Skip to main content

ఏప్రిల్ 2021 రాష్ట్రీయం

ఇటీవల ఏ జిల్లాకు ఏపీ–అమూల్‌ పాల వెల్లువ ప్రాజెక్టును విస్తరించారు?
Current Affairs
ఏపీ–అమూల్‌ పాల వెల్లువ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లోని 400 గ్రామాల్లో అమూల్‌ సంస్థ పాలు సేకరిస్తుండగా.. కొత్తగా గుంటూరు జిల్లాకు ప్రాజెక్టును విస్తరించారు. గుంటూరు జిల్లాలో కొత్తగా 129 గ్రామాలతోపాటు, చిత్తూరు జిల్లాలో అదనంగా మరో 174 గ్రామాల నుంచి అమూల్‌ ద్వారా పాల సేకరణను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్‌ 16న తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు.
డిసెంబర్‌ 2న ప్రారంభం...
ఆంధ్రప్రదేశ్‌లోని మహిళా పాడి రైతులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి ఉద్దేశించిన ‘ఏపీ–అమూల్‌ పాల వెల్లువ ప్రాజెక్టు’ ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టు తొలి దశ కార్యక్రమాన్ని 2020, డిసెంబర్‌ 2న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. అమూల్‌ ప్రాజెక్టు ద్వారా భాగంగా తొలి దశలో చిత్తూరు, వైఎస్సార్‌ కడప, ప్రకాశం జిల్లాల్లో 400 గ్రామాల్లో పాలసేకరణ ప్రారంభమైంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఏపీ–అమూల్‌ పాల వెల్లువ ప్రాజెక్టు విస్తరణ
ఎప్పుడు : ఏప్రిల్‌ 16
ఎవరు : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : మహిళా పాడి రైతులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి

నూతన జోనల్‌ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం
ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నూతన జోనల్‌ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ ‘371డి’లోని (1) (2) క్లాజ్‌ల కింద దఖలుపడిన అధికారాలను అనుసరించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌... తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ లోకల్‌ కేడర్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌) ఆర్డర్‌–2018కి ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు ఏప్రిల్‌ 19న కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పోలీసు మినహాయించి మిగిలిన అన్ని విభాగాలకూ ఈ జోన్ల విధానం వర్తిస్తుంది.

2019 – 20 రబీ సున్నా వడ్డీ రాయితీ చెల్లింపు
వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 2019 – 20 రబీ సున్నా వడ్డీ రాయితీని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్‌ 20న తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి విడుదల చేశారు. అర్హులైన 6,27,906 మంది రైతుల ఖాతాల్లో రూ.128.47 కోట్లను జమ చేశారు. లక్ష రూపాయల వరకు పంట రుణం తీసుకుని ఏడాదిలోగా తిరిగి చెల్లించిన రైతులకు ప్రభుత్వం వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని వర్తింపచేస్తోంది.

హిందూ దైవం ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రే అని తెలిపిన సంస్థ?
హిందువుల ఆరాధ్య దైవమైన ఆంజనేయుడి జన్మస్థలం తిరుపతిలోని తిరుమల అని... టీటీడీ ప్రకటించింది. తిరుమలలో శ్రీవారి ఆలయానికి సమీపంలోని జాపాలి తీర్థమే హనుమంతుడి జన్మస్థలమని.. అదే అంజనాద్రి అని తెలిపింది. ఇందుకు సంబంధించి పండితుల కమిటీ రూపొందించిన నివేదికను ఏప్రిల్‌ 21న తిరుమలలో ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌ హాజరయ్యారు.
రాఘవరాయలు నిర్మించిన...
15వ శతాబ్దంలో విజయ రాఘవరాయలు జాపాలిలో నిర్మించిన శ్రీఆంజనేయుని ఆలయమే హనుమ జన్మస్థలం అని ఆధారాలతో కూడిన వివరాలను టీటీడీ తన నివేదికలో పొందుపరిచింది. జాపాలి మహర్షి జపం ఆచరించి శ్రీనివాసుడిని ప్రసన్నం చేసుకోవడంతో ఈ తీర్థానికి జాపాలి అనే పేరు వచ్చింది. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానములు(టీటీడీ) ఈవోగా డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి ఉన్నారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : హిందూ దైవం ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రే అని తెలిపిన సంస్థ?
ఎప్పుడు : ఏప్రిల్‌ 21
ఎవరు : తిరుమల తిరుపతి దేవస్థానములు(టీటీడీ)
ఎక్కడ : అంజనాద్రి, తిరుమల, చిత్తూరు జిల్లా
ఎందుకు : ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రే అని ఆధారాలు ఉన్నాయని...

