Skip to main content

మార్చి 2018 రాష్ట్రీయం

పెట్టుబడి పథకానికి 'రైతుబంధు' పేరు ఖరారు
Current Affairs తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పెట్టుబడి పథకానికి 'రైతుబంధు'అని నామకరణం చేసింది. గతంలో దీని పేరు రైతులక్ష్మి పథకంగా ప్రచారం జరిగినా, చివరకు ముఖ్యమంత్రి రైతుబంధు పేరుని ఖరారు చేశారని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి వెల్లడించారు. రైతు బంధు పథకంపై బ్యాంకు అధికారులతో గురువారం ఆయన సమావేశం నిర్వహిచారు. ప్రతీ రైతుకు సాగు భూమి అంతటికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పెట్టుబడి పథకం పేరు 'రైతుబంధు'
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : తెలంగాణలో
ఎందుకు : రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు

ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రపంచ రికార్డు
తమిళనాడులోని రామనాథపురం సమీపంలో తలైమన్నార్-ధనుష్కోటి మధ్య ఉన్న పాక్ జలసంధిని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మోదుకూరి తులసి చైతన్య అనే పోలీసు 8 గంటల 25 నిమిషాల్లో ఈది ప్రపంచ రికార్డు సృష్టించారు. మార్చి 25 తెల్లవారుజామున తలైమన్నార్ హార్బర్ నుంచి ఈదడం ప్రారంభించిన తులసి చైతన్య ఉదయం 9.25 గంటలకు ధనుష్కోటికి చేరుకున్నారు. దీంతో ఇప్పటివరకూ నమోదైన గణాంకాల ప్రకారం అతి తక్కువ సమయంలో పాక్ జలసంధిని ఈదిన తొలివ్యక్తిగా చైతన్య రికార్డు సృష్టించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అతి తక్కువ సమయంలో పాక్ జలసంధిని ఈదిన వ్యక్తి
ఎప్పుడు : మార్చి 25
ఎవరు : ఆంధ్రప్రదేశ్ కు చెందిన పోలీస్ మోదుకూరి తులసి చైతన్య
ఎక్కడ : తమిళనాడులోని రామనాథపురం సమీపంలో తలైమన్నార్-ధనుష్కోటి మధ్య
ఎందుకు : 8 గంటల 25 నిమిషాల్లో ఈది ప్రపంచ రికార్డు

చిత్తూరులో హీరో మోటార్‌కార్ప్ పరిశ్రమకు శంకుస్థాపన
చిత్తూరులోని శ్రీసిటీ సమీపంలో హీరో మోటార్‌కార్ప్ చిత్తూరు ప్లాంటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్చి 23న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీలో తిరుపతి, నెల్లూరు, అనంతపురం ప్రాంతాలను కలుపుతూ ఆటోమొబైల్ హబ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామమని చెప్పారు. ఈజ్‌ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండోస్థానంలో ఉందన్నారు. చిత్తూరు ప్లాంటు నిర్మాణం కోసం రూ.1,600 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని హీరో మోటార్‌కార్ప్ సీఎండీ పవన్ ముంజాల్ చెప్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హీరో మోటార్‌కార్ప్ పరిశ్రమకు శంకుస్థాపన
ఎప్పుడు : మార్చి 23
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబు
ఎక్కడ : చిత్తూరు శ్రీసిటీ సమీపంలో

చిత్తూరు శ్రీసిటిలో 'క్రియా' యూనివర్సిటీ
రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొత్త బాధ్యతలు చేపట్టబోతున్నారు. కొందరు కార్పొరేట్లతో కలిసి యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు. వీరిలో జేఎస్‌డబ్ల్యు గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఉన్నారు. చిత్తూరు జిల్లా శ్రీసిటీలో రానున్న ఈ యూనివర్సిటీకి 'క్రియా' అని పేరు పెట్టారు. క్రియా యూనివర్సిటీకి తొలుత రూ.750 కోట్ల నిధులు సమకూరతాయని ఇండస్‌ఇండ్ బ్యాంక్ చైర్మన్, యూనివర్సిటీ సూపర్‌వైజరీ బోర్డు చైర్మన్ ఆర్.శేషసాయి తెలిపారు. దాతృత్వంలో భాగంగా కార్పొరేట్లు ఈ యూనివర్సిటీకి ఖర్చు చేస్తారన్నారు. యూనివర్సిటీ గవర్నింగ్ కౌన్సిల్ సలహాదారుగా రఘురామ్ రాజన్ వ్యవహరిస్తారు. రాజన్ ప్రస్తుతం.. యూనివర్సిటీ ఆఫ్ షికాగోకు చెందిన బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫైనాన్స్ సబ్జెక్టును బోధిస్తున్నారు.
క్లాసులు 2019 నుంచి..: యూనివర్సిటీలో 2019 జూలై నుంచి తొలి బ్యాచ్ ప్రారంభమవుతుంది. హాస్టల్ వసతితో కలిపి ఫీజు రూ.7-8 లక్షలు ఉండనుంది. లిబరల్ ఆర్‌‌ట్స, సెన్సైస్‌లో బీఏ హానర్స్, బీఎస్సీ హానర్స్ డిగ్రీ కోర్సులు ఆఫర్ చేస్తారు. మెరిట్ ఆధారంగానే అడ్మిషన్లుంటాయి. తాత్కాలికంగా శ్రీసిటీలోని ఐఎఫ్‌ఎంఆర్ క్యాంపస్‌లో క్లాసులు ప్రారంభిస్తారు. తర్వాత సొంత భవనంలోకి మారుస్తారు. 200 ఎకరాల్లో నిర్మించే క్రియా యూనివర్సిటీ సొంత భవనం 2020 నాటికి సిద్ధమవుతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్రియా యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్న రఘురామ్ రాజన్
ఎప్పుడు : మార్చి 23
ఎక్కడ : చిత్తూరు శ్రీసిటీలో

