
తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా సికింద్రాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉప సభాపతి ఎన్నికలో భాగంగా ఫిబ్రవరి 23న నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసే సమయానికి పద్మారావుగౌడ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఫిబ్రవరి 25న అసెంబ్లీలో ప్రకటన చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : పద్మారావుగౌడ్

విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వే (ఎస్‌సీఓఆర్)’ పేరుతో కొత్త రైల్వే జోన్ ఏర్పాటుచేయనున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఫిబ్రవరి 27న వెల్లడించారు. దీంతో దేశంలో రైల్వే జోన్‌ల సంఖ్య 18కి చేరనుంది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో కలిపి కొత్త జోన్‌ను ఏర్పాటుచేయనున్నారు.
కొత్త జోన్ ఏర్పాటులో భాగంగా వాల్తేరు డివిజన్‌ను రెండు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని (ఏపీ పరిధిలోది) విజయవాడ డివిజన్‌లో విలీనం చేయనున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు. వాల్తేరు డివిజన్‌లోని మిగిలిన భాగాన్ని (ఒడిశా ప్రాంతంలోది) రాయగడ కేంద్రంగా నూతన డివిజన్‌గా ఏర్పాటుచేయనున్నట్లు వివరించారు. ఇది తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలో ఉంటుందని పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ డివిజన్లతో కూడుకుని ఉంటుందని ప్రకటించారు.
ఇప్పటివరకు 17 రైల్వే జోన్లు..
దేశంలో ఇప్పటివరకు 17 రైల్వే జోన్లు ఉన్నాయి. రైల్వే డివిజన్ల విసృ్తతి, పరిమాణం, పనిభారం, అవకాశం, ట్రాఫిక్, పాలన అవసరాల అధారంగా రైల్వే జోన్లు ఏర్పాటు చేశారు. చివరిగా 2003-04లో రైల్వే జోన్లను పునర్ వ్యవస్థీకరించారు.
.మ. రైల్వేలో ఆరు డివిజన్లు...
సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో 6 డివిజన్లు ఉన్నాయి. సికింద్రాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు ఉన్నాయి. వీటిలో విజయవాడ, గుంతకల్లు, గుంటూరు తాజాగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి వెళతాయి. కొత్త రైల్వే జోన్ పరిధిలో జోనల్ స్థాయి రైల్వే ఆసుపత్రి, ఆరోగ్య కేంద్రాలు, రైల్వే పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటయ్యే అవకాశం ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దక్షిణ కోస్తా రైల్వే (ఎస్‌సీఓఆర్) పేరుతో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 27
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్

బౌరాపూర్ భ్రమరాంబ జాతరకు ప్రభుత్వ గుర్తింపు
తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో చెంచు తెగలు ఏటా నిర్వహించే బౌరాపూర్ భ్రమరాంబ జాతరకు ఫిబ్రవరి 27న రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. ఈ మేరకు ఏటా నిర్వహించే ఈ జాతరకు ప్రభుత్వమే నిధులిచ్చి నిర్వహించనుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ తెలిపింది. శివరాత్రి సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం బౌరాపూర్‌లో ఈ జాతర నిర్వహిస్తారు. ఈ గ్రామం నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది. మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరలో చెంచుల సాంప్రదాయాల ప్రకారం ఉత్సవాలను నిర్వహిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బౌరాపూర్ భ్రమరాంబ జాతరకు ప్రభుత్వ గుర్తింపు
ఎప్పుడు : ఫిబ్రవరి 27
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : బౌరాపూర్ గ్రామం, లింగాల మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా, తెలంగాణ

భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన
Current Affairs ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బలపాలెం వద్ద నిర్మించే భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫిబ్రవరి 14న శంకుస్థాపన చేశారు. గురజాడ యూనివర్శిటీ, డిగ్రీ కళాశాల, పతంజలి ఆల్ట్రా మెగాఫుడ్ పార్క్, చందన ఇంటిగ్రేటింగ్ ఫుడ్‌పార్క్, ఆరోగ్య మిల్లెట్స్ ప్రాసెసింగ్ కేంద్రానికి కూడా ఇదే వేదిక నుంచి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఎయిర్‌పోర్ట్ నిర్మాణం మూడేళ్లలో పూర్తవుతుందని, ఎయిర్ పోర్టుకు అసైన్‌‌డ భూములిచ్చిన వారికి పరిహారం ఇస్తామని చెప్పారు. ఇచ్చాపురం నుంచి భోగాపురం మీదుగా విశాఖపట్నం వరకూ బీచ్ రోడ్డు ఏర్పాటు చేస్తామని, పేదల పెళ్లికి రూ. 35 వేలు ఇస్తామని ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబునాయడు
ఎక్కడ : దిబ్బలపాలెం, భోగాపురం మండలం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్

విశాఖపట్నంలో డేటా సెంటర్‌కు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం భీమిలి మండలం కాపులుప్పాడ వద్ద అదాని గ్రూప్ నిర్మించనున్న డేటా సెంటర్ అండ్ టెక్నాలజీ పార్కుకు సీఎం చంద్రబాబునాయుడు ఫిబ్రవరి 14న శంకుస్థాపన చేశారు. రుషికొండ వద్ద నూతనంగా నిర్మించిన మిలీనియం టవర్స్‌ను కూడా ప్రారంభించారు. మరోవైపు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. టాటా మెమోరియల్ ట్రస్ట్ భాగస్వామ్యంతో రూ.600 కోట్లతో రాష్ట్రంలో 10 ఆస్పత్రుల నిర్మాణాన్ని చేపట్టినట్లు ఈ సందర్భంగా సీఎం తెలిపారు. బసవతారకం ట్రస్ట్ చైర్మన్, ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ తొలిదశలో భాగంగా 18 నెలల్లో 300 పడకలతో ఆస్పత్రిని పూర్తి చేస్తామని వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విశాఖపట్నంలో డేటా సెంటర్‌కు శంకుస్థాపన
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
ఎక్కడ : కాపులుప్పాడ, భీమిలి మండలం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్

దేశంలో మూడో ఎత్తై జాతీయ పతాకావిష్కరణ
కర్ణాటక, హైదరాబాద్‌లో సంజీవయ్య పార్కులోని జాతీయ పతాకాల తరువాత అత్యంత ఎత్తైన జాతీయ పతకాన్ని తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌లోని పురాతన ఉన్నత పాఠశాల మైదానంలో ఆవిష్కరించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 150 ఫీట్ల ఎత్తులో 32 అడుగుల పొడవు, 48 అడుగుల వెడల్పుతో ఏర్పాటుచేసిన జాతీయ పతాకాన్ని ఎంపీ వినోద్ కుమార్ ఫిబ్రవరి 15న ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో మూడో ఎత్తై జాతీయ పతాకావిష్కరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : ఎంపీ వినోద్ కుమార్
ఎక్కడ : ఉన్నత పాఠశాల, కరీంనగర్, తెలంగాణ

తెలంగాణలో రెండు కొత్త జిల్లాల ఏర్పాటు
తెలంగాణలో కొత్తగా ములుగు, నారయణపేట జిల్లాలను ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 16న ఉత్తర్వులు జారీ చే సింది. దీంతో రాష్ట్ర భౌగోళిక స్వరూపం 33 జిల్లాలుగా విడిపోయింది. తెలంగాణ జిల్లాల (ఏర్పాటు) చట్టం 1974, సెక్షన్ 3 ప్రకారం ఫిబ్రవరి 17 నుంచి ఈ జిల్లాలు మనుగడలోకి వ స్తాయని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ పేర్కొన్నారు. ములుగు జిల్లాలో 9 మండలాలు, 336 గ్రామాలుండగా... 11 మండలాలు, 246 గ్రామాలతో నారాయణపేట జిల్లా ఏర్పడింది.
కొత్తగా ఏర్పాటైన ములుగు జిల్లాలో ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపురం, వాజేడు మండలాలు ఉన్నాయి. అలాగే నారాయణపేట జిల్లాలో నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోస్గి, మద్దూర్, ఉట్కూరు, నర్వ, మక్తల్, మాగనూరు, కృష్ణ మండలాలు ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణలో కొత్తగా ములుగు, నారయణపేట జిల్లాల ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం

కొలువుదీరిన తెలంగాణ కొత్త మంత్రివర్గం
తెలంగాణలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం రాజ్‌భవన్‌లో సందడిగా జరిగింది. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఫిబ్రవరి 19 ఉదయం 11.30 గంటలకు పది మందితో ప్రమాణస్వీకారం చేయించారు.
శాఖల కేటాయింపు:
కె.చంద్రశేఖర్‌రావు: ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, మంత్రులకు కేటాయించని శాఖలు
మహమ్మద్ మహమూద్ అలీ: హోం, జైళ్లు, అగ్నిమాపక.
అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి: అటవీ,పర్యావరణం, శాస్త్ర, సాంకేతిక,దేవాదాయ, న్యాయ.
తలసాని శ్రీనివాస్‌యాదవ్: పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమ అభి వృద్ధి, సినిమాటోగ్రఫి.
గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి: విద్య
ఈటల రాజేందర్: వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం.
సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి: వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు.
కొప్పుల ఈశ్వర్: ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమం, బీసీ సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, వికలాంగుల సంక్షేమం, వయో వృద్ధుల సంక్షేమం.
ఎర్రబెల్లి దయాకర్‌రావు: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా.
వి.శ్రీనివాస్‌గౌడ్: ప్రొహిబిషన్, ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటకం, సాంస్కృతిక, పురావస్తు.
వేముల ప్రశాంత్ రెడ్డి: రవాణా, రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణం, శాసనసభ వ్యవహారాలు.
చామకూర మల్లారెడ్డి: కార్మిక, ఉపాధి, ఫ్యాక్టరీలు, మహిళా-శిశు సంక్షేమం, నైపుణ్య అభివృద్ధి
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
ఏప్పుడు : ఫిబ్రవరి 19
ఎక్కడ : తెలంగాణ

గ్లోబల్ ఆర్ అండ్ డీ సమ్మిట్- 2019 ప్రారంభం
అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన, అభివృద్ధిలో పరస్పర సహకారం అందించుకునేందుకు హైదరాబాద్ వేదికగా గ్లోబల్ ఆర్ అండ్ డీ సమ్మిట్-2019ను నిర్వహించనున్నట్లు ఫిబ్రవరి 20న తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ, ఫిక్కీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 21, 22 తేదీల్లో హైదరాబాద్‌లోని మారియట్ హోటల్‌లో ఈ సదస్సును నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందులో భారత్, ఆఫ్రికా దేశాల మధ్య శాస్త్రసాంకేతిక రంగాల్లో పరిశోధన, ఇరు దేశాల అభివృద్ధి సహకారంపై చర్చించనున్నన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్లోబల్ ఆర్ అండ్ డీ సమ్మిట్-2019
ఎప్పుడు : ఫిబ్రవరి 21, 22 తేదీల్లో
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన, అభివృద్ధిలో పరస్పర సహకారం అందించుకునేందుకు..

ఏపీ శాసనమండలి కొత్త చైర్మన్‌గా షరీఫ్
Current Affairs
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి కొత్త చైర్మన్‌గా మహ్మద్ అహ్మద్ షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఫిబ్రవరి 7న ప్రకటించారు. చైర్మన్ ఎన్నికకు అహ్మద్ షరీఫ్ ఒక్కరే నామినేషన్ వేశారని, అందువల్ల ఆయనను ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు ప్రకటిస్తున్నానని చెప్పారు. ఇప్పటివరకు శాసన మండలిలో ప్రభుత్వ విప్‌గా షరీఫ్ కొనసాగారు. మండలి చైర్మన్‌గా కొనసాగిన ఎన్‌ఎండీ ఫరూక్ 2018, నవంబరులో మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఇన్నాళ్లు ఆ పదవి ఖాళీగా ఉంది.
1955, జనవరి 1న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో షరీఫ్ జన్మించారు. ఎంకామ్, ఎల్‌ఎల్‌బీ చేసిన ఆయన 1982లో టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నారు. నరసాపురం పట్టణ పార్టీ అధ్యక్షుడిగా, జిల్లా పార్టీ కార్యదర్శిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. 2015 నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. 2017 నుంచి శాసనమండలి ప్రభుత్వ విప్‌గా కొనసాగారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి కొత్త చైర్మన్ ఎన్నిక
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : మహ్మద్ అహ్మద్ షరీఫ్