ఏపీలో నెంబర్‌ వన్‌గా ఏయూ న్యాయ కళాశాల
Current Affairs
ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ న్యాయ కళాశాల రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో గ్లోబల్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌–కాంపిటీషన్‌ సక్సర్‌ రివ్యూ మ్యాగజైన్‌ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో అత్యుత్తమ న్యాయ కళాశాలగా నిలిచింది.

ఏపీలోని ఏ జిల్లాలో ట్రాన్సాసియా బయో మెడికల్స్‌ ఏర్పాటైంది?
ఆసియాలో అతిపెద్ద బయో మెడికల్స్‌ తయారీ కేంద్రంగా 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌లో నిర్మించిన ఇన్‌ విట్రో డయోగ్నొస్టిక్‌ (ఐవీడీ) కంపెనీ ‘ట్రాన్సాసియా బయో మెడికల్స్‌’ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వర్చువల్‌ విధానంలో ఏప్రిల్‌ 13న ఈ కంపెనీని ప్రారంభించారు. రూ.30 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన ఈ కంపెనీలో... కోవిడ్‌–19 ఐజీజీ ఎలిసా టెస్ట్‌ కిట్స్, ఆర్టీపీసీఆర్‌ కిట్స్, ర్యాపిడ్‌ కిట్స్‌ వంటి వాటిని తయారు చేయనున్నారు.
కత్తి పద్మారావుకు లోక్‌నాయక్‌ పురస్కారం
2021 ఏడాది లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ పురస్కారాన్ని కవి, రచయిత, హేతువాద, దళితవాద ఉద్యమ నాయకుడు, సంఘ సంస్కర్త డాక్టర్‌ కత్తి పద్మారావుకు ప్రదానం చేయనున్నట్లు ఫౌండేషన్‌ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తెలిపారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ట్రాన్సాసియా బయో మెడికల్స్‌ కంపెనీ ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్‌ 13
ఎవరు : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి
ఎక్కడ : విశాఖపట్నం మెడ్‌టెక్‌ జోన్‌
ఎందుకు : కోవిడ్‌–19 ఐజీజీ ఎలిసా టెస్ట్‌ కిట్స్, ఆర్టీపీసీఆర్‌ కిట్స్, ర్యాపిడ్‌ కిట్స్‌ వంటి వాటి తయారీ కోసం...

తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఈ–గోల్కొండ పోర్టల్‌ ఉద్దేశం?
Current Affairs
తెలంగాణ రాష్ట్రంలో తయారవుతున్న సంప్రదాయ హస్త కళాకృతులకు ప్రపంచస్థాయి మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించేందుకు రూపొందించిన ‘ఈ–గోల్కొండ’ వెబ్‌ పోర్టల్‌ ప్రారంభమైంది. తెలంగాణ చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ పోర్టల్‌ను ఏప్రిల్‌ 1న ప్రగతిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఈ–గోల్కొండ ద్వారా సంప్రదాయ హస్త కళా కృతులను కొనుగోలు చేసే వీలుంటుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ పోర్టల్‌ ద్వారా ప్రస్తుతం దేశంలోని ఏ ప్రాంతానికైనా తమ కళా కృతులను సరఫరా చేయనున్నట్లు చెప్పారు. త్వరలో కేంద్ర ప్రభుత్వ అనుమతులు పొంది.. ప్రపంచ దేశాలకు కూడా ఎగుమతులు చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
12 సశక్తికరణ్‌ అవార్డులు...
దీనదయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్‌ పురస్కారాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి 12 జాతీయ అవార్డులు లభించాయి. జాతీయస్థాయిలో రాష్ట్రానికి చెందిన 9 ఉత్తమ గ్రామ పంచాయతీలు, 2 మండలాలు, ఒక జిల్లా పరిషత్‌లకు అవార్డులు లభించాయి. ప్రస్తుతం తెలంగాణ రాçష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉన్నారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఈ–గోల్కొండ వెబ్‌ పోర్టల్‌ ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్‌ 1
ఎవరు : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌
ఎక్కడ : ప్రగతిభవన్, హైదరాబాద్‌
ఎందుకు : తెలంగాణ రాష్ట్రంలో తయారవుతున్న సంప్రదాయ హస్త కళాకృతులకు ప్రపంచస్థాయి మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించేందుకు

విశాఖపట్నంలో డేటా సెంటర్‌ ఏర్పాటు చేయనున్న సంస్థ?
విశాఖపట్నంలో డేటా సెంటర్, బిజినెస్‌ పార్క్‌ నెలకొల్పేందుకు వైజాగ్‌ టెక్‌ పార్క్‌ (వీటీపీఎల్‌) పేరిట అనుబంధ సంస్థను ఏర్పాటు చేసినట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ వెల్లడించింది. దీని అధీకృత మూలధనం రూ. 5 లక్షలుగా ఉంటుందని పేర్కొంది. విశాఖలో సమీకృత డేటా సెంటర్‌ పార్క్‌తో పాటు టెక్నాలజీ/బిజినెస్‌ పార్క్‌ అభివృద్ధి చేసే లక్ష్యంతో వీటీపీఎల్‌ ఏర్పాటైందని అదానీ తెలిపింది.
తెలంగాణలో ఓ రహదారి ప్రాజెక్టు అభివృద్ధి, నిర్వహణ పనుల కోసం కోదాడ ఖమ్మం రోడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట మరో అనుబంధ సంస్థను కూడా ఏర్పాటు చేసినట్లు అదానీ సంస్థ తెలిపింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : వైజాగ్‌ టెక్‌ పార్క్‌ (వీటీపీఎల్‌) పేరిట అనుబంధ సంస్థ ఏర్పాటు
ఎప్పుడు : ఏప్రిల్‌ 1
ఎవరు : అదానీ ఎంటర్‌ప్రైజెస్‌
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : విశాఖపట్నంలో డేటా సెంటర్, బిజినెస్‌ పార్క్‌ నెలకొల్పేందుకు

ఏపీలోని ఏ జిల్లాలో కృష్ణపట్నం పోర్టు ఉంది?
నెల్లూరు జిల్లా ముతుకూర్‌ మండంలో ఉన్న కృష్ణపట్నం పోర్టులో పూర్తిగా 100 శాతం వాటాను అదానీ గ్రూపు కైవసం చేసుకుంది. ఇప్పటికే 75 శాతం వాటాను కలిగి ఉన్న అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ (ఏపీసెజ్‌) తాజాగా మిగిలిన 25 శాతం వాటాను కొనుగోలు చేసింది. కృష్ణపట్నం పోర్టులో విశ్వ సముద్ర హోల్డింగ్స్‌కు చెందిన 25 శాతం వాటాను రూ.2,800 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఏపీసెజ్‌ ఏప్రిల్‌ 5న స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లకు తెలియచేసింది.

కట్టుపల్లి పోర్టు ఏ రాష్ట్రంలో ఉంది?
2025 నాటికి ఏపీసెజ్‌ నిర్వహణ సామర్థ్యం 500 మిలియన్‌ టన్నులకు తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో తూర్పు తీర ప్రాంతంపై అదానీ గ్రూపు ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా తమిళనాడులో కట్టుపల్లి, ఎన్నోర్‌ పోర్టులను కొనుగోలు చేసిన అదానీ... ఏపీలోని కృష్ణపట్నం, గంగవరం పోర్టులను కొనుగోలు చేసింది. కృష్ణపట్నం పోర్టులో 100 శాతం వాటా కొనుగోలు రూ.14,800 కోట్లు వ్యయం చేయగా, గంగవరం పోర్టులో 89.6 శాతం వాటాను రూ.5554 కోట్లకు కొనుగోలు చేసింది.
  • కట్టుపల్లి , ఎన్నోర్‌ పోర్టులు తమిళనాడులోని తిరువళ్ళూర్‌ జిల్లాలో ఉన్నాయి.
  • ఎన్నోర్‌ పోర్టు పేరును కామరాజర్‌ పోర్టుగా మార్చారు.

ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఎక్కడ ఉంది?

