Krishnaveni: ప్రముఖ నిర్మాత, నటి, గాయని.. కృష్ణవేణి కన్నుమూత

ఫిబ్రవరి 16వ తేదీ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో కృష్ణవేణి తుది శ్వాస విడిచారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా పంగిడి గ్రామంలో 1924 డిసెంబర్ 24న కృష్ణవేణి జన్మించారు. ఆమె చిన్నతనంలోనే నాటకాల్లో ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి వేషాలు వేసి, బహుమతులు అందుకున్నారు. కాగా ప్రముఖ దర్శక–నిర్మాత సి. పుల్లయ్య బాలనటీనటులతో ‘సతీ అనసూయ’ చిత్రానికి శ్రీకారం చుట్టిన సమయంలో రాజమండ్రిలో ‘తులాభారం’ నాటకం చూశారు. ఆ నాటకంలో కృష్ణవేణి నటన నచ్చి, ‘సతీ అనసూయ’కు అవకాశం ఇచ్చారు.
అలా కృష్ణవేణి ‘సతీ అనసూయ’ (1936) సినిమాతో కృష్ణవేణి తొలిసారి వెండితెరపై కనిపించారు. హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం ‘కచదేవయాని’ (1938) విజయం సాధించడంతో ఆమెకు మంచి గుర్తింపు, పేరు దక్కాయి.
ప్రముఖ నిర్మాత మీర్జాపురం రాజు (మేకా రంగయ్య) బేనర్‌లో ఆమె ‘జీవన జ్యోతి’ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా చేశారు. ఈ చిత్రం తర్వాత మీర్జాపురం రాజుతో ఆమె పెళ్లయింది. ఆ తర్వాత జయా పిక్చర్స్‌పై తన భర్త తీసిన సినిమాలకు నిర్వహణ బాధ్యతలు చూసుకునేవారు. వివాహం తర్వాత జయా పిక్చర్స్‌ని శోభనాచల స్టూడియోస్‌గా మార్చారు. ఈ బేనర్ నిర్మించిన ‘దక్షయజ్ఞం (1941), గొల్లభామ (1947), లక్ష్మమ్మ (1950)’ వంటి చిత్రాల్లో మాత్రమే నటించారు.
Satyendra Das: అయోధ్య రామాలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ కన్నుమూత
ఒకవైపు నటిస్తూనే ‘బాల మిత్రుల కథ, కీలు గుర్రం’ వంటి సినిమాల్లో పాటలు కూడా పాడారు. 1942లో మీర్జాపురం రాజా–కృష్ణవేణి దంపతులకు కుమార్తె రాజ్యలక్ష్మి అనురాధ జన్మించారు.
ఆమె హీరోయిన్‌గా నటించిన ఆఖరి చిత్రం ‘సాహసం’ (1952). అప్పట్లో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్‌గా కృష్ణవేణికి పేరుంది. ‘ధర్మాంగద’ చిత్రానికి గాను ఆమె రూ.45 వేలు పారితోషికం అందుకున్నారట.
‘మన దేశం’ చిత్రం ద్వారా ఎన్టీఆర్‌ని పరిచయం చేసిన నిర్మాతగా కృష్ణవేణి బాగా పాపులర్ అయ్యారు. నటిగా, నిర్మాతగా, గాయనిగా తనకంటూ ప్రత్యేక ప్రతిభను చాటుకున్నారు.
కృష్ణవేణి 2004లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. 2022లో ‘సాక్షి ఎక్స్‌లెన్స్’ అవార్డుల్లో భాగంగా ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందుకున్నారు. ఇక ఆమె కుమార్తె అనురాధ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 17 సినిమాలు నిర్మించారు. కన్నడంలో ‘భక్త కుంభార’ (1974) నిర్మాతగా ఆమె తొలి చిత్రం.
కృష్ణవేణి ప్రపంచంలో అత్యధిక చిత్రాలు నిర్మించిన మహిళా నిర్మాతగా లిమ్కా బుక్ రికార్డ్‌ని సొంతం చేసుకుంది.