జనవరి 2018 రాష్ట్రీయం
ప్రముఖ ఐటీరంగ కంపెనీ టెక్ మహీంద్ర వరంగల్‌లో తమ కేంద్రాన్ని (టెక్ సెంటర్) ఏర్పాటు చేయనుంది. టెక్ మహీంద్ర కార్యకలాపాలు ప్రారంభించా లని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేసిన విజ్ఞప్తికి కంపెనీ యాజమాన్యం సానుకూలంగా స్పందించింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా మంత్రి కేటీఆర్ జనవరి 25న మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర, సీఈవో సీపీ గుర్నానీతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం-మహీంద్ర సంస్థల మధ్య ఉన్న భాగసామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని మంత్రి కోరగా, వరంగల్‌లో టెక్ సెంటర్ ఏర్పాటు చేస్తానని ఆనంద్ హామీ ఇచ్చారు. తొలుత 500 మందితో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు అలీబాబా క్లౌడ్ సహకారం
దావోస్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జనవరి 24న క్లౌడ్ కంప్యూటింగ్, వెబ్ సర్వీసెస్ కంపెనీ అలీబాబా క్లౌడ్ అధ్యక్షుడు సైమన్ హూతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి అలీబాబా సహకారం అందిస్తే మరిన్ని అద్భుతాలు సాధిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. సైమన్ హూ స్పందిస్తూ.. భారత్‌లో తమరెండో డేటా సెంటర్‌ను ఈ ఏడాది చివరకు ఆంధ్రప్రదేశ్ లోనే ఏర్పాటు చేస్తామని చంద్రబాబుకు హామీ ఇచ్చారు. వ్యవసాయంలో సూక్ష్మ పోషకాలు, క్రిమి సంహారక మందులు, రసాయన ఎరువులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేయాలన్నది తమ ఉద్దేశమని, ఆ దిశగా ఎనలిటిక్స్ రంగంలో అలీబాబా సంస్థ సహకారం కోరుతున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్
బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ జనవరి 26న ప్రారంభమైంది. 28వ తేదీ వరకు జరిగే ఈ వేడుకల్లో పలు సాహిత్య, సామాజిక అంశాలపై 30కిపైగా సదస్సులు, సాంస్కృతిక, చర్చా కార్యక్రమాలు, వర్క్‌షాపులు, ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో స్పెయిన్ అతిథి దేశంగా పాల్గొంటుంది. 15కు పైగా రాష్ట్రాలు, 10 దేశాల నుంచి ప్రతినిధులు ఈ వేడుకలకు హాజరయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్
ఎప్పుడు : జనవరి 26 - 28
ఎక్కడ : బేగంపేట్ పబ్లిక్ స్కూల్
ఆంధ్రప్రదేశ్ సర్కార్ విజన్ - 2029
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో 44 శాతం కుటుంబాలకు ఇంటి ఆవరణలో స్నానం చేసే గదులు కూడా లేవు. ఇందులో అత్యధిక శాతం ఎస్సీ, ఎస్టీల కుటుంబాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇది ఎక్కువగా ఉంది. వీరిలో అత్యధికులకు బ్యాంకు ఖాతాలు కూడా లేకపోవడం గమనార్హం. ఇక 69 లక్షల కుటుంబాలకు సెంటు భూమి కూడా లేదు. విజన్-2029లో స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నివేదికలో ఈ అంశాలు స్పష్టమయ్యాయి. ప్రభుత్వ పథకాలకు నోచుకోక 48 లక్షల కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నట్లు తేలింది.
నివేదికలో ముఖ్యాంశాలు..
- రాష్ట్రంలో ఇంటి ఆవరణలో స్నానపు గదుల్లేని కుటుంబాలు 44 శాతం ఉన్నాయి.
- 72 శాతం ఎస్టీ కుటుంబాలకు, 54 శాతం ఎస్సీ కుటుంబాలు, 38 శాతం మంది ఇతరులకు ఇంటి ఆవరణలో స్నానం గదులు లేవు.
- రాష్ట్రంలో 33 శాతం కుటుంబాలకు సరైన గూడు లేదు. నాణ్యతతో కూడిన నివాస గృహాలు 67 శాతం మందికే ఉన్నాయి.
- రాష్ట్రంలో 1.37 కోట్ల మంది నిరక్షరాస్యులు ఉండగా వీరిలో 39 లక్షల మంది ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. ఇతర కుటుంబాల్లో 98 లక్షల మంది నిరక్షరాస్యులున్నారు.
- 60 శాతం కుటుంబాలకు ఇంట్లో నల్లా నీటి సౌకర్యం లేదు.
