Skip to main content

మార్చి 2020 రాష్ట్రీయం

ఏపీలో మూడు వైద్య కళాశాలలకు అనుమతి
Current Affairs
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 7 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మూడు కాలేజీలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి అమిత్ బిశ్వాస్ మార్చి 20న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపించారు. పాడేరు, గురజాల, మచిలీపట్నం వైద్య కళాశాలలకు అనుమతించారు. ఒక్కో కళాశాలకు రూ. 325 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేయగా ఇందులో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం భరిస్తుంది. ఈ లెక్కన ఒక్కో కళాశాలకు కేంద్రం నుంచి రూ. 195 కోట్ల నిధులు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ. 130 కోట్లు వ్యయం చేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీలో మూడు వైద్య కళాశాలలకు అనుమతి
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : పాడేరు, గురజాల, మచిలీపట్నం

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ జగనన్న కాలనీలు
పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని 2020, ఏప్రిల్ 14వ తేదీ అంబేడ్కర్ జయంతి రోజుకు వాయిదా వేసినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్చి 20న తెలిపారు. కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి నివారణ చర్యలు చేపడుతున్నందున ఉగాది(2020, మార్చి 25) రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం లేదని పేర్కొన్నారు.
వైఎస్సార్ జగనన్న కాలనీలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి.. ఇళ్లు కట్టించే కాలనీలకు వైఎస్సార్ జగనన్న కాలనీలు అని పేరు ఖరారు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి మార్చి 20న జీవో జారీ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వైఎస్సార్ జగనన్న కాలనీలు
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్

ఏపీ గ్రామాలకు 14వ ఆర్థిక సంఘం నిధులు
పంచాయతీ ఎన్నికలు నిర్వహించని కారణంగా గత రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిలిపి వేసిన 14వ ఆర్థిక సంఘం నిధుల్లో కొంత మొత్తాన్ని కేంద్రప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు కలిపి దాదాపు రూ. 3,710 కోట్లు విడుదల కావాల్సి ఉండగా, అందులో 2018-19 ఏడాదికి సంబంధించి బేసిక్ గ్రాంట్ రూపంలో రూ. 870.23 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ డెరైక్టరు బి.కుమార్ సింగ్ మార్చి 20న ఉత్తర్వులు జారీ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో మార్చి 31 వరకు లాక్‌డౌన్
దేశాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ కట్టడికి మార్చి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్చి 22న ప్రకటించారు. అత్యవసర, నిత్యావసర వస్తువులు, సేవలు మాత్రం యథావిధిగా ప్రజలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేయడంతోపాటు రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ప్రజా రవాణా వ్యవస్థను నిలిపివేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అదే సమయంలో పేదలకు ఇబ్బంది కలగకుండా ఆదుకునేందుకు ప్రతి ఇంటికి రూ.వెయి్యతోపాటు ఉచితంగా రేషన్, కిలో పప్పు సరఫరా చేస్తామని తెలిపారు.
తెలంగాణలో...
అత్యవసర పరిస్థితుల్లో విశేష అధికారాల కోసం అమలు చేసే అంటురోగాల నియంత్రణ చట్టం-1897ను రాష్ట్రంలో ప్రయోగించామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మార్చి 22న ప్రకటించారు. ఈ చట్టంతో మార్చి 31 వరకు తెలంగాణ రాష్ట్రం లాక్‌డౌన్‌లో ఉంటుందన్నారు. నిత్యావసర, అత్యవసర వస్తువుల సేకరణ కోసం కుటుంబానికి ఒక వ్యక్తిని మాత్రమే బయటకు అనుమతిస్తారని పేర్కొన్నారు. లాక్‌డౌన్ సమయంలో తెల్ల రేషన్‌కార్డుగల కుటుంబానికి రూ. 1,500 ఇస్తున్నామని తెలిపారు. అలాగే కార్డులోని ప్రతి వ్యక్తికి ఉచితంగా 12 కేజీల చొప్పున బియ్యం అందజేస్తామన్నారు.