డీజీపీ నియామక బిల్లుకి ఆమోదం
డీజీపీని నియమించుకునే అధికారం రాష్ట్రానికే కల్పిస్తూ పోలీసు చట్టానికి తెలంగాణ ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ మేరకు రూపొందించిన కొత్త పోలీసు చట్టం బిల్లుని మార్చి 25న శాసనమండలి ఆమోదించింది. సీఎం కేసీఆర్ తరపున మంత్రి కె.తారక రామారావు సభలో బిల్లును ప్రవేశపెట్టగా, సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
అలాగే... తెలంగాణ అసైన్‌‌డ భూముల చట్టం-1977ను సవరించే బిల్లును ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. వీటితో పాటు తెలంగాణ విద్య, వృత్తిదారుల రిజిస్ట్రేషన్ చట్టం-1968 ను సవరించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రవేశ పెట్టిన బిల్లును, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కేంద్ర పాఠశాలల్లో తెలుగును తప్పనిసరిగా బోధించాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రవేశపెట్టిన బిల్లును సభ ఆమోదించింది. తెలంగాణ న్యాయవాదుల గుమాస్తాల సంక్షేమ నిధి చట్టం-1992ను, తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం-1987లను సవరించేందుకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పెట్టిన రెండు బిల్లులను సభ ఆమోదించింది.

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ గ్యారేజ్
ప్రముఖ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో గ్యారేజ్‌ని ప్రారంభించింది. తెలంగాణ ఐటీ శాఖమంత్రి కె. తారక రామారావు మార్చి 26న దీనిని ప్రారంభించారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్‌‌స (ఐవోటీ), రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త సాంకేతికతలు, ఉత్పత్తుల పరిష్కరణ వంటి వాటి కోసం ఈ గ్యారేజీ పనిచేస్తుంది. 8 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ గ్యారేజ్ దేశంలోనే మొదటిది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్‌లో మైక్రోసాఫ్ట్ గ్యారేజ్
ఎప్పుడు : మార్చి 26
ఎవరు : ఐటీ మంత్రి కేటీఆర్
ఎక్కడ : హైదరాబాద్

తెలంగాణ అడ్వొకేట్ జనరల్ రాజీనామా
తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి మార్చి 26న తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు. అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ల బహిష్కరణకు సంబంధించిన కేసు విషయంలో వచ్చిన స్పర్ధల కారణంగా ఆయన రాజీనామా చేసినట్లు తెలిసింది. ఈ కేసులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు ప్రకాష్ రెడ్డిని తప్పించి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వేను రప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రకాశ్‌రెడ్డి 2017 జూలై 17న అడ్వొకేట్ జనరల్‌గా నియమితులయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ అడ్వొకేట్ జనరల్ రాజీనామా
ఎప్పుడు : మార్చి 26
ఎవరు : దేశాయ్ ప్రకాష్ రెడ్డి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం(ఈసీ) మార్చి 27న ప్రకటించింది. మొత్తం 224 శాసనసభ స్థానాలకు మే 12న ఒకే దశలో పోలింగ్ నిర్వహించి మే 15న ఫలితాలు వెల్లడించనుంది. ఏప్రిల్ 17న నోటిఫికేషన్ విడుదల కానుండగా నామినేషన్లకు ఏప్రిల్ 24 వరకు గడువు ఉంటుందని ప్రధాన ఎన్నికల కమీషనర్ ఓపీ రావత్ తెలిపారు. ఈ ఎన్నికల్లో అన్నీ ఈవీఎంలకు వీవీపీఏటీ (ఓటు రశీదు యంత్రం)లను అనుసంధానించనున్నారు.
ఎన్నికల షెడ్యూల్-2018

మొత్తం స్థానాలు

224

నోటిఫికేషన్ విడుదల

ఏప్రిల్ 17

నామినేషన్లకు చివరి తేది

ఏప్రిల్ 24

ఉపసంహరణకు గడువు

ఏప్రిల్ 27

పోలింగ్ తేది

మే 12

ఓట్ల లెక్కింపు

మే 15


తెలుగును తప్పనిసరి చేసే బిల్లుకు ఆమోదం
తెలంగాణలో ఒకటి నుంచి పదోతరగతి వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన బిల్లుకు శాసనసభ మార్చి 24న ఆమోదం తెలిపింది. దీంతో తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, ఇతర మాధ్యమాలు (ఉర్దూ, తమిళం, మళయాలం), కేంద్ర, అంతర్జాతీయ విద్యాసంస్థల్లో తెలుగును మొదటి భాషగా బోధించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా 2018-19 విద్యా సంవత్సరం నుంచి అన్ని రకాల పాఠశాలల్లో ఒకటి, ఆరో తరగతిల్లో తెలుగును మొదటి భాషగా అమలుచేయనున్నారు. క్రమంగా ఒక్కో ఏడాది తరగతులను పెంచనున్నట్లు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ విస్తరణకు శంకుస్థాపన
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా.. ప్రయాణీకుల సామర్థ్యాన్ని పెంచి.. నూతన సౌకర్యాలు కల్పించేలా యాజమాన్య సంస్థ విమానాశ్రయ విస్తరణకు శ్రీకారం చుట్టుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న కోటిన్నర మంది(సంవత్సరానికి) ప్రయాణీకుల సామర్థ్యాన్ని 4 కోట్లకు పెంచనున్నారు. దీనికి సంబంధించిన పనులకు తెలంగాణ సీఎం కేసీఆర్ మార్చి 23న శంకుస్థాపన చేశారు. విస్తరణలో భాగంగా ఎయిర్‌పోర్ట్ సిటీ, 12 వేల మందికి ఒకేసారి ఆతిథ్యం ఇవ్వగల కన్వెన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్ కేంద్రాలను నిర్మించనున్నారు.

