Skip to main content

డిసెంబర్ 2019 రాష్ట్రీయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భద్రతా కమిషన్ ఏర్పాటు
Current Affairs
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర భద్రతా కమిషన్ ఏర్పాటైంది. ఈ మేరకు డిసెంబర్ 26న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర హోంమంత్రి చైర్‌పర్సన్‌గా వ్యవహరించే ఈ కమిషన్‌లో పలువురు కీలక అధికారులతోపాటు ముగ్గురు స్వతంత్ర సభ్యులు ఉంటారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమావేశమయ్యే ఈ కమిషన్ పోలీసుల సేవలు, పనితీరును అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తుంది.
భద్రతా కమిషన్ కార్యదర్శిగా హోంశాఖ సెక్రటరీ వ్యవహరిస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు పోలీస్ ఫోర్స్ హెడ్(ఎక్స్-అఫీషియో సెక్రటరీ) ఇందులో ఉంటారు. వీరితోపాటు శాంతిభద్రతల నిర్వహణ, పరిపాలన, మానవ హక్కులు, చట్టం, సామాజిక సేవ, ప్రజా పరిపాలన నిర్వహణ లాంటి విషయాల్లో అనుభవమున్న మరో ముగ్గురిని సభ్యులుగా నియమించాల్సి ఉంది. ఆ మేరకు రిటైర్డ్ ఐపీఎస్‌లు డీటీ నాయక్, గోపీనాథ్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్‌సింగ్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భద్రతా కమిషన్ ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : పోలీసుల సేవలు, పనితీరును అంచనా వేసేందుకు

తెలుగు రచయితల 4వ మహాసభలు ప్రారంభం
విజయవాడలోని మొగల్రాజపురం పీబీ సిద్ధార్థ కళాశాల వేదికగా ‘ప్రపంచ తెలుగు రచయితల 4వ మహాసభలు’ డిసెంబర్ 27న ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరిగే ఈ సభలను కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబార్ ప్రారంభించారు. తెలుగు భాష.. సంస్కృతి పరిరక్షణలో భాగంగా ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో నివసించే సాహిత్యాభిమానులైన తెలుగువారందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి భాషా వికాసానికి కృషి చేయడం ప్రధాన లక్ష్యంగా ఈ మహాసభలను నిర్వహిస్తున్నారు.
కృష్ణాజిల్లా రచయితల సంఘం సహకారంతో ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మహాసభలకు దేశ, విదేశాల నుంచి 100 మందికిపైగా ప్రతినిధులు, 500 మందికిపైగా తెలుగు ప్రముఖులు హాజరయ్యారు. ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవాధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగువారిలో భాషా స్వాభిమానం తగ్గుతోందని ఆందోళన వెలిబుచ్చారు. తెలుగు భాష ఉద్ధరణకు రచయితలు కృషి చేయాలని కోరారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలుగు రచయితల 4వ మహాసభలు ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబార్
ఎక్కడ : మొగల్రాజపురం పీబీ సిద్ధార్థ కళాశాల, విజయవాడ, ఆంధ్రప్రదేశ్

ఏపీ రాజధాని అంశంపై హైపవర్ కమిటీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణంపై అధ్యయనం చేసిన జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ, ప్రపంచ ప్రఖ్యాత బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు (బీసీజీ) నివేదికల్లోని అంశాల సమగ్ర, తులనాత్మక పరిశీలనకు హైపవర్ కమిటీ ఏర్పాటు కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలో డిసెంబర్ 27న సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయించింది. ఈ హైపవర్ కమిటీని మంత్రులు, సీనియర్ ఐఏఎస్‌లతో ఏర్పాటు చేయాలని తీర్మానించింది.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్‌రావు నేతృత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. ఇవే అంశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని బీసీజీని సైతం ఇప్పటికే ప్రభుత్వం కోరింది. ఈ రెండు నివేదికలను అధ్యయనం చేసి రిపోర్టు సమర్పించడం కోసం హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది.
వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు కొత్త పాలసీ
రాష్ట్రంలో 191 మార్కెట్ యార్డులు, 150 ఉప మార్కెట్ యార్డులు.. మొత్తం 341 చోట్ల వ్యవసాయ ఉత్పత్తుల శాశ్వత కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేవలం కోతల సమయంలోనో, వ్యవసాయ ఉత్పత్తులు చేతికొచ్చే సమయంలోనే కాకుండా 365 రోజులూ ఇవి పనిచేసేలా నూతన విధానం అమలవుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ రాజధాని అంశంపై హైపవర్ కమిటీ ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
ఎందుకు : జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు (బీసీజీ) నివేదికలపై అధ్యయనం చేసేందుకు

స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లు
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలను 2011 జనాభా లెక్కల ప్రకారం నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అత్యంత కీలకమైన రిజర్వేషన్లను సైతం ఖరారు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలో డిసెంబర్ 27న సమావేశమైన మంత్రివర్గం ఎన్నికల రిజర్వేషన్లతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు.
మంత్రివర్గ నిర్ణయాలు ఇలా..
  • 2011 జనాభా గణన ఆధారంగా బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 19.08, ఎస్టీలకు 6.77 శాతం.. మొత్తం 59.85 శాతం రిజర్వేషన్ల దామాషా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం- 1994 ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ.
  • కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో 6.04 ఎకరాలు కేటాయింపు. మార్కెట్ విలువ ఎకరా రూ.43 లక్షలు ఉన్నప్పటికీ ఎకరా రూ.లక్షకే కేటాయించాలని నిర్ణయం.
  • వైఎస్సార్ జిల్లా రాయచోటిలో 4 ఎకరాలను రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు బదలాయించేందుకు ఆమోదం.
  • మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ బాధ్యతను కేంద్ర ప్రభుత్వ సంస్థ రైట్స్ నిర్మాణ సంస్థకు అప్పగిస్తూ ఇన్‌క్యాబ్ సీఎండీ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం.
  • మచిలీపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిర్మించడం కోసం స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ) ఏర్పాటుకు అనుమతి.
  • రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న కృష్ణపట్నం సముద్ర ముఖపరిధిని కుదించాలని నిర్ణయం.
  • 412 సరికొత్త 108 సర్వీసు వాహనాలను వచ్చే ఏడాది మార్చి ఆఖరులోగా రూ.71.48 కోట్లతో కొనుగోలు.
  • ఆరోగ్య పరీక్షలు నిర్వహించే 104 సర్వీసుల కోసం 656 వాహనాలను రవాణా వ్యయంతో కలిపి మొత్తం రూ.60.51 కోట్లతో మార్చి ఆఖరులోగా కొనుగోలు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లు
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్

ట్రస్మా ఎడ్యుకేషన్ ఎక్స్‌పో ప్రారంభం
తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ ఎక్స్ పో-2019 ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో డిసెంబర్ 28న తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఈ ఎక్స్ పోను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పిల్లలకు నాణ్యమైన విద్యనందించడం ఎంత అవసరమో, విలువలతో కూడిన విద్యను అందించడం కూడా అంతే అవసరమని అభిప్రాయపడ్డారు.
మరోవైపు కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (క్రెడాయ్) తెలంగాణ ఆధ్వర్యంలో డిసెంబర్ 28న హైదరాబాద్‌లో జరిగిన 2వ క్రియేట్ అవార్డ్స్-2019 ప్రదానోత్సవంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. విద్యుత్, నీటి వినియోగం ఎక్కువగా అవసరం లేని గ్రీన్ బిల్డింగ్‌‌స నిర్మాణాలపై డెవలపర్లు దృష్టి సారించాలన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ట్రస్మా ఎడ్యుకేషన్ ఎక్స్ పో-2019 ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
ఎక్కడ : హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హైదరాబాద్‌లోని

విశాఖలో 1285 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో రూ.1285.32 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు డిసెంబర్ 28న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ముందుగా కైలాసగిరిపై వీఎంఆర్‌డీఏ చేపట్టే రూ.379.82 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జీవీఎంసీ చేపట్టనున్న రూ.905.50 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. మరోవైపు విశాఖ ఆర్‌కే బీచ్‌లో ఏర్పాటు చేసిన విశాఖ ఉత్సవ్-2019ను సీఎం జగన్ ప్రారంభించారు. తర్వాత తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్‌జైన్ దంపతులకు సీఎం ఆత్మీయ సత్కారం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రూ.1285.32 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్

హైపవర్ కమిటీ కన్వీనర్‌గా సీఎస్ నీలం సాహ్ని
ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులను.. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) ఇచ్చే నివేదికను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 29న హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ హైపవర్ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. మొత్తం పదిమంది మంత్రులు, సీఎం ముఖ్య సలహాదారు, ఐదుగురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది.
హైపవర్ కమిటీ సభ్యులు
బుగ్గన రాజేంద్రనాథ్, పిల్లి సుభాష్‌చంద్ర బోస్, బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతంరెడ్డి, ఆదిమూలపు సురేష్, సుచరిత, కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, పేర్ని నాని, కొడాలి నాని, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, డీజీపీ సవాంగ్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్యామలరావు, న్యాయ శాఖ కార్యదర్శులు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హైపవర్ కమిటీ కన్వీనర్‌గా ఏపీ సీఎస్ నీలం సాహ్ని
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : జీఎన్ రావు కమిటీ చేసిన సిఫార్సులను.. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) ఇచ్చే నివేదికను అధ్యయనం చేసేందుకు