సీఎం సహాయనిధికి రూ.500 కోట్లు విరాళాలు
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో సర్కారు చేస్తున్న యుద్ధానికి టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు సంపూర్ణ సహాయ సహకారాలు అందించడానికి ముందుకొచ్చారు. తమ వంతుగా సీఎం సహాయనిధికి దాదాపు రూ.500 కోట్ల విరాళం ఇవ్వాలని నిర్ణయించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక్కో ఎంపీకి ఏడాదికి రూ.5కోట్ల చొప్పున మంజూరవుతాయి. ఈ ఏడాది తమకు మంజూరయ్యే రూ.80 కోట్ల నిధులను టీఆర్‌ఎస్ ఎంపీలు 16 మంది (9 మంది లోక్‌సభ, ఏడుగురు రాజ్యసభ సభ్యులు) సీఎం సహాయనిధికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన అంగీకార పత్రాన్ని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు డాక్టర్ కె.కేశవరావు, ఉప నాయకుడు బండ ప్రకాశ్, లోక్‌సభలో పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు, ఉప నాయకుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌కు అందజేశారు. ఇక సీఎంతోపాటు మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఒక నెల వేతనాన్ని సీఎం సహాయనిధికి ఇవ్వాలని నిర్ణయించారు. ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి ఏడాదికి రూ.3 కోట్ల చొప్పున నియోజకవర్గ అభివద్ధి నిధులు మంజూరయ్యాయి. ఆ నిధులను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇవ్వనున్నట్టు టీఆర్‌ఎస్ శాసనసభాపక్షం ప్రకటించింది. అలాగే టీఆర్‌ఎస్ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు తమ ఒక నెల వేతనాన్ని సీఎం సహాయనిధికి, మరో నెల వేతనాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి అందజేస్తారని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు తెలిపారు.

వింగ్స్ ఇండియా సదస్సు ప్రారంభం
Current Affairs
హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్ట్ వేదికగా మార్చి 12న ‘వింగ్స్ ఇండియా 2020’సదస్సు ప్రారంభమైంది. మార్చి 15 వరకు నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో విమానాల తయారీ, యంత్ర పరికరాలు, విమానయాన రంగంలో సేవలందించే కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్‌ఐసీసీఐ), మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు కరోనా వైరస్ భయంతో బిజినెస్ విజిటర్ల రాక తగ్గింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వింగ్స్ ఇండియా 2020 సదస్సు ప్రారంభం
ఎప్పుడు : మార్చి 12
ఎక్కడ : బేగంపేట ఎయిర్‌పోర్ట్, హైదరాబాద్
ఎందుకు : విమానయాన రంగంలో సేవలందించే కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు

మల్కాపూర్‌లో ఐఓసీ డీఈఎఫ్ టెర్మినల్‌ను ఏర్పాటు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) రూ.3,800 కోట్ల పెట్టుబడులతో చేపడుతున్న పారదీప్ - హైదరాబాద్ డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ (డీఈఎఫ్) పైప్‌లైన్ ప్రాజెక్ట్ తుది దశకు చేరుకుంది. ఈ పైప్‌లైన్‌కు అనుసంధానిస్తూ కొత్తగా యాదాద్రి భువనగిరి జిల్లా మల్కాపూర్‌లో భారీ డీఈఎఫ్ టెర్మినల్‌ను ఏర్పాటు చేస్తోంది. రూ.611 కోట్ల పెట్టుబడులతో సుమారు 70 ఎకరాల్లో దీని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఏడాదిన్నరలో అందుబాటులోకి వస్తుందని ఐఓసీఎల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (ఈడీ), ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హెడ్ శ్రవణ్ ఎస్ రావు మార్చి 11న తెలిపారు. ఎల్‌పీజీ, పెట్రోల్, డీజిల్ మార్కెట్లో 39 శాతం మార్కెట్ వాటాతో ఐఓసీఎల్ మార్కెట్ లీడర్‌గా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ (డీఈఎఫ్) టెర్మినల్ ఏర్పాటు
ఎప్పుడు : మార్చి 11
ఎవరు : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్)
ఎక్కడ : మల్కాపూర్, యాదాద్రి భువనగిరి, తెలంగాణ