విజయవాడలో సూర్యారాధన కార్యక్రమం
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం జనవరి 28న సూర్యారాధన కార్యక్రమం నిర్వహించింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు.. చరిత్రలో మొదటి సారిగా ప్రభుత్వం తరఫున ప్రకృతిని ఆరాధించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. భారత దేశంలో మొదటిగా ఆంధ్రప్రదేశ్‌లోనే సూర్యుడు ఉదయిస్తాడని, ఆ తర్వాతే ఇతర రాష్ట్రాలకు సూర్యోదయం జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. సూర్యారాధన మతం కాదని, సైన్‌స అని అన్నారు. కులమతాలకు అతీతంగా సూర్యారాధన కొనసాగించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న మాదిరిగానే సూర్యారాధనను రాష్ట్ర స్థాయి ఉత్సవంగా నిర్వహిస్తున్నామన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సూర్యారాధన కార్యక్రమం
ఎప్పుడు : జనవరి 28
ఎక్కడ : విజయవాడ
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
హైదరాబాద్‌లో అంతర్జాతీయ కణ జీవశాస్త్ర సదస్సు
హైదరాబాద్ వేదికగా జనవరి 27 నుంచి 31 వరకు అంతర్జాతీయ కణ జీవశాస్త్ర సదస్సు(ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ సెల్ బయాలజీ) జరిగింది. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) ఆధ్వర్యంలో షామీర్‌పేట్‌లోని లియోనియా రిసార్ట్‌లో ఈ సదస్సు జరిగింది. అమెరికాకు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత మార్టిన్ చాల్ఫీ ప్రారంభోపన్యాసం చేశారు. జీవ వైజ్ఞానిక శాస్త్రంలో మూడు అగ్రగామి సంస్థలైన ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ సెల్ బయాలజీ (ఐఎఫ్‌సీబీ), ఏషియన్ పసిఫిక్ ఆర్గనైజేషన్ ఫర్ సెల్ బయాలజీ (ఏపీఓసీబీ), ఇండియన్ సొసైటీ ఫర్ సెల్ బయాలజీ (ఐఎస్‌సీబీ)లు తొలిసారిగా ఒకే వేదికను పంచుకున్నాయి. 30 దేశాల నుంచి 300 సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు, 1,400 మంది జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ కణ జీవశాస్త్ర సదస్సు
ఎప్పుడు : జనవరి 27 - 31
ఎక్కడ : హైదరాబాద్‌లో
విశాఖలో అంతర్జాతీయ మహిళా పారిశ్రామిక సదస్సు
పారిశ్రామిక నవకల్పనలు, సాంకేతిక ఉత్పత్తి, పారిశ్రామికీకరణ అంశాలపై విశాఖపట్నంలో జనవరి 17న అంతర్జాతీయ మహిళా పారిశ్రామికాభివృద్ధి సదస్సు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ సదస్సుని ప్రారంభించారు. తమ ఉత్పత్తుల్ని ప్రదర్శించడంతో పాటు వ్యాపార అభివృద్ధిపై చర్చించేందుకు దేశ విదేశాలకు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలు సదస్సుకి హాజరయ్యారు. భారత మహిళా పారిశ్రామిక వేత్తల సమాఖ్య (అలీఫ్ ఇండియా), దక్షిణాసియా మహిళాభివృద్ధి సంస్థతో కలిసి ఏపీ ప్రభుత్వం ఈ సదస్సు నిర్వహించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ మహిళా పారిశ్రామివేత్తల సదస్సు
ఎప్పుడు : జనవరి 17-19
ఎక్కడ : విశాఖపట్నం
ఎవరు : భారత మహిళా పారిశ్రామిక వేత్తల సమాఖ్య (అలీఫ్ ఇండియా), దక్షిణాసియా మహిళాభివృద్ధి సంస్థ, ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా సిసోడియా
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)గా ఆర్.పి.సిసోడియాను నియమిస్తూ జనవరి 17న కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు భన్వర్‌లాల్ సీఈవోగా పనిచేశారు. ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత జాయింట్ సీఈవో అనూప్‌సింగ్ రెండు రాష్ట్రాలకు ఇన్‌చార్జి సీఈవోగా విధులు నిర్వర్తించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ప్రధాన ఎన్నికల అధికారి
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : ఆర్.పి. సిసోడియా
తెలంగాణలో నేరస్తులు 2.18 లక్షలు
రాష్ట్రంలో తరచూ నేరాలకు పాల్పడేవారు 2.1 లక్షల మంది ఉన్నట్లు పోలీసుశాఖ నేరస్తుల సమగ్ర సర్వేలో లెక్కతేల్చింది. రాష్ట్రంలో నేరస్తుల గుర్తింపు, వారి కదలికలు, నిఘా కోసం జనవరి 18న ఒకేరోజున రాష్ట్రవ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించింది. డీజీపీ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్ని స్థాయిల పోలీసు సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. పదే పదే నేరాలకు పాల్పడేవారెంత మంది, దొంగలు ఎందరు, దోపిడీలకు పాల్పడేవారెంత మంది, ఈవ్‌టీజింగ్, ఇతర నేరాలకు పాల్పడేవారెంత మంది ఉన్నారనే లెక్కలు తేల్చారు.