సేవా కార్యక్రమాలకు కనెక్ట్ టు ఆంధ్ర సొసైటీ
కార్పొరేట్ సామాజిక బాధ్యత (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ-సీఎస్సార్) కింద రాష్ట్రంలో సేవా కార్యక్రమాలను విస్తృతం చేయడం, వాటిని పక్కాగా పర్యవేక్షించడానికి ‘కనెక్ట్ టు ఆంధ్ర’ అనే లాభాపేక్షలేని సొసైటీని ఏర్పాటుచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డిసెంబర్ 31న ఉత్తర్వులు జారీ చేసింది.
ఉద్దేశం..
సీఎస్సార్ కింద నిధులు సమీకరించి నిర్మాణాత్మకంగా విద్య, వైద్య రంగాల్లో వెచ్చించడం ద్వారా మానవ వనరుల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషిచేయడం కనెక్ట్ టు ఆంధ్ర సొసైటీ ఉద్దేశం. నిబంధనల ప్రకారం... ప్రతి సంస్థ ఏటా వచ్చే నికర లాభంలో రెండు శాతం మొత్తాన్ని తప్పనిసరిగా కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సేవా కార్యక్రమాలకు వెచ్చించాలి.
సీఈఓగా ప్రణాళిక విభాగం కార్యదర్శి..
కనెక్ట్ టు ఆంధ్ర సొసైటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా ప్రణాళిక విభాగం కింద ఉప కార్యదర్శి/సంయుక్త కార్యదర్శి హోదా అధికారి ఉంటారు.
సీఎం అధ్యక్షతన కార్యనిర్వాహక కమిటీ..
ముఖ్యమంత్రి అధ్యక్షతన అపెక్స్ కమ్ కార్యనిర్వాహక కమిటీ ఉంటుంది. ఇందులో ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, ముగ్గురు ప్రత్యేక ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీకి ప్రణాళిక శాఖ కార్యదర్శి మెంబర్ కన్వీనరుగా వ్యవహరిస్తారు. విధాన నిర్ణయాల రూపకల్పన, సామాజిక బాధ్యతల్లో కార్పొరేట్ సేవలను వినియోగించుకోవడం ఈ కమిటీ బాధ్యతలు. అలాగే జిల్లా కలెక్టరు అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సేవా కార్యక్రమాలకు కనెక్ట్ టు ఆంధ్ర సొసైటీ
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : రాష్ట్రంలో సేవా కార్యక్రమాలను విస్తృతం చేయడం, వాటిని పక్కాగా పర్యవేక్షించడానికి

ఆసియాలో తొలి సైఫన్ సిస్టం ప్రాజెక్టుకు గండి
ఆసియా ఖండంలోనే తొలి ఆటోమేటిక్ సైఫన్ సిస్టం ప్రాజెక్టు అయిన సరళాసాగర్ ప్రాజెక్టుకు డిసెంబర్ 31న భారీగా గండి పడింది. దీంతో 0.5 టీఎంసీల నీరు రామన్‌పాడు జలాశయానికి చేరింది. అక్కడ క్రస్టుగేట్లు ఎత్తడంతో ఊకచెట్టు వాగు నుంచి తిరిగి కృష్ణా నదిలోకి నీరు చేరింది. ఇటీవల భీమా, కేఎల్‌ఐ ప్రాజెక్టుల ద్వారా సరళాసాగర్‌లో గరిష్ట స్థాయి నీటిని నిల్వ చేశారు. అయితే ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్లే నీరు తక్కువగా.. లోనికొచ్చే నీరు ఎక్కువగా ఉండటం, కొన్నేళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఒక్కసారిగా గండి పడింది.
ఆసియా ఖండంలోనే తొలి సైఫన్ సిస్టం..
వనపర్తి సంస్థానాన్ని పాలించిన చివరి రాజు, కేంద్ర మాజీ మంత్రి రాజారామేశ్వర్‌రావు తన తల్లి సరళాదేవి పేరున ఆసియా ఖండంలోనే తొలి ఆటోమేటిక్ సైఫన్ సిస్టంతో 1947లో ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సుమారు 35 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 1959 లో పూర్తి చేశారు. దీని కింద 4,200 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. 2009లో కురిసిన భారీ వర్షాలకు చివరిసారి సైఫన్లు తెరుచుకున్నాయి. తర్వాత ప్రాజెక్టు గరిష్ట స్థాయికి నీరు చేరుకోలేదు.
ఆటోమేటిక్ సైఫన్ సిస్టం : గాలిపీడనంతో కవాటాలు వాటంతట అవే తెరచుకునే పద్ధతి.

80వ భారత పారిశ్రామిక ప్రదర్శన ప్రారంభం
హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 80వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్) ప్రారంభమైంది. 45 రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్‌ను తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్, పశుసంర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు జనవరి 1న ప్రారంభించారు.
హైదరాబాద్‌లో ఏటా తెలంగాణ ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ 79 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలతోపాటు ఇతర దేశాలకు చెందిన వారు కూడా నుమాయిష్‌లో స్టాల్ ఏర్పాటు చేసి తమ వస్తువులకు ప్రచారం చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 80వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్) ప్రారంభం
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : తెలంగాణ మంత్రులు
ఎక్కడ : నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం, హైదరాబాద్

ప్రభుత్వ ఉద్యోగులుగా ఏపీఎస్‌ఆర్టీసీ సిబ్బంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ)ను విలీనం చేస్తూ డిసెంబర్ 31న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ జనవరి 1న అమల్లోకి వచ్చింది. దీంతో 51,488 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రజా రవాణా శాఖ సిబ్బందిగా మారారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే సదుపాయాలన్నీ వీరికి వర్తిస్తాయి.
ప్రజా రవాణా శాఖ...
రవాణా, ఆర్‌అండ్‌బీ పరిపాలన నియంత్రణలోనే ప్రజా రవాణా శాఖను ఏర్పాటు చేశారు. రవాణా శాఖ మంత్రి ఈ శాఖకు మంత్రిగా, రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రిన్సిపల్ సెక్రటరీగా, పబ్లిక్ ట్రాన్స్ పోర్టు డిపార్ట్‌మెంట్‌కు కమిషనర్/డైరక్టర్‌గా ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ బాధ్యతలు నిర్వర్తిస్తారు.

1956లో ఏపీఎస్‌ఆర్‌టీసీగా రూపాంతరం..
1932లో అప్పటి నిజాం రాష్ట్ర రైల్వేలో ఒక భాగంగా ఎన్‌ఎస్‌ఆర్ అండ్ ఆర్‌టీడీ (నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్‌మెంట్)గా ఈ సంస్థ ఆవిర్భవించింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రా ప్రాంతం విడిపోవడం, ఆ తర్వాత నిజాం స్టేట్‌తో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక 1958లో ఏపీఎస్‌ఆర్‌టీసీగా రూపాంతరం చెందింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎస్‌ఆర్‌టీసీ పని చేయడం మొదలుపెట్టింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రభుత్వ ఉద్యోగులుగా ఏపీఎస్‌ఆర్టీసీ సిబ్బంది
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసినందుకు

విజయనగరంలో ఈఎస్‌ఐ ఆస్పత్రికి శంకుస్థాపన
Current Affairs
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా గాజులరేగ ప్రాంతంలో ఏయూ క్యాంపస్ ఎదురుగా నిర్మించనున్న 100 పడకల కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐ) ఆస్పత్రికి కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ డిసెంబర్ 19న శంకుస్థాపన చేశారు. ఈఎస్‌ఐ ద్వారా దేశంలో 3.50 కోట్ల మంది కార్మికులు లబ్ధి పొందుతున్నారని ఈ సందర్భంగా గంగ్వార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ... ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణాన్ని రూ.75 కోట్లతో రెండు సంవత్సరాల్లో పూర్తి చేయనున్నట్టు చెప్పారు. ఆస్పత్రిని 500 పడకల స్థాయికి పెంచనున్నట్టు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఈఎస్‌ఐ ఆస్పత్రికి శంకుస్థాపన
ఎప్పుడు : డిసెంబర్ 19
ఎవరు : కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్
ఎక్కడ : గాజులరేగ ప్రాంతం, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్

15వ ఆర్థిక సంఘం చైర్మన్‌తో ఏపీ సీఎం సమావేశం
15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్.కె.సింగ్, కార్యదర్శి అరవింద్ మెహతా, సభ్యులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర అధికారులు సమావేశమయ్యారు. అమరావతిలో డిసెంబర్ 19న జరిగిన ఈ భేటీలో ఆర్థిక సంఘానికి సీఎం జగన్ రాష్ట్ర పరిస్థితిని వివరించారు. రాష్ట్ర సామాజిక, ఆర్థిక, వ్యవసాయ, పారిశ్రామిక, సేవ, ఆరోగ్య, విద్యా, మౌలిక రంగాలపై అధికారులు సమగ్ర వివరాలు అందించారు. విభజన వల్ల దెబ్బతిన్న రాష్ట్రం అన్ని రంగాల్లో కోలుకోవాలంటే ఉదారంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో నిధులు అందేలా సిఫార్సులు చేయాలని కోరారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్.కె.సింగ్‌తో సమావేశం
ఎప్పుడు : డిసెంబర్ 19
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్

ఏపీ రాజధానిపై జీఎన్ రావు కమిటీ నివేదిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని, పరిపాలన వికేంద్రీకరణపై ఏర్పాటైన జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ తన నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించింది. 125 పేజీలతో కూడిన ఈ నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి డిసెంబర్ 20న అందజేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా అమరావతిలో శాసన రాజధాని(లెజిస్లేటివ్ క్యాపిటల్), విశాఖలో పరిపాలన రాజధాని (ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్), కర్నూలులో న్యాయ రాజధాని (జ్యుడీషియల్ క్యాపిటల్) ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ తన నివేదికలో సూచించింది.
నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు
అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది.
ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఇవే..
  1. ఉత్తరాంధ్ర: శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం
  2. మధ్య కోస్తా: తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా
  3. దక్షిణ కోస్తా: గుంటూరు, ప్రకాశం, నెల్లూరు
  4. రాయలసీమ: వైఎస్సార్, చిత్తూరు, కర్నూలు, అనంతపురం
కమిటీ ప్రధాన సిఫార్సులు..
  • మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌లో ఉన్నట్టు రాష్ట్రంలో అమరావతి, విశాఖపట్నంలో శాసన(లెజిస్లేచర్) వ్యవస్థ ఉండాలి. అసెంబ్లీ అమరావతిలో ఉన్నా.. వేసవికాల సమావేశాలు విశాఖలో నిర్వహించాలి. విశాఖపట్నంలో సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాలు, సీఎం క్యాంపు కార్యాలయం, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. అమరావతిలో అసెంబ్లీతో పాటు హైకోర్టు బెంచ్, సీఎం క్యాంపు కార్యాలయం, రాజ్‌భవన్ ఉండాలి. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో నిర్వహించాలి.
  • అన్ని ప్రభుత్వ విభాగాలను ఒకేచోట ఉంచాల్సిన అవసరం లేదని కె.సి.శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. అమరావతిలో భూమి తీరు, వరద ప్రభావం తదితర అంశాల కారణంగా రాజధాని కార్యకలాపాల్ని ఇతర నగరాలకు వికేంద్రీకరించాలి. ఇక్కడ దాదాపుగా పూర్తైన నిర్మాణాలను వినియోగంలోకి తీసుకురావాలి. అమరావతిలో ప్రతిపాదిత నిర్మాణాల్ని తగ్గించాలి. ఎన్జీటీ ఆదేశాల ప్రకారం రివర్ ఫ్రంట్ నిర్మాణాలు ఉండరాదు. వరద ముంపు నుంచి రక్షణ కోసం చేపట్టిన నిర్మాణాలు పూర్తి చేయాలి. సీడ్ యాక్సిస్ రోడ్డును నేషనల్ హైవేకు అనుసంధానించాలి.
  • శ్రీబాగ్ ఒడంబడికను గౌరవించేలా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి.
  • పరిపాలన వికేంద్రీకరణ ద్వారా నిరుపేదల సమస్యలను సత్వరం పరిష్కారం దొరుకుతుంది.
రాష్ట్రమంతా అధ్యయనం...
జీఎన్ రావు కమిటీ మొత్తం సుమారు 10,600 కిలోమీటర్లు రాష్ట్రమంతా పర్యటించి రాజధాని, అభివృద్ధి అంశాలపై అధ్యయనం చేసింది. ఈ కమిటీకి జీఎన్ రావు కన్వీనర్‌గా వ్యవహరించారు. సభ్యులుగా విజయమోహన్, ఆర్.అంజలీ మోహన్, డాక్టర్ మహావీర్, డాక్టర్ సుబ్బారావు, కేటీ రవీంద్రన్, అరుణాచలం ఉన్నారు.

వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత కార్మికులకు ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకం ప్రారంభమైంది. అనంతపురం జిల్లా ధర్మవరంలో డిసెంబర్ 21న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా సొంతంగా మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. కుటుంబానికి ఎన్ని మగ్గాలున్నప్పటికీ ఒక యూనిట్‌గానే తీసుకుని రూ.24 వేలు అందిస్తారు. 2019-20 బడ్జెట్‌లో చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం కోసం రూ.200 కోట్లు కేటాయించారు.
నేతన్న నేస్తం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ... అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు విలువ ఇవ్వాలని తమ ప్రభుత్వం భావిస్తోందని, సామాజిక న్యాయంతో పాటు ఆర్థిక న్యాయం కూడా జరగాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. నేతన్న నేస్తం ద్వారా రాష్ట్రంలో 85 వేల కుటుంబాలకు రూ.196 కోట్లకు పైగా సహాయాన్ని ఇక్కడి నుంచే విడుదల చేయబోతున్నామని చెప్పారు. ఈ పథకం ద్వారా రానున్న ఐదేళ్లల్లో మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి అక్షరాలా లక్షా 20 వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని వివరించారు.

బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం
2014 నుంచి 2019 వరకు ఒక్క అనంతపురం జిల్లాలోనే 57 మంది చేనేతలు ఆత్మహత్య చేసుకున్నారని, ఈ కుటుంబాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని సీఎం జగన్ తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు తమ ప్రభుత్వం ఆదుకుంటుందని చెబుతూ రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ మేరకు ఆయా కుటుంబాలకు ఆయన మెగా చెక్కును అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : దర్మవరం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : సొంతంగా మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు

గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రత్యేక శాఖ
గ్రామ, వార్డు సచివాలయాలను మరింత సమర్థవంతంగా పని చేయించేందుకు ప్రత్యేకంగా ‘గ్రామ, వార్డు వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ’ను ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని డిసెంబర్ 21న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ఒకటవ షెడ్యూల్‌లో ఈ శాఖను చేర్చనున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులతో సంబంధిత శాఖల మధ్య మరింత సమన్వయం పెంచేందుకు ఈ శాఖ పనిచేస్తుంది. సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు అవసరమైన సమగ్ర శిక్షణ ఇచ్చి వారంతా విధులు, బాధ్యతలు, జవాబుదారీతనాన్ని పాటించేలా ఈ శాఖ చూస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నూతనంగా గ్రామ, వార్డు వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : గ్రామ, వార్డు సచివాలయాలను మరింత సమర్థవంతంగా పని చేయించేందుకు

కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన
వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి వద్ద డిసెంబర్ 23న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. పరిశ్రమకు సంబంధించి ఫైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... రూ.15 వేల కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ పరిశ్రమ ద్వారా 25 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. రాయలసీమ ఆర్థిక, ఉద్యోగాల చరిత్రను మార్చేందుకు 30 లక్షల టన్నుల సామర్థ్యంతో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేస్తున్నామని చెప్పారు. ఏపీ హైగ్రేడ్ స్టీల్ పరిశ్రమ(కడప ఉక్కు పరిశ్రమ)కు ముడిసరుకు అందించేందుకు ఎన్‌ఎండీసీ (నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని పేర్కొన్నారు.
కడప ఉక్కు పరిశ్రమకు జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో 3,275.66 ఎకరాలను కేటాయించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన
ఎప్పుడు : డిసెంబర్ 23
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : సున్నపురాళ్లపల్లి, జమ్మలమడుగు మండలం, వైఎస్సార్ జిల్లా

కుందూ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన
రూ.2,300 కోట్లతో చేపట్టిన రాజోలి ప్రాజెక్టు, జొలదరాశి ప్రాజెక్టు, కుందూ - బ్రహ్మంసాగర్ ఎత్తిపోతల పథకాలతోపాటు మరికొన్ని అభివృద్ధి పనులకు వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం నేలటూరు వద్ద ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబర్ 23న శంకుస్థాపన చేశారు. ఏటా గోదావరి నుంచి మూడు వేల టీఎంసీల వరద జలాలు సముద్రం పాలవుతున్నాయని, వరద వచ్చిన 40 - 50 రోజుల్లోపే ఆ నీటిని ఒడిసి పట్టేందుకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఈ సందర్భంగా సీఎం జగన్ చెప్పారు. గోదావరి నీటిని బల్లేపల్లె నుంచి బనకచర్ల వరకు.. పెన్నా బేసిన్‌కు తరలించేందుకు శ్రీకారం చుట్టామన్నారు.
మరోవైపు కడప రిమ్స్‌లో రూ.107 కోట్లతో క్యాన్సర్ కేర్ సెంటర్, రూ.175 కోట్లతో సూపర్ స్పెషాలిటీ బ్లాక్, రూ.40.81 కోట్లతో మానసిక చికిత్సాలయం, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే కడప - రాయచోటి రోడ్డులో రూ.82.73 కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించారు.
ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులివీ..
  • కర్నూలు, వైఎస్సార్ జిల్లాల సరిహద్దులో కుందూనదిపై రూ.1357 కోట్లతో 2.95 టీఎంసీల సామర్థ్యంతో రాజోలి ప్రాజెక్టు. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల వద్ద రూ.312 కోట్లతో 0.8 టీఎంసీల సామర్థ్యంతో జొలదరాశి ప్రాజెక్టు.
  • దువ్వూరు మండలం జొన్నవరం వద్ద రూ.564 కోట్లతో కుందూ నది నుంచి తెలుగంగ ఎస్‌ఆర్-1 ద్వారా బ్రహ్మంసాగర్‌కు నీటిని అందించే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు వల్ల తెలుగుగంగ కింద 91వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతోపాటు మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల్లోని తాగునీటి అవసరాలు తీరతాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కుందూ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన
ఎప్పుడు : డిసెంబర్ 23
ఎవరు : ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : నేలటూరు, దువ్వూరు మండలం, వైఎస్సార్ జిల్లా

జీఎన్‌ఎస్‌ఎస్ అనుసంధాన పథకానికి శంకుస్థాపన
గాలేరు-నగరి సుజల స్రవంతి(జీఎన్‌ఎస్‌ఎస్) పథకంతో హంద్రీ-నీవా సుజల స్రవంతి(హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) ఎత్తిపోతల పథకం అనుసంధానానికి వైఎస్సార్ జిల్లా రాయచోటిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబర్ 24న శంకుస్థాపన చేశారు. రూ.1,272 కోట్లతో చేపట్టిన ఈ అనుసంధాన పథకం ద్వారా కృష్ణా వరద జలాలను ఒడిసిపట్టి వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
మరోవైపు చిత్రావతి రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి పులివెందుల ప్రాజెక్టు, లింగాల మండలాల్లోని చెరువులను నింపడంతోపాటు యూసీఐఎల్ (యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) ప్రభావిత ఏడు గ్రామాల ప్రజలకు నీటిని అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టులకు కూడా ముఖ్యమంత్రి రాయచోటిలో శంకుస్థాపన చేశారు. అలాగే రాయచోటి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు.
సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు
  • రూ.60 వేల కోట్లతో రాయలసీమకు గోదావరి వరద జలాలను తరలిస్తాం.
  • పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచుతాం.
  • తెలుగుగంగ సామర్థ్యం 11,500 క్యూసెక్కుల నుంచి 18,000 క్యూసెక్కులకు పెంచుతాం.
  • కేసీ కెనాల్, నిప్పులవాగు కెపాసిటీని 12,500 క్యూసెక్కుల నుంచి 35,000 క్యూసెక్కులకు పెంచుతాం.
  • గండికోటకు దిగువన మరో 20 టీఎంసీలతో రిజర్వాయర్‌కు ప్రతిపాదనల తయారీ
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీఎన్‌ఎస్‌ఎస్ - హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ అనుసంధాన పథకానికి శంకుస్థాపన
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : రాయచోటి, వైఎస్సార్ జిల్లా, ఆంధ్రప్రదేశ్

పులివెందులలో 24 అభివృద్ధి పనులకు శంకుస్థాపన
పులివెందులకు అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ కళాశాలలను మంజూరు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో రూ.1,329 కోట్లతో చేపట్టిన 24 అభివృద్ధి పనులకు డిసెంబర్ 25న ఆయన పులివెందుల ధ్యాన్‌చంద్ క్రీడా మైదానంలో శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పులివెందులలో తొలివిడతగా ఈ పనులకు శ్రీకారం చుట్టామని, రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. గండికోట ప్రాజెక్టు దిగువన ముద్దనూరు మండలం ఆరవేటిపల్లె, దేనేపల్లె వద్ద 20 టీఎంసీల సామర్థ్యంతో కొత్తగా రిజర్వాయర్ నిర్మిస్తామన్నారు. ముద్దనూరు - కొడికొండ చెక్‌పోస్టు (పులివెందుల-బెంగుళూరు) రోడ్డును విస్తరిస్తామని పేర్కొన్నారు.

