Skip to main content

నవంబర్ 2017 రాష్ట్రీయం

గోదావరి-కావేరీ నదుల అనుసంధానానికి ప్రణాళిక
గోదావరి మిగులు జలాల్ని కావేరీకి తరలించేందుకు ప్రణాళిక రూపకల్పన కోసం ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహిస్తామని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ నవంబర్ 23న చెప్పారు. మిగులు జలాల్ని గోదావరి నది నుంచి కృష్ణకు, అక్కడి నుంచి పెన్నా.. చివరకు కావేరీకి తరలించాలని జల వనరుల శాఖ నిర్ణయించిందని ఆయన వివరించారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించి, వారి అనుమతితో ప్రణాళికను ఖరారు చేస్తామని.. ఈ ప్రాజెక్టుల్ని జాతీయ ప్రాజెక్టులుగా పరిగణించి.. 90 శాతం ఖర్చు కేంద్ర ప్రభుత్వం, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయని తెలిపారు. అలాగే.. చెన్నై - బెంగళూరుల మధ్య రూ. 20 వేల కోట్లతో ఎక్స్‌ప్రెస్ వేను నిర్మిస్తామని ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గోదావరి-కావేరీ నదుల అనుసంధాన ప్రణాళిక కోసం ముఖ్యమంత్రులతో సమావేశ నిర్వహణ
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ
ఎందుకు : గోదావరి మిగులు జలాల్ని కావేరీకి తరలించేందుకు

పళని-పన్నీర్‌లకు ‘రెండాకుల’ గుర్తు కేటాయింపు
అన్నాడీఎంకే పార్టీ అధికారిక చిహ్నమైన ‘రెండాకుల గుర్తు’ను తమిళనాడు సీఎం ఎడపాటి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వంల వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నవంబర్ 23న నిర్ణయం తీసుకుంది. అన్నాడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తల్లో అత్యధికులు పళనికే మద్దతు ఇస్తున్నందున ఆ వర్గానికే గుర్తు కేటాయించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం తమిళనాడుతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రెండాకుల గుర్తును పళని వర్గానికి కేటాయిస్తున్నట్లు పేర్కొంది. రెండాకుల గుర్తు కోసం ఆ పార్టీ బహిష్కృత నేత శశికళ, దినకరన్ తీవ్రంగా పోరాడారు.
ఇది రెండోసారి..!
అన్నా డీఎంకే పార్టీ ఎన్నికల చిహ్నంగా రెండాకుల గుర్తును ఎన్నికల సంఘం (ఈసీ) పునరుద్ధరించడం ఇది రెండోసారి. ఒక పార్టీ ఎన్నికల చిహ్నాన్ని రెండుసార్లు నిలిపివేసి మళ్లీ కేటాయించడం ఏఐఏడీఎంకే విషయంలోనే జరిగింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పళనిస్వామి - పన్నీర్ సెల్వం వర్గానికి రెండాకుల గుర్తు
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : కేంద్ర ఎన్నికల సంఘం
ఎక్కడ : తమిళనాడు, పుదుచ్చేరి

కాళేశ్వరం ప్రాజెక్టుకు అటవీ అనుమతులు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర అటవీశాఖ స్టేజ్ - 2 అనుమతులు ఇచ్చింది. దీంతో.. అటవీ అనుమతుల ప్రక్రియ పూర్తయింది. ప్రాజెక్టులోని రిజర్వాయర్లు, పంపుహౌజ్‌లు, టన్నెళ్ల నిర్మాణానికి అవసరమైన అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా రెవెన్యూ భూముల బదలాయింపు.. ఆ భూముల్లో నిర్దేశించిన మేర తిరిగి మొక్కల పెంపకానికి సంబంధించి ప్రభుత్వం రూ.722.30 కోట్లు మంజూరు చేసిన అంశాన్ని పరిగణనలోకి తీసుకుంది. డిసెంబర్ నాటికి పర్యావరణ తుది అనుమతులు వచ్చే అవకాశముంది.
రాష్ట్రంలో నీటి ఎద్దడి ఉన్న జిల్లాల్లోని సుమారు 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇవ్వడంతోపాటు 18.82 లక్షల ఎకరాలను స్థిరీకరించేలా రూ.80,499.71 కోట్ల వ్యయ అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాళేశ్వరం ప్రాజెక్టుకు స్టేజ్ - 2 అటవీ అనుమతులు
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : కేంద్ర అటవీశాఖ

ఏపీలో సునామీ మెగా మాక్ డ్రిల్
సునామీల సమయంలో వ్యవహరించాల్సిన తీరుపై ఆంధ్రప్రదేశ్‌లోని తొమ్మిది కోస్తా జిల్లాల్లో నవంబర్ 24న మెగా మాక్ డ్రిల్ నిర్వహించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామంలోని ఎన్‌డీఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో జాతీయ విపత్తుల శాఖ, రాష్ట్ర విపత్తుల శాఖ, ఇన్కొయిస్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. సునామీ వస్తున్నట్టుగా ఇన్కొయిస్ ప్రమాద హెచ్చరికలు జారీ చేయగా, రాష్ట్ర విపత్తుల శాఖ జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేస్తూ 9 కోస్తా జిల్లాల్లో ఎంపిక చేసిన ఒక్కో గ్రామంలో మాక్ ఎక్సర్‌సైజ్ చేపట్టారు.
కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈ మెగా మాక్ డ్రిల్ జరిగింది.

అవయవదానంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్
అవయవదానంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అవయవాల సేకరణ, అవగాహన, శిక్షణ, సాఫ్ట్‌వేర్ నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఇందుకు గుర్తింపుగా నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్‌‌సప్లాంటేషన్ ఆర్గనైజేషన్ (ఎన్‌వోటీటీవో) ఈ అవార్డును ప్రకటించింది. నవంబర్ 27న ‘నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే’ సందర్భంగా ప్రభుత్వం తరఫున జీవన్‌ధాన్ ఇన్‌చార్జి డాక్టర్ స్వర్ణలత ఢిల్లీలో ఈ అవార్డు అందుకున్నారు.
తమిళనాడును దాటేసి..
తమిళనాడు జనాభా 8 కోట్లు కాగా.. తెలంగాణ జనాభా 3.5 కోట్లు. తమిళనాడులో గత 11 ఏళ్లలో 5,367 అవయవాలను సేకరించి దేశంలోనే తొలి స్థానంలో ఉంది. తెలంగాణలోని నిమ్స్ జీవన్‌దాన్ ఆధ్వర్యంలో 2013 నుంచి 2017 అక్టోబర్ వరకు 414 మంది దాతల నుంచి 1,675 అవయవాలను సేకరించారు. గతేడాది వరకు రెండోస్థానంలో ఉన్న తెలంగాణ ఈసారి తొలిస్థానంలో నిలిచింది. కేరళ ఇప్పటివరకు 701 అవయవాలు సేకరించి మూడోస్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అవయవదానంలో దేశంలోనే నంబర్ వన్‌గా తెలంగాణ రాష్ట్రం
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్‌‌సప్లాంటేషన్ ఆర్గనైజేషన్

మధ్యప్రదేశ్‌లో చిన్నారులపై రేప్‌కు మరణశిక్ష
మధ్యప్రదేశ్‌లో ఇటీవల అత్యాచార ఘటనలు పెరిగిపోతుండటంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 12 ఏళ్లు అంతకన్నా తక్కువ వయసున్న బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణశిక్ష విధించేలా చట్టం రూపకల్పనకు అంగీకరించింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలో నవంబర్ 26న సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చిన్నారులపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణశిక్ష
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : మధ్యప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : మధ్యప్రదేశ్‌లో

హైదరాబాద్‌లో అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు
భారత్‌లో తొలిసారిగా జరుగుతున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు 2017 నవంబర్ 28న హైదరాబాద్‌లో ప్రారంభమయింది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు, కూతురు ఇవాంకా ట్రంప్‌తో కలిసి ప్రారంభించారు.
బెంగళూరుకు చెందిన కంపెనీ తయారు చేసిన ‘మిత్ర’ రోబో సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు స్వాగతోపన్యాసం చేయగా మోదీ, ఇవాంకా సదస్సును ఆరంభించి మాట్లాడారు. అంనతరం ‘బీ ద చేంజ్.. విమెన్‌‌స ఎంట్రప్రెన్యురల్ లీడర్‌షిప్’ అంశంపై పలువురు చర్చించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు 2017
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : ప్రధాని మోదీ, ఇవాంకా ట్రంప్
ఎక్కడ : హైదరాబాద్

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభం
హైదరాబాద్ మెట్రో రైలును ప్రధాని నరేంద్రమోదీ గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో కలసి నవంబర్ 28న ప్రారంభించారు. అనంతరం మెట్రో పైలాన్, మెట్రో జర్నీ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘టి-సవారీ’ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. తర్వాత మెట్రో రైలులో ప్రయాణించిన మోదీ అక్కడి నుంచి ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు(జీఈఎస్) జరిగే హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)కి బయల్దేరి వెళ్లారు.
మెట్రో తొలిదశలో నాగోల్-అమీర్‌పేట్ (17 కి.మీ), మియాపూర్-అమీర్‌పేట్ (13 కి.మీ) మొత్తంగా 30 కి.మీ. మార్గంలో రవాణా సేవలు ప్రారంభమయ్యాయి. ఈ మార్గాల్లో మొత్తం 24 స్టేషన్లున్నాయి. మెట్రో రైలులో ప్రయాణించేందుకు స్మార్ట్‌కార్డు నెబ్యులా, టికెట్, టోకెన్‌లను ప్రవేశపెట్టారు.
మెట్రో రైలు ప్రారంభంలో లోకో పైలట్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వేపరాల గ్రీష్మ ఉన్నారు. దీంతో ఆమె దేశంలోనే మెట్రో తొలి మహిళా లోకోపైలట్‌గా రికార్డులకెక్కారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : మియాపూర్, హైదరాబాద్

దేశంలోనే తొలిసారి చెన్నైలో జీఐఎస్ సర్వే
దేశంలోనే తొలిసారిగా చెన్నైలో భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్) మ్యాపింగ్ సర్వే 2017 నవంబర్ 21న ప్రారంభించారు. రెండు డ్రోన్లతో 120 రోజుల్లో నగరంలోని రహదారులు మొదలు వీధి దీపాల వరకు అన్ని వివరాలను ఈ సర్వేలో నమోదు చేస్తారు.