సమగ్ర సర్వే ద్వారా గుర్తించిన నేరస్తుల వివరాలను, వారి నివాసాలకు చేసిన జియో ట్యాగింగ్‌ను ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెట్రోలింగ్ వాహనాలు, బ్లూకోల్ట్స్ వాహనాలకు అనుసంధానించారు. అంతేగాకుండా ఈ వివరాలన్నింటినీ టీఎస్ కాప్ యాప్‌కు అనుసంధానం చేయనున్నారు. తద్వారా ఎక్కడైనా దొంగతనం లేదా ఇతర నేరం ఏదైనా జరిగితే.. వెంటనే అనుమానితులను గుర్తించడం, వారి నివాసాలకు వెళ్లి విచారించడం సులభతరం కానుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణలో తరచూ నేరాలకు పాల్పడేవారు 2.18 లక్షల మంది
ఎప్పుడు : జనవరి 18
ఎవరు : తెలంగాణ పోలీస్
ఏపీ-నీతిఆయోగ్ మధ్య ఆన్‌లైన్ డ్యాష్‌బోర్డ్ ఒప్పందం
ముఖ్యమంత్రి చంద్రబాబు నివాస సముదాయంలో కొత్తగా నిర్మించిన గ్రీవెన్‌స హాలులో జనవరి 18న జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్సులో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. దేశంలో అత్యంత వెనుకబడిన 115 జిల్లాల్లో ఆన్‌లైన్ డ్యాష్ బోర్డు అభివృద్ధికి సంబంధించి నీతి ఆయోగ్ - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అనంతరం మాట్లాడిన రాజీవ్ కుమార్.. దేశాన్ని 2022 నాటికి సరికొత్త భారతావనిగా ఆవిష్కరించి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి సర్వ శ్రేష్ట భారత్‌ను ఆవిష్కరించాలన్నారు. అవినీతిరహిత, పరిశుభ్ర, ఆరోగ్య, నైపుణ్య, సురక్షిత భారత్ సాకారం కావాలని ఆకాంక్షించారు. టీమ్ ఇండియా మాదిరిగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ క్రతువులో ఆంధ్రప్రదేశ్ ముందుండాలని సూచించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ - నీతి ఆయోగ్ మధ్య ఆన్‌లైన్ డ్యాష్ బోర్డు అభివృద్ధి ఒప్పందం
ఎప్పుడు : జనవరి 18
ఎక్కడ : అమరావతి
టీఎస్ వైద్య, ఆరోగ్య శాఖకు జాతీయ అవార్డు
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు మరో జాతీయ అవార్డు దక్కింది. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్‌ఐ) నిహిలెంట్ ఈ-గవర్నెన్‌స అవార్డు-2017కు రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ బెస్ట్ ఈ-గవర్నెన్‌స స్టేట్-అవార్డు ఆఫ్ రికగ్నేషన్ (హెల్త్ అండ్ వెల్ బీయింగ్) విభాగంలో ఎంపికై ంది. ఈ మేరకు జనవరి 20న కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ ఈ అవార్డుని అందుకున్నారు.
2002 నుంచి ఈ సంస్థ ఈ -గవర్నెన్‌సలో ప్రగతి సాధించిన రాష్ట్రాలను ఎంపిక చేసి అవార్డులను అందిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖకు ఈ-గవర్నెన్స్ అవార్డు-2017
ఎప్పుడు : జనవరి 20
ఎవరు : కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా
ఎక్కడ : న్యూఢిల్లీలో
టోక్యో క్లీన్ అథారిటీతో తెలంగాణ ఒప్పందం
టోక్యో క్లీన్ అథారిటీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బృందం జపాన్ పర్యటనలో భాగంగా జనవరి 19న ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఘన వ్యర్థాల భస్మీకరణ, నిర్వహణకు సంబంధించి సాంకేతిక సహకారాన్ని టోక్యో సహాయం అందించనుంది. పౌల్ట్రీ రంగంలో సాంకేతిక సహకారానికి సంబంధించి ఐఎస్‌ఈ ఫుడ్‌సతో కూడా ఓ అవగాహనకు వచ్చింది. కోడిగుడ్ల ఉత్పత్తిలో కొత్త సాంకేతికతను వినియోగించుకోనుంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేకంగా సోలార్ పార్కును రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టోక్యో క్లీన్ అథారిటీతో ఎంవోయూ
ఎప్పుడు : జనవరి 19
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : మంత్రి కేటీఆర్ జపాన్ పర్యటనలో భాగంగా
ఏపీ మాజీ డీజీపీ రాగాల కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డీజీపీ రామకొండల రాగాల (80) జనవరి 21న హైదరాబాద్‌లో కన్నుమూశారు. తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు మండలం చదలవాడ గ్రామానికి చెందిన ఆర్.కె.రాగాల 1994లో ఏడు నెలలపాటు ఆంధ్రప్రదేశ్ డీజీపీగా పనిచేశారు. పోలీసు శాఖలో 33 ఏళ్లపాటు కమ్యూనికేషన్ ఐజీ, ఫైర్ సర్వీసెస్ డీజీ, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ కన్నుమూత