ప్రజలకు ఉగాది కానుకగా "తెలంగాణ వెలుగు"
Current Affairs
రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పర్వదినం సందర్భంగా కరదీపిక పేరుతో హ్యాండ్ బుక్ తీసుకొచ్చింది. ఇందులో 20 రకాల అంశాలను పొందుపరిచారు. వర్ణమాల, తెలుగు సంవత్సరాలు, తిథులు - వారాలు, పక్షాలు - ఆయనాలు, మాసాలు, రుతువులు, కార్తెలు, నక్షత్రాలు - రాశులు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, యుగాలు, ప్రాచీన కాలగణనం, తెలంగాణలో పూర్వం వాడుకలో ఉన్న కొలమానాలు, ప్రాచీన సంఖ్యామానం, పండుగలు, పండుగల పాటలు, రాష్ట్ర చిహ్నాలు, తెలంగాణ కళలు, వాయిద్య పరికరాలు, మన పంటలు - ఆహారం, మన ఆటలు, నీతి పద్యాలు, తెలంగాణను పరిపాలించిన రాజవంశాలు ఉన్నాయి. మొత్తం 56 పేజీల పుస్తకం సమగ్ర సమాచారంతో అందరినీ ఆకట్టుకొంటోంది. పాశ్చాత్య మోజులో పడి మన సంస్కృతి, సంప్రదాయాలను మరచిన నేటి తరానికి మన ప్రాచీన జ్ఞానం తెలియాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఈ కరదీపికను ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రతి ఇంటికీ దీన్ని అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. సమగ్ర కుటుంబ సర్వేలో తేల్చిన 1.30 కోట్ల కుటుంబాలకు ఈ కరదీపికను డీఈవోలు, రెవెన్యూ యంత్రాంగం ద్వారా పంపిణీ చేయనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రజలకు ఉగాది కానుకగా "తెలంగాణ వెలుగు" కరదీపీక
ఎప్పుడు : మార్చి 15
ఎక్కడ : తెలంగాణలో
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం

మైనర్‌పై అత్యాచారానికి పాల్పడే మృగాళ్లకు మరణశిక్ష
అరుణాచల్‌ప్రదేశ్‌లో మహిళలపై నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడే మృగాళ్లకు మరణశిక్ష లేదా 14 ఏళ్ల కఠిన కారాగారశిక్ష విధించేలా రూపొందించిన బిల్లుకు అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ మార్చి 16న ఆమోదముద్ర తెలిపింది. క్రిమినల్ లాస్(అరుణాచల్ ప్రదేశ్) సవరణ బిల్లు-2018ను రాష్ట్ర హోంమంత్రి కుమార్ వాయి సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం 12 ఏళ్లలోపు బాలికల(మైనర్)పై అత్యాచారానికి పాల్పడే వ్యక్తులకు మరణశిక్ష లేదా 14 ఏళ్లకు తగ్గకుండా కఠిన కారాగారశిక్ష విధిస్తారు. ఈ శిక్షను యావజ్జీవశిక్షగా కూడా మార్చవచ్చు. వీటితో పాటు దోషులకు జరిమానా కూడా విధించవచ్చు.
2015 నుంచి 2017 నవంబర్ వరకూ రాష్ట్రంలో 225 రేప్ కేసులు నమోదుకాగా.. ఒక్క 2016లోనే 91 అత్యాచార కేసులు నమోదయ్యాయి. దీంతో మహిళలకు తగిన రక్షణ కల్పించడంలో భాగంగా పలువురు సభ్యుల సిఫార్సుతో అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టానికి రూపకల్పన చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మైనర్‌పై అత్యాచారానికి పాల్పడే మృగాళ్లకు మరణశిక్ష లేదా 14 ఏళ్లకు తగ్గకుండా కఠిన కారాగార శిక్ష
ఎప్పుడు : మార్చి 16
ఎక్కడ : అరుణాచల్ ప్రదేశ్‌లో
ఎవరు : క్రిమినల్ లాస్(అరుణాచల్ ప్రదేశ్) సవరణ బిల్లు-2018కు శాసనసభ ఆమోదం

కల్యాణలక్ష్మి’ సాయం రూ.1,00,116కు పెంపు
కల్యాణలక్ష్మి పథకం కింద నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లికి అందజేస్తున్న సాయాన్ని ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు రూ.75,116గా ఉన్న మొత్తాన్ని రూ.1,00,116కు పెంచుతున్నట్టు ప్రకటించింది. మార్చి 19న శాసనసభలో ప్రశ్నోత్తరాల అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పేరిట అందజేస్తున్న సాయాన్ని మరింత పెంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘కల్యాణలక్ష్మి’ సాయం రూ.1,00,116కు పెంపు
ఎప్పుడు : మార్చి 19
ఎక్కడ : తెలంగాణలో
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం

స్టీఫెన్ హాకింగ్ పేరుతో పోస్టల్ కవర్ విడుదల
ఇటీవల కన్నుమూసిన ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ పేరుతో పోస్టల్ శాఖ ప్రత్యేక కవర్‌ను విజయవాడలో విడుదల చేసింది. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఇస్రో వైస్‌చైర్మన్ డాక్టర్ కేవీ రమణ ఈ కవర్‌ను విడుదల చేశారు.
అంతకముందు.. తపాలా శాఖ అంధ్రప్రదేశ్ సర్కిల్.. దీన్‌దయాల్ స్పర్శ యోజన కింద స్కాలర్‌షిప్పులను విద్యార్థులకు అందజేశారు. స్టాంపుల సేకరణను ప్రోత్సహించే క్రమంలో పోస్టల్ శాఖ పాఠశాల విద్యార్థులకు పరీక్ష నిర్వహించింది. ఇందులో ఎంపికైన మొత్తం 40 మంది విజేతలకు ఒక్కొక్కరికి రూ.6 వేలు చొప్పున ఈ ఉపకార వేతనాలు పంపిణీ చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్టీఫెన్ హాకింగ్ పేరుతో పోస్టల్ కవర్ విడుదల
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్
ఎక్కడ : విజయవాడలో