వరంగల్ జౌళి పార్కులో యంగ్వన్ పరిశ్రమ
Current Affairs
వరంగల్‌లోని మెగా జౌళి పార్కులో రూ. 900 కోట్ల పెట్టుబడులతో యంగ్వన్ కార్పొరేషన్ పరిశ్రమను స్థాపించనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో డిసెంబర్ 11న అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుల సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ పరిశ్రమకు 290 ఎకరాల భూకేటాయింపు పత్రాలను మంత్రులు ఆ సంస్థ ప్రతినిధులకు అందజేశారు. వరంగల్‌లో ఏర్పాటు చేసే పరిశ్రమ ద్వారా 12 వేల మందికి ఉపాధి కల్పిస్తామని యంగ్వన్ తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రూ. 900 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమ స్థాపన
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : యంగ్వన్ కార్పొరేషన్
ఎక్కడ : వరంగల్‌లోని మెగా జౌళి పార్కు

ఏపీ దిశ బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోదం
మహిళలు, బాలికలపై అత్యాచారాలు వంటి క్రూరమైన నేరాలకు పాల్పడితే వారికి మరణ శాసనం లిఖించేలా, 21 పనిదినాల్లోనే తీర్పు ఇచ్చేలా రూపొందించిన ‘ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం-క్రిమినల్ లా (సవరణ) బిల్లు-2019’ను ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిసెంబర్ 13న ఆమోదించింది. ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ లా చట్టం- 1973ను రాష్ట్రానికి వర్తింపచేయడంతో పాటు, అందులో అవసరమైన సవరణల చేస్తూ ఈ బిల్లును రూపొందించారు. అలాగే పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే గరిష్టంగా జీవిత ఖైదు విధించేలా.. సోషల్‌మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా మహిళల్ని వేధించడం, అసభ్య పోస్టింగులు పెడితే రెండేళ్ల నుంచి నాలుగేళ్ల వరకూ జైలు శిక్ష విధించేలా ఈ చట్టంలో కొత్త సెక్షన్లను చేర్చారు.
ప్రత్యేక న్యాయస్థానాల బిల్లుకు ఆమోదం
మహిళలు, బాలలపై నేరాల్ని త్వరితగతిన విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటునకు వీలు కల్పించే ‘ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం- మహిళలు, బాలలపై నిర్ధేశిత నేరాల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాల బిల్లు-2019’కు కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం మహిళలు, పిల్లలపై నేరాల విచారణకు.. త్వరితగతిన విచారణ ప్రక్రియ ముగించేందుకు ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తారు. ఇంతవరకూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ మహిళలు, పిల్లలపై నేరాల సత్వర విచారణకు జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు లేవు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం-క్రిమినల్ లా (సవరణ) బిల్లు-2019కు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : ఆంధ్రప్రదేశ్ శాసనసభ
ఎందుకు : మహిళలు, బాలికలపై అత్యాచారాలు వంటి క్రూరమైన నేరాలకు పాల్పడితే వారికి మరణ శాసనం లిఖించేలా, 21 పనిదినాల్లోనే తీర్పు ఇచ్చేలా

ఏపీ మహిళా కమిషన్ లోగో ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ లోగోను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఏపీ అసెంబ్లీలో డిసెంబర్ 16న జరిగిన లోగో కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, మహిళా సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ ఆర్‌కే రోజా పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ 2019, ఆగస్టు 26న ప్రమాణ స్వీకారం చేశారు. కమిషన్ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ కేబినెట్ హోదాతో ప్రభుత్వం నియమించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ లోగో ఆవిష్కరణ
ఎప్పుడు : డిసెంబర్ 16
ఎవరు : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఏపీ అసెంబ్లీ

ఏపీ శాసనసభలో 16 కీలక బిల్లులకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిసెంబర్ 16న చారిత్రక ఘట్టానికి వేదికైంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో పాఠ్యాంశాల బోధన, ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకోవడం, మద్యం అక్రమ విక్రయాలు, అక్రమ రవాణాను అరికట్టడం, ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల ఏర్పాటు వంటి 16 చరిత్రాత్మక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.
శాసనసభ ఆమోదించిన 16 బిల్లులు..
  1. ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్-1982 సవరణ
    ఉద్దేశం:
    ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యార్థులకు భోదన.. ధనిక, మధ్యతరగతి, పేద అనే తేడా లేకుండా అందరికీ నాణ్యమైన విద్యను అందించడం.. ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి దోహదం చేయడం.. అన్ని తరగతుల్లోనూ తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేయడం.
  2. ప్రభుత్వ సర్వీసుల్లోకి ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు
    ఉద్దేశం:
    ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేయడం.. ఆ సంస్థ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకునేలా ప్రత్యేకంగా ప్రజా రవాణా విభాగాన్ని ఏర్పాటు చేయడం.
  3. ఎస్సీ కమిషన్
    ఉద్దేశం:
    ఎస్సీ వర్గాల ప్రజల ప్రయోజనాలను సమర్థవంతంగా పరిరక్షించడం.
  4. ఎస్టీ కమిషన్
    ఉద్దేశం:
    ఎస్టీ వర్గాల ప్రజల ప్రయోజనాలను సమర్థవంతంగా పరిరక్షించడం.
  5. చిరుధాన్యాల(మిల్లెట్స్) బోర్డు ఏర్పాటు
    ఉద్దేశం:
    చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడం.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం.. ప్రజలందరికీ అందుబాటులోకి తేవడం.. పౌష్టికాహారాన్ని అందించడం.
  6. పప్పుధాన్యాల(పల్సస్) బోర్డు ఏర్పాటు
    ఉద్దేశం:
    పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించడం.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం.. ధరలు పెరగడకుండా నియంత్రించడం..ప్రజలందరికీ అందుబాటులోకి తేవడం.. పౌష్టికాహారాన్ని అందించడం.
  7. ఆంధ్రప్రదేశ్ మద్యనిషేధ చట్టం-1995కు సవరణ
    ఉద్దేశం:
    అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలకు అడ్డుకట్ట వేయడం.. అలాంటి నేరానికి తొలిసారి పాల్పడితే రూ.రెండు లక్షల జరిమానా.. రెండోసారి నేరానికి పాల్పడితే రూ.5 లక్షల జరిమానా.
  8. ఆంధ్రప్రదేశ్ ఆబ్కారీ చట్టం-1968కు సవరణ
    ఉద్దేశం:
    బార్‌లలో అక్రమ, సుంకం చెల్లించని మద్యం విక్రయం.. సరిహద్దుల నుంచి అక్రమ రవాణా.. ఇలాంటి నేరాలకు తొలిసారి పాల్పడితే హెచ్చరికతోపాటు లెసైన్స్ ఫీజుకు రెండు రెట్లు జరిమానా.. రెండోసారి పాల్పడితే బార్ లెసైన్స్ రద్దు, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు.
  9. కర్నూలులో క్లస్టర్ యునివర్సిటీ ఏర్పాటు
    ఉద్దేశం:
    కర్నూలులో సిల్వర్ జూబ్లీ కాలేజీ, కేవీఆర్ ప్రభుత్వ బాలికల డిగ్రీ కాలేజీలను విలీనం చేసి క్లస్టర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం.. విద్యార్థులకు ఉపాధి కల్పన సామర్థ్యాలు, నైపుణ్యాలను పెంచేలా నాణ్యమైన విద్యను అందించడం.
  10. జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, లలిత కళల విశ్వవిద్యాలయం చట్టం సవరణ
    ఉద్దేశం:
    వైఎస్సార్ ఆర్కిటెక్చర్, లలిత కళల విశ్వవిద్యాలయం కడపలో ఏర్పాటు చేయడం.
  11. ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల చట్టాల సవరణ బిల్లు
    ఉద్దేశం:
    విశ్వవిద్యాలయాల పాలక మండళ్లలో ఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్/ప్రతినిధి ఎక్స్-అఫీషియో సభ్యునిగా నియామకం.
  12. ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల చట్టాల రెండో సవరణ బిల్లు
    ఉద్దేశం:
    విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్ లర్ (ఉప కులపతులు)ల నియామక నిబంధనల్లో మార్పులు
  13. ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల రెండో సవరణ బిల్లు
    ఉద్దేశం:
    సహకార సంఘాల పాలక మండలి ఎన్నికల్లో కుష్టు వ్యాధిగ్రస్తులు, మూగ, చెవిటి వారికి పోటీ చేసే అవకాశం కల్పించడం.
  14. ఏపీ వృత్తిదారులు, వ్యాపారులు, ఉద్యోగుల వృత్తిపన్ను చట్టం సవరణ బిల్లు-2019
  15. ఏపీ జీఎస్టీ సవరణ బిల్లు-2019
  16. ఏపీ మున్సిపల్ చట్టం సవరణ బిల్లు-2019
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ సమావేశాల్లోనే 19 బిల్లులను శాసనసభ ఆమోదించింది.
చదవండి : తొలి సమావేశాల్లో ఆమోదం పొందిన 19 బిల్లులు

ఎన్‌ఎండీసీతో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ ఒప్పందం
జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ)తో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిలో డిసెంబర్ 18న జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ సీఎండీ పి.మధుసూదన్, ఎన్‌ఎండీసీ ప్రతినిధి అలోక్ కుమార్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం... ఎన్‌ఎండీసీ ఏటా 5 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని సరఫరా చేయనుంది. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో నెలకొల్పనున్న కడప ఉక్కు ఉక్కు కర్మాగారానికి ఈ ముడి ఇనుమును సరఫరా చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ)తో ఒప్పందం
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్
ఎందుకు : ఏటా 5 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని సరఫరా చేసేందుకు

భారత్ అమెరికా రక్షణ సదస్సు ప్రారంభం
భారత్ అమెరికా రక్షణ సంబంధాలపై హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సు డిసెంబర్ 18న ప్రారంభమైంది. రెండ్రోజుల పాటు జరిగే ఈ సదస్సును అంతర్జాతీయ బిజినెస్ కౌన్సిల్, భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), యూఎస్ రాయబార కార్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సుకు తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు, కార్యదర్శి జయేశ్ రంజన్, కేంద్ర రక్షణ రంగ ఉత్పత్తుల శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ జాజు, యూఎస్ రాజకీయ-రక్షణ వ్యవహారాల విభాగం డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జోయల్ స్టార్, హైదరాబాద్‌లో యూఎస్ కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్‌మాన్ హాజరయ్యారు.
సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ... తెలంగాణ లాంటి వేగంగా పురోగమిస్తున్న రాష్ట్రాలను నేరుగా సంప్రదిస్తే అమెరికా పెట్టుబడి సంస్థలు స్థానికంగా ఎదుర్కొనే అవాంతరాల పరిష్కారం దిశగా చొరవ తీసుకుంటామని చెప్పారు. భారత్‌లో ఎయిరోస్పేస్, డిఫెన్స్ రంగాల వాటా రూ.1.13 లక్షల కోట్లు కాగా, ఇది మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే సికోర్క్సీ హెలికాప్టర్‌తో పాటు, ఎఫ్ 16 యుద్ధ విమానాల రెక్కలు హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ అమెరికా రక్షణ సదస్సు ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎక్కడ : హైదరాబాద్