ఎప్పుడు : జనవరి 21
ఎవరు : రామకొండల రాగాల
ఎక్కడ : హైదరాబాద్
హైదరాబాద్‌లో అంతర్జాతీయ హెరిటేజ్ సదస్సు
అంతర్జాతీయ హెరిటేజ్ సదస్సు జనవరి 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగింది. ఈ సదస్సులో చారిత్రక పరిశోధకుడు, ది రాయల్ హిస్టారికల్ సొసైటీ ఫెలో కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డి తన పరిశోధన వ్యాసాన్ని సమర్పించారు. ఇందులో ఆయన హైదరాబాద్ పాతపేరు చిచులం అని తెలిపారు. చిచులం లేదా చచలం అంటే చింతచెట్టు అని అర్థం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హైదరాబాద్‌లో అంతర్జాతీయ హెరిటేజ్ సదస్సు
ఎప్పుడు : జనవరి 19 - 20
ఎవరు : ది రాయల్ హిస్టారికల్ సొసైటీ ఫెలో లింగాల పాండురంగారెడ్డి
ఎక్కడ : మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ
‘కళారత్న’ రవిశంకర్ కన్నుమూత
కళారత్న బిరుదు గ్రహీత కూచిపూడి నాట్య కళాకారుడు వెంపటి రవిశంకర్ (49) జనవరి 23న హైదరాబాద్ మణికొండలోని తన నివాసంలో కన్నుమూశారు. తండ్రి వెంపటి చినసత్యం వారసునిగా ఈ రంగంలో ప్రవేశించిన ఆయన తండ్రి అడుగుజాడలనే అనుసరించారు. పెదనాన్న పెద్దసత్యం బాణీని కళకు చేర్చి కూచిపూడి నాట్యంలో శిల్పప్రావీణ్యానికి శోభను చేకూర్చారు. దాదాపు 80కి పైగా నృత్యరీతులను దేశవిదేశాల్లో శిష్యులకు నేర్పించారు. 200లకు పైగా స్వీయ రచనలకు సంగీతాన్ని సమకూర్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘కళారత్న’ రవిశంకర్ కన్నుమూత
ఎప్పుడు : జనవరి 23
ఎక్కడ : హైదరాబాద్‌లో
తెలంగాణలో గుట్కాపై నిషేధం పొడిగింపు
రాష్ట్రంలో గుట్కా, పాన్ మసాలా అమ్మకంపై నిషేధాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రత కమిషనర్ శాంతికుమారి ఈ మేరకు జనవరి 11న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డెరైక్టర్ శంకర్ ఈ ప్రకటన విడుదల చేశారు. నికొటిన్, పొగాకు ఆనవాళ్లు ఉండి, నోటి ద్వారా తీసుకునే అన్ని ఉత్పత్తులపైనా నిషేధం విధించినట్లు తెలిపారు. గుట్కా, పాన్‌మసాలా అమ్మకాలపై 2013 జనవరి 9 నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధిస్తోంది. ప్రతిఏటా కొత్తగా ఉత్తర్వులు జారీ చేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గుట్కాపై నిషేధం పొడిగింపు
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : తెలంగాణలో
ఏపీ ‘నాలా’ బిల్లుకు గవర్నర్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూ వినియోగ మార్పిడి (నాలా) చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ నరసింహన్ ఆమోద ముద్ర వేశారు. శాసనసభ, శాసనమండలి 2017 డిసెంబర్‌లో ఆమోదించి పంపిన నాలా బిల్లుపై గవర్నర్ జనవరి 11న సంతకం చేశారు. నాలా రుసుము తగ్గింపు, నిబంధనల సవరణపై ఆర్డినెన్‌స కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడు నెలల క్రితం పంపిన ప్రతిపాదనలపై గవర్నర్ పలు సందేహాలను వ్యక్తం చేయడమే కాకుండా పునఃపరిశీలించాలంటూ ఫైల్ వెనక్కి పంపటం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ ‘నాలా’ బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : గవర్నర్ నరసింహన్
పీఎస్సీల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా రెండోసారి చక్రపాణి
యూపీఎస్సీ చైర్మన్ సమక్షంలో పీఎస్సీ చైర్మన్ల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ప్రొఫెసర్ చక్రపాణి రెండోసారి ఎన్నికయ్యారు. గోవాలో జనవరి 11, 12 తేదీల్లో జరిగిన పబ్లిక్ సర్వీసు కమిషన్ (పీఎస్సీ) చైర్మన్ల స్టాండింగ్ కమిటీ 20వ జాతీయ సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నారు. చక్రపాణి.. ఆ పదవిలో మరో రెండేళ్లపాటు కొనసాగుతారు. ఒకే పీఎస్సీ చైర్మన్‌ను రెండోసారి ఎన్నుకోవడం ఇదే ప్రథమం.