లక్కంపల్లిలో పతంజలి’ యూనిట్
Current Affairs
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం లక్కంపల్లిలో పతంజలి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు బాబా రామ్‌దేవ్, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సమక్షంలో పతంజలి సంస్థ సీఈవో ఆచార్య బాలకృష్ణ, తెలంగాణ టీఎస్‌ఐఐసీ ఎండీ ఇ.వి.నర్సింహారెడ్డి నవంబర్ 15న ఎంఓయూ కుదుర్చుకున్నారు. తెలంగాణలో విత్తనాభివృద్ధి, జంతువుల దాణా ఉత్పత్తి పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు కూడా పతంజలి సంస్థ ఆసక్తి కనబరిచింది.
లక్కంపల్లిలో ఏర్పాటు చేయనున్న ఆహార శుద్ధి కర్మాగారంలో పసుపు, మిర్చి, మక్కలు, సోయా తదితర సుగంధ ద్రవ్యాలు, తృణ ధాన్యాల్ని సేకరించి శుద్ధి చేస్తారు. యూనిట్‌కు కావలసిన పసుపు, మిరప, సోయా, మక్కలు ఆ ప్రాంతంలోనే కొనుగోలు చేస్తారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా అనేక మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరకడంతో పాటు ఆ ప్రాంత రైతులకు పంటలను ఒకేసారి అమ్ముకోడానికి వీలవుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణలో పతంజలి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్
ఎప్పుడు : నవంబర్ 15
ఎవరు : పతంజలి, టీఎస్ ఐఐసీ మధ్య అవగాహన ఒప్పందం
ఎక్కడ : లక్కంపల్లి, నిజామాబాద్ జిల్లా

గోదావరి పుష్కరాలు’ డాక్యుమెంటరీకి అవార్డు
తూర్పు గోదావరి జిల్లా గోదావరి పుష్కరాలు’ పేరుతో తీసిన డాక్యుమెంటరీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవార్టు ప్రకటించింది. అమరావతిలో నవంబర్ 14న వివిధ పేర్లతో ప్రకటించిన వివిధ కేటగిరీల్లో గోదావరి పుష్కరాలు’కు 2015 ఏడాదికిగాను ఉత్తమ ద్వితీయ డాక్యుమెంటరీ అవార్డు వరించింది. ఈ డాక్యుమెంటరీ తీసిన నిర్మాత, దర్శకుడి పేరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
గోదావరి పుష్కరాల డాక్యుమెంటరీకి అవార్డు
ఎప్పుడు : నవంబర్ 14
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఏపీకి మరో 28 ఐఏఎస్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐఏఎస్ పోస్టుల సంఖ్య పెరిగింది. కేడర్ రివ్యూలో భాగంగా కొత్తగా 28 ఐఏఎస్ పోస్టులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ నవంబర్ 15న నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రానికి 211 ఐఏఎస్ పోస్టులు ఉండగా ఆ సంఖ్య ఇప్పుడు 239కి పెరిగింది. ప్రస్తుతం ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెండు అదనపు ప్రధాన కార్యదర్శులు పోస్టులు ఉండగా కేడర్ రివ్యూలో భాగంగా మూడు అదనపు ప్రధాన కార్యదర్శులు పోస్టులు వచ్చాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌కి మరో 28 ఐఏఎస్ పోస్టులు మంజూరు
ఎప్పుడు : నవంబర్ 15
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : ఏపీలో 239కి పెరిగిన ఐఏఎస్ పోస్టుల సంఖ్య

తెలంగాణకు ఇండియా టుడే అవార్డులు
ఆర్థిక రంగం, స్వచ్ఛతలో పురోగతికి గుర్తింపుగా తెలంగాణకు రెండు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. ఇండియా టుడే ఏటా నిర్వహిస్తున్న స్టేట్ ఆఫ్ ద స్టేట్స్ కాన్‌క్లేవ్-2017 సదస్సు నవంబర్ 16న ఢిల్లీలో జరిగింది. ఆర్థిక, స్వచ్ఛత రంగాల్లో పురోగతికి రాష్ట్రానికి రెండు బెస్ట్ పెర్ఫార్మింగ్ లార్జ్ స్టేట్ అవార్డులు ప్రదానం చేసింది. ఈ అవార్డులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా మంత్రులు కేటీఆర్, జోగు రామన్న అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్టేట్ ఆఫ్ ద స్టేట్స్ కాన్‌క్లేవ్ - 2017
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : ఇండియాటుడే
ఎక్కడ : న్యూఢిల్లీలో
ఎందుకు : ఆర్థిక, స్వచ్ఛత రంగంలో తెలంగాణకు రెండు అవార్డులు

ఈ-నామ్‌లో తెలంగాణకు అగ్రస్థానం
ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ-నామ్) ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.7,454 కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు జరిగాయని కేంద్ర వ్యవసాయశాఖ నవంబర్ 16న ప్రకటించింది. 18.71 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను రైతులు ఆన్‌లైన్ ద్వారా వ్యాపారులకు అమ్ముకున్నారని పేర్కొంది. ఇలా రాష్ట్రంలో 44 మార్కెట్ల ద్వారా ఈ-నామ్‌ను విజయవంతంగా అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపింది. ఈ మేరకు వివిధ రాష్ట్రాలను పోల్చుతూ తెలంగాణలో ఈ-నామ్ అమలు తీరును కేంద్రం తన నివేదికలో ప్రస్తావించింది.
ఒడిశాలో ఈ-నామ్ మార్కెట్లకు వచ్చిన వ్యవసాయ ఉత్పత్తుల్లో కేవలం 2 శాతం మాత్రమే ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారా విక్రయించగా, తెలంగాణలో ఏకంగా 85 శాతం ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారానే విక్రయించారు. ఏ రాష్ట్రంలోనూ ఆన్‌లైన్ ద్వారా ఈ స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం జరగలేదని కేంద్ర నివేదికలో ప్రస్తావించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఈ - నామ్ అమలులో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : కేంద్ర వ్యవసాయశాఖ
ఎందుకు : ఈ - నామ్ ద్వారా రూ.7,454 కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు

అమరావతి నిర్మాణంపై ఎన్జీటీ షరతులు
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో పర్యావరణ పరిరక్షణకు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) పలు షరతులు విధించింది. సుస్థిరమైన అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణ కూడా ఒక భాగమనే విషయం గుర్తించాలని పేర్కొంది. నదుల సహజ ప్రవాహ దిశను మార్చడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. వరద ముంపు ప్రాంతాల్లో మార్పులు చేపట్టాలంటే అందుకు సంబంధించి అధ్యయనం చేయాలని తెలిపింది. పర్యావరణ అనుమతి (ఈసీ)కి అదనంగా పలు షరతులు విధించింది. తమ ఆదేశాల అమలుకు వీలుగా, పర్యావరణ పరిరక్షణకు రెండు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ఎన్జీటీ తెలిపింది. ఈ మేరకు ఎన్జీటీ చైర్మన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం 145 పేజీల తీర్పును నవంబర్ 17న వెలువరించింది.
ఈసీకి అదనంగా విధించిన ముఖ్యమైన షరతులు..
  • నది గానీ, సహజ వరద నీటి ప్రవాహ పద్ధతిని గానీ, ప్రవాహ దిశను గానీ మార్చేందుకు అనుమతి లేదు. ప్రవాహ దిశను స్ట్రెయిట్‌గా చేయడానికి అనుమతించడం లేదు. అలాంటి మార్పుల వల్ల నేల కోతకు గురవుతుంది. భూగర్భ నీరు తగ్గుతుంది.
  • కొండవీటి వాగు, దాని ఉప వాగులు, ఇతర వరద కాలువల పరీవాహక ప్రాంతంలో నీటి సంరక్షణ దిశగా చర్యలు చేపట్టాలి. ఉపరితలంపై ప్రవాహ వేగం తగ్గించేందుకు, భూగర్భ నీటి నిల్వ పెంచేందుకు అటవీకరణ చేపట్టాలి.
  • రాజధాని నగరంలో ఉన్న 251 ఎకరాల అటవీ స్థలాన్ని సంరక్షించాలి. అటవీయేతర అవసరాలకు వినియోగించరాదు. కనీసం పార్కులు, వినోద కార్యక్రమాలకు ఆ భూమిని వినియోగించరాదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమరావతి నిర్మాణానికి షరతులతో కూడిన అనుమతి
ఎప్పుడు : నవంబర్ 17
ఎవరు : జాతీయ హరిత ట్రిబ్యునల్
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ అగ్రిటెక్ సమావేశం - 2017
ఆంధ్రప్రదేశ్ అగ్రిటెక్ శిఖరాగ్ర సమావేశం - 2017 విశాఖపట్నంలో నవంబర్ 15-17 వరకు జరిగింది. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్‌గేట్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా.. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయరంగంలో అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌తో కలసి పనిచేస్తామని బిల్‌గేట్స్ ప్రకటించారు. భారత్‌లో మూడు అంశాల్లో తమ ఫౌండేషన్ ఆసక్తి చూపుతోందని చెప్పారు. సామాజికాభివృద్ధి, అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం, ప్రపంచానికి ఎంతో అవసరమైన ఆహార ఉత్పత్తిని పెంచడం తమ ఫౌండేషన్ లక్ష్యాలన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ అగ్రిటెక్ సమావేశం - 2017
ఎప్పుడు : నవంబర్ 15 -17
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : విశాఖపట్నం

తెలంగాణలో రెండో అధికార భాషగా ఉర్దూ
రాష్ట్రవ్యాప్తంగా ఇకపై రెండో అధికార భాషగా ఉర్దూ చలామణిలోకి రానుంది. ఈ మేరకు తెలంగాణ అధికార భాషల చట్ట సవరణకు శాసనసభ నవంబర్ 16న ఆమోదముద్ర వేసింది. 1966లోనే ఉర్దూను రెండో భాషగా ప్రకటించినా అప్పట్లో ఇది జిల్లా యూనిట్‌గా అమలైంది. పూర్వపు ఖమ్మం జిల్లా పరిధిలో ఉర్దూ మాట్లాడే వారి సంఖ్య తక్కువగా ఉండటంతో అక్కడ దాన్ని అమల్లోకి తీసుకురాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 31 జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో జిల్లా యూనిట్‌గా కాకుండా రాష్ట్రం యూనిట్‌గా ఉర్దూను రెండో అధికార భాషగా చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణలో రెండో అధికార భాషగా ఉర్దూ
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : తెలంగాణ అధికార భాషల చట్ట సవరణకు శాసనసభ ఆమోదం

బొటానికల్ గార్డెన్‌లో పాలపిట్ట సైక్లింగ్ పార్కు
హైదరాబాద్ కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన పాలపిట్ట సైక్లింగ్ పార్క్‌ను రాష్ట్ర మున్సిపల్, ఐటీ మంత్రి కె.తారకరామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకంగా సైక్లింగ్ పార్క్‌ను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బొటానికల్ గార్డెన్‌లో పాలపిట్ట సైక్లింగ్ పార్కు ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : మంత్రి కేటీఆర్
ఎక్కడ : హైదరాబాద్‌లో

ఏపీలో స్థానికత మరో రెండేళ్లు పెంపు
ఉద్యోగ, విద్య రంగాల్లో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలి వచ్చిన వారికి మరో రెండేళ్ల పాటు స్థానికతకు అర్హత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 20న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రం విడిపోయిన తేదీ నుంచి మూడేళ్లలోగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన వారికి మాత్రమే స్థానికతకు అర్హత ఉంటుందని గతంలో ఉత్తర్వులిచ్చారు. అయితే, ఉద్యోగ సంఘాల నుంచి మరో రెండేళ్ల పాటు స్థానికతకు అర్హత కల్పించాలని విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో మరో రెండేళ్లలోపు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన వారికి స్థానికత అర్హత కలిగించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్‌లో ఐటీ వరల్డ్ కాంగ్రెస్
ప్రతిష్టాత్మక వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సదస్సుకు హైదరాబాద్ వేదికవుతోంది. ఫిబ్రవరి 19- 21 తేదీల్లో హెచ్‌ఐసీసీలో ఈ కార్యక్రమం జరుగనుంది. 80 దేశాల నుంచి 5,000 మంది వివిధ రంగాల నిపుణులు హాజరవుతారని టెక్ మహీంద్రా సీఈవో సి.పి.గుర్నాని నవంబర్ 19న తెలిపారు. భారత సిలికాన్ వ్యాలీగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ను ప్రోత్సహించేందుకు ఈ సదస్సులు జరుపుతున్నట్టు వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐటీ వరల్డ్ కాంగ్రెస్
ఎప్పుడు : ఫిబ్రవరి 19 - 21
ఎక్కడ : హైదరాబాద్‌లో