సూర్య’ ప్రయోగాన్ని వీక్షించనున్న తెలంగాణ విద్యార్థి
సూర్యుడిపై ఉన్న ఉష్ణోగ్రతను అధ్యయనం చేయడానికి నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) త్వరలో రాకెట్‌ను సూర్యునిపైకి పంపనుంది. ఈ ప్రయోగాన్ని వీక్షించడానికి ప్రపంచ దేశాల నుంచి 110 మందిని ఎంపిక చేసింది. వీరిలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన విద్యార్థి అబీర్ మనీష్ గోదాగోమంకర్ ఉన్నారు.
గోదాగోమంకర్‌కు ప్రయోగాలంటే చాలా ఇష్టం. సూర్యుడి ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి నాసా రాకెట్ పంపుతోందన్న విషయం తెలుసుకున్నాడు. వెబ్‌సైట్‌లో నాసా అడిగిన 10 ప్రశ్నలకు అబీర్ సమాధానాలు ఇవ్వడంతో నాసా నుంచి ఆహ్వానం అందింది. భారత్ నుంచి మొత్తం 13 మంది విద్యార్థులకు ఈ అవకాశం దక్కింది. ఎంపికైన వారి పేర్లను రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నారు.

క్వాలిటీ ఆఫ్ లివింగ్‌లో అగ్రస్థానంలో హైదరాబాద్
హైదరాబాద్ నగరం మరోసారి అరుదైన ఘనతను దక్కించుకుంది. దేశంలోని మహానగరాలను వెనక్కునెట్టి ఈసారి కూడా ‘క్వాలిటీ ఆఫ్ లివింగ్’ రేటింగ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ‘క్వాలిటీ ఆఫ్ లివింగ్ రేటింగ్-2018’ పేరుతో మెర్సర్ ఈ జాబితాను విడుదల చేసింది. నేరాల శాతం తక్కువగా ఉండటం, ఏ కాలంలోనైనా వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ రేటింగ్ ఇస్తారు. భాగ్యనగరంతో పాటూ పుణె కూడా ఈ లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో ఉంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీ వరుసగా మూడోసారి అట్టడుగు స్థానానికే పరిమితమైంది. వాయు కాలుష్యం, భారీ ట్రాఫిక్‌తో దేశ రాజధాని ప్రతిష్ట రోజురోజుకు దిగజారుతోంది.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే హైదరాబాద్ 142వ ర్యాంక్ దక్కించుకుంది. హైదరాబాద్‌తోపాటు పుణె కూడా ఇదే ర్యాంక్‌లో ఉంది. పుణె కూడా 151వ ర్యాంక్ నుంచి 142వ స్థానానికి వచ్చింది. బెంగళూరు 149, చెన్నై 151, ముంబై 154, కోల్‌కతా 160, ఢిల్లీ 162 ర్యాంకులు దక్కించుకున్నాయి. ఆస్ట్రియా రాజధాని వియన్నా ఉత్తమ నగరంగా తొలి ర్యాంకు దక్కించుకుంది. ఆ తర్వాత స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ రెండో ర్యాంక్‌లో నిలిచింది.

20 మంది మహిళకు తెలంగాణ అవార్డులు
Current Affairs వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన 20 మంది ప్రముఖ మహిళలకు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అవార్డులను అందజేసింది. అవార్డులకు ఎంపికై న వారిలో విద్య, వైద్య, క్రీడా, సాహిత్యం, నాట్యం, సంగీతం, వ్యవసాయం, సమాజసేవ తదితర రంగాలకు చెందిన వారు ఉన్నారు.
ఇటీవల జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్‌లో రజత పతకం సాధించిన అరుణారెడ్డితో పాటు, సినిమా డెరైక్టర్ నందినీరెడ్డి, హైదరాబాద్ మెట్రో రైల్ డ్రైవర్ సుప్రియ సనమ్, ఢిల్లీ ఆర్టీసీ డ్రైవర్ సరిత, ఉద్యమ గాయకురాలు ఎదునూరి పద్మ, మహిళా సాధికారతలో యాప భద్రమ్మ తదితరులు అవార్డుకు ఎంపికయ్యారు. వీరందరికీ లక్ష రూపాయల నగదు రివార్డుతో ప్రభుత్వం సత్కరించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 20 మంది మహిళలకు తెలంగాణ అవార్డులు
ఎప్పుడు : మార్చి 8న
ఎందుకు : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని

మహిళా రైల్వేస్టేషన్‌గా బేగంపేట్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బేగంపేట్ రైల్వేస్టేషన్‌ను ‘మహిళా ఉద్యోగుల రైల్వేస్టేషన్’గా సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ ప్రకటించారు. బేగంపేట్‌లో 8 మంది కమర్షియల్ ఉద్యోగులు, నలుగురు అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్లు, మరో ఆరుగురు పాయింట్స్ ఉమెన్, ఇద్దర్ ఆర్‌పీఎఫ్ మహిళా పోలీసులను నియమించనున్నట్లు పేర్కొన్నారు. వీరు రైల్వేస్టేషన్ నిర్వహణ, టిక్కెట్ బుకింగ్, ప్రయాణికుల భద్రత తదితర కార్యకలాపాలను నిర్వహిస్తారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలో ఇప్పటికే చంద్రగిరి స్టేషన్‌ను మహిళా ఉద్యోగుల రైల్వేస్టేషన్‌గా అభివృద్ధి చేశారు. త్వరలో ఫిరంగిపురం స్టేషన్ కూడా మహిళా ఉద్యోగుల రైల్వేస్టేషన్‌గా మారనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మహిళా రైల్వేస్టేషన్‌గా బేగంపేట్
ఎప్పుడు : మార్చి 8
ఎక్కడ : దక్షిణమధ్య రైల్వే సీపీఆర్‌వో ఉమాశంకర్