అన్ని రాష్ట్రాల్లో వివిధ ఉద్యోగ పరీక్షల్లో మోడల్ స్కీం, సిలబస్‌ను అమలు చేయాలని ఈ సదస్సులో పబ్లిక్ సర్వీసు కమిషన్ (పీఎస్సీ) చైర్మన్ల స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పీఎస్సీల స్టాండింగ్ కమిటీ 20వ జాతీయ సదస్సు
ఎప్పుడు : జనవరి 11,12
ఎక్కడ : గోవా
ఎవరు : రెండోసారి ీపఎస్సీల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన ఘంటా చక్రపాణి
తెలంగాణలో ‘అమ్మ ఒడి’ సేవల విస్తరణ
అమ్మ ఒడి (102 సేవలు) విస్తరణ, కొత్తగా ద్విచక్ర అంబులెన్సులు, ఏఎన్‌ఎంలు వినియోగించే ద్విచక్ర వాహనాల (వింగ్‌స) సేవలను సీఎం కేసీఆర్ జనవరి 17న హైదరాబాద్‌లో ప్రారంభించారు. కేంద్రం అమలు చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా అమలవుతున్న జననీ సురక్ష యోజన నిధులతో రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రులలో కాన్పు అయిన మహిళను, శిశువును సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చడం లక్ష్యంగా ఈ కార్యక్రమం మొదలైంది. 2016 డిసెంబర్ 28న రాష్ట్రంలో అమ్మ ఒడి సేవలను ప్రారంభించారు. మొదటి దశలో 41 వాహనాలతో సేవలు మొదలయ్యాయి. జీవీకే ఈఎంఆర్‌ఐ భాగస్వామ్యంతో 102 వాహనాలకు విస్తరించింది. అయితే 12 జిల్లాల్లోనే ఈ సేవలను కొనసాగిస్తున్నారు. మిగతా జిల్లాల్లోనూ ఈ పథకం అమలుకు కొత్తగా 200 వాహనాలను కొనుగోలు చేసి అందుబాటులోకి తెచ్చారు.
అలాగే అత్యవసర సమయాల్లో వేగంగా రోగుల దగ్గరకు వెళ్లేందుకు వినియోగించే ద్విచక్ర అంబులెన్‌స సేవలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సేవల కోసం 50 వాహనాలను కొనుగోలు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమ్మ ఒడి(102) సేవల విస్తరణ
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : తెలంగాణలో
‘మొయిబా’తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా జనవరి 17న తెలంగాణ ప్రభుత్వం.. మొబైల్ ఇంటర్నెట్ బిజినెస్ అసోసియేషన్ (మొయిబా) సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్‌స, వర్చువల్ రియాలిటీ, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ తదితర అంశాల్లో మొయిబా, రాష్ట్ర ప్రభుత్వం పరస్పర సహకారం కోసం ఈ ఒప్పందం కుదిరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘మొయిబా’ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
ఎప్పుడు : జనవరి 16
ఎవరు : మంత్రి కేటీఆర్ దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా
ఎక్కడ : దక్షిణ కొరియా
ఏపీలో ఐదో విడత 'జన్మభూమి - మా ఊరు' కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్‌లో ఐదో విడత 'జన్మభూమి - మా ఊరు' కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనవరి 2న ప్రకాశం జిల్లా దర్శిలో ప్రారంభించారు. జనవరి 2 నుంచి 11 వరకు కొనసాగే కార్యక్రమంలో ప్రభుత్వ పాలనను మొత్తం ప్రజల ముందుకు తెస్తున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు. త్వరలో కొత్తగా మరో 4 లక్షల మందికి పింఛన్లు ఇవ్వబోతున్నామని.. దీంతో మొత్తం 50 లక్షల మందికి పింఛన్లు ఇచ్చినట్లు అవుతుందని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐదో విడత జన్మభూమి - మా ఊరు కార్యక్రమం
ఎప్పుడు : జనవరి 2 -11
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో
ఎందుకు : ప్రభుత్వ పాలనను ప్రజల ముందుకు తెచ్చేందుకు
తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా ఎర్రోళ్ల శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్ చైర్మన్‌గా ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను నియమించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జనవరి 2న సంతకం చేశారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం గణపూర్‌కు చెందిన యువ నాయకుడు. కమిషన్ సభ్యులుగా బోయిళ్ల విద్యాసాగర్ (సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ఎడవల్లి), ఎం.రాంబాల్ నాయక్ (రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పోడగుట్ట తండా), కుర్సం నీలాదేవి (ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రాయగూడ), సుంకపాక దేవయ్య (హైదరాబాద్‌లోని రాంనగర్), చిలకమర్రి నర్సింహ (రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల)ను నియమించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : చైర్మన్‌గా ఎర్రోళ్ల శ్రీనివాస్
తెలంగాణ మైనారిటీ కమిషన్ చైర్మన్‌గా కమరుద్దీన్
తెలంగాణ మైనారిటీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జనవరి 3న నోటిఫికేషన్ జారీ చేసింది. మహమ్మద్ కమరుద్దీన్‌ను కమిషన్ చైర్మన్‌గా, రాజారపు ప్రతాప్‌ను వైస్ చైర్మన్‌గా నియమించింది. సభ్యులుగా మహ్మద్ అర్షద్ అలీఖాన్, విద్యా స్రవంతి, గస్టీ నోరియా, బొమ్మల కట్టయ్య, సురేందర్ సింగ్ నియమితులయ్యారు. మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం ఈ ఉత్తర్వులు జారీచేశారు. చైర్మన్‌తో పాటు సభ్యుల పదవీ కాలం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ మైనారిటీ కమిషన్ ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : చైర్మన్‌గా కమరుద్దీన్
తెలంగాణలో జనవరి 22 నుంచి పులుల గణన
రాష్ట్రంలో పులుల సంఖ్యను పక్కాగా తేల్చేందుకు అటవీ శాఖ సిద్ధమైంది. జనవరి 22 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో పులుల గణన చేపడతామని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి పీకే ఝా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,100 బీట్లను గుర్తించామని, ప్రతి బీట్‌కు ఇద్దరు చొప్పున నియమించి పులుల లెక్కలు తీస్తామన్నారు. ఈసారి గణనకు సీసీ కెమెరాల వినియోగంతో పాటు పాద ముద్రలు, పెంటిక నిర్ధారణ పరీక్షలనూ పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఈ గణనలో స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవో సంఘం సభ్యుల సహకారం తీసుకుంటామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న యువతీ యువకులు గణనలో పాల్గొనటానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. పులుల గణనను నాలుగేళ్లకోసారి నిర్వహిస్తారు. చివరిసారిగా 2013 జనవరిలో పులుల గణన చేపట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణలో పులుల గణన
ఎప్పుడు : జనవరి 22 నుంచి 29 వరకు
ఎవరు : తెలంగాణ అటవీశాఖ
దేశంలో తొలిసారిగా తెలంగాణలో కో-ఫైనాన్సింగ్ సంస్థ
ఖాయిలా పరిశ్రమలను పునరుద్ధరించడంతో పాటూ ఉత్పాదక రంగంలోని సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు (ఎస్‌ఎంఈ) రుణాలందించటమే లక్ష్యంగా ఏర్పాటవుతున్న తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌కు (టీఐహెచ్‌సీ) లైన్ క్లియరైంది. దేశంలోనే తొలిసారిగా దీనికి కో-ఫైనాన్సింగ్ ఎన్‌బీఎఫ్‌సీగా ఆర్‌బీఐ అనుమతినిచ్చింది. ఇది ఫిబ్రవరి రెండో వారంలో ప్రారంభం కానుంది.
టీఐహెచ్‌సీలో రెండు విభాగాలు
- ఖాయిలా పడ్డ పరిశ్రమలను పునరుద్ధరించడం.
- ఉత్పాదక రంగంలోని ఎస్‌ఎంఈలకు నిధులు సమకూర్చడం.