వైఎస్సార్ లైఫ్‌టైమ్ అవార్డులఎంపికకు కమిటీ
ఆంధ్రప్రదేశ్‌లో 2020 సంవత్సరానికి సంబంధించి వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులకు విశిష్ట వ్యక్తులను సిఫార్సు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని డిసెంబర్ 18న ఉత్తర్వులు జారీ చేశారు.
వైఎస్సార్ లైఫ్‌టైమ్ అవార్డుల ఎంపిక కమిటీ
అధ్యక్షుడు : సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్
మెంబర్ కన్వీనర్ : సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్) అదనపు కార్యదర్శి కిశోర్‌కుమార్
సభ్యులు: మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి దమయంతి, రెవెన్యూ శాఖ కార్యదర్శి వి.ఉషారాణి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్, సమాచార పౌరసంబంధాల కమిషనర్ టి.విజయకుమార్‌రెడ్డి
వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభచూపిన, అసాధారణ సేవలందించిన వారిని ఎంపిక చేసి ఏటా ఆగస్టు 15, జనవరి 26 తేదీల్లో వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులతో సత్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం విదితమే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వైఎస్సార్ లైఫ్‌టైమ్ అవార్డుల ఎంపికకు కమిటీ
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

తిరుపతిలో స్కిల్ డెవలప్‌మెంట్ వర్సిటీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ, విశాఖపట్నంలో హైఎండ్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్యకలాపాలపై డిసెంబర్ 18న ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడంలో భాగంగా స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు కావాలని సీఎం సూచించారు.

నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా పాలిటెక్నిక్ కాలేజీలు
రాష్ట్రంలోని ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక పాలిటెక్నిక్ కాలేజీ.. అవసరమైతే ఇంకోటి ఏర్పాటు చేసి, వాటిని నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మార్చాలని సీఎం జగన్ ఆదేశించారు. వీటన్నింటిపై ఏర్పాటయ్యే యూనివర్సిటీ వీటిని గైడ్ చేస్తుందన్నారు. ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్ లాంటి కోర్సులు పూర్తి చేసిన వారిలో మరింతగా నైపుణ్యం పెంపొందించేందుకే వీటిని తీసుకు వస్తున్నామని చెప్పారు.
స్కిల్ డెవలప్‌మెంట్ వర్సిటీ పని తీరు ఇలా..
  • స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలకు చుక్కానిలా ఉంటుంది.
  • ఎప్పటికప్పుడు వాటికి దిశ, నిర్దేశం చేస్తుంది.
  • ఎప్పుడు ఏ అంశాలపై శిక్షణ ఇవ్వాలో సూచిస్తుంది.
  • అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ
హైఎండ్ స్కిల్ వర్సిటీ పని తీరు ఇలా..
  • నైపుణ్యవంతులను మరింతగా తీర్చిదిద్దడం
  • రోబోటిక్స్‌లో ప్రపంచంతో పోటీ పడేలా శిక్షణ
  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పట్టు సాధించేలా కసరత్తు
  • విదేశీ కంపెనీల్లో ఉద్యోగాలొచ్చేలా అదనపు నైపుణ్యాలు సమకూర్చడం
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
ఎక్కడ : తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్

త్వరలో భారత మార్కెట్‌లోకి కియా కార్నివాల్’ కొత్త కారు
Current Affairs
ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాలుగా సహాయ, సహకారాలను అందిస్తామని సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ఎంతో అనువైన ప్రాంతమని, తమ ప్రభుత్వం చొరవ తీసుకుని క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని చెప్పారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలోని కియా కార్ల తయారీ ప్లాంటు పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభించిన సందర్భంగా డిసెంబర్ 5న నిర్వహించిన ‘గ్రాండ్ ఓపెనింగ్’ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఏటా 3 లక్షల కార్ల తయారీ సామర్థ్యం, రూ.13,500 కోట్ల పెట్టుబడితో కియా కార్ల తయారీ ప్లాంటు ఏర్పాటైంది.
ఏటా కార్ల ఉత్పత్తి సామర్థ్యం 70 వేల నుంచి 3 లక్షల వరకు..
కియా సంస్థ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. ప్రస్తుతం కియా ద్వారా నేరుగా 3 వేల మందికి, అనుబంధ కంపెనీల ద్వారా 3,500 మందికి ఉపాధి లభిస్తోందన్నారు. ఏటా కార్ల ఉత్పత్తి సామర్థ్యం 70 వేల నుంచి 3 లక్షలకు చేరడం వల్ల ప్రత్యక్షంగా 11 వేల మందికి, పరోక్షంగా 7 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఏపీలో కియా సంస్థ పెట్టుబడులు పెట్టడం దేశానికే గర్వకారణమని, అన్ని విభాగాల్లో పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. ఇందుకోసం కృషి చేసిన కియా సిబ్బందికి సీఎం అభినందనలు తెలిపారు.
ప్రభుత్వం నుంచి మంచి సహకారం: కియా గ్లోబల్ సీఈవో హన్
తమ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంచి సహకారం అందుతోందని కియా సంస్థ గ్లోబల్ సీఈవో హన్ ఊ పాక్ తెలిపారు. అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఏర్పాటైన ఈ ప్లాంటు ప్రపంచస్థాయి కార్ల తయారీ యూనిట్ల సరసన నిలుస్తుందన్నారు. 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏటా 28 లక్షల కార్లను విక్రయించాలనేది తమ లక్ష్యమని, అనంతపురం యూనిట్ ఇందులో కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. తమ సంస్థ నుంచి త్వరలో రానున్న ‘కియా కార్నివల్’ కారును భారతీయుల అవసరాలకు అనుగుణంగా ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కియా కార్ల తయారీ ప్లాంటు పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభం
ఎప్పుడు: డిసెంబర్ 5, 2019
ఎవరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్
ఎక్కడ: అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి గ్రామం

దిశ’ నిందితులు ఎన్‌కౌంటర్
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ‘దిశ’ అత్యాచార ఘటనలో నిందితులు పోలీసు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. చటాన్‌పల్లి వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు అక్కడికక్కడే మరణించారు. డిసెంబర్ 6వ తేదీ తెల్లవారు జామున ఆధారాల సేకరణ కోసం దిశను కాల్చిన ప్రదేశానికి తీసుకొచ్చిన సమయంలో అనూహ్యం గా తలెత్తిన పరిస్థితులు ఎన్‌కౌంటర్‌కు దారితీశా యి. ఉదయం 5:45 నుంచి 6:15 గంటల మధ్యలో పోలీసులు, నిందితులకు జరిగిన కాల్పుల్లో ఆ నలుగురు నిందితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్‌గౌడ్ గాయపడ్డారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ‘దిశ’ అత్యాచార ఘటనలో నిందితులు పోలీసు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు
ఎవరు: ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు
ఎప్పుడు: డిసెంబర్ 6, 2019
ఎక్కడ: చటాన్‌పల్లి
ఎందుకు: ఆధారాల సేకరణ కోసం దిశను కాల్చిన ప్రదేశానికి తీసుకొచ్చిన సమయంలో అనూహ్యం గా తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో

ఏపీ ఎస్‌ఐపీబీ చైర్మన్‌గా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
ఏపీ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ)ను పునరుద్ధరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 9న ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్‌ఐపీబీ చైర్మన్‌గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కన్వీనర్‌గా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎస్‌ఐపీబీ సభ్యులుగా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పిల్లి సుభాష్ చంద్రబోస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, జి.జయరాం, మేకపాటి గౌతమ్‌రెడ్డి, బాలినేని శ్రీనివాసులరెడ్డిలను ప్రభుత్వం నియమించింది. సంబంధిత శాఖల కార్యదర్శులు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. ఎస్‌ఐపీబీ ప్రతి నెలా ఒకసారి సమావేశమై కీలకమైన పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) పునరుద్ధరణ
ఎప్పుడు : డిసెంబర్ 9
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : పెట్టుబడుల ప్రతిపాదనలను పరిశీలించి ఆమోదించేందుకు

తెలంగాణ ప్రభుత్వంతో స్విట్జర్లాండ్ ఒప్పందం
హైదరాబాద్‌లో జరగనున్న ‘బయో ఆసియా 2020’ సదస్సు నిర్వహణలో భాగస్వామ్యం వహించేందుకు స్విట్జర్లాండ్ ముందుకొచ్చింది. దీనికి సంబంధించి డిసెంబర్ 10న తెలంగాణ ప్రభుత్వంతో స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్య ఒప్పందంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు సమక్షంలో స్విట్జర్లాండ్ కాన్సులేట్ జనరల్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతకాలు చేశారు. స్విట్జర్లాండ్ డిప్యూటీ కాన్సుల్ జనరల్ సిల్వానా రెంగ్లి ఫ్రే, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ ఒప్పందం సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సుమారు వంద దేశాల నుంచి లైఫ్ సెన్సైస్ దిగ్గజాలను ఆకర్షించడంలో బయో ఆసియా 2020 సదస్సు కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సదస్సు నిర్వహణలో స్విట్జర్లాండ్ భాగస్వామ్యం ద్వారా అక్కడి కంపెనీలు, ప్రభుత్వంతో బహుముఖ సంబంధాలు ఏర్పడతాయని వ్యాఖ్యానించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం
ఎప్పుడు : డిసెంబర్ 10
ఎవరు : స్విట్జర్లాండ్ ప్రభుత్వం
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : బయో ఆసియా 2020 సదస్సు నిర్వహణలో భాగస్వామ్యం వహించేందుకు

దుమ్ముగూడెం బహుళార్థ సాధక ప్రాజెక్టుకు ఆమోదం
గోదావరి నదిపై దుమ్ముగూడెం బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 3,481.9 కోట్ల అంచనా వ్యయంతో దుమ్ముగూడెం బ్యారేజీ నిర్మాణానికి అనుమతిచ్చింది. బ్యారేజీకి అనుబంధంగా 320 మెగావాట్ల సామర్థ్యంతో జల విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన డిసెంబర్ 11న సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది. దుమ్ముగూడెం బ్యారేజీకి అయ్యే ఖర్చును రెండేళ్ల పాటు బడ్జెట్లలో కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. 37 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 63 మీటర్ల ఎత్తులో, భూసేకరణ అవసరం లేకుండా నదిలోనే నీళ్లు నిల్వ ఉండేలా బ్యారేజీ నిర్మాణం చేపట్టొచ్చని అధికారులు తెలిపారు. ఈ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దుమ్ముగూడెం బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణానికి ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం
ఎక్కడ : గోదావరి నది