ఏపీలో ఆంధ్రాబ్యాంకు ఎస్‌బీజీ పథకం ప్రారంభం
ఆంధ్రాబ్యాంకు రూపొందించిన పట్టాభి సీతారామయ్య స్వయం వ్యాపార సంఘాల పథకం’ (ఎస్‌బీజీ)ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవంబర్ 21న విజయవాడలో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకులు పట్టాభి సీతారామయ్య పేరుతో స్వయం సహాయక సంఘాల తీరుతెన్నులను మార్చే విధంగా పథకం ప్రారంభించడం అభినందనీయమని తెలిపారు. ఎస్‌బీజీ పథకం ద్వారా 184 గ్రూపులకు చెందిన 1100 మంది మహిళలకు రూ.13.14 కోట్ల మేర రుణాలు అందించామన్నారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలను మ్యారేజ్ మిత్రలుగా నియమిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.

మత్స్యకారులకు 50 ఏళ్లకే పింఛన్
మత్స్యకారులందరికీ 50 ఏళ్లకే పింఛను సౌకర్యం కల్పిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ఈ మేరకు ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పట్టాభి సీతారామయ్య స్వయం వ్యాపార సంఘాల పథకం ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : ఆంధ్రాబ్యాంక్
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో
ఎందుకు : స్వయం వ్యాపార సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు

హైదరాబాద్‌లో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం
20వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం హైదరాబాద్‌లో నవంబర్ 14న ముగిసింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, చిత్రోత్సవ చైర్మన్ ముకేష్ ఖన్నా, సీఈవో శ్రావణ్‌కుమార్, ప్రత్యేక అతిథి శ్రద్ధాకపూర్ (బాలీవుడ్ నటి) తదితరులు పాల్గొన్నారు.

కాళేశ్వరంపై ఎన్‌జీటీ మధ్యంతర ఉత్తర్వులు రద్దు
Current Affairs
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులన్నింటినీ ఆపేయాలంటూ గత నెల 5న ఢిల్లీలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ప్రధాన బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉమ్మడి హైకోర్టు రద్దు చేసింది. పనులు కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే పర్యావరణ అనుమతులు వచ్చేంత వరకు కాలువలు, పిల్ల కాలువల నిర్మాణ పనులతోపాటు ఇతర అనుబంధ పనులను మాత్రం చేయరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అటవీ అనుమతులు వచ్చేంత వరకు అటవీ భూములను తాకరాదని సూచించింది. ఈ ప్రాజెక్టు కారణంగా అటవీ ప్రాంతంలో ఒక్క చెట్టు కూడా కూలరాదని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఇప్పటికే ఏవైనా పనులు చేపట్టి ఉంటే కేవలం తాగునీటి అవసరాలకే వాటిని పరిమితం చేయాలని స్పష్టం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్‌జీటీ మధ్యంతర ఉత్తర్వులు రద్దు
ఏమిటి : నవంబర్ 8
ఎవరు : హైదరాబాద్ హైకోర్టు

ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య కన్నుమూత
ఒగ్గు కథా పితామహుడు, పల్లె సుద్దులకు జీవం పోసిన మహనీయుడు చుక్క సత్తయ్య (82) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నవంబర్ 9న జనగామ జిల్లాలోని తన స్వగ్రామం మాణిక్యాపురంలో తుదిశ్వాస విడిచారు.
జనగామ జిల్లాలోని లింగాలఘణపురం మండలం మాణిక్యాపురంలో ఆగయ్య-సాయమ్మ దంపతులకు 1935 మార్చి 29న సత్తయ్య జన్మించారు. కులవృత్తి అయిన ఒగ్గు కళను నేర్చుకుని 14 ఏళ్ల నుంచే ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక ప్రదర్శనలు ఇచ్చి ఒగ్గుకళను సరికొత్త తీరాలకు చేర్చారు. ఒగ్గు కథల రూపంలోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలైన కుటుంబ నియంత్రణ, వరకట్న నిషేధం, వయోజన విద్య, మద్యపాన నిషేధం, కేంద్ర ప్రభుత్వం 20 సూత్రాల పథకాలపై ప్రదర్శనలు ఇచ్చారు.
అవార్డులు..
  • 2004లో రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
  • 2005లో అప్పటి గవర్నర్ సుశీల్‌సుమార్ షిండే చేతుల మీదుగా కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్
  • తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్
  • ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వెంగళరావు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, పీవీ నర్సింహరావు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా చేతుల మీదుగా సన్మానాలు
  • తమిళనాడు ప్రభుత్వం నుంచి కళాసాగర్ అవార్డు
  • 2014లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి విశిష్ట పురస్కారం
  • 2014లో తానా అవార్డు
  • ఏపీ ప్రభుత్వం నుంచి రాజీవ్ సాగర్ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం నుంచి కీర్తి పురస్కార్
  • తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2015లో ఉత్తమ కళాకారుడి అవార్డు
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య కన్నుమూత
ఏమిటి : నవంబర్ 9
ఎక్కడ : జనగామ