ఏపీలో కొత్తగా వైఎస్సార్ కాపరి బంధు పథకం
రాష్ట్రంలోని గొర్రెల కాపరులకు ఆర్థిక సాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఎన్‌సీడీసీ (నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ఆర్థిక సాయంతో ‘వైఎస్సార్ కాపరి బంధు’ పేరుతో కొత్త పథకాన్ని అమలు చేయనుంది. ఈ పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారునికి 20 గొర్రెలు, ఒక పొట్టేలు కొనుగోలు చేసేందుకు ఆర్థిక సాయం చేయనున్నారు. సంవత్సరానికి 12,500 మంది చొప్పున నాలుగు సంవత్సరాలకు 50 వేల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలిగించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. ఎన్‌సీడీసీ ఈ పథకానికి తొలుత రూ.200 కోట్లు కేటాయించేందుకు అంగీకరించిందని అధికారులు తెలిపారు.
మరోవైపు యూనిట్ల కొనుగోలుకు ఎన్‌సీడీసీ మంజూరు చేసే రుణంలో 30 శాతం(ప్రస్తుతం 20 శాతం) సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. ఒక యూనిట్ (20 గొర్రెలు, ఒక పొట్టేలు) కొనుగోలుకు రూ.1.50 లక్షలు మంజూరు చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వైఎస్సార్ కాపరి బంధు పేరుతో కొత్త పథకం
ఎప్పుడు : మార్చి 13
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : రాష్ట్రంలోని గొర్రెల కాపరులకు ఆర్థిక సాయం అందించేందుకు

సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం
భారత పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్సీ), జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్)లను వ్యతిరేకిస్తూ తెలంగాణ శాసనసభ మార్చి 16న తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి ఎంఐఎం, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మద్దతు తెలపగా, బీజేపీ మాత్రం వ్యతిరేకించింది. తీర్మానంపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సీఏఏ కేవలం హిందూ, ముస్లింల సమస్య కాదని.. యావత్ దేశ సమస్య అని, నిమ్న వర్గాలు, సంచార జాతులు, మహిళలు, పేదలు, వలసదారులు ఈ చట్టంతో భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు.
ద్రవ్య బిల్లుకు ఆమోదం..
రాష్ట్ర ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,82,914 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా చర్చ అనంతరం ఉభయ సభలు ఆమోద ముద్రవేశాయి.
ఐదు బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
తెలంగాణ శాసనసభ మార్చి 15న నాలుగు బిల్లులకు ఆమోదం తెలిపింది. ఈ ఐదు బిల్లులలో తెలంగాణ లోకాయుక్త-2020 సవరణ బిల్లు, లాభదాయక పదవుల జాబితా నుంచి 29 చైర్మన్ పదవులను మినహాయించే సవరణ బిల్లు, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పొడిగింపు బిల్లు ఉన్నాయి. అలాగే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సవరణ బిల్లు, అభయహస్తం పథకం-మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) కో కాంట్రిబ్యూటరీ పింఛను చట్టం రద్దు బిల్లులు కూడా ఉన్నాయి.
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పొడిగింపు
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను మరో పదేళ్లు పొడిగిస్తూ పార్లమెంట్ ఆమోదించిన 2019 రాజ్యాంగ (126 సవరణ) బిల్లును తెలంగాణలో అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ర్యాటిఫై (క్రమబద్ధీకరిస్తూ) చేస్తూ రాష్ట్ర శాసనసభ మార్చి 15న తీర్మానించింది. లోక్‌సభ, అసెంబ్లీల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను మరో పదేళ్లపాటు (2030, అక్టోబర్ 25 వరకు )పొడిగిస్తూ 2019, డిసెంబర్‌లో పార్లమెంట్ చట్ట సవరణ చేసిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లోకాయుక్త-2020 సవరణ బిల్లుతో పాటు మరో ఐదు బిల్లులకు ఆమోదం
ఎప్పుడు : మార్చి 15
ఎవరు : తెలంగాణ శాసనసభ