వీ హబ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
కొత్తగా పరిశ్రమలు పెట్టే వారి కోసం ఇప్పటికే టీహబ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. తాజాగా మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా వీహబ్ (ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ హబ్) ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8న హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అంబేడ్కర్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీ హబ్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభించారు. ఈ వీ హబ్ ఇంక్యుబేటర్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించింది. వీహబ్‌కు కొత్త ఆలోచనలతో వచ్చే మహిళలకు అక్కడే యూనిట్ ఏర్పాటు చేసేందుకు అవకాశమివ్వడంతోపాటు పెట్టుబడి కోసం రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు సాయాన్ని అందజేయనుంది. దీనికి తొలుత ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు తమ ఆలోచనలను వీహబ్‌కు తెలియజేయాలి. ప్రాజెక్టు రిపోర్టు సమర్పించిన అనంతరం పారిశ్రామిక రంగంలో పేరొందిన నిపుణుల ఆధ్వర్యంలో వారికి మార్గనిర్దేశనం చేస్తారు. ఈ మేరకు వీహబ్ ఆరు ప్రముఖ సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వీ హబ్ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 8
ఎక్కడ : హైదరాబాద్‌లో
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎందుకు : మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు

కర్ణాటక రాష్ట్రానికి ప్రత్యేక జెండా
కర్ణాటక రాష్ట్రం కోసం రూపొందించిన అధికారిక జెండాను ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య ఆవిష్కరించారు. ‘నాద ధ్వజ’గా పేర్కొంటున్న ఈ జెండాలో పసుపు, తెలుపు, ఎరుపు వర్ణాలతోపాటు మధ్యలో రాష్ట్ర చిహ్నమైన ‘గండభేరుండ’ ఉంటుంది. రాష్ట్రానికి ప్రత్యేక జెండా ఉండాలన్నది కన్నడిగుల అభిప్రాయం, ఆకాంక్ష అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. దీనిని మార్చి 9న రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపింది.
ప్రస్తుతం దేశంలో జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేక జెండా ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కర్ణాటక రాష్ట్ర జెండా ఆవిష్కరణ
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : కర్ణాటక సీఎం సిద్ధారామయ్య

రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా గుత్తా
తెలంగాణ రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డిని నియమిస్తూ మార్చి 8న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతు సమన్వయ సమితిని లాభాపేక్షలేని సంస్థ(కార్పొరేషన్)గా నమోదు చేసినట్లు ఉత్తర్వులో పేర్కొంది. రైతు సమన్వయ సమితిలో ఐదుగురిని డెరైక్టర్లుగా నియమించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి డెరైక్టర్, చైర్మన్ హోదాలో ఉంటారు. వ్యవసాయ శాఖ కమిషనర్ ఎం.జగన్‌మోహన్‌ను రైతు సమన్వయ సమితి ఎండీగా, ఉద్యాన శాఖ డెరైక్టర్ ఎల్.వెంకట్రామిరెడ్డి, మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ జి.లక్ష్మీబాయి, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి సి.హెచ్.వి.సాయిప్రసాద్‌ను రైతు సమన్వయ సమితి డెరైక్టర్లుగా నియమించారు. నియామక ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని, విధి విధానాలను త్వరలో ఖరారు చేస్తామని తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ రైతు సమన్వయ సమితికి చైర్మన్ నియామకం
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : గుత్తా సుఖేందర్‌రెడ్డి

మహారాష్ట్రలో వేలాది మంది రైతుల ఆందోళన
మండుటెండలో బొబ్బలెక్కిన పాదాలతో ఆరు రోజులపాటు 180 కిలో మీటర్లు నడిచి తమ సమస్యల పరిష్కారం కోసం ముంబైకి చేరుకున్న వేలాది మంది రైతుల ఆందోళనకు మహారాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. రైతుల డిమాండ్లలో దాదాపు అన్నింటినీ నెరవేరుస్తామని రెవెన్యూ మంత్రి చంద్రకాంత్ పాటిల్ మార్చి 12న ప్రకటించారు. ఆ తర్వాత సీఎం ఫడ్నవిస్ అసెంబ్లీ బయట మాట్లాడుతూ.. రైతులు, ఆదివాసీల ప్రతినిధులతో సమావేశమయ్యామని.. ఆదివాసీలు సాగుచేస్తున్న అటవీ భూములను వారికే బదిలీ చేయాలని నిర్ణయించామని తెలిపారు. అయితే 2005కు ముందు నుంచి ఆ భూమిని తామే సాగు చేస్తున్నట్లు గిరిజనులు ఆధారాలు చూపించాలని వెల్లడించారు.
సీపీఎం అనుబంధ సంస్థ అయిన అఖిల భారత కిసాన్ సభ రైతుల పోరాటానికి నేతృత్వం వహించింది.