ప్రయాణికుల సదుపాయాల్లో సికింద్రాబాద్ స్టేషన్ నంబర్ 1
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ మరో ఘనతను సొంతం చేసుకుంది. ప్రయాణికుల సదుపాయాల కల్పనలో దేశంలోనే ఆదర్శప్రాయంగా నిలిచింది. ఈ మేరకు రైల్వేశాఖ ఏర్పాటు చేసిన కేంద్ర రైల్వే ప్రయాణికుల సదుపాయాల కమిటీ కితాబు నిచ్చింది. తాము ఇప్పటివరకు పరిశీలించిన 600 రైల్వేస్టేషన్‌లలో సికింద్రాబాద్ చాలా బాగుందని, విమానాశ్రయం తరహాలో సదుపాయాలు ఏర్పాటు చేశారని కమిటీ ప్రతినిధులు ప్రశంసించారు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వేస్టేషన్‌లలో ప్రయాణికులకు అందజేసే సదుపాయాలపై ఈ కమిటీ విసృ్తతస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తుంది.

తెలంగాణ ఇన్‌చార్జ్ డీజీపీగా మహేందర్‌రెడ్డి
రాష్ట్ర ఇన్‌చార్జ్ డీజీపీగా మహేందర్‌రెడ్డి నియమితులయ్యారు. అనురాగ్ శర్మ ఆదివారం పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో డీజీపీగా హైదరాబాద్ పోలీసు కమిషనర్, 1986 బ్యాచ్‌కు చెందిన ఎం.మహేందర్‌రెడ్డిని నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం శాంతి భద్రతల విభాగం అదనపు కమిషనర్‌గా ఉన్న వీవీ శ్రీనివాస్‌రావును హైదరాబాద్ ఇన్‌చార్జి కమిషనర్‌గా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.
అనురాగ్ శర్మను రాష్ట్ర అంతర్గత భద్రతా సలహదారుగా నియమిస్తూ సంబంధిత ఫైల్‌పై సీఎం సంతకం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
తెలంగాణ ఇన్‌చార్జ్ డీజీపీ
ఏమిటి : నవంబర్ 10
ఎవరు : మహేందర్‌రెడ్డి
ఎందుకు : అనురాగ్ శర్మ పదవీ విరమణతో

కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్‌లలో ఐటీ హబ్స్
కరీంనగర్‌లో ఐటీ హబ్ ఏర్పాటు కోసం రూ.25 కోట్లతో జీ+5 అంతస్తులతో భవనాన్ని నిర్మించేందుకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిజైన్లు సిద్ధం చేయగా, సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆమోదముద్ర వేశారు. కరీంనగర్‌తోపాటు ఖమ్మం, వరంగల్, నిజామాబాద్‌లకు కూడా ఐటీ టవర్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటి నిర్మాణానికి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్‌ఐఐసీ) టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది.

కృష్ణా నది బోటు ప్రమాదంలో 17 మంది మృతి
విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిలో నవంబర్ 12న బోటు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడ్డారు. ఏడుగురి జాడ తెలియకుండా పోయింది. ప్రమాద సమయంలో 15 మందిని సహాయక బృందాలు రక్షించాయి. మృతుల్లో ఎక్కువ మంది ప్రకాశం జిల్లా ఒంగోలు రంగరాయ చెరువు వాకర్స్ క్లబ్‌కు చెందినవారు. పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మ హారతులను చూసేందుకు వెళుతుండగా బోటు బోల్తా పడింది. అనుమతిలేకుండా నిర్వహిస్తున్న బోటు మితిమీరిన సంఖ్యలో పర్యాటకులను ఎక్కించుకోవడం.. బోటు సిబ్బందికి తగిన నైపుణ్యం లేకపోవడం, నదీ మార్గంపై డ్రైవర్‌కు అవగాహన లేకపోవడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు ప్రాథమికంగా తేల్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కృష్ణా నది బోటు ప్రమాదంలో 17 మంది మృతి
ఏమిటి : నవంబర్ 12
ఎక్కడ : ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద

ఆంగ్ల వెబ్‌సైట్‌లో సింగరేణి ఉద్యోగి పదాలు
Current Affairs
సింగరేణిలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న యార్లగడ్డ పోలీస్ రాసిన పదాల (Words)కు ప్రఖ్యాత ఆంగ్ల వెబ్‌సైట్‌లో చోటు దక్కింది. అమెరికాకు చెందిన ఎ కలెక్షన్ ఆఫ్ వరల్డ్ అడిటీ అండ్ ట్రివియా (A COLLECTION OF WORLD ODDITY AND TRIVIA) వెబ్‌సైట్ ఆయన రాసిన పది పదాలు ప్రచురించేందుకు సమ్మతించింది. ఈ పదాలు పోటీ పరీక్షలు, సినిమాలు, క్విజ్, స్క్రాబుల్, ఫన్‌విత్ వర్డ్స్, ప్యాన్‌గ్రామ్, క్రాస్‌వర్డ్ ఫజిల్, రేబస్ వంటి ఆటలకు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.
యార్లగడ్డ గతంలో ఆసియాలో అతిపొడవైన పాలిన్‌డ్రోమ్, క్రాస్‌వర్డ్ పజిల్(పదకేళి) తయారు చేసినందుకు గాను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు, చైనా బుక్ ఆఫ్ రికార్డు, నేపాల్ బుక్ ఆఫ్ రికార్డు, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్ సింగపూర్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సాధించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ఆంగ్ల వెబ్‌సైట్‌లో సింగరేణి ఉద్యోగి పదాలు
ఎప్పుడు : నవంబర్ 1
ఎవరు : యార్లగడ్డ పోలీస్
ఎక్కడ : అమెరికాకు చెందిన ఎ కలెక్షన్ ఆఫ్ వరల్డ్ అడిటీ & ట్రివియా వెబ్‌సైట్‌లో

కాళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్రాష్ట్ర అనుమతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అంతర్రాష్ట్ర అనుమతులు (ఇంటర్ స్టేట్ క్లియరెన్‌‌స) ఇస్తూ కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నవంబర్ 3న ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ప్రాజెక్టుకు పర్యావరణ, అటవీ, హైడ్రాలజీ అనుమతులు లభించాయి. తెలంగాణ ప్రభుత్వం అంతర్రాష్ట్ర ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో 2016 ఆగస్ట్ 23న ఒప్పందం కుదుర్చుకుంది. దీంతోపాటు తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత, ప్రాజెక్టులో చేపట్టే రిజర్వాయర్ల సామర్థ్యంపై కేంద్ర జల సంఘం సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రీడిజైనింగ్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా చేపట్టింది.
కాళేశ్వరం ప్రాజెక్టుతో 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు మరియు 18 లక్షల ఎకరాల స్థిరీకరణ జరగడంతో పాటు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో 45 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. తమ్మిడిహెట్టితో తెలంగాణలో రెండు లక్షల ఎకరాలకు, మహారాష్ట్రలోని గడ్చిరోలీ, చంద్రాపూర్ జిల్లాల్లో 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్ర అంతరాష్ట్ర ఒప్పందం చేసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
కాళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్రాష్ట్ర అనుమతి
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : కేంద్ర జల సంఘం
ఎక్కడ : తెలంగాణలో

హైదరాబాద్‌లో అర్బన్ మొబిలిటీ ఇండియా సదస్సు
నగరీకరణ పెరిగిపోతున్న నేపథ్యంలో సుస్థిర రవాణా వ్యసవ్థలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో నవంబర్ 4 నుంచి 6 వరకు జరిగిన అర్బన్ మొబిలిటీ ఇండియా సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన కీలకోపన్యాసం చేశారు.
సదస్సులో 56 దేశీయ నగరాలు, 30 విదేశీ నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థ తీరుతెన్నులపై ప్రదర్శనలిచ్చారు.
ఈ సదస్సును కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద పనిచేసే Institute of Urban Transport (India) 2006 నుంచి ఏటా నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రవాణా రంగంలో చోటు చేసుకుంటున్న విప్లవాత్మక పరిణామాలతో నగరాల్లో మెరుగైన రవాణా వ్యవస్థలను కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. గ్రీన్ అర్బన్ మొబిలిటీ ఇండియా తర్వాతి సదస్సును 2018 నవంబర్ 2 నుంచి 4 వరకు నాగపూర్‌లో నిర్వహించనున్నారు.
పట్టణ ప్రాంతాల్లో ప్రజా రవాణాపై అవార్డులు

బెస్ట్ సిటీ

:సూరత్ మున్సిపల్ కార్పొరేషన్

బెస్ట్ నాన్ మోటరైజ్డ్ ట్రాన్‌‌సపోర్ట్

: మైసూర్

బెస్ట్ అర్బన్ ట్రాన్‌‌సపోర్ట్ ప్రాక్టీసెస్

: జీహెచ్‌ఎంసీ, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్

క్విక్ రివ్యూ:
ఏమిటి : అర్బన్ మొబిలిటీ ఇండియా సదస్సు
ఎప్పుడు : నవంబర్ 4 - 6
ఎవరు : Institute of Urban Transport (India)
ఎక్కడ : హైదరాబాద్‌లో
ఎందుకు : సుస్థిర, మెరుగైన రవాణా సౌకర్యాల కల్పన కోసం

తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ విడుదల
నవంబర్ 4న ఢిల్లీలో జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా-2017 సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ ప్రాసెసెంగ్ పాలసీని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు విడుదల చేశారు. ఈ పాలసీ ద్వారా వచ్చే ఐదేళ్లలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు లక్షా 25 వేల ఉద్యోగాల కల్పనకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు.
ఈ సదస్సులో కేటీఆర్ వివిధ సంస్థలతో సుమారు రూ.7,200 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. బికనీర్‌వాలా, ప్రయాగ్ న్యూట్రియన్‌‌స ఫుడ్, అన్నపూర్ణ ఫుడ్‌‌స, కరాచీ బేకరీస్, బ్లూక్రాఫ్ట్ ఆగ్రో, సంప్రీ గ్రూప్, క్రీమ్‌లైన్ డైరీ, పుష్య ఫుడ్‌‌స సంస్థలు తదితర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి.
పాలసీలోని ముఖ్యాంశాలు
  • పాలసీ కాలపరిమితి ఐదేళ్లు. సగటు ఫుడ్ ప్రాసెసింగ్ స్థాయిని 20 శాతం పెంచడం
  • ఐదేళ్లలో రూ.20 వేల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ
  • 1,25,000 ఉద్యోగాల కల్పనకు ప్రణాళిక
  • రైతుల ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యం. దీని కోసం గొర్రెలు, చేపల పెంపకం, పశుసంపద పంపిణీ కార్యక్రమాలను అనుసంధానం చేయడం
  • అంతర్జాతీయ ప్రమాణాలతో వ్యవసాయం-ఆహార ఉత్పత్తుల వ్యాల్యూ చైన్ ఏర్పాటు చేయడం. దీని కోసం ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లు, ఫుడ్ పార్కుల అభివృద్ధి
  • పాలసీలో భాగంగా స్టార్టప్స్ కోసం అగ్రి నిధి ఏర్పాటు
క్విక్ రివ్యూ:
ఏమిటి :
తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ విడుదల
ఎప్పుడు : నవంబర్ 5
ఎవరు : కె.తారక రామారావు
ఎక్కడ : వరల్డ్ ఫుడ్ ఇండియా-2017 సదస్సు