తెలంగాణ లోకాయుక్త చట్ట సవరణకు ఆర్డినెన్స్
లోకాయుక్త చైర్మన్, వైస్ చైర్మన్ల నియామకానికి సంబంధించిన అర్హతలను మార్చేందుకు తెలంగాణ లోకాయుక్త చట్టాన్ని అత్యవసరంగా సవరిస్తూ ఆర్డినెన్స్ తేవాలన్న ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. లోకాయుక్త చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జీని నియమించాలన్న నిబంధన స్థానంలో జిల్లా జడ్జిగా పనిచేసి రిటైరైన వారికి కూడా అవకాశం కల్పించేలా సవరణ చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన డిసెంబర్ 11న సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
మంత్రివర్గ భేటీలోని కీలక నిర్ణయాలు
  • కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి కొత్తగా మరో రూ.15,575.11 కోట్ల రుణాలు సమీకరించాలన్న ప్రతిపాదనలకు ఆమోదం. కాళేశ్వరం నీటిపారుదల పథకం కార్పొరేషన్ పేరుతో నాబార్డు నుంచి రూ.1,500 కోట్లు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ) నుంచి రూ.10 వేల కోట్లు, పీఎఫ్‌సీ నుంచే మరో రూ.4,075.11 కోట్ల రుణాలు తీసుకోవాలని నిర్ణయం.
  • కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మిడ్‌మానేరు వరకు 3 టీఎంసీల నీటిని తరలించేందుకు అవసరమైన నిర్మాణాలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రస్తుతం నిర్మించిన ప్రాజెక్టు ద్వారా రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసే వీలుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ లోకాయుక్త చట్ట సవరణకు ఆర్డినెన్స్
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం
ఎందుకు : లోకాయుక్త చైర్మన్, వైస్ చైర్మన్ల నియామకానికి సంబంధించిన అర్హతలను మార్చేందుకు

ములుగులో అటవీ కళాశాల ప్రారంభం
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగులో ఏర్పాటుచేసిన అటవీ కళాశాల-పరిశోధనా కేంద్రం, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయ భవనాలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు డిసెంబర్ 11న ప్రారంభించారు. అనంతరం గజ్వేల్‌లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సమీకృత ప్రభుత్వ కార్యాలయ భవనం, మహతి ఆడిటోరియాలను సీఎం ప్రారంభించి.. వంద పడకల మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...‘‘ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. అందుకు ప్రజల ఆరోగ్య రికార్డును తయారు చేయాలి. ముందుగా గజ్వేల్ నియోజకవర్గం ఎక్స్‌రే పేరుతో ప్రతి ఒక్కరినీ పరీక్షించి రికార్డు సిద్ధం చేయాలి. తర్వాత రాష్ట్రమంతా అమలు చేయాలి’’ అని చెప్పారు. ప్రమాదాలు జరిగినప్పుడు బ్లెడ్ గ్రూప్, ఇతర వివరాలు తెలిస్తే వెంటనే చికిత్స అందుతుందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అందరి ఆరోగ్య రికార్డు ఉంటుందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అటవీ కళాశాల-పరిశోధనా కేంద్రం, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయ భవనం ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు
ఎక్కడ : ములుగు, గజ్వేల్ నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా

ఏపీ దిశ యాక్ట్-2019 బిల్లుకు మంత్రివర్గం ఆమోదం
మహిళలు, బాలికలపై అత్యాచారాలు వంటి అఘాయిత్యాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించేలా.. నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లోనే తీర్పు ఇచ్చేలా చారిత్రాత్మక ముసాయిదా బిల్లుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ డిసెంబర్ 11న ఆమోదం తెలిపింది. మహిళలు, బాలికలపై క్రూరమైన నేరాలకు పాల్పడే వారికి ఇక జీవితం ఉండదనే రీతిలో స్పష్టమైన సంకేతాలు ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా (సవరణ) చట్టం-2019 (ఆంధ్రప్రదేశ్ దిశ యాక్ట్)ను తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ చట్టంలో భాగంగా మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తారు. ఏపీ దిశ చట్టంతో పాటు మహిళలు, చిన్నారుల భద్రత కోసం ఇండియన్ పీనల్ కోడ్‌లో అదనంగా 354(ఇ), 354 (ఎఫ్) సెక్షన్లను చేర్చే ముసాయిదా బిల్లులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
కేబినెట్ భేటీలో మరికొన్ని కీలక నిర్ణయాలు
  • కర్నూలులో క్లస్టర్ యూనివర్శిటీ ఏర్పాటుకు నిర్ణయం. సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజీ, కేవీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలను విలీనం చేస్తూ క్లస్టర్ యూనివర్శిటీగా ఏర్పాటు చేయాలని నిర్ణయం.
  • చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం పంగూరు గ్రామంలో 15.28 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి కేటాయింపునకు మంత్రివర్గం అనుమతి.
  • ఏపీ స్టేట్ యూనివర్శిటీ యాక్ట్‌లో సవరణలకు కేబినెట్ పచ్చజెండా. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ లేదా ఆయన నియమించిన వ్యక్తి అన్ని యూనివర్శిటీల్లో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉంటారు.
  • కడప జిల్లాలో వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్‌‌ట్స యూనివర్సిటీ ఏర్పాటుకు ఆమోదం. యూనివర్శిటీలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్‌‌ట్స ఏర్పాటు. రెండు కాలేజీల్లో ఐదు విభాగాలు.
  • ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక విభాగం కమిషన్ చైర్మన్‌గా వంగపండు ఉష నియామకానికి కేబినెట్ ఆమోదం.
  • ఆంధ్రప్రదేశ్ టాక్స్ ఆన్ ప్రొఫెషన్స్, ట్రేడ్‌‌స, కాలింగ్‌‌స అండ్ ఎంప్లాయిమెంట్ సవరణ ముసాయిదా బిల్లు-2019 కు ఆమోదం.
  • వీఓఏ/సంఘమిత్ర/యానిమేటర్ల జీతాల పెంపుదలకు మంత్రివర్గం అంగీకారం. జీతాలు రూ.10వేలకు పెంచుతూ ఇటీవలే నిర్ణయం.
  • ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీస్ (ఏపీసీఎస్) చట్టం 1964లో సెక్షన్ 21-ఎ (1) (ఇ) సవరణకు కేబినెట్ ఆమోదం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ దిశ యాక్ట్-2019 బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
ఎందుకు : మహిళలు, బాలికలపై అత్యాచారాలు వంటి అఘాయిత్యాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించేలా

సచివాలయాలు, వలంటీర్ల కోసం కొత్త శాఖ
గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయాల నిర్వహణకు కొత్త శాఖ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి డిసెంబర్ 11న అంగీకారం తెలిపింది. గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయాలపై సమీక్ష, పర్యవేక్షణలకు బలమైన యంత్రాంగం ఏర్పాటు చేయడమే దీని ఉద్దేశం. లక్ష్యాల సాధనకు ఇతర శాఖలతో సమన్వయం చేసుకునేలా కార్యాచరణ ఉంటుంది. ఉద్యోగులను సమర్ధంగా వినియోగించుకోవడంతోపాటు లక్ష్యాలపై స్పష్టత తీసుకురావడం, మెరుగైన భాగస్వామ్యంతో మంచి ఫలితాలు రాబడతారు.
కేబినెట్ భేటీలో మరికొన్ని కీలక నిర్ణయాలు
  • ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కొత్త చట్టం ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం. ప్రభుత్వంలో ఏపీఎస్‌ఆర్టీసీ విలీనం కోసం పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఏర్పాటుకు మంత్రిమండలి అంగీకరించింది.
  • అన్ని పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టును తప్పనిసరిచేస్తూ మంత్రివర్గం నిర్ణయించింది.
  • ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం. రూ.101 కోట్ల షేర్ క్యాపిటల్‌తో ఏర్పాటు.
  • ఆంధ్రప్రదేశ్ మిల్లెట్ బోర్డు చట్టం-2019 ముసాయిదాకు బిల్లుకు గ్రీన్‌సిగ్నల్. కరవు, వర్షాభావ ప్రాంతాల్లో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటుకు ముసాయిదా బిల్లు.
  • ఆంధ్రప్రదేశ్ పప్పుధాన్యాల బోర్డు చట్టం - 2019 బిల్లుకు ఆమోదం.
  • ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రుణ పరిమితి మరో రూ.3వేల కోట్లు పెంచేందుకు కేబినెట్ అంగీకారం. ప్రస్తుతం ఉన్న పరిమితి రూ.22 వేల కోట్లు.
  • ఆంధ్రప్రదేశ్ గూడ్‌‌స అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సవరణ ముసాయిదా బిల్లుకు మంత్రిమండలి పచ్చజెండా
క్విక్ రివ్యూ:
ఏమిటి : సచివాలయాలు, వలంటీర్ల కోసం కొత్త శాఖ ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
ఎందుకు : గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయాల నిర్వహణకు

5వ ఏపీ సైన్స్ కాంగ్రెస్ -2019 ప్రారంభం
Current Affairs శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో 5వ ఏపీ సైన్స్ కాంగ్రెస్-2019 ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరగనున్న ఈ కాంగ్రెస్‌ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నవంబర్ 28న న ప్రారంభించారు. ‘అభివృద్ధిలో శాస్త్ర విజ్ఞానం’ అంశంగా జరుగుతున్న ఈ కాంగ్రెస్‌లో గవర్నర్ మాట్లాడుతూ... సైన్స్ తోనే సమాజంలోని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. పర్యావరణ అసమానతలు భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారుతున్నాయని, ఢిల్లీ వంటి నగరాల్లో కాలుష్య తీవ్రతే ఇందుకు నిదర్శనమన్నారు. మొక్కలు విస్తారంగా నాటుతూ అడవుల భూభాగం 33 శాతం కంటే పెరగడం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 5వ ఏపీ సైన్స్ కాంగ్రెస్ -2019 ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
ఎక్కడ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్