మచిలీపట్నం ఓడరేవు పనులకు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో మచిలీపట్నం ఓడరేవు పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫిబ్రవరి 7న శంకుస్థాపన చేయడంతోపాటు పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఓడరేవు రాకతో రైల్వేలైను, విమానాశ్రయం, పరిశ్రమలు తరలివస్తాయని అన్నారు. తొలి విడతలో భాగంగా పోర్టును 40 లక్షల కార్గో సామర్థ్యంతో అందుబాటులోకి తెస్తామని, తర్వాత ఏటా లక్షన్నర సామర్థ్యాన్ని పెంచుతామని వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మచిలీపట్నం ఓడరేవు పనులకు శంకుస్థాపన
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
ఎక్కడ : మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్

కాపు రిజర్వేషన్ల బిల్లుకు ఏపీ శాసనమండలి ఆమోదం
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లోని (ఈడబ్ల్యూఎస్) కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు విద్యా, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఫిబ్రవరి 8న ఆమోదం తెలిపింది. అలాగే కాపులు కాకుండా ఆర్థికంగా వెనుకబడిన ఇతర కులాలకు మరో అయిదు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును, ద్రవ్యవినిమయ బిల్లులను కూడా శాసనమండలి ఆమోదించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాపు రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్

విశాఖలో వశిష్ట డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఎస్-1 వశిష్ట డెవలప్‌మెంట్ ప్రాజెక్టు, ్ట్రాటజిక్ క్రూడ్ ఆయిల్ స్టోరేజీ ఫెసిలిటీ ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 10న ప్రారంభించారు. నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నంలోని కోస్టల్ ఇన్‌స్టలేషన్‌కు కూడా మోదీ శంకుస్థాపన చేశారు. గుంటూరులో ఫిబ్రవరి 10న భాజపా ఏర్పాటుచేసిన ‘ప్రజా చైతన్య సభ’లో పాల్గొనేందుకు ముందు రిమోట్ ద్వారా ఈ కార్యక్రమాలను నిర్వహించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎస్-1 వశిష్ట డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్

ద్వారకా తిరుమల ఆలయానికి ఐఎస్‌వో గుర్తింపు
ఆంధ్రప్రదేశ్‌లో పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల క్షేత్రంలో శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానానికి ఐఎస్‌వో (ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్) గుర్తింపు లభించింది. ఈ మేరకు ఫిబ్రవరి 11న గుర్తింపు ధ్రువపత్రాన్ని ఆలయ అధికారులకు ఐఎస్‌వో అందజేసింది. కార్యనిర్వహణ విధానం, భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పన తదితర అంశాల్లో ఉత్తమ ప్రమాణాలు పాటిస్తున్నందుకు ఆలయానికి ఐఎస్‌వో గుర్తింపు దక్కింది. రాష్ట్రంలో శ్రీశైలం దేవస్థానం గతంలో ఈ ధ్రువపత్రాన్ని అందుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ద్వారకా తిరుమల ఆలయానికి ఐఎస్‌వో గుర్తింపు
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎక్కడ : ద్వారకాతిరుమల క్షేత్రం, పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్