తెలంగాణలో 4 విడతల్లో రుణమాఫీ
వడ్డీతో సహా రూ.లక్ష వరకు ఉన్న వ్యవసాయ పంటల రుణాలను తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేయనుంది. గతంలోలాగే ఈసారి కూడా నాలుగు విడతల్లో రుణమాఫీ అమలు చేయనుంది. వ్యవసాయ రుణమాఫీ పథకం-2018 అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి మార్చి 17న ఉత్తర్వులు జారీ చేశారు.
కుటుంబం యూనిట్‌గా...
స్వల్పకాలిక పంట రుణాలు, బంగారం తాకట్టుపై గ్రామీణ ప్రాంతాల్లో తీసుకున్న పంట రుణాలకు ప్రభుత్వం రుణమాఫీని వర్తింపజేసింది. కుటుంబం యూనిట్‌గా రుణమాఫీ చేయనున్నారు. దీని ప్రకారం 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ 11 వరకు రైతులు తీసుకున్న, రెన్యువల్ చేసుకున్న పంట రుణాలు, వడ్డీలు కలుపుకొని రూ.లక్ష మించకుండా అర్హులైన వారందరికీ రుణమాఫీ వర్తింపజేయనున్నారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర తీసుకున్న వారికి ఇది వర్తించదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వ్యవసాయ పంటల రుణాలు నాలుగు విడతల్లో మాఫీ
ఎప్పుడు : మార్చి 17
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : తెలంగాణ
ఎందుకు : రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు

ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగం
Current Affairs ఆరు దశాబ్దాలపాటు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల అవసరాలే ప్రాతిపదికగా ప్రభుత్వ పాలన కొనసాగుతోందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా మార్చి 6న ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. రాష్ట్రంలోని వనరులు, వసతులు, అవసరాలు, అనుకూలతలు, ప్రతికూలతలు, బలాలు, బలహీనతలన్నింటినీ అంచనా వేసుకొని స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికల వంటి మూడంచెల ప్రణాళికలను రూపొందించుకొని రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు.
గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
  • పేదలకు కనీస జీవన భద్రత కల్పించాలని ప్రభుత్వం సంక్షేమ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది.
  • వృద్ధాప్య పెన్షన్ల అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే వారందరికీ పెన్షన్లు అందుతాయి.
  • దేశంలోనే తలసరి విద్యుత్ వినియోగం అధికంగా కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది. సమైక్య రాష్ట్రంలో 13,162 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఏర్పడితే తెలంగాణ రాష్ట్రంలో 13,168 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది.
  • ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా రికార్డు సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు త్వరలోనే పూర్తికానుంది.
  • వ్యవసాయాభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న గొప్ప పథకాల్లో రైతుబంధు ఒకటని ఐక్యరాజ్యసమితి కీర్తించడం మనకు గర్వకారణం.
  • ప్రజలకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తాం.
  • 2013-14లో రాష్ట్ర ఐటీ ఎగుమతుల విలువ రూ. 57 వేల కోట్లు కాగా 2018-19 నాటికి రూ. 1.09 లక్షల కోట్లకు చేరింది.

కోవిడ్ -19 నిరోధానికి రూ. 200 కోట్లు కేటాయింపు

కోవిడ్ -19 (కరోనా వైరస్)పై ప్రజలను ఆందోళనకు గురి చేయాల్సిన అవసరం లేదని, అయితే జాగ్రత్తలు సూచించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సీఎం జగన్ మార్చి 6న క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విజయవాడ, అనంతపురంలో కోవిడ్ చికిత్సకు ప్రత్యేక వార్డుల నిర్వహణకు రూ.60 కోట్లతోపాటు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రూ.200 కోట్లు విడుదల చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
తెలంగాణలో ర్యాపిడ్ రెస్పాన్స్...
కోవిడ్ 19ను ఎదుర్కొనేందుకు తెలంగాణ వ్యాప్తంగా ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేయాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఆ మేరకు రాష్ట్రస్థాయి రెస్పాన్స్ టీమ్స్‌తో పాటు ప్రతి జిల్లాలోనూ ఈ టీంలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా కోవిడ్ పాజిటివ్ కేసుల కాంటాక్టులను గుర్తించడం కోసం 15 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటైంది. అలాగే ప్రతి జిల్లాలోనూ 15 మంది చొప్పున ఈ టీంలు పనిచేస్తాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కోవిడ్ -19 నిరోధానికి రూ. 200 కోట్లు కేటాయింపు
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో నిఘా యాప్ ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీని అరికట్టేందుకు రూపొందించిన ‘నిఘా యాప్’ను మార్చి 7న తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఓటర్లకు ఎవరైనా డబ్బులు, మద్యం పంపిణీ చేస్తే ఎన్నికైన తర్వాత కూడా సంబంధిత వ్యక్తులపై అనర్హత వేటుతో పాటు మూడేళ్ల జైలు శిక్ష పడేలే ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసిన విషయం విదితమే.