బిల్ రీ డిస్కౌంట్‌లో.. గడువు ముగిసి బ్యాంకులు ఎన్‌పీఏలుగా ప్రకటించిన పరిశ్రమలను గుర్తించి.. వాటి బ్యాంక్ పేమెంట్‌ను టీఐహెచ్‌సీ చెల్లిస్తుంది. పరిశ్రమలకు మరో 90 రోజుల సమయమిస్తారు. దీనికి పరిశ్రమలు టీఐహెచ్‌సీకి సంబంధిత బ్యాంక్ వడ్డీ కంటే 5 శాతం తక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో తొలి కో-ఫైనాన్సింగ్ ఎన్‌బీఎఫ్‌సీకి అనుమతి
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : ఆర్‌బీఐ
ఎక్కడ : తెలంగాణలో
ఎందుకు : తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ (టీఐహెచ్‌సీ) ఏర్పాటు కోసం
తెలంగాణ గురుకులాల్లో ‘భారత్ దర్శన్’
విద్యార్థులు పాఠశాలలకే పరిమితం కాకుండా, వారిలో విషయ పరిజ్ఞానం, వికాసం, సృజనాత్మకత పెంపొందించేందుకు తెలంగాణ గురుకుల సొసైటీ ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వివిధ ప్రదేశాలను సందర్శించి వాటిపై అవగాహన పెంచుకునే విధంగా దీన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ‘భారత్ దర్శన్’ పేరిట దేశంలోని ప్రఖ్యాత ప్రాంతాలు, ప్రముఖ స్థలాలకు విద్యార్థులను తీసుకెళ్లేలా ప్రణాళికలు రచించింది. ఈ మేరకు ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రాధాన్యత క్రమంలో అవకాశం కల్పించనుంది. 9వ తరగతి నుంచి డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు దీన్ని అమలు చేస్తోంది. రాష్ట్రంలో ఉన్న సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల్లో 1.35 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో విశాల దృక్పథాన్ని అలవర్చాలనే ఉద్దేశంతో గురుకుల సొసైటీలు భారత్ దర్శన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 9వ తరగతి నుంచి డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ‘భారత్ దర్శన్’
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : తెలంగాణ గురుకుల సొసైటీ
ఎందుకు : వివిధ ప్రదేశాలను సందర్శించి వాటిపై అవగాహన పెంచేందుకు
దేశంలో రెండో ఉత్తమ పోలీస్ స్టేషన్ పంజగుట్ట
దేశంలో రెండో ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా హైదరాబాద్ కమిషనరేట్‌లోని పంజగుట్ట పోలీస్ స్టేషన్ అవార్డు దక్కించుకుంది. కేంద్ర హోంశాఖ, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇటీవల దేశవ్యాప్తంగా మోడల్ పోలీస్ స్టేషన్లపై సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా వందకు పైగా స్టేషన్లను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ల పనితీరు, దర్యాప్తు.. ఇలా 140 ప్రమాణాలను పరిగణనలోకి తీసుకున్నారు. వీటిలో పది పోలీస్ స్టేషన్లతో తుది జాబితా రూపొందించి వాటిలోంచి మూడు ఉత్తమ స్టేషన్లను ఎంపిక చేశారు. తమిళనాడులోని కోయంబత్తూర్ పోలీస్ స్టేషన్ మొదటి స్థానంలో, ఉత్తరప్రదేశ్‌లోని లక్నో కమిషనరేట్ పరిధిలోని గుడుంబా పోలీస్ స్టేషన్ మూడో స్థానంలో నిలిచాయి. డీజీపీల సదస్సులో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ పోలీస్ స్టేషన్లకు ట్రోఫీలు అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో ఉత్తమ పోలీస్ స్టేషన్లు
ఎప్పుడు : జనవరి 6
ఎవరు : తొలి స్థానంలో తమిళనాడులోని కోయంబత్తూర్ పోలీస్ స్టేషన్. రెండో స్థానంలో హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్.
ఏపీ రుణభారం రూ.2 లక్షల కోట్లు
2018 బడ్జెట్ నాటికి ఆంధ్రప్రదేశ్ రుణభారం రూ.2.16 లక్షల కోట్లకు చేరుతుందని జనవరి 5న కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పి.రాధాక్రిష్ణన్ లోక్‌సభకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలు, బడ్జెట్ ప్రకారం 2016 మార్చి నాటికి ఏపీ రుణం రూ.1,73,854 కోట్లకు; 2017 మార్చి బడ్జెట్ నాటికి రూ.1,92,984 కోట్లకు చేరిందన్నారు. ఇది 2018 బడ్జెట్ నాటికి రూ.2,16,027 కోట్లకు చేరుతుందని అంచనా వేసినట్లు తెలిపారు.
‘బతుకుపోరు, విలువలు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి
బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు రచించిన ‘బతుకుపోరు, విలువలు’పుస్తకాన్ని డిసెంబర్ 28న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. రాములు.. 90కిపైగా పుస్తకాలు రాసి బహుగ్రంథ కర్తగా పేరొందారు. తత్వశాస్త్రంతోపాటు తెలంగాణ వాస్తవ జీవన చిత్రంపై కథలు, నవలలు, కథానికలు, సాహిత్య విమర్శ, బీసీ సామాజిక వర్గాలపై రచనలు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘బతుకుపోరు, విలువలు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : రచయిత బీఎస్ రాములు
అమరావతిలో ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు భూమిపూజ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని తుళ్లూరులో రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్ భవన సముదాయ నిర్మాణానికి డిసెంబర్ 28న ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దొంగతనం ఏ రూపంలో అయినా అది పోలీసు, ప్రభుత్వం ఉదాసీనత వల్లే జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఏ తప్పు చేసినా న్యాయస్థానాల్లో ఏదో రకంగా తప్పించుకోవచ్చని చాలా మంది అనుకుంటున్నారన్నారు. నేరాల ఆధారాలకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ సమర్థంగా పనిచేసి తప్పు చేసిన వారు తప్పించుకోకుండా చేయాలని సూచించారు. రూ. 254 కోట్లతో ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు భూమిపూజ
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
ఎక్కడ : తుళ్లూరు, అమరావతి
హైదరాబాద్‌లో రోబో పోలీస్ ప్రారంభం
పోలీసు విభాగంలో అత్యాధునిక సాంకేతిక విధానాలతో రూపొందించిన రోబో పోలీస్‌ను తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ డిసెంబర్ 29న ప్రారంభించారు. ఈ రోబో డిసెంబర్ 31 నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్టులో విధులు నిర్వహిస్తుంది. టీ-హబ్‌లో స్టార్టప్ కంపెనీగా ప్రారంభమైన ‘హెచ్ బోట్స్’ రోబోటిక్స్ కంపెనీ పోలీస్ రోబోను రూపొందించింది. ఈ రోబో పోలీసు అన్ని విషయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఫిర్యాదులు తీసుకుని కంట్రోల్ రూమ్‌కు చేరవేస్తుంది. అనుమానితులను, బాంబులను గుర్తిస్తుంది.