కోమటిరెడ్డి, సంపత్‌కుమార్ సభ్యత్వం రద్దు
తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో శాసనసభలో అనుచితంగా ప్రవర్తించినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి (నల్లగొండ), ఎస్‌ఏ సంపత్‌కుమార్ (అలంపూర్) ల సభ్యత్వం రద్దయింది. సభా హక్కుల ఉల్లంఘన, సభ గౌరవానికి భంగం కలిగించడం వంటి చర్యలకు పాల్పడ్డారనే కారణంగా ప్రస్తుత అసెంబ్లీ ముగిసే వరకు వారి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ మార్చి 13న అసెంబ్లీ తీర్మానించింది. అలాగే కాంగ్రెస్‌కు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలను సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేసింది.
మార్చి 12న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నర్సింహన్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెడ్‌ఫోన్స్ సెట్‌ను విసిరేయగా.. అది తగిలి శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి గాయమైంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వం రద్దు
ఎప్పుడు : మార్చి 13
ఎవరు : కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్
ఎక్కడ : తెలంగాణ శాసనసభ
ఎందుకు : అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించినందుకు

9 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మార్చి 13న మావోయిస్టులు జరిపిన భారీ దాడిలో తొమ్మిది మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న సీఆర్పీఎఫ్ 212 బెటాలియన్‌కు చెందిన జవాన్లు రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో సమీపంలోని కాసారం అనుబంధ క్యాంపునకు వెళ్తుండగా మావోయిస్టులు అత్యంత శక్తివంతమైన మందుపాతర (ఐఈడీ) పేల్చారు. ఇటీవల 20 మంది మావోయిస్టులు మరణించిన తడపలగుట్ట ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగానే మావోయిస్టులు ఈ దాడికి పాల్పడినట్లుగా భావిస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 9 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి
ఎప్పుడు : మార్చి 13
ఎవరు : బీహార్, ఉత్తరప్రదేశ్, బెంగాల్‌కు చెందినవారు
ఎక్కడ : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కిష్టారం వద్ద
ఎందుకు : మావోయిస్టులు భారీ మందుపాతర పేల్చడంతో

కొత్త పథకం హెల్త్ ప్రొఫైల్ ఆఫ్ తెలంగాణ స్టేట్’
తెలంగాణలో ప్రతి ఒక్కరికీ ఏటా ఉచిత వైద్య పరీక్షలు జరిపేందుకు త్వరలోనే ‘హెల్త్ ప్రొఫైల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ’ పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఏటా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఆ సమాచారాన్ని కంప్యూటరీకరించి, లబ్ధిదారులకు కార్డు అందిస్తారు. దీంతోపాటు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్రచికిత్సలు కూడా చేయిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కొత్త పథకం ‘హెల్త్ ప్రొఫైల్ ఆఫ్ తెలంగాణ స్టేట్’
ఎప్పుడు : త్వరలో
ఎవరు : కేసీఆర్
ఎక్కడ : తెలంగాణ
ఎందుకు : ప్రతి ఒక్కరికీ ఏటా ఉచిత వైద్య పరీక్షలు చేయడానికి

2018-19 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2018-19 సంవత్సరానికి ఏపీ రాష్ట్ర బడ్జెట్‌ను మార్చి 8న శాసన సభలో ప్రవేశపెట్టారు. ఆయన బడ్జెట్‌ను రూ.1,91,064 కోట్లతో రూపొందించారు.
ముఖ్యాంశాలు
రెవెన్యూ వ్యయం: రూ.1,50,272 కోట్లు
మూలధన వ్యయం: రూ.28,678 కోట్లు
రెవెన్యూ మిగులు: రూ.5,235.24 కోట్లు
ద్రవ్యలోటు : రూ.24,205 కోట్లు
సమకూరే ఆదాయం
కేంద్ర పన్నుల్లో వాటాల రూపంలో: రూ.33,930 కోట్లు
గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ద్వారా: రూ.50,696 కోట్లు
ఠిప్రభుత్వ సొంత పన్నుల ద్వారా: రూ.65,535 కోట్లు
ప్రాధాన్య రంగాలు- నిధులు
గ్రామీణాభివృద్ధి: రూ.20,815.98 కోట్లు
నీటిపారుదల, వరద నియంత్రణ: రూ.16,978.23 కోట్లు
వ్యవసాయం, అనుబంధ రంగాలు: రూ.12,355.32 కోట్లు
సాధారణ విద్య: రూ.24,185.75 కోట్లు
సంక్షేమం: రూ.13,722.98 కోట్లు
వైద్యం: రూ.8,463.51 కోట్లు
విద్యుత్: రూ.5,052.54 కోట్లు
గృహ నిర్మాణం: రూ.3,679.53 కోట్లు
రవాణా: రూ.4,653.74 కోట్లు.

ఏపీ సామాజిక ఆర్థిక సర్వే: 2017-18
2017-18 ఆర్థిక సర్వేని రాష్ట్ర ప్రభుత్వం మార్చి 8న శాసనసభలో ప్రవేశపెట్టింది. సర్వే ప్రకారం- ఏపీ తలసరి ఆదాయం రూ.1,42,054గా అంచనా. ఇది 2015-16లో రూ.1,07,276గా ఉంది. ఏపీ 2017-18లో దేశంలో రొయ్యల ఎగుమతి; పండ్లు, సుగంధ ద్రవ్యాలు, కోకో, నిమ్మ, ఆయిల్‌పామ్, బొప్పాయి, టమోటా ఉత్పత్తిలో మొదటి స్థానంలో; జీడిమామిడి, మామిడి, బత్తాయి, మాంసం, పాల ఉత్పత్తిలో రెండోస్థానంలో నిలిచింది.