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సరస్వతీనగర్‌లోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సేవలను కొనసాగిస్తూ కేంద్ర విద్యాశాఖ ఏప్రిల్‌ 7న ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడి సేవలను నిలిపివేయడంపై భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కేంద్ర విద్యాశాఖ కార్యదర్శితో ఫోన్‌లో మాట్లాడారు. దీంతో కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి పాత ఉత్తర్వులను రద్దుచేసి.. కొత్త ఉత్తర్వులిచ్చారు.
పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం ఎక్కడ ఉంది?
రెండో సబర్మతిగా పేరుగాంచిన నెల్లూరు జిల్లా పల్లెపాడులోని పినాకిని సత్యాగ్రహ ఆశ్రమ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో భారతీయ తపాలా శాఖ ప్రత్యేక తపాలా కవర్‌ను విడుదల చేసింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సేవలను కొనసాగిస్తూ ఉత్తర్వులు
ఎప్పుడు : ఏప్రిల్‌ 7
ఎవరు : కేంద్ర విద్యాశాఖ
ఎక్కడ : సరస్వతీనగర్, వెంకటాచలం మండలం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా

మెడ్‌ట్రానిక్‌ ఇంజనీరింగ్, ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఏర్పాటైన నగరం?
మెడికల్‌ టెక్నాలజీ రంగంలో ఉన్న యూఎస్‌ దిగ్గజం మెడ్‌ట్రానిక్‌ ఇంజనీరింగ్, ఇన్నోవేషన్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఏర్పాటు చేసింది. వంశీరామ్‌ బిల్డర్స్‌ నిర్మించిన బీఎస్‌ఆర్‌ టెక్‌ పార్క్‌లో 1,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది కొలువుదీరింది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ఏప్రిల్‌ 7న ఈ ఫెసిలిటీని ప్రారంభించారు. యూఎస్‌ వెలుపల సంస్థకు ఇది అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రం. మెడ్‌ట్రానిక్‌ ఈ ఫెసిలిటీకి రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తోంది. వచ్చే అయిదేళ్లలో 1,000 మందిని నియమించుకోనుంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : మెడ్‌ట్రానిక్‌ ఇంజనీరింగ్, ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఏర్పాటు
ఎప్పుడు : ఏప్రిల్‌ 7
ఎవరు : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు
ఎక్కడ : నానక్‌రామ్‌గూడ, హైదరాబాద్‌

పడ్‌నా లిఖ్‌నా అభియాన్‌ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పడ్‌నా లిఖ్‌నా అభియాన్‌(అక్షరాస్యత కార్యక్రమం) ప్రారంభమైంది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ భవనంలో ఏప్రిల్‌ 7న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘చదువుకుందాం’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. పడ్‌నా లిఖ్‌నా అభియాన్‌లో భాగంగా చదువు వయసు దాటిపోయిన 3,28,000 మందికి 40 రోజుల్లో చదవడం, రాయడం నేర్పుతామని మంత్రి చెప్పారు. చదువు లేని 15 ఏళ్ల వయసు దాటిన వారిని బడికి తీసుకొస్తామన్నారు.
శ్రీశైలంలో చిత్రలిపి శాసనాలు
కర్నూలు జిల్లా శ్రీశైలంలో పురాతన చిత్రలిపి ఉన్న శాసనాలు వెలుగుచూశాయి. శ్రీశైల దేవస్థానం పరిధిలో రుద్రాక్ష మఠం, విబూది మఠం సమీపాన బండ పరుపుపై ఉన్న ఈ శాసనాలు క్రీస్తుపూర్వం 1500 నుంచి 300 సంవత్సరాల్లోపు వేసి ఉంటారని అంచనా వేస్తున్నారు.
జీఎస్‌ఎన్‌ శాస్త్రికి ‘బుర్రా’ పురస్కారం
గుంటూరు జిల్లా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏప్రిల్‌ 7న కళల కాణాచి సంస్థ ఆధ్వర్యంలో బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి జాతీయ రంగస్థల పురస్కారాన్ని ప్రఖ్యాత నటుడు జీఎస్‌ఎన్‌ శాస్త్రికి ప్రదానం చేశారు. సినీనటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌లు రూ.25 వేల నగదు, జ్ఞాపిక, గజమాలతో శాస్త్రి దంపతులను సత్కరించారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : పడ్‌నా లిఖ్‌నా అభియాన్‌(అక్షరాస్యత కార్యక్రమం) ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్‌ 7
ఎవరు : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌
ఎక్కడ : ఇబ్రహీంపట్నం, కృష్ణా జిల్లా
ఎందుకు : చదువు వయసు 15 ఏళ్లు దాటిపోయిన 3,28,000 మందికి 40 రోజుల్లో చదవడం, రాయడం నేర్పేందుకు
Published date : 16 Apr 2021 05:20PM

Photo Stories