విశాఖలో ప్రపంచ సముద్ర సైన్స్ కాంగ్రెస్

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఫిబ్రవరి 25 నుంచి ప్రపంచ సముద్ర శాస్త్ర సదస్సు (ఓషన్ సైన్స్ కాంగ్రెస్)ను నిర్వహించనున్నారు. మూడురోజుల పాటు జరిగే ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన 1,500 మంది సముద్ర అధ్యయన/విజ్ఞాన శాస్త్రవేత్తలు, రక్షణరంగ నిపుణులు, జియో సైంటిస్టులు, ఆర్కియాలజిస్టులు, మెట్రాలజిస్టులతో పాటు రీసెర్చి స్కాలర్లు, విద్యార్థులు పాల్గొననున్నారు. సముద్రంలో వాతావరణ మార్పులు, సముద్రం-సమాజం, మారిటైం లా, జియోపాలిటిక్స్, మారిటైం హిస్టరీ, ఆర్కియాలజీ, కోస్టల్ టూరిజం, షిప్పింగ్, ఫిషరీ, ఆక్వాకల్చర్ తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ సముద్ర శాస్త్ర సదస్సు (ఓషన్ సైన్స్ కాంగ్రెస్)
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్‌లో వెకా ప్లాంట్ ప్రారంభం
యూపీవీసీ ఉత్పత్తుల తయారీ సంస్థ ఎన్‌సీఎల్ వెకా హైదరాబాద్ శివారులో ప్లాంట్‌ను ప్రారంభించింది. మెదక్ జిల్లా ముచ్చెర్లలో ఏర్పాటుచేసిన ఈ ప్లాంట్‌ను తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఫిబ్రవరి 13న ప్రారంభించారు. 16.8 ఎకరాల్లో రూ.50 కోట్ల పెట్టుబడులతో నెలకొల్పలిన ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 24 వేల టన్నుల ప్రొఫైల్స్ అని ఎన్‌సీఎల్ వెకా సీఈఓ అశ్విన్ దాట్ల తెలిపారు. ఈ ఉత్పత్తులను మన దేశంతో పాటూ మధ్య ప్రాచ్య, ఆఫ్రికా (ఎంఈఏ) మార్కెట్లలో సరఫరా చేస్తామని పేర్కొన్నారు. ఎన్‌సీఎల్ వెకా కంపెనీ హైదరాబాద్‌కు చెందిన ఎన్‌సీఎల్ గ్రూప్, జర్మనీకి చెందిన వెకా జాయింట్ వెంచర్.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌సీఎల్ వెకా ప్లాంట్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్
ఎక్కడ : ముచ్చెర్ల, మెదక్ జిల్లా, తెలంగాణ

ఏపీలో గిరి ఆహార పోషణ పథకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు పోషకాహారలోపాన్ని అధిగమించేందుకు ఉద్దేశించిన ‘గిరి ఆహార పోషణ’ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫిబ్రవరి 13న అమరావతిలో ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా 6రకాల పోషకాలు ఉండే రూ.532 విలువైన ఆహారబుట్టను ఒక్కో గిరిజన కుటుంబానికి 2019, మార్చి 1వ తేదీ నుంచి ప్రతి నెలా ఉచితంగా అందించనున్నారు. ఇందుకోసం 2018-19 బడ్జెట్‌లో మొత్తం రూ.120 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం బాలింతలు, చిన్నారులకు గిరి గోరుముద్దలు, అన్న అమృతహస్తం వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గిరి ఆహార పోషణ పథకం ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : గిరిజనులు పోషకాహారలోపాన్ని అధిగమించేందుకు

సంతోష నగరాల సదస్సు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మూడు రోజులపాటు నిర్వహించనున్న అంతర్జాతీయ సంతోష నగరాల సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫిబ్రవరి 13న ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఉన్నత ప్రమాణాలతో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని అన్నారు. మరోవైపు అమరావతి-2050’ పేరుతో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ సిటీస్ రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ సంతోష నగరాల సదస్సు
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్

ఏపీలో వైకుంఠపురం బ్యారేజీకి శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం వద్ద కృష్ణానదిపై నిర్మించతలపెట్టిన వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫిబ్రవరి 13నశంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ...ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు తొలి ప్రాజెక్టుగా ప్రకాశం బ్యారేజీ నిర్మాణానికి ఫిబ్రవరి 13, 1954న శంకుస్థాపన చేశారని, సరిగ్గా 65 ఏళ్ల తర్వాత అదేరోజు వైకుంఠపురం బ్యారేజీకి శంకుస్థాపన చేస్తున్నామని అన్నారు. ఈ బ్యారేజీ నిర్మాణానికి రూ.2,169 కోట్లు వెచ్చిస్తున్నామని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
ఎక్కడ : వైకుంఠపురం, అమరావతి, ఆంధ్రప్రదేశ్