బ్రహ్మానందానికి ‘హాస్య నట బ్రహ్మ’ అవార్డు
1,100 సినిమాల్లో నటించిన ప్రముఖ హాస్యనటుడు కె.బ్రహ్మానందాన్ని ‘హాస్య నట బ్రహ్మ’ అవార్డుతో సత్కరించారు. టీఎస్‌ఆర్ కాకతీయ లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో మార్చి 11న మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. ఇందులో స్పీకర్ మధుసూదనాచారి, కళాబంధు సుబ్బరామిరెడ్డి, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సినీనటులు జయప్రద, రాజశేఖర్, జీవిత, బాబుమోహన్, అలీ, శ్రద్ధాదాస్, రఘుబాబు, శ్రీనివాస్‌రెడ్డిలకు కాకతీయ పురస్కారాలు అందజేశారు. కళారంగంలో సేవలు అందిస్తున్న ఉమ్మడి జిల్లాకు చెందిన ఎల్లూరి శివారెడ్డి, కపిలవాయి లింగమూర్తి, గోరటి వెంకన్న, చిక్కా హరీశ్, జంగిరెడ్డి, వంగీశ్వర నీరజ, పద్మాలయ ఆచార్యను ‘కాకతీయ అవార్డు’లతో సత్కరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్రహ్మానందానికి ‘హాస్య నట బ్రహ్మ’ అవార్డు
ఎప్పుడు : మార్చి 11
ఎక్కడ : మహబూబ్‌నగర్‌లో
ఎవరు : టీఎస్‌ఆర్ కాకతీయ లలిత కళాపరిషత్

హైదరాబాద్‌లో టాటా బోయింగ్’ ప్రారంభం
Current Affairs రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్లలో ఉన్న టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్‌లో రూ. 400 కోట్లతో నెలకొల్పిన టాటా బోయింగ్ ఏరోస్పేస్ విమానాల తయారీ పరిశ్రమను మార్చి 1న కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దీంతోపాటే ఏహెచ్-64 బోయింగ్ విమానాలు, హెలికాప్టర్లకు ప్యూస్‌లేజ్ (ప్రధాన భాగాల)ను తయారు చేసే యూనిట్‌ను ప్రారంభించారు. ఈ పరిశ్రమకు 2016 జూన్ 19న నాటి రక్షణ మంత్రి మనోహర్ పరీకర్, కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఇప్పటికే ఆదిబట్ల ఏరోస్పేస్ సెజ్‌లో టాటా అడ్వాన్‌‌సడ్ సిస్టమ్స్, టాటా లాకిడ్ మార్టిన్, టాటా సికోర్‌స్కై లాంటి సంస్థలు ఉన్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టాటా బోయింగ్ ఏరోస్పేస్ విమానాల తయారీ పరిశ్రమ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : ఆదిభట్ల, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా

కేన్సర్ నియంత్రణకు టాటా ట్రస్టుతో తెలంగాణ ఒప్పందం
కేన్సర్ వ్యాధి నియంత్రణకు టాటా ట్రస్టుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మార్చి 1న శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని నోవాటెల్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి కె. తారకరామారావు, టాటా సంస్థల అధినేత, మాజీ చైర్మన్ రతన్ టాటా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతు.. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఉచిత పరీక్షల నిర్వహణకు కూడా ప్రభుత్వం యోచిస్తోందన్నారు. తెలంగాణ ప్రజల సమగ్ర ఆరోగ్య సమాచారాన్ని ఆధార్‌తో అనుసంధానం చేసేలా చర్యలు తీసుకునేందుకు అడుగులు వేస్తున్నామన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టాటా ట్రస్టు, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఒప్పందం
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : మంత్రి కేటీఆర్, టాటా సంస్థల అధినేత రతన్ టాటా
ఎందుకు : కేన్సర్ నియంత్రణ కోసం

కరీంనగర్ అధ్యాపకుడికి జాతీయ పురస్కారం
మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ పురస్కారం 2018 కి కరీంనగర్‌కు చెందిన మహ్మద్ ఆజమ్ ఎంపికయ్యారని హైదరాబాద్ దళిత సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ తెలిపారు. సామాజిక స్పృహ, నాయకత్వ లక్షణాలు కలిగి ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని నాలుగేళ్లుగా సేవలందిస్తున్న ఆజమ్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ అవార్డును మార్చి 15న తిరుపతిలో జరిగే సభలో ప్రదానం చేస్తారు. ఆజమ్ ప్రస్తుతం జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలలో ఆంగ్ల విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ పురస్కారం - 2018
ఎప్పుడు : మార్చి 2
ఎవరు : మహ్మద్ ఆజమ్, కరీంనగర్
ఎందుకు : అధ్యాపక వృత్తిలో ఉంటు సామాజిక స్పృహ, నాయకత్వ లక్షణాలు కలిగి ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటున్నందుకు



ఏపీలో హెల్త్ బులెటిన్, పలకరింపు కార్యక్రమాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలిపేందుకు 'హెల్త్ బులిటెన్', చిన్నారులకు టీకాలు వేసేందుకు ఉద్దేశించిన 'పలకరింపు' కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్చి 4న ప్రారంభించారు. మార్చి 5 నుంచి 30వ తేదీ వరకూ ‘పలకరింపు’ కార్యక్రమం ద్వారా ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ టీకాలు వేసే కార్యక్రమం చేపట్టనున్నారు. 57 వేల మందికి పైగా సిబ్బంది 1.22 కోట్ల ఇళ్లకు వెళ్లి ఈ ‘పలకరింపు’ కార్యక్రమంలో పాల్గొంటారు.
రాష్ట్రంలో ఆర్థరైటిస్(ఎముకలు, కీళ్లజబ్బులు), ఆస్తమా, హైపర్ టెన్షన్ జబ్బులు తీవ్రంగా ఉన్నట్టు సీఎం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వెల్లడైంది. జిల్లాల వారీగా చూస్తే.. విజయనగరం, వైఎస్సార్ జిల్లాల్లో హైపర్ టెన్షన్ ఎక్కువగా ఉండగా పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో మధుమేహం తీవ్రంగా ఉంది. శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో ఆస్తమా జబ్బుతో బాధపడుతున్నవారి సంఖ్య ఎక్కువ ఉంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గుండె జబ్బులతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉండగా.. ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఆర్థరైటిస్ జబ్బు అధికంగా ఉన్నట్టు తేలింది. నెల వారీగా విడుదల చేసే బులెటిన్‌లో ఈ జబ్బులకు పరిష్కారం సూచించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హెల్త్ బులిటెన్, పలకరింపు కార్యక్రమాలు ప్రారంభం
ఎప్పుడు : మార్చి 4
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