సీఎం జగన్‌తో జర్మనీ కాన్సుల్ జనరల్ భేటీ
సౌర విద్యుత్, పర్యాటకం, జీరో బడ్జెట్ ఫార్మింగ్ వంటి రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ ఆసక్తి వ్యక్తం చేసింది. జర్మనీ కాన్సుల్ జనరల్ కెరిన్ స్టోల్ మార్చి 9న తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న 10 వేల మెగా వాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు, విద్యా వ్యవస్థలో అమలు చేస్తున్న సంస్కరణలు, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను స్టోల్‌కు సీఎం వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నిఘా యాప్ ఆవిష్కరణ
ఎప్పుడు : మార్చి 7
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
ఎక్కడ : సీఎం క్యాంపు కార్యాలయం, తాడేపల్లి
ఎందుకు : స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీని అరికట్టేందుకు

ఏపీలో కొత్తగా మరో 4 ఓడరేవులు
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 4 ఓడరేవులు(పోర్టులు) అందుబాటులోకి రానున్నాయి. మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు పోర్టులను రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మించడానికి మంత్రివర్గం ఆమోదం తెలపడంతో పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ఈ పనుల ప్రక్రియను వేగవంతం చేసింది.
  • మచిలీపట్నం పోర్టును 26 బెర్తులతో 253.20 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో నిర్మించేలా డీపీఆర్ సిద్ధం చేశారు. మొత్తం ఆరు దశల్లో చేపట్టే ఈ పోర్టు నిర్మాణానికి రూ.11,924 కోట్లు అవసరమని అంచనా.
  • రామాయపట్నం పోర్టు నిర్మాణానికి రూ.10,009 కోట్లు అవసరమని రైట్స్ సంస్థ అంచనా వేసింది. మొత్తం 16 బెర్తులతో 138.54 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఈ ఓడరేవును మూడు దశల్లో నిర్మించనున్నారు.
  • శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు అందుబాటులో ఉండేలా భావనపాడు ఓడరేవు నిర్మించనున్నారు. ఐదు బెర్తులతో 31.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఈ పోర్టును నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందుకోసం రూ.3,000 కోట్లు అవసరమని అంచనా. గతంలో ఈ పోర్టు నిర్మాణానికి టెండర్లు పిలవగా ఆదానీ గ్రూపు దక్కించుకుంది. ఇప్పుడు ఈ ఓడరేవును ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయించడంతో తాజాగా డీపీఆర్ రూపొందించనున్నారు.

విద్యార్థులకు 6 వస్తువులతో జగనన్న విద్యా కానుక
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘జగనన్న విద్యా కానుక’ కింద ఆరు రకాల వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇవన్నీ నాణ్యతతో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. 1వ తరగతి నుంచి 10 తరగతి వరకు చదివే 42 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఈ కిట్లను అందిస్తారు. ప్రతి కిట్‌లో 3 జతల యూనిఫామ్ క్లాత్, నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, షూ- 2 జతల సాక్స్‌లు, స్కూల్ బ్యాగ్, బెల్టు ఉంటాయి. యూనిఫామ్ కుట్టించేందుకు అయ్యే ఖర్చులను విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వమే జమ చేస్తుంది. వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు తెరిచే నాటికి ఈ కిట్లను పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా శాఖ అధికారులను ఆదేశించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ ‘జగనన్న విద్యా కానుక’ కింద ఆరు రకాల వస్తువులు
ఎప్పుడు: వచ్చే విద్యా సంవత్సరం నుంచి
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎందుకు : విద్యార్థుల అవసరాల నిమిత్తం