అమరావతిలో వెంకటేశ్వరస్వామి ఆలయానికి భూకర్షణం
Current Affairs ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటాపురం)లో శ్రీవెంకటేశ్వరస్వామి నూతన ఆలయ నిర్మాణానికి భూకర్షణం, బీజావాపన కార్యక్రమం నిర్వహించారు. జనవరి 31న జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. దేవాలయానికి కేటాయించిన 25 ఎకరాల భూమిని ఉచితంగా, ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు తీసుకోకుండా ఇస్తున్నట్టు ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు. రెండున్నరేళ్లలో ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేయాలని ఆదేశించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : శ్రీవెంకటేశ్వరస్వామి నూతన ఆలయ నిర్మాణానికి భూకర్షణం
ఎప్పుడు : జనవరి 31
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబు నాయడు
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక హైకోర్టు భవనం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని నేలపాడులో నిర్మించిన ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక హైకోర్టు భవనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ ఫిబ్రవరి 3న ప్రారంభించారు. అలాగే శాశ్వత హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక హైకోర్టు భవనం ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 3
ఎవరు : సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్
ఎక్కడ : నేలపాడు, అమరావతి, ఆంధ్రప్రదేశ్

పొగాకు రహిత పర్యాటక ప్రాంతంగా తెలంగాణ
పొగాకు రహిత పర్యాటక ప్రాంతంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పర్యాటక ప్రాంతాలు, ప్రదేశాల్లో పొగాకు వాడకాన్ని నిషేధించాలని పర్యాటక శాఖ కమిషనర్ సునిత ఎం.భగవత్ ఫిబ్రవరి 2న ఆదేశాలు జారీ చేశారు. పర్యాటక ప్రదేశాల్ని పొగాకు రహితంగా మార్చాలంటూ వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (వీహెచ్‌ఏఐ), ఇండియన్ డెంటల్ అసోసియేషన్ (ఐడీఏ) కృషి చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పొగాకు రహిత పర్యాటక ప్రాంతంగా రాష్ట్రాంగ అభివృద్ధి
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : తెలంగాణ పర్యాటక శాఖ

నాణ్యమైన పట్టు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ
దేశంలో అత్యంత నాణ్యమైన పట్టు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. ఈ మేరకు తెలంగాణకు జాతీయ స్థాయి అవార్డు ప్రకటిస్తున్నట్లు కేంద్ర జౌళిశాఖ ఫిబ్రవరి 4న తెలిపింది. 2019, ఫిబ్రవరి 9న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగే కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేయనున్నారు. 2018లో దేశంలో అత్యధికంగా బైవోల్టిన్ (అత్యంత నాణ్యమైన) పట్టు గుడ్లను ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు రాష్ట్రంలో 3,176 ఎకరాలుగా ఉన్న మల్బరీసాగు గత నాలుగేళ్లలో 10,645 ఎకరాలకు విస్తరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో అత్యంత నాణ్యమైన పట్టు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎవరు : తెలంగాణ

తెలంగాణలో నాగోబా జాతర ప్రారంభం
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర ఫిబ్రవరి 4న ప్రారంభమైంది. ఏటా పుష్యమాసం అమావాస్య రోజున ప్రారంభమయ్యే నాగోబా జాతర ఆరురోజుల పాటు కొనసాగుతుంది. మెస్రం వంశీయులు వారు బస చేసిన మర్రిచెట్టు (వడమర) నుంచి పవిత్ర గంగాజలంతో నాగోబా ఆలయానికి చేరుకుని పూజలు చేయడంతో ఈ గిరిజన జాతర మొదలవుతుంది. ఈ జాతరలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాషా్ర్టలకు చెందిన గిరిజనులు పాల్గొంటారు. నాగోబా జాతరను రాష్ట్ర పండుగగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నాగోబా జాతర ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎక్కడ : కేస్లాపూర్, ఇంద్రవెల్లి మండలం, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ
Published date : 26 Feb 2019 01:28PM

Photo Stories