మొదటిసారి ఇనుము వాడింది ఏపీలోనే
దేశంలో మొదటిసారిగా ఇనుము వాడింది సింధు నాగరికత ప్రజలని ఇన్నాళ్లూ అనుకున్నాం. కానీ వారి కంటే 500 ఏళ్ల ముందే.. అది కూడా ఆంధ్రప్రదేశ్‌లో.. ముందుగా ఇనుమును వాడారని ఏపీ పురావస్తు పరిశోధనల ద్వారా వెల్లడైంది. గోదావరి నదీ తీరాన మెగాలిథిక్ నాగరికత కాలంలో ఇనుప పనిముట్లు వాడినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా సింధు నాగరికత కాలం నాటి ప్రజల కంటే దక్షిణ భారతదేశంలో విలసిల్లిన మెగాలిథిక్ నాగరికత కాలం నాటి ప్రజలు ఆధునికంగా ముందున్నారని స్పష్టమైంది. పుణేకు చెందిన డెక్కన్ కాలేజీ సహకారంతో పురావస్తు శాఖ పోలవరం ముంపు గ్రామాల్లో జరుపుతున్న పరిశోధనలు ఈ విషయాన్ని నిర్ధారించాయి.
మెగాలిథిక్ నాగరికత అంటే..
ఆదిమానవ దశ నుంచి పరిపక్వతతో కూడిన కుటుంబ జీవనానికి మధ్య ఉన్న సంధి దశనే మెగాలిథిక్ నాగరికత అంటారు. క్రీ.పూ.3,000 నుంచి క్రీ.పూ.1,000 మధ్య ఈ నాగరికత దక్షిణ భారతదేశంలో విలసిల్లింది. సింధులోయ నాగరికతలో క్రీ.పూ.2,500 నుంచి క్రీ.పూ.1,750 మధ్య ఇనుము వాడినట్లు పరిశోధకులు నిర్ధారించారు. కానీ అంతకంటే దాదాపు 500 ఏళ్ల క్రితమే మెగాలిథిక్ నాగరికతలో ఇనుము వాడినట్లు పురావస్తు పరిశోధనల్లో వెల్లడైంది. దీంతో నాటి మానవుల జీవన శైలి మీద పరిశోధనలు చేస్తే మరింత సమాచారం లభిస్తుందని భావిస్తున్నారు. తవ్వకాల్లో బయల్పడిన ఎముకల ఆధారంగా అప్పటి మానవుల డీఎన్‌ఏ మ్యాపింగ్ చేయించాలని పురావస్తు శాఖ కమిషనర్ వాణీమోహన్ నిర్ణయించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలో మొదటిసారి ఇనుము వాడింది ఏపీలోనే
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : ఏపీ పురావస్తు శాఖ, డెక్కన్ కాలేజీ - పూణె

తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారిగా రజత్‌కుమార్
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా రజత్‌కుమార్ మార్చి 6న బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పర్యావరణ, అటవీశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన రజత్‌కుమార్‌ను రిలీవ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 5న ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రాకు పర్యావరణ, అటవీ శాఖ పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : రజత్‌కుమార్

తొలి మహిళా రైల్వేస్టేషన్.. చంద్రగిరి
దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో తొలి మహిళా రైల్వేస్టేషన్‌గా చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి ఎంపికైంది. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకిచ్చే ప్రత్యేక కానుకగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ దీన్ని ప్రకటించారు. మార్చి 6న చంద్రగిరి రైల్వేస్టేషన్‌కు మహిళా రైల్వేస్టేషన్‌గా నామకరణం చేశారు. ఆయన మాట్లాడుతూ దేశంలో ఇప్పటికే రెండు మహిళా రైల్వేస్టేషన్‌లు ఉన్నాయని, చంద్రగిరి మూడోదని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలో తొలి మహిళా రైల్వేస్టేషన్
ఎప్పుడు : మార్చి 6
ఎక్కడ : చంద్రగిరి, చిత్తూరు జిల్లా

విశాఖ కలెక్టర్‌కు తొలి విద్యుత్ కారు
దేశంలోనే తొలిసారిగా విద్యుత్ కారును విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా అందజేసింది. విశాఖలోని వివిధ శాఖల అధికారులకు దాదాపు 110 ఎలక్ట్రిక్ కార్లను ప్రభుత్వం కేటాయించనుంది. దేశంలోనే తొలిసారిగా అధికారికంగా విద్యుత్ కారును ఉపయోగించిన ఘనత విశాఖ జిల్లాకు దక్కిందని, ఈ వాహనాన్ని ప్రథమంగా తానే నడపడం సంతోషంగా ఉందని కలెక్టర్ అన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలో తొలి విద్యుత్ కారుని అందుకున్న కలెక్టర్
ఎప్పుడు : మార్చి 7
ఎవరు : విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్

10 మంది మావోయిస్టులు మృతి
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో 2018, మార్చి 2న జరిగిన ఎన్‌కౌంటర్లో 10 మంది మావోయిస్టులు, ఒక గ్రేహౌండ్‌‌స కమాండో మరణించారు. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా, వెంకటాపురం మండలం తిమ్మాపురం సమీపంలోని తడపల గుట్టల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Published date : 15 Mar 2018 12:53PM

Photo Stories