జూలై 8న వైఎస్సార్ చిరునవ్వు ప్రారంభం
Current Affairs
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు చదివే విద్యార్థులందరికీ ఉచితంగా దంత వైద్యం అందించేందుకు ఉద్దేశించిన ‘డాక్టర్ వైఎస్సార్ చిరునవ్వు కార్యక్రమాన్ని 2020, జూలై 8న ప్రారంభం కానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఫిబ్రవరి 27న అధికారులను ఆదేశించారు. వైఎస్సార్ చిరునవ్వు ద్వారా ప్రతి విద్యార్థికి టూత్‌పేస్ట్, బ్రష్‌ను ఉచితంగా ఇవ్వాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో దంత వైద్య పరీక్షలు జరగాలని, 60 లక్షల మంది చిన్నారులను స్క్రీనింగ్ చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని చెప్పారు.
సచివాలయాల్లో విలేజ్ క్లినిక్‌లు
రాష్ట్రంలో ప్రతి రెండు వేల జనాభాను ఒక యూనిట్‌గా తీసుకుని అక్కడి పరిస్థితులకు అనుగుణంగా విలేజ్ క్లినిక్‌ను అందుబాటులో ఉంచాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ అందుబాటులో ఉండాలన్నారు. విలేజ్ క్లినిక్ అనేది రెఫరల్ పాయింట్‌లా ఉండాలని, ప్రతి రోగికి ప్రాథమిక వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికొక బోధనాసుపత్రి ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2020, జూలై 8న వైఎస్సార్ చిరునవ్వు ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 27
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : రాష్ట్ర వ్యాప్తంగా
ఎందుకు : రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు చదివే విద్యార్థులందరికీ ఉచితంగా దంత వైద్యం అందించేందుకు

జైలులో స్కిల్ డెవలప్‌మెంట్ యూనిట్ ఏర్పాటు
దేశంలోనే తొలిసారిగా కడప కేంద్ర కారాగారంలో రూ.4.70 కోట్ల వ్యయంతో స్కిల్ డెవలప్‌మెంట్ మాడ్యులర్ ఫర్నిచర్ యూనిట్ నెలకొల్పుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. కడప కేంద్ర కారాగారంలో ఫిబ్రవరి 28న ఆమె ఈ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. స్విట్జర్లాండ్‌లో తప్ప మరెక్కడాలేని మాడ్యులర్ ఫర్నిచర్ యూనిట్‌ను కడప కేంద్ర కారాగారంలో ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ఖైదీలలో పరివర్తన కోసం చేపట్టిన సంస్కరణల్లో భాగంగా ఈ యూనిట్ నెలకొల్పుతున్నామన్నారు. రాబోయే నాలుగు నెలల్లో ఈ యూనిట్ పూర్తవుతుందన్నారు. ఖైదీల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్కిల్ డెవలప్‌మెంట్ మాడ్యులర్ ఫర్నిచర్ యూనిట్ ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత
ఎక్కడ : కడప కేంద్ర కారాగారం, కడప, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ఖైదీల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు

తెలంగాణలో తొలి కోవిడ్ 19 కేసు నమోదు
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్ మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రవేశించింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో తొలి కోవిడ్ 19 కేసు నమోదైంది. దుబాయ్ నుంచి బెంగళూరు ద్వారా నగరానికి వచ్చిన 24 ఏళ్ల ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌కు ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. అయితే ప్రజలు ఎటువంటి భయాందోళనలు చెందొద్దని, ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుందని, వైద్య ఆరోగ్యశాఖ ఇచ్చే సూచనలు, సలహాలను పాటించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. దేశంలో ఢిల్లీ, హైదరాబాద్‌లలో ఒక్కో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదైందని మార్చి 2న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తొలి కోవిడ్ 19 కేసు నమోదు
ఎప్పుడు : మార్చి 2
ఎక్కడ : తెలంగాణ

స్థానిక సంస్థల రిజర్వేషన్లపై హైకోర్టు కీలక తీర్పు
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్లను చట్ట విరుద్ధంగా ప్రకటించింది. రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదని, అలా జరగడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం, బీసీలకు 34 శాతం.. మొత్తం 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019 డిసెంబర్ 28న ప్రభుత్వం జారీ చేసిన జీవో 176ను రద్దు చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం మార్చి 2న తీర్పు వెలువరించింది.