దుబాయ్‌లో చక్రాలతో కూడిన రోబో పోలీసు విధులను నిర్వహిస్తుండగా.. ఇక్కడ దానికి భిన్నంగా నడిచే పోలీస్ రోబోకు ‘హెచ్ బోట్స్’ రూపకల్పన చేసింది. ప్రపంచంలోనే రెండో పోలీస్ రోబోగా గుర్తింపు పొందనున్న దీనిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినట్టు రూపకర్తలు తెలిపారు. దశల వారీగా అన్ని ప్రాంతాల్లో రోబో సేవలు విస్తరించాలని భావిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హైదరాబాద్‌లో రోబో పోలీస్ ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎవరు : ‘హెచ్ బోట్స్’ రోబోటిక్స్
ఏపీలోని ఏడు ద్వీపాల్లో 7 పర్యాటక ప్రాజెక్టులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిధిలోని కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్న ఏడు ద్వీపాలను అభివృద్ధి చేసి ఏడు పర్యాటక ప్రాజెక్టులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో నాలుగు ద్వీపాలు, రెండో దశలో మిగిలిన మూడు ద్వీపాలను అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మొదట భవానీ ద్వీపాన్ని ఎకో పార్కుగా అభివృద్ధి చేయడానికి ఇటీవలే ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే దీన్ని మారిషస్ తరహాలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా మరింత మెరుగైన ప్రతిపాదనలు రూపొందించాలని ప్రభుత్వం కన్సల్టెన్సీలను కోరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏడు ద్వీపాల్లో 7 పర్యాటక ప్రాజెక్టులు
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : రాజధాని అమరావతిలో పరిధిలో
54 సర్వీసులతో ’టీఎస్ కాప్’ యాప్ ఆవిష్కరణ
నేరాల నియంత్రణ నుంచి పరిశీలన, దర్యాప్తు, విచారణల తీరు దాకా అన్ని అంశాలూ అరచేతిలోనే ఇమిడిపోయేలా ‘టీఎస్ కాప్’ అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ స్థాయి పోలీసింగ్‌కు తోడ్పడేలా రూపొందిన ఈ యాప్‌ను జనవరి 1న హైదరాబాద్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డి, ఐపీఎస్ అధికారులతో కలసి ఆవిష్కరించారు. దీనిని తొలుత పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్‌లో పరిశీలించగా.. పెట్రోలింగ్ సిబ్బంది, సెక్టార్ ఎస్సైలు, బ్లూకోల్ట్స్ సిబ్బందికి చాలా ఉపయోగపడింది. మంచి ఫలితాలను సాధించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ సిబ్బందికి అందుబాటులోకి తీసుకువచ్చారు. పోలీసు శాఖలోని దాదాపు 14 ప్రధాన విభాగాలు టీఎస్ కాప్ యాప్‌ను ఉపయోగించుకునేలా రూపొందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టీఎస్ కాప్ యాప్ ఆవిష్కరణ
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : తెలంగాణ పోలీస్
ఎందుకు : నేరాల నియంత్రణ నుంచి పరిశీలన, దర్యాప్తు, విచారణల తీరు దాకా అన్ని అంశాలూ అరచేతిలోనే ఇమిడిపోయేలా
గుంటూరులో భారత ఆర్థిక సంఘం సదస్సు
భారత ఆర్థిక సంఘం(ఐఈఏ) శత వార్షిక సదస్సును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డిసెంబర్ 27న గుంటూరులోప్రారంభించారు. ఈ సదస్సు డిసెంబర్ 30 వరకు జరిగింది. ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, సీఎం చంద్రబాబునాయుడు, నోబెల్ పురస్కార గ్రహీత మహమ్మద్ యూనస్ తదితరులు పాల్గొన్నారు.
హిజ్రాలకు ప్రత్యేక విధానం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 30న హిజ్రా (ట్రాన్స్‌జెండర్స్)ల కోసం ప్రత్యేక విధానం ప్రకటిం చింది. ఈ విధానంలో భాగంగా 18 సంవత్సరాలు పైబడిన హిజ్రాలకు రూ.1500 అందించనుంది.