నవరత్నాల అమలుకు ప్రత్యేక కమిటీలు
ప్రతిష్టాత్మక నవరత్నాల పథకాలను అర్హులైన వారికి మరింత సమర్థంగా అందించేందుకు ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నవంబర్ 28న ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర స్థాయి కమిటీ
రాష్ట్రస్థాయి కమిటీలో 27 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీకి చైర్మన్‌గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహరిస్తారు. ఉపాధ్యక్షునిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం.శామ్యూల్, సభ్య కన్వీనర్‌గా ప్రణాళికా శాఖ కార్యదర్శి వ్యవహరిస్తారు. సభ్యులుగా నలుగురు ఉప ముఖ్యమంత్రులు, సంబంధిత శాఖల మంత్రులు, ఆయా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఉంటారు.
జిల్లా స్థాయి కమిటీ
జిల్లా స్థాయి కమిటీకి జిల్లా ఇన్‌చార్జి మంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. సభ్యులుగా జిల్లా మంత్రులు, నవరత్నాలకు సంబంధించిన శాఖల జిల్లాల అధికారులు ఉంటారు. ఈ కమిటీకి సభ్య కన్వీనర్‌గా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నవరత్నాల అమలుకు ప్రత్యేక కమిటీలు
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : నవరత్నాల పథకాలను అర్హులైన వారికి మరింత సమర్థంగా అందించేందుకు

విశాఖ వేదికగా మిలాన్-2020 విన్యాసాలు
నౌకాదళ విభాగంలో ప్రతిష్టాత్మకమైన మిలాన్ (బహుపాక్షిక నావికా విన్యాసాలు)కు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వేదిక కానుంది. విశాఖలోని ఈస్ట్రన్ నేవల్ కమాండ్ (ఈఎన్‌సీ) ప్రధాన స్థావరంలో మిలాన్-2020 విన్యాసాలు నిర్వహించనున్నారు. మిలాన్-2020లో పాల్గొనేందుకు ఇప్పటికే భారత నౌకాదళం దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా, యూరప్‌లకు చెందిన 41 దేశాలకు ఆహ్వానాలు పంపింది. వివిధ దేశాల మధ్య స్నేహ పూర్వక సత్సంబంధాల్ని మెరుగు పరచుకోవడంతో పాటు శత్రుసైన్యానికి బలం, బలగం గురించి తెలియజేసేందుకు మిలాన్ విన్యాసాలు నిర్వహిస్తుంటారు.
1995లో తొలిసారి జరిగిన మిలాన్ విన్యాసాల్లో భారత్‌తో పాటు ఇండోనేసియా, సింగపూర్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలు మాత్రమే పాల్గొన్నాయి. రెండేళ్లకోసారి నిర్వహించే మిలాన్‌లో 2010 వరకు 8 దేశాలు మాత్రమే పాల్గొనగా.. 2012లో 16 దేశాలు పాల్గొన్నాయి. 2014లో 17 దేశాలు పాల్గొని అతి పెద్ద మిలాన్‌గా చరిత్రకెక్కింది. 2018లో అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగిన విన్యాసాల్లోనూ 17 దేశాలు పాల్గొన్నాయి. 2005లో సునామీ రావడం వల్ల మిలాన్ విన్యాసాలు రద్దు చేయగా, 2001, 2016 సంవత్సరాల్లో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)లు నిర్వహించడం వల్ల మిలాన్ విన్యాసాలు జరగలేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మిలాన్-2020 విన్యాసాలు
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : భారత నౌకాదళం
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్

తెలంగాణ ప్రభుత్వంతో స్కైవర్త్ కంపెనీ ఒప్పందం
తెలంగాణ ప్రభుత్వంతో చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ స్కైవర్త్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు తెలంగాణ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావుతో స్కైవర్త్ గ్రూప్ చైర్మన్ లై వీడ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం నవంబర్ 29న హైదరాబాద్‌లో భేటీ అయింది. తాజా ఒప్పందం ప్రకారం... స్కెవర్త్ కంపెనీ మొదటి దశలో రూ. 700 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ కేంద్రంగా 50 ఎకరాల విస్తీర్ణంలో ఉత్పాదక ప్లాంటును ఏర్పాటు చేయనుంది. స్కైవర్త్ పెట్టుబడులతో రాష్ట్రంలో 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త ఫీచర్లను అందించే స్కైవర్త్ బ్రాండ్... ఎల్‌ఈడీ టీవీలను ఇప్పటికే ఉత్పత్తి చేస్తోంది. కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఎలక్ట్రానిక్ వాహనాల్లో ఉపయోగించే లిథియం బ్యాటరీలు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లను తయారు చేయాలని స్కైవర్త్ నిర్ణయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ స్కైవర్త్
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : హైదరాబాద్ కేంద్రంగా 50 ఎకరాల విస్తీర్ణంలో ఉత్పాదక ప్లాంటును నెలకొల్పేందుకు

న్యాయాధికారుల సదస్సులో జస్టిస్ జేకే మహేశ్వరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయాధికారుల తొలి సదస్సులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి పాల్గొన్నారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున వర్సిటీ ప్రాంగణంలో డిసెంబర్ 1న ఈ సదస్సులో జస్టిస్ మహేశ్వరి మాట్లాడుతూ... న్యాయవ్యవస్థపై ప్రజలు ఎంతో నమ్మకం ఉంచారని, శీఘ్రగతిన వారికి న్యాయాన్ని అందించినప్పుడే ఆ నమ్మకానికి సార్థకత చేకూరుతుందని అన్నారు. ప్రజలు మనదేశంలో న్యాయమూర్తులను దేవుళ్లలా భావిస్తారని, అందుకే న్యాయస్థానాలు ‘న్యాయ ఆలయాలు’ అయ్యాయన్నారు. ఈ సదస్సులో హైకోర్టు న్యాయమూర్తులతో పాటు 13 జిల్లాలకు చెందిన దాదాపు 530 మంది న్యాయాధికారులు పాల్గొన్నారు.
హైకోర్టు జడ్జిపై 12 వేల కేసుల భారం...
అధికార గణాంకాల ప్రకారం హైకోర్టులో 1,90,431 కేసులు పెండింగ్‌లో ఉంటే, ప్రస్తుతం ఉన్నది 15 మంది న్యాయమూర్తులేనని సీజే తెలిపారు. ఆ ప్రకారం ఒక్కో న్యాయమూర్తిపై 12,695 కేసులను విచారించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. అలాగే కింది కోర్టుల్లో 5,67,630 పెండింగ్ కేసులు ఉంటే, ప్రస్తుతం ఉన్నది 529 మంది న్యాయాధికారులేనని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయాధికారుల తొలి సదస్సు
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి
ఎక్కడ : ఆచార్య నాగార్జున వర్సిటీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్

విశాఖలో ఉబెర్ ఎక్సలెన్స్ సెంటర్ ప్రారంభం
అమెరికాకు చెందిన ప్రముఖ ట్యాక్సీ సేవల సంస్థ ‘ఉబెర్’.. విశాఖపట్నంలో తన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)ను డిసెంబర్ 2న ప్రారంభించింది. రూ. 5.73 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ద్వారా 2020 ఏడాది చివరినాటికి మొత్తం 500 మందికి ఉపాధి లభించనుందని ఉబెర్ ప్రకటించింది. అత్యవసర సమస్యలను పరిష్కరించడం, ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే స్పందించడం కోసం శిక్షణ పొందిన బృందాలు ఇక్కడ నుంచే నిరంతర సేవలను అందిస్తాయని వివరించింది.
ప్రపంచంలో 12వ సెంటర్
ఉబెర్ సంస్థ భారత్‌లో తన మొదటి కేంద్రాన్ని హైదరాబాద్‌లో 2015లో సంస్థ ఏర్పాటుచేసింది. ప్రస్తుతం 1,000 మంది ఉద్యోగులతో ఉబెర్ రైడర్స్, డ్రైవర్లు, కస్టమర్లు, కొరియర్, రెస్టారెంట్ భాగస్వాములకు ఇక్కడ నుంచే సేవలందిస్తోంది. ఓలాకు పోటీనివ్వడం కోసం తాజాగా రెండవ సెంటర్‌ను విశాఖలో ప్రారంభించింది. ప్రపంచంలోనే కంపెనీకి ఇది 12వ సెంటర్‌గా ప్రకటించింది. అమెరికాలో 2, యూరప్‌లో 4 సీఓఈ కేంద్రాలతో పాటు మధ్యప్రాచ్యం, ఆఫ్రికాల్లో ఇటువంటి కార్యాలయాలనే నిర్వహిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉబెర్ ఎక్సలెన్స్ సెంటర్ ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : ఉబెర్
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్

భారత్‌లోనే ఇంటర్నెట్ చౌక : కేంద్ర టెలికం మంత్రి
ప్రపంచం మొత్తం మీద భారత్‌లోనే మొబైల్ డేటా రేట్లు అత్యంత తక్కువని కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. బ్రిటన్‌కు చెందిన కేబుల్.కో.యూకే అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని పేర్కొన్నారు. డేటా రేట్లకు సంబంధించిన చార్టును డిసెంబర్ 2న మంత్రి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ చార్టు ప్రకారం... ఒక గిగాబైట్ (జీబీ) డేటా సగటు ధర భారత్‌లో 0.26 డాలర్లుగా ఉండగా.. బ్రిటన్‌లో 6.66 డాలర్లు, అమెరికాలో 12.37 డాలర్లుగా ఉంది. ప్రపంచ సగటు 8.53 డాలర్లుగా ఉంది.
డేటా రేట్ల విషయమై మంత్రి స్పందిస్తూ... ‘ట్రాయ్ గణాంకాల ప్రకారం 2014లో ఒక్క జీబీకి చార్జీ రూ. 268.97గా ఉండేది. ప్రస్తుతం ఇది రూ. 11.78కి తగ్గింది’ అని పేర్కొన్నారు. దేశీ టెల్కోలు భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా, రిలయన్స్ జియో .. ఏకంగా 50 శాతం దాకా టారిఫ్‌లను పెంచు తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో మంత్రి స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచం మొత్తం మీద భారత్‌లోనే ఇంటర్నెట్ చౌక
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్

హైదరాబాద్‌లో ఇంటెల్ డిజైన్ సెంటర్ ప్రారంభం
చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ ఇండియా... డిజైన్, ఇంజనీరింగ్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. 3 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో 1,500 సీట్ల సామర్థ్యంతో నెలకొల్పిన ఈ సెంటర్‌ను తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు డిసెంబర్ 2న ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడ 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంటెల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజా ఎం కోడూరి మాట్లాడుతూ... ఎక్సా స్కేల్ సూపర్ కంప్యూటర్ అభివృద్ధిలో హైదరాబాద్ ఇంటెల్ కేంద్రం పాలు పంచుకుంటుందని వెల్లడించారు. ఈ సూపర్ కంప్యూటర్ యూఎస్‌లో 2021లో, భారత్‌లో 2022లో రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇంటెల్ డిజైన్ సెంటర్ ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు
ఎక్కడ : హైదరాబాద్

వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ పథకం ప్రారంభమైంది. గుంటూరు జనరల్ ఆసుపత్రిలో డిసెంబర్ 2న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన డేగల సత్యలీలకు సీఎం తొలి చెక్కు అందించారు. రోడ్డు ప్రమాదానికి గురైన ఆమెకు ప్రభుత్వం రూ.10 వేలు చెల్లించింది.
ఆరోగ్య ఆసరా ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ... ఆరోగ్యశ్రీలో భాగంగా ఉండే వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఆపరేషన్ తర్వాత రోగికి రోజుకు రూ.225 చొప్పున నెలకు గరిష్టంగా రూ.5 వేల వరకు అందిస్తామని తెలిపారు. వైద్యుల సిఫార్సుల మేరకు ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా చికిత్సానంతర జీవనభృతిని అందిస్తామన్నారు. మూడేళ్లలో ప్రభుత్వాస్పత్రులను కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దేందుకు రూ.13 వేల కోట్లు వెచ్చించనున్నామని పేర్కొన్నారు.
జనవరి 1 నుంచి ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు
ఆరోగ్యశ్రీ పరిధిని పెంచి ఏటా రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. అందులో భాగంగా వారికి జనవరి 1వతేదీ నుంచి ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు జారీ చేస్తామన్నారు. జనవరి 1 నుంచి ఆరోగ్యశ్రీని 1,200 చికిత్సలకు విస్తరిస్తామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2,000 చికిత్సలను చేరుస్తామని వెల్లడించారు. ‘తొలిదశలో పెలైట్ ప్రాజెక్ట్ కింద ముందు పశ్చిమ గోదావరి జిల్లాలో జనవరిలో దీన్ని ప్రారంభిస్తాం. ఏప్రిల్ నుంచి నెలకు ఒక జిల్లా చొప్పున విస్తరించుకుంటూ వెళతాం. వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది’ అని సీఎం తెలిపారు.
సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు
  • విజయనగరం, పాడేరు, ఏలూరు, మచిలీపట్నం, గురజాల, మార్కాపురం, పులివెందులలో బోధనాస్పత్రులను ఏర్పాటు చేస్తాం.
  • 2020, ఏప్రిల్ నాటికి 104, 108 వాహనాలు కొత్తవి 1,060 కొనుగోలు చేస్తాం.
  • డయాలసిస్ రోగులకు ఇస్తున్న విధంగానే తలసేమియా, సికిల్‌సెల్, హీమోఫీలియా వ్యాధిగ్రస్తులకు కూడా 2020, జనవరి 1 నుంచి నెలకు రూ.10 వేలు చొప్పున ఇస్తాం.
  • ప్రమాదాలు, పక్షవాతం, నరాల బలహీనత కారణంగా వీల్ చైర్లు, మంచానికే పరిమితమైన వారికి 2020, జనవరి 1 నుంచి రూ.5 వేలు చొప్పున పెన్షన్ చెల్లిస్తాం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : గుంటూరు జనరల్ ఆసుపత్రి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : చికిత్స తర్వాత రోగికి ఆర్థిక సాయం అందించేందుకు

వైఎస్సార్ లా నేస్తం పథకం ప్రారంభం
వృత్తిలోకి కొత్తగా ప్రవేశించిన న్యాయవాదులకు ఆర్థిక సాయం చేసేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ లా నేస్తం’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబర్ 3న రాష్ట్ర సచివాలయంలో ప్రారంభించారు. వైఎస్సార్ లా నేస్తం పథకం కింద జూనియర్ న్యాయవాదులకు ప్రతినెలా రూ.5,000 చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రాక్టీస్ పిరియడ్‌లో మూడేళ్ల పాటు అందించనున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి వైఎస్సార్ లా నేస్తం కింద జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ చెల్లించేందుకు రూ.5.30 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
వైఎస్సార్ లా నేస్తం పథకానికి అర్హులు
  • జీవో జారీ చేసిన నాటికి 35 ఏళ్ల లోపు వయసున్న, బార్ కౌన్సిల్ రోల్స్‌లో నమోదైన జూనియర్ న్యాయవాదులు
  • 2016, ఆ తర్వాత ఉత్తీర్ణులైన లా గ్రాడ్యుయేట్లు
క్విక్ రివ్యూ:
ఏమిటి : వైఎస్సార్ లా నేస్తం పథకం ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ సచివాలయం
ఎందుకు : జూనియర్ న్యాయవాదులకు ప్రతినెలా రూ.5,000 చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రాక్టీస్ పిరియడ్‌లో మూడేళ్ల పాటు అందించేందుకు

మహిళల రక్షణకు బీ సేఫ్ యాప్ ఆవిష్కరణ
ఏపీ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 3న విజయవాడలో ‘ఉమెన్ సేఫ్టీ ఇన్ సైబర్ స్పేస్’ అనే అంశంపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు సందర్భంగా మహిళలు, యువత రక్షణ కోసం ఉద్దేశించిన ‘బీ సేఫ్’ యాప్‌ను ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆవిష్కరించారు. అనంతరం హోం మంత్రి మాట్లాడుతూ... అత్యవసర ఫోన్ నంబర్లు 100, 181, 112, వాట్సాప్ నంబరు 9121211100పై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళామిత్ర, సైబర్‌మిత్ర ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బీ సేఫ్ యాప్ ఆవిష్కరణ
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : మహిళలు, యువత రక్షణ కోసం

దిశ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు
దిశ అత్యాచారం, హత్య ఘటనలో దోషులను త్వరితగతిన తేల్చేందుకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. జస్టిస్ ఫర్ దిశ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనకు హైకోర్టు ఆమోదముద్ర వేసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు వీలుగా డిసెంబర్ 4న తెలంగాణ న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్‌నగర్ మొదటి అదనపు సెషన్స్ జిల్లా జడ్జి కోర్టును ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టుగా పరిగణిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. రోజువారీగా ‘దిశ’కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారించి సత్వరం తీర్పు వెలువరించనుంది.
నోట్ : శంషాబాద్‌లో నవంబర్ 27న అత్యాచారం, దారుణ హత్యకు గురైన బాధితురాలి పేరును ‘జస్టిస్ ఫర్ దిశ’గా పిలవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ డిసెంబర్ 1న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రెండోసారి ఫాస్ట్‌ట్రాక్..
తెలంగాణ ఏర్పాటు తర్వాత ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు కావడం ఇది రెండోసారి. ఇటీవల వరంగల్ జిల్లాలో 9 నెలల పాపపై అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. ఈ కేసులో సత్వర విచారణ జరిపిన కోర్టు 56 రోజుల్లో తీర్పు చెప్పింది. నిందితుడికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్పు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : తెలంగాణ న్యాయ శాఖ
ఎందుకు : దిశ అత్యాచారం, హత్య ఘటనలో దోషులను త్వరితగతిన తేల్చేందుకు

మహిళల భద్రతకు అభయ్ వాహనాలు
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో రాత్రి వేళల్లో ప్రయాణించే మహిళలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ‘అభయ్’ పేరుతో వాహనాలు ఏర్పాటు చేశారు. ఈ వాహనాలను ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ డిసెంబర్ 4న ఒంగోలులో ప్రారంభించారు. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు జిల్లాలో ఎనిమిది వాహనాలు (నాలుగు చక్రాలు) మహిళల రక్షణకు అందుబాటులో ఉంటాయి. ప్రైవేటు వాహనాలను నమ్మలేని పరిస్థితుల్లో, అత్యవసర సమయాల్లో డయల్-100కు ఫోన్ చేసి మహిళలు అభయ్ వాహనాల సేవలను వినియోగించుకోవచ్చు. వాహనంలో డ్రైవర్‌తో పాటు ఓ మహిళా కానిస్టేబుల్ కూడా ఉంటారు. జిల్లా వ్యాప్తంగా అత్యవసరంగా సేవలందించేందుకు 70 ద్విచక్ర వాహనాలను సైతం ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న వరుస దుర్ఘటనల నేపథ్యంలో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
లూథియానాలోనూ...
పంజాబ్‌లోని లూథియానా పోలీసులు కూడా రాత్రి వేళల్లో ప్రయాణించే మహిళలు, యువతుల కోసం డిసెంబర్ 1 నుంచి నుంచి కొత్త సర్వీసు ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అభయ్ పేరుతో వాహనాలు ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్
ఎక్కడ : ఒంగోలు, ప్రకాశం జిల్లా
ఎందుకు : రాత్రి వేళల్లో ప్రయాణించే మహిళలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు

విశాఖపట్నంలో నేవీ డే వేడుకలు
విశాఖపట్నంలోని ఆర్‌కే బీచ్ వేదికగా.. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో నేవీ డే వేడుకలు డిసెంబర్ 4న జరిగాయి. ఈ వేడుకల్లో తూర్పు నౌకాదళాధిపతి, వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కె డైవర్ల బృంద సారధి లెఫ్టినెంట్ రాథోడ్ ముఖ్య అతిథి సీఎం జగన్‌కు స్మృతి చిహ్నాన్ని అందించారు. వేడకల్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సూర్యకిరణ్ యుద్ధ విమానాల బృందం విన్యాసాలు నిర్వహించింది. తొలిసారిగా త్రివిధ దళాలకు చెందిన సిబ్బంది ఈ విన్యాసాల్లో పాల్గొన్నారు.
నేవీ డే కథ...
బంగ్లాదేశ్ విమోచన అంశం ప్రధాన కారణంగా భారత్-పాక్ మధ్య 1971 డిసెంబర్ 3న మొదలైన యుద్ధం డిసెంబర్ 16న పాకిస్తాన్ ఓటమితో ముగిసింది. ఈ యుద్ధంలో డిసెంబర్ 4 పాకిస్తాన్ దక్షిణ తీర ప్రాంతంలోని ముఖ్యమైన కరాచీ నౌకా స్థావరాన్ని భారత పశ్చిమ నౌకాదళం ‘ఆపరేషన్ ట్రైడెంట్’ పేరుతో నాశనం చేసింది. ఈ అద్భుత విజయానికి చిహ్నంగా ఏటా డిసెంబర్ 4న ‘భారత నౌకాదళ దినోత్సవం’గా జరుపుకొంటున్నాం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేవీ డే వేడుకలు
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : తూర్పు నౌకాదళాధిపతి, వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
ఎక్కడ : ఆర్‌కే బీచ్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
Published date : 31 Dec 2019 04:44PM

Photo Stories