కోవిడ్ 19 కట్టడికి 100 కోట్లు కేటాయింపు
తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించిన కోవిడ్19 మహమ్మారి మరింత విస్తరించకుండా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వైరస్ వ్యాప్తిని నివారించేందుకు రూ.100 కోట్లు కేటాయించినట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మార్చి 3న వెల్లడించారు. హైదరాబాద్‌లోని గాంధీ, ఫీవర్, చెస్ట్ ఆస్పత్రులు, కంటోన్మెంట్‌లోని మిలిటరీ ఆస్పత్రితోపాటు వికారాబాద్‌లోని టీబీ ఆస్పత్రిలోనూ ప్రత్యేక వార్డులను సిద్ధం చేసినట్లు చెప్పారు. అలాగే హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న ప్రైవేటు మెడికల్ అనుబంధ ఆసుపత్రుల్లో 3 వేల పడకలను అందుబాటులో ఉంచాలని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. వాటిలో కొన్నింటిని సాధారణ ఐసొలేషన్ కోసం, కొన్నింటిని ప్రత్యేక చికిత్స కోసం ముందు జాగ్రత్తగా తీసుకున్నట్లు వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కోవిడ్ 19 కట్టడికి 100 కోట్లు కేటాయింపు
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎందుకు : కోవిడ్ 19 మరింత విస్తరించకుండా చర్యలు చేపట్టేందుకు

26 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీకి ఏపీ కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌లో 2020 ఏడాది ఉగాది రోజున సుమారు 26 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎన్‌పీఆర్‌లోని కొన్ని అంశాల్లో మార్పులు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించింది. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన మార్చి 4న సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు
  • ఏటా 6 లక్షలకుపైగా ఇళ్ల చొప్పున వచ్చే నాలుగేళ్లలో 26 లక్షల ఇళ్లు నిర్మించాలని.. వీటికి వైఎస్సార్ జగనన్న కాలనీలుగా పేరు పెట్టాలని నిర్ణయం.
  • నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్‌పీఆర్)పై మైనార్టీ వర్గాల ప్రజల్లో అభద్రతాభావం తొలగించాలంటే 2010 నాటి జనాభా గణన ప్రశ్నావళికే పరిమితం కావాలని.. ఆ మేరకు ప్రస్తుతం ఉన్న ఎన్‌పీఆర్ ప్రశ్నల నమూనాలో మార్పు చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం. అలా మార్పు చేసే వరకు ఎన్‌పీఆర్ ప్రక్రియను అభయన్స్ లో ఉంచాలని నిర్ణయం.
  • పీపీపీ విధానంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృది పనులను జీఎమ్మార్ ఎయిర్‌పోర్‌‌ట్స లిమిటెడ్ సంస్థకు అప్పగించేందుకు ఆమోదం.
  • తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో తొండంగి మండలం కోన గ్రామం వద్ద పోర్టు నిర్మాణం కోసం 9 నెలల కాల వ్యవధిని పొడిగింపు. ఆ మేరకు కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్‌కు అనుమతికి నిర్ణయం.
  • కాకినాడ ఎస్‌ఈజెడ్ లిమిటెడ్‌లో 49 శాతం ఈక్విటీని అదానీ పోర్టు అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్‌కు బదిలీ చేస్తూ చేసుకున్న ఒప్పందానికి ఆమోదం.
  • రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నంలలో పోర్టులను రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
  • ఏపీ జెన్‌కో, ఏపీపీడీసీఎల్ చెరో రూ.1,000 కోట్లు చొప్పున, మొత్తంగా రూ.2 వేల కోట్ల రుణం తీసుకోవడానికి ప్రభుత్వం నుంచి బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించింది.
Published date : 10 Apr 2020 07:50PM

Photo Stories