అధిక బరువు సమస్యలో ఆంధ్రప్రదేశ్ టాప్
దేశంలో అధిక బరువు సమస్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది. 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల వయసున్న మహిళలు, పురుషుల్లో (నగరాలు/పట్టణాలు, గ్రామాలు) అధిక బరువు సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ఏపీలోని పట్టణాల్లోని 45.6 శాతం మంది మహిళలు, 44.4 శాతం మంది పురుషులు అధిక బరువు సమస్య కలిగి ఉండగా తెలంగాణలోని పట్టణాల్లో మహిళలలో 39.5 శాతం మంది, పురుషులలో 31 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు.
రాష్ట్రాల వారీగా నగర/పట్టణ ప్రాంతాల్లో స్థూలకాయుల శాతం

రాష్ట్రం

మహిళలు

పురుషులు

ఆంధ్రప్రదేశ్‌

45.6

44.4

తెలంగాణ

39.5

31.9

గోవా

36.3

35.3

తమిళనాడు

36.2

30.6

సిక్కిం

34.1

41.5

పశి్చమబెంగాల్‌

30.6

20.7

కర్ణాటక

31.8

28.6

ఉత్తరఖండ్‌

28.4

23.0

హర్యానా

24.3

21.0

మధ్యప్రదేశ్‌

23.8

17.6

బీహార్‌

23.5

20.1

త్రిపుర

23.5

18.2

మేఘాలయ

18.4

17.1

క్విక్ రివ్యూ:
ఏమిటి : అధిక బరువు సమస్యలో ఆంధ్రప్రదేశ్ టాప్
ఎప్పుడు : నవంబర్ 5
ఎవరు : జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే
ఎక్కడ : దేశవ్యాప్తంగా

వాస్తుశిల్పి బీఎన్ రెడ్డి కన్నుమూత
ప్రముఖ వాస్తు శిల్పి, రచయిత మాజీ ఎంపీ బద్దం నర్సింహారెడ్డి(86) నవంబర్ 6న కన్నుమూశారు. బీఎన్ రెడ్డిగా సుపరిచితులైన నర్సింహారెడ్డి 1931 జూన్ 21న నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో జన్మించారు. ఉస్మానియా వర్సిటీలో బీటెక్, అమెరికా కొలరాడో విశ్వ విద్యాలయంలో ఎంటెక్ పూర్తి చేశారు.
ఓయూలో కొంతకాలం లెక్చరర్‌గా పని చేసిన ఆయన 1989, 1996, 1998లో కాంగ్రెస్ నుంచి మూడుసార్లు మిర్యాలగూడ ఎంపీగా గెలిచారు. 1968లో విర్గో పేరుతో ఆర్కిటెక్ట్ సంస్థను స్థాపించారు. 1979లో చైతన్య భారతి విద్యాసంస్థలను ఏర్పాటు చేసిన ఆయన వాటికి మూడుసార్లు చైర్మన్‌గా పని చేశారు.
రచయిత కూడా అయిన బీఎన్‌రెడ్డి సామాజిక అంశాలపై ‘సామాన్యుడి సందేశం’, ‘బీఎన్ భాషితాలు’, ‘బీఎన్. భావతరంగిణి’ వంటి కవితలు రాశారు. ఆయన రాసిన ‘పెళ్ళికాని పెళ్ళి’ కథకు ఉత్తమ కథకుడిగా నంది పురస్కారం, రాజీవ్‌గాంధీ పురస్కారం లభించాయి. 1994లో బీఎన్ సాహితీ పురస్కారం స్థాపించారు. వాస్తు శాస్త్రానికి సంబంధించిన ‘గ్లిమ్‌సెస్ ఆఫ్ వాస్తు’ అనే గ్రంథం రాశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
వాస్తుశిల్పి బద్దం నర్సింహా రెడ్డి కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 6
ఎక్కడ : హైదరాబాద్

హైదరాబాద్‌లో ఇమేజ్ టవర్‌కు శంకుస్థాపన
యానిమేషన్, గేమింగ్ రంగాల్లో తెలంగాణను ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ఇమేజ్ టవర్‌కు నవంబర్ 4న శంకుస్థాపన జరిగింది. రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో 10 ఎకరాల్లో ఇమేజ్ టవర్‌ను రూ.946 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. దాదాపు 15 లక్షల మందికి ఉపాధి కల్పించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. హైదరాబాద్‌కు మకుటాయమానంగా నిలుస్తున్న చార్మినార్ స్ఫూర్తితో ఇమేజ్ సౌధం నమూనాను సిద్ధం చేశారు. ఎటు చూసినా టీ ఆకారంలో ఈ నిర్మాణం ఉంటుంది. టీ అంటే తెలంగాణ. టీ అంటే టెక్నాలజీ. దీని నిర్మాణాన్ని మూడేళ్లలో (2020 నాటికి) పూర్తి చేస్తారు.

విశాఖ నుంచి మూడు పోర్టులకు జల రవాణా ప్రారంభం
విశాఖ ఉక్కు ఉత్పత్తులను ఇక్కడి నౌకాశ్రయం నుంచి సముద్ర మార్గం మీదుగా ముంబై, కొచ్చి, అహ్మదాబాద్‌కు రవాణా చేసే ఎస్.ఎస్.ఎల్. శబరిమలై నౌకను నవంబర్ 1న ప్రారంభించారు.
Published date : 15 Nov 2017 11:29AM

